Previous Page Next Page 
ఉషోదయం పేజి 41

    సుప్రియ తెల్లబోయింది. శారద ఇంత తొందరగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందనుకోలేదు. గొడవ చేస్తుంది, తిడుతుంది... ఏం జవాబివ్వలా, ఎలా ఆమె ముఖం చూడాలా అని లోలోన భయపడుతోంది.
    సునీత అలా అనగానే బెదురుగా "ఏమిటో నాకు తెలియకుండానే అతనికి లొంగిపోయాను. అతని మాట కాదంటే ఉద్యోగం నించి తీసేస్తాడేమో... మళ్ళీ రోడ్డుమీద పడాలని భయపడి..." నసుగుతూ చెప్పబోయింది.
    "నోర్ముయ్... వెధవ కుంటిసాకులు నా దగ్గర చెప్పకు. నీకిష్టం లేకుండా అతనేం చెయ్యగలడు? నీకు ఈ ఫ్లాటు, సుఖాలు అవీ కావాలి. వాటికోసం మగాళ్ళకి వలలు విసిరే నీ గుణం నాకు తెలిసి కూడా నిన్ను నమ్మాం మేం ఇద్దరం. ఇంకేం ఊరేగు అతనితో. నాలుగురోజులు వాడుకుని తన్ని పంపిస్తాడు. అప్పుడు తెలుస్తుంది నీ బతుకు" అంటూ సుప్రియని ఛీత్కారంగా చూసి ఆమె ఏదో చెప్పబోతూంటే వినకుండా వెళ్ళిపోయింది.
                                          * * *
    శారద చెప్పింది విని సత్యవతి నిర్ఘాంతపోయింది.
    ఆవిడమొహం కోపంతో జేవురించింది.
    "వీడికిలాంటి బుద్ధులు కూడానా... ఇంతకి దిగజారాడా! ఈమధ్య వాడిని చూస్తే నాకెందుకో ఏదో అనుమానం వచ్చింది. వాడి మొహం చూస్తే ఏదో తప్పుచేసినవాడు మొహం చాటేసినట్టు నన్ను తప్పించుకుని తిరుగుతున్నాడు. రాత్రిళ్ళు పదకొండుకి రావడం, భోజనాలు చేసి రావడం... నీవు లేవని ఏదో ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేస్తున్నాడనుకున్నాను. ఇంట్లో పెళ్ళాన్నింత ఉద్ధరించాడు వీడి మొహానికింకా ప్రేమలు కావల్సి వచ్చాయా..." ఆవేశంగా అంది.
    "వద్దూ అత్తయ్యా మీరూరుకోండి. ఇక నా మనసు విరిగిపోయింది. ఆయనకి, నాకు భార్యాభర్తల సంబంధం లేనేలేదు. ఆయన్నైనా సుఖపడనీయండి నచ్చినవారితో. నే వెళ్ళిపోతాను. మ్యూచువల్ సెపరేషన్..."
    "నేనొప్పుకోను. నువ్వెళ్ళడానికి వీలులేదు... పెళ్ళంటే ఏమనుకుంటున్నారు ఈ మగాళ్ళు... అదింత సుళువుగా వదిలించుకునేది కాదు..."  
    "ప్లీజ్... నేను ఆనందంగా వుండాలంటే మీ సపోర్టు కావాలత్తయ్యా. నాకింక ఈ సంసారంలో సారం కనపడలేదు. ఇన్నాళ్ళూ ఏ ఆనందం లేకపోయినా వివాహ వ్యవస్థని గౌరవించి, మీ అందరికోసం ఒక ఇంట్లో బతికాను. ఇప్పుడు జరిగినదాంతో నాకు మనసు పూర్తిగా విరిగింది. తప్పు నాది కాదు కనుక విడిపోవడానికి సంకోచం కలగడంలేదు. అంచేత మీరేం అడ్డురావద్దు. నేను ముందు కొన్నాళ్ళు అమ్మావాళ్ళ యింట్లో వుండి, తర్వాత వేరే వెళ్తాను."
    "నీవెక్కడికీ వెళ్ళనక్కరలేదు. ఈ ఇల్లు నాది... నా భర్త నాకిచ్చింది. నా తదనంతరం వాడికిమ్మని రాశారు... నేనున్నచోటే నీవుంటావు. మనిద్దరం, నా మనవడు... మనం వుందాం. వాడిష్టం. ఎటు పోతాడో పోమ్మందాం..." విరక్తిగా అంది సత్యవతి.
    శారద ఆశ్చర్యంగా చూసింది. "ప్లీజ్ అత్తయ్యా! నాకోసం మీరు కొడుకుని వదులుకోవడం ఏమిటి, నాకేం ఫరవాలేదు. మీ సాయం ఎప్పుడు కావాలన్నా తీసుకుంటాను. అమ్మా నాన్న వున్నారు. నేనేం ఒంటరిదాన్నవను. మీరిలాంటి నిర్ణయం తీసుకుంటే ఆయనకింకా కోపం వస్తుంది. ఇదంతా నేనే చేయించానంటారు."
    "వాడెవడు నన్ననడానికి... నేనేం వాడిమీద ఆధారపడి బతకడంలేదు. నేను ఎవరితో వుండాలనుకుంటే వాళ్ళతో వుంటావు" పట్టుదలగా అందావిడ.
    శారద నిస్సహాయంగా చూసింది.
    "వాడే వెడతాడు ఇంట్లోంచి. నీవు నీ ఇంట్లో వుండు. చూడు శారదా, అసలే మీ వాళ్ళు కష్టాల్లో వున్నారు. ఇప్పుడు నీ సంసారం ఇలా అయిందని తెలిస్తే వున్నవాటికి ఇదొకటా అని చాలా బాధపడ్తారు. ఇప్పుడప్పుడే ఏం చెప్పకు... కొన్నాళ్ళు పోనీ..." అంది.
    శారదకీ అదే అనిపించింది.
    రాత్రి ప్రకాష్ రాగానే సత్యవతి శారదిచ్చిన కాగితాలు అతనిముందు పడేసింది మౌనంగా... "ఏమిటి, ఏమిటివి?" అన్నాడు ఆశ్చర్యంగా.
    "శారదిచ్చి వెళ్లింది" అంది ముభావంగా.
    తల్లి మొహం చూడగానే శారద వచ్చి తల్లితో చెప్పివుంటుందనిపించి గబగబా కాగితాలు తీశాడు. చూడగానే అతని మొహంలో రకరకాల రంగులు మారిపోయాయి. "డైవోర్స్ పేపర్లు శారద ఇచ్చిందా! ఆవిడ ఉద్దేశం ఏమిటి? డైవోర్స్ ఇస్తుందటనా నాకు" మండిపడుతూ అన్నాడు.
    "అభిమానవతి అయిన ఓ ఆడది ఇదే చేస్తుంది" సత్యవతి సూటిగా అంది.
    ప్రకాష్ కఠినంగా తల్లివంక చూసి "నీ కోడలిని వెనకేసుకొచ్చింది చాలు. నీతో కాదు మాట్లాడటం నాతో వచ్చి మాట్లాడమను."
    "మాట్లాడటానికేం లేదు, నే చెప్పాల్సింది ఈ కాగితాలు చెప్తాయి... అని ఇచ్చి వెళ్ళింది. సంతకం పెట్టిమ్మంది..."
    "ఆహా... సంతకమేగా కావాలి ఇదిగో పెడుతున్నాను. మళ్ళీ వచ్చి గోలపెడితే ఊరుకోను. మళ్ళీ ఈ గుమ్మం తొక్కడానికి వీలులేదు. ఆడదానికే అంత పొగరు, నిర్లక్ష్యం అయితే నాకెంతుండాలి..." తలెగరేసి అన్నాడు కోపంగా సంతకం పెడుతూ.
    "ఈ గుమ్మం తొక్కడానికి వీలులేదని చెప్పడానికి నీకేం హక్కులేదు ప్రకాష్. ఇది నా ఇల్లు. శారద ఇక్కడికి వస్తుంది, ఇక్కడే నాతో వుంటుంది" అంది సత్యవతి.
    ప్రకాష్ తెల్లబోయాడు. అతని మొహంలో రక్తం పొంగింది. "అంటే... అంటే" అతని మాట తడబడింది.
    "అంటే ఏంలేదు. నా కోడలిని, మనవడిని నేను దూరం చేసుకోను. ఈ ఇల్లు నా పేర ఇచ్చారు మీ నాన్నగారు. నేనున్నన్ని రోజులు నా ఇష్టం వచ్చిన వారితో వుండే హక్కు నాకుంది."
    "అంటే నీకు కొడుకు అక్కరలేదు... కోడలే కావాలని చెబుతున్నావా... అంటే నన్నే ఇంట్లోంచి పొమ్మనా అర్థం..." ఉక్రోషంగా అన్నాడు.

 Previous Page Next Page