Previous Page
ఉషోదయం పేజి 42

 

    "సరే అత్తాకోడళ్లిద్దరూ ఉట్టికట్టుకుని ఊరేగండి... నా కొడుకుని తీసుకుని నేనే వెళ్ళిపోతాను..." కసిగా ఆఖరి అస్త్రం వదిలాడు."
    సత్యవతి నవ్వింది.
    "హు... ఓ ఆడదాన్ని లొంగదీసుకోడానికి పిల్లల్ని అస్త్రాలుగా వాడుకుంటారు మీ మగవారు. కొడుకు కస్టడీకోసం శారద పోరాడీ తీరుతుంది. ఆమె ఒక లాయరు. కొడుకు కస్టడీ ఎలా తీసుకోవాలో ఆమెకి తెలుసు. అయినా వాడిని తీసుకెళ్ళి ఏంచేస్తావు... పెంచుతావా..." నవ్వింది ఆవిడ.
    "వెళ్లు వెళ్లు... ఆ సుప్రియనైనా సుఖపెట్టు..." అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది.
                                         * * *
    గత నాలుగురోజులుగా నీరదలో చాలా మార్పు వచ్చింది. కళ్ళు తెరిచి అందరినీ చూస్తోంది... ఏదో వెతుకుతున్నట్టు ఆ చూపులు అందరినీ వెంటాడుతూ చూస్తున్నాయి. ఏదో చెప్పాలనో, అడగాలనో ఆ కళ్ళు చూస్తున్నాయి.
    అది గుర్తించి శ్రీనివాస్ "నీరూ, నన్ను గుర్తుపట్టలేదా, మనం ఇద్దరం మంచి స్నేహితులం. ఉత్తి స్నేహితులం కాదు అంతకంటే మించిన బంధం మనది. నీవు మాట్లాడాలి, కోలుకోవాలి. 'ఉషోదయం' నీకోసం ఎదురు చూస్తోంది. చెప్పు! శీనూ అను..." అంటూ చిన్నపిల్లతో మాట్లాడినట్టు ఒక్కొక్క మాట ఒత్తిపలుకుతూ మాటలు నేర్పడానికి ప్రయత్నిస్తున్నాడు.
    ఆమెని లేపి వెనకాతల తలగడ ఆనించి కూర్చోపెడుతున్నాడు. కాస్త ఘనాహారం లోపలికి వెడుతోందీ మధ్య. ఇంకా మధ్య మధ్య ఆమె కళ్ళు, చేతులు వణుకుతున్నాయి. అపుడు శారదో, శ్రీనివాసో చేతులు గట్టిగా పట్టుకుని ధైర్యం చెబుతున్నట్టు నిమురుతున్నారు. చెమ్చాతో నోటిలో ఎవరన్నా ఏదన్నా పెడితే నోరు తెరిచి మింగుతోంది.
    మొహంలో నలుపురంగు విరిగి రంగు మారుతోంది.
    మొహంలో క్రమేపీ జీవకళ వస్తోంది. కళ్ళల్లో శూన్యదృక్కులు తగ్గాయి.
    నీరదలో వచ్చిన మార్పుకి, ప్రోగ్రెస్ కి డాక్టరు చాలా సంతోషించాడు. నీరద త్వరలో మామూలు మనిషవగలదన్నఆశ అందరికీ నిశ్చింతని, సంతోషాన్నిచ్చింది.
    లలితమ్మ చాలావరకు కోలుకుంది.
    తన పనులు తను చేసుకోగలుగుతోంది కాస్త.
                                         * * *
    మొదటివిడతగా నలభై శాతం డబ్బు పంపకం రేపు పదిగంటలకి ప్రారంభం అవుతుందని బ్యాంక్ వారు ప్రెస్ స్టేట్ మెంట్ పంపారు.
    తెల్లారి ఐదుగంటలకి శ్రీనివాస్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరివుతూ "అక్కా... నీరూ.. నీరూ నన్ను గుర్తుపట్టిందక్కా... శీనూ అంటూ నెమ్మదిగా పిలిచింది. మాట గట్టిగా వినపడేదుగాని మాట్లాడిందక్కా. నేను చేయి పట్టుకుంటే నా చేయి గట్టిగా పట్టుకుంది" అన్నాడు గబగబా.
    "నిజంగానా... పొద్దుటే శుభవార్త చెప్పావు..." శారద ఉబ్బితబ్బిబ్బు అవుతూ అంది. "శీనూ, జాగ్రత్త... దానిదగ్గిర పాత విషయాలు ఏమీ ఎత్తద్దు."
    "నాకు తెలియదా అక్కా ఆ సంగతి..." అన్నాడు.
    "ఏమిటమ్మా ఇంత పొద్దునే ఫోను... ఎవరు?" ఫోను మోగడం విని లేచివచ్చి ఆరాటంగా అడిగాడు నారాయణమూర్తి.
    "డాడీ, నీరద శ్రీనివాస్ ని గుర్తుపట్టిందట... పిలిచిందట..." సంతోషంగా అంది.
    నారాయణమూర్తిగారు కనిపించని దేవుడికి దండం పెడుతుంటే ఆయన కళ్ళు నిండాయి.
    ఉషోదయం వెలుగురేఖలు మోసుకొస్తే... 'ఉషోదయం' పేపరు మోసుకొచ్చిన శుభవార్త డిపాజిటర్లందరి ఆనందానికీ హద్దులు లేవు. గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నాడు. పోయిన జీవనం తిరిగివచ్చినట్టు చీకటి తొలిగి వెలుగురేఖలు మళ్ళీ వచ్చిన అనుభూతికి లోనయ్యారు. అపుడే వెళ్లి బ్యాంక్ ముందు నిల్చోవాలన్నంత ఉద్వేగానికి లోనయ్యారు.
    పదిగంటలకి బ్యాంక్ కి వెళ్ళేముందు వందలాదిమంది డిపాజిటర్లు ముందుగా 'ఉషోదయం పేపరు' ఆఫీసుముందు బారులు తీరి నిలబడి నారాయణమూర్తి రాగానే ప్రతి ఒక్కరూ ఆయన చేయిపట్టుకుని తమ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
    కొందరు పుష్పగుచ్ఛాలు అందించి విష్ చేశారు.
    "ఇది మీ చలవే సార్" అంటూ కొందరు కన్నీళ్ళు తుడుచుకున్నారు.
    నారాయణమూర్తిగారు అందరికీ నమస్కరిస్తూ నీరు నిండిన కళ్ళు తుడుచుకోకుండానే మాట్లాడలేనట్టు మౌనంగా లోపలికి నడిచారు.

                                                    అయిపోయింది                                   

 

 Previous Page