Previous Page Next Page 
ఉషోదయం పేజి 40

    "ఆఫ్ కోర్స్... ఏమిటి విషయం?" అంది ఆరాటంగా.
    "చెప్తాలే... అన్నట్టు ఇవాళ రాహుల్ కి పెద్ద దెబ్బ తగిలింది. ఇక్కడే వున్నాడు. తలకి దెబ్బ తగిలింది. స్టిచెస్ పడ్డాయి..."
    "అందుకా అలా వున్నావు?"
    "కాదులే. అదికాదు... రేపు మాట్లాడుదాంలే"
    "సస్పెన్స్ లో పెట్టి చంపుతున్నావు...సరే త్వరగా వచ్చేయ్" అంది.
                                 * * *
    సునీత నిర్ఘాంతపోయింది శారద చెప్పినది వింటూ. ఆమె మొహం ఎర్రబడిపోయింది. "అనుకున్నాను, ఆరోజే అనుమానం వచ్చింది" అంది.
    శారద వింతగా చూసి "ఏ రోజు? నీకు ముందే తెలుసా ఇలా జరుగుతోందని."
    "ఊహు... అలాకాదు... ఇరవైరోజుల క్రిందట ఓసారి రవీంద్ర వాళ్ళిద్దర్నీ హోటల్ లో చాలా ఇంటిమసీగా చేతిలో చెయ్యి వేసుకుని మాట్లాడుతూ డిన్నరు తీసుకుంటుంటే చూశారట."
    "మరి నాకెందుకు చెప్పలేదూ... సరేలే చెబితే మాత్రం ఏం చేసుండేదాన్ని! అడిగితే ఏం, డిన్నరుకెళ్ళడం తప్పా అని దబాయించేవారు."
    "డిన్నరుకెళ్ళడం తప్పుకాదు... ముఖానికి ముఖాలానించి ముద్దు పెట్టుకోవడమూ తప్పుకాదేమో అడగకపోయావా నిలబెట్టి..." కోపంగా అంది సునీత.
    "అసలు ఆ సుప్రియని నమ్మడం మన తప్పు... ఏడుస్తూంటే జాలిపడి దగ్గిరికి తీశాం చూడు అది బుద్ధిలేని పని. స్నేహితురాలన్న భావం, సాయం చేశామన్న కృతజ్ఞతన్నా వుందా దానికి.. దాని బుద్ధే అలాంటిది. మగాడు చేయిచాపితే వాలిపోయే రకం. పదా, దానింటికికెళ్లి మొహంమీద కడిగేద్దాం పద.. దానికి వార్నింగ్ ఇచ్చాను... అయినా ఇలా చేసిందంటే దానికెంత ధైర్యం..." ఆవేశంగా అని లేచింది సునీత. శారద సునీత చెయ్యిపట్టుకుని లాగి కూర్చోపెట్టింది.
    "మన బంగారం మంచిదైతే ఇంకొకరిని అనడం ఎందుకు? సుప్రియతో నాకేమిటి దానిష్టం వచ్చినట్లుండే హక్కు దానికుంది. అడగవలసింది జవాబు చెప్పాల్సింది నా భర్త."
    "అయితే ఆయన్నే అడుగు ఏమంటారో... జవాబేం చెప్తారో విందాం..."
    "వద్దు నేనడగను. ఆయనిష్టం. ఎవరితో తిరిగినా నాకేం బాధ ఇంక..."
    "అంటే... అలా వదిలేసి సహిస్తావా... నాకు అపుడు ఎంత ధైర్యం చెప్పి, పోరాడావు నా తరుపున... కేసువేసి నా హక్కులు నేను పొందాలన్నావు. ఇప్పుడేమైంది ఆ స్పిరిట్?"
    "అవును అందరి ఆడవాళ్ళకూ న్యాయం జరగాలని పోరాడాను. కాని ఇప్పుడు పోరాడి నాకు నేను అన్యాయం చేసుకోదలచలేదు" స్థిరంగా అంది.
    సునీత అర్థం కానట్టు తెల్లబోతూ చూసింది.
    "అవును సునీతా. ఆయనకి, నాకు మధ్య మానసికబంధం ఏర్పడనేలేదు ఇన్నాళ్ళ వైవాహిక జీవితంలో. ఇప్పుడు శారీరకబంధమూలేదు. ఇంకనేను ఏ బంధంకోసం ఈ వైవాహికబంధం కోరుకోవాలి నీవే చెప్పు? రవీంద్ర నిన్నెప్పుడూ ప్రేమించాడు. ఏదో చాపల్యంతో కాస్త తప్పటడుగు వేశాడు. ఇప్పటికీ నీవు, పిల్లలు అంటే అతనికి ప్రాణం. పోరాడి సాధించేది కాదు ప్రేమన్నది. పెళ్లి నిలబెట్టుకోగలనేమో పోరాడి, కాని ప్రేమ, అనురాగం దెబ్బలాడి సాధించేది కాదు. ఏమీ దొరకని పెళ్ళిని నిలబెట్టుకుని నే పొందేది ఏమిటి సునీతా! పోనీ, ఆయనెలా పోయినా నాకింక అనవసరం... రేపే డైవర్సు కి నేనే అప్లయ్ చేస్తాను" స్థిరంగా అంది.
    సునీత తెల్లబోతూ "ఆర్ యూ సీరియస్?" అంది.
    తల ఆడించింది శారద.
    "కానీ నీ అంతట నీవు ఒక్కర్తివి ఆర్థికంగా నెట్టుకురాగలవా, ఆ వైపూ ఆలోచించు."
    "ఆలోచించడానికేముంది? నాకంటూ సంపాదన వుంది. ఇన్నాళ్ళు అవసరం లేకే ఆట్టే సంపాదించలేదు. అవసరం అయితే ప్రాక్టీసు ఎక్కువ చేసుకుంటాను, ఆర్థిక విషయాలు, రాహుల్ చదువు మొదలైనవి సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు ననుకుంటాను" నమ్మకంగా అంది.
    "ఒకవేళ అతను పంతానికి రాహుల్ ని ఇవ్వనంటే... తనే పెంచుకుంటానంటే..."
    శారద నవ్వింది. "అయినా! ఒక్కరోజు కూడా వాడిని చూడలేరు. ఇవ్వనంటే అపుడు కోర్టుకెక్కి ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకున్న తండ్రి నా కొడుకు పోషణ సరిగా చూడడని వాదిస్తాను... మా అత్తగారు నా పక్షమే మాట్లాడతారు" అంది నిబ్బరంగా.
    శారద అన్ని విషయాలు అప్పుడే మనసులో నిర్ణయాలు తీసుకుందన్నది సునీతకి అర్థమైంది.
    "ఇప్పుడు రవీంద్రలాగే ఆయనగారికీ బుద్ధి వచ్చి అనుభవం పాతబడ్డాక వస్తానంటే నేనంగీకరించను. ఈ పనే నేను చేస్తే ఆయన నాతో మళ్ళీ సంబంధం కొనసాగించడానికి ఒప్పుకుంటారా అంటాను."
    సునీత ఇంక ఏమనడానికీ తోచక "ఇంక నేనేం చెప్పగలను... నీ ఇష్టం. మరి ఆలోచించుకో మరోసారి" అంది అసంతృప్తిగా.
    శారద వెళ్ళడానికి లేచింది.
    "అన్నట్టు రంజని అంత సులువుగా మీవారిని ఎలా వదిలింది? అడగాలనుకుని మర్చిపోయాను" శారద ఆరా తీసింది.
    "సులువుగా ఏం వదలలేదు. ఈయనగారి బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీచేసి మూడులక్షలు పట్టుకెళ్ళింది. అరిచి గోలచేసి ఈయన పరువు ఆఫీసులో నలుగురి ముందూ తీసి ఏడుస్తూ శాపనార్థాలు పెడుతూ వెళ్లింది. ఆ మాత్రం శిక్ష కావాలిలే ఆయనకి... ఇంకో ఆడదాని పొందు కోరడం వరం కాదు శాపం అని అర్థం అవ్వాలి మగాళ్ళకి..." అంది.
    "ఏదో పోనీ ఇంతటితో వదిలింది... అంతేచాలు" అంది శారద.
                                      * * *
    సునీత ఎడాపెడా దులిపేస్తుంటే సుప్రియ తలదించుకుని కూర్చుంది మాడిపోయిన మొహంతో. "ఛీ... నీ మొహం చూడాలనిపించడం లేదు. పాతజీవితం మర్చిపోయి మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తున్న నీకీ జన్మకి బుద్ధిరాదు. నీ చావు నీవు చావు. మధ్యలో శారద బతుకులో నిప్పులు పోశావు. అసలే ఆ ప్రకాష్ తో దానికి అంతంతమాత్రం అనుబంధం. ఇప్పుడది ససేమిరా అతనితో కలిసి బతకడానికి కిష్టపడడం లేదు. డైవర్స్ తీసుకుంటుందట. ఇంకేం, చక్కగా అతన్ని పెళ్ళాడు. ఒక ఆడదాని కాపురం కూల్చిన ఏ ఆడదీ ఆనందంగా వుండలేదు" కఠినంగా అంది.                 

 Previous Page Next Page