అంతలో ప్రియాంక నియమించిన ఇద్దరు వ్యక్తులు వచ్చారు.
"ఏమిటి విషయం?" ఆమె చిరాగ్గా అడిగింది.
"మీరు కోపంగా వున్నట్టున్నారు. కాని మేం మాత్రం ఏం చేయగలం? అతనేం వ్యాపారం చేస్తున్నాడో తెలియపర్చాం. లైసెన్స్ దొరక్కుండా చేయాలని సిన్సియర్ గానే ప్రయత్నించాం. కాని ఛటర్జీ మా ఆటల్ని సాగనివ్వలేదు..."
"మరింకెందుకొచ్చారు?"
"మీరడిగిన మూడో పనిని పూర్తిచేసేందుకు మాకు ఇప్పుడు వీలవుతుంది. టెక్నీషియన్ అదృశ్యం అయిన విషయం వసుంధరా ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ కి తెలిసిపోయి ఆందోళన చెందుతున్నారు. సరిగ్గా ఇదే సమయం. ఇప్పుడు వారికి తమ ఉద్యోగభద్రత పట్ల తమ డిపాజిట్స్ పట్ల అనుమానం కలిగిస్తే మీరు అప్పగించిన పని సులభమవుతుంది. ఈ పని ఇంతకుముందే పూర్తి చేయలేకపోవడానికి కారణం వుంది. త్రినాధ్ వారికి ఉద్యోగాలిచ్చాడు. జీతాలు సక్రమంగా ఇస్తున్నాడు. పైపెచ్చు వారి డిపాజిట్స్ కి బ్యాంక్ గ్యారంటీ ఇప్పించాడు. అలాంటి పరిస్థితులలో ఏ విధంగానూ వారితో ఉద్యోగాలు మాన్పించలేం. వీటన్నిటికి మించి వారికి ఏ పనీ అప్పగించకుండా జీతాలిస్తున్నాడు త్రినాధ్. సోషల్ ప్రెస్టేజ్ కోసం వారికి ఉద్యోగం వుంది. సోమరులుగా సుఖపడటానికి పనేంలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం మాన్పించడం అన్నది అసాధ్యం. జీతాలు సక్రమంగా రానప్పుడు కాని, కంపెనీ దివాళా తీయబోతున్నప్పుడుగానీ మీరప్పగించిన పని సాధ్యం. అదిప్పుడు జరగబోతోంది."
అప్పటివరకు వారిపై వ్యక్తపరచిన ఆమె మోములోని చికాకు చటుక్కున మాయమయింది. వారివేపు ప్రశాంతంగా చూస్తూ "గోహెడ్" అంది.
అక్కడే త్రినాధ్ తెలివితేటల్ని ఆమె తక్కువగా అంచనా వేసింది.
* * * *
ఎప్పటిలాగే తెల్లవారుఝామున నాలుగు గంటలకే జీప్ ఎక్కేశాడు త్రినాధ్.
వెళుతున్న కొడుకువేపు ఆశ్చర్యంతో చూస్తుండిపోయింది వసుంధరాదేవి.
పట్టుదల, పౌరుషం వుంటే మనిషి ఆకాశమంత ఎత్తున ఎదగలేక పోయినా కనీసం సోమరితనాన్ని వదిలించుకొని తన శరీరాన్ని, మనస్సును తన ఆధీనంలో ఉంచుకోగలడు.
తన కొడుకు ఎదుగుతాడా లేడా అన్న ఆందోళన లేదిప్పుడామెలో. సాధారణంగా పుట్టి, అతి సాధారణంగా ఎదిగి ఊరు, పేరు లేకుండా ఎందుకు పుట్టామో, ఎందుకు బతుకుతున్నామో తెలియకుండా మట్టిలో కలిసిపోయే దౌర్భాగ్యస్థితి తన కొడుకుకు పడుతుందేమోనని ఎంత కాలంగానో ఆమె పడుతున్న మనోవేదన క్రమంగా ఆమెనుంచి దూరమైపోయింది.
త్రినాధ్ జీప్ మాలిని ఇంటివేపు దూసుకుపోతోంది. అతని ఆలోచనలు జీప్ వేగంతో పోటీపడుతున్నాయి.
ఉండుండి అతని పెదవులపై చిరునవ్వు మెరుస్తోంది. సరిగ్గా మరో వారానికే తాను తొలిసారి మార్కెట్ లోకి వెళ్ళబోయేది- చూడాలి, పరిస్థితులు తనకు ఎలా సహకరిస్తాయో.
త్రినాధ్ జీప్ దిగగానే ఆమె ఎప్పటిలా ఎదురురాలేదు. ఓ క్షణం అతను ఆశ్చర్యపోయాడు. గతి తప్పని దినచర్య... ఈ రోజు ఎందుకిలా జరిగింది?
తెల్లవారడానికి ఇంకా టైముంది. త్రినాధ్ జీప్ దిగి ఇంటికేసి నడవడం ప్రారంభించాడు.
ఆ నీరవ వాతావరణంలో అనుకోకుండా అతని కళ్ళముందు ప్రియాంక, మాలిని కదిలాడారు.
ఇద్దరిదీ అద్వితీయమైన సౌందర్యం. ప్రియాంక నవయౌవ్వనంలోకి అడుగుపెట్టి నవ్యశోభతో తళుకులీనుతూ ఇతరులను తేలిగ్గా ఆకర్షిస్తే, మాలినిలోని సౌందర్యం పరిపూర్ణమై ఇతరులు ఆమెపట్ల గౌరవంగా ప్రవర్తించడానికి, అంతర్లీనంగా ఆరాధించటానికి మాత్రమే అవకాశమిస్తుంది.
ప్రియాంక నయాగరా జలపాతం అయితే, మాలిని ఎన్నో అల్లకల్లోలాలను తన అంతర్భాగంలో దాచుకొని పైకి ప్రశాంతంగా, గంభీరంగా కనిపించే నిశ్చల తటాకం.
ఇద్దరిలోనూ పౌరుషం వుంది. ఆత్మాభిమానం వుంది.
తన గెలుపు కోసం ప్రియాంక మోసానికైనా సిద్ధపడితే, మాలిని తనను ఎవరూ మోసం చేయకుండా చూసుకోవాలంటుంది.
ఒకరు తనను అవమానించి, రెచ్చగొట్టి తనలోని పట్టుదలను, ఆత్మాభిమానాన్ని మేల్కొలిపితే, మరొకరు తనలోని శక్తిసామర్ధ్యాలను, ఆత్మ విశ్వాసాన్ని వెలికితీస్తున్నారు.
ఇద్దరు చిత్రమైన స్త్రీ మూర్తులు తన పరమపద సోపాన పటం వెనుక వున్నారు.
ప్రతి మగవాడి విజయం వెనుక ఓ స్త్రీ మూర్తి తప్పక వుండి తీరుతుంది. తన వెనుక మాత్రం ఇద్దరు. అప్పుడప్పుడు త్రినాధ్ కి అతనిపట్ల అతనికే ఆశ్చర్యంగా వుంటుంది.
త్రినాధ్ ఆలోచనల్నుంచి తేరుకుని తలుపు మీద చేయివేసి లోపలకు నెడుతుండగానే "గరళకంఠుడికిదే నా సుస్వాగతం... " గంభీరమైన ఆమె స్వరం ఆ నిశ్శబ్దంలోంచి చిత్రంగా వినిపించింది.
లోపలకు వెళ్ళేసరికి ఆమె బెడ్ మీద జారగిలబడి కనిపించింది. ఆమె మోములో ఒకింత అలసట కనిపించింది.
అతను అడిగేలోపే ఆమె అంది- "కాలంలో పందెం కట్టే కార్మోన్ముఖుడికి మనసెంత ఆరోగ్యంగా వుండాలో, శరీరము అంత ఆరోగ్యంగా వుండాలి. అలాగే కార్యోన్ముఖుడ్ని చేసేవారికీ వుండాలి. నా ఎడల చిన్న తప్పు జరిగింది. ప్రస్తుతం నేను జ్వరపీడితురాల్ని. ఒక్కొక్కసారి ఒక్క క్షణకాలం వృధాకావడమే మనిషిని అధోపాతాళానికి దిగజార్చుతుంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు పెద్ద పెదవులలో వుండే అధికార, అనధికారుల కాలం చాలా విలువైనది. జిహ్వచాపల్యానికి అడ్డమైన చెత్తతిండి తిని, ఇతర దుర్వ్యసనాల మూలంగా అనారోగ్యం కొని తెచ్చుకుంటే ఎన్నో విలువైన కార్యక్రమాలు వెనుకబడిపోతాయి. ప్రస్తుతం నీ కాలం ఎంతో విలువైనది. కారణం, కాలంతో పందెం కాశావు కనుక. నా అనుభవం నుంచి పాఠం నేర్చుకో. ఒక గుమాస్తాకి, ఒక డాక్టరుకి, ఒక లాయర్ కి, జ్వరం వస్తే పెద్ద కొంప మునిగేదేం లేదు. సంవత్సరము ముందుగా నిర్ణయింపబడే అమెరికా, రష్యా అధినేతల సమావేశం ముందురోజు ఆ ఇద్దరిలో ఒకరికి జ్వరం వస్తే...? తిరిగి మరో సమావేశం నిర్ణయింప బడేలోపు యుద్ధం వస్తే...? ప్రపంచ బ్యాంక్ అధినేత ఎంతో కష్టంమీద మన రాష్ట్రానికి సేద్యపు నీటివనరులకోసం అప్పు ఇచ్చేందుకు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి జ్వరంతో ఇంట్లో పడుకుంటే... ? మరలా మన రాష్ట్రపు వంతు రావడానికి నాలుగు సంవత్సరాలు పడితే...? ఈలోపు లక్షలాది ఎకరాలు బీడుపడిపోతే... ?
అందుకే ఈ రోజునుంచే యోగా చేయడం, ఎక్సర్ సైజ్ చేయడం ప్రారంభించు. ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ పాటించు..."
ఆమె చెప్పింది జీర్ణించుకుంటూనె అన్నాడు... "ఈ రోజుకు విశ్రాంతి తీసుకోకూడదూ?"
ఆమె బలహీనంగా నవ్వింది.
జీవితంలో సగభాగం నిద్రకు, మిగతా సగభాగంలో కొంత అనారోగ్యానికి, మరికొంత వృద్ధాప్యానికి, ఇంకొంత ప్రయాణాలకు, ఎంటర్ టైన్ మెంట్ కి పోతే మనిషి చేతిలో మిగిలే కాలం ఎంత... ?"
త్రినాధేం మాట్లాడలేదు.
"ఏమీ అనుకోకపోతే- వంటగదిలో అన్నీ వున్నాయి. రెండు కప్పుల కాఫీ పట్టుకురాగలవా...?" అంది.
అతని మనస్సంతా కృతజ్ఞతతో నిండిపోయింది. లోపలకు వెళ్ళి పది నిమిషాలలో కాఫీ తెచ్చి ఆమెకో కప్పు అందించి, తనో కప్పు తీసుకున్నాడు.
ఆమె కాఫీ త్రాగడం పూర్తిచేసి ఒకింత వెనక్కు జరిగి దిండుకు జారగిలబడింది.
"ఒక్కోసారి చిన్న సంఘటన కూడా మన కళ్ళు తెరిపిస్తుంది. అదే ఒక పెద్ద అవసరాన్ని చూపిస్తుంది. చాలా సంవత్సరాల క్రితం న్యూయార్క్ అమెరికాకి చెందిన రాల్ఫ్ చ్చెనెయిడర్ అనే లాయర్ ఒక కొత్త రెస్టారెంట్ లో తన వ్యాపార మిత్రులకు భారీ ఎత్తున పార్టే అరేంజ్ చేశాడు. పార్టీ పూర్తవుతుండగా బిల్ వచ్చింది. దాన్ని చెల్లించేందుకు జేబులో చేయి పెట్టగానే అతని ముఖం వివర్ణమయింది. అతని పర్స్ పోయింది. అదెంత ఇబ్బందికరమైన సందర్భమో వూహించు. ఆ ప్రాంతం అతనికి కొత్త. ఆ రెస్టారెంట్ అంతకంటే కొత్త. అతను కావడానికి ధనవంతుడే. కాని అది చెప్పి తన పరువును కాపాడుకోలేడు గదా? తనకు తారసపడిన ఆ ఇబ్బందిలోంచి ఒక అవసరాన్ని కనుగొన్నాడు. అతనోప్రక్క ఆ సమస్యనుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తూనే మరోప్రక్క ఇలాంటి సందర్భం ప్రపంచంలో చాలామందికి చాలాసార్లు వస్తుంది. దీనికో చక్కని పరిష్కారాన్ని కనుక్కో గలిగితే...?! అని ఆలోచించాడు. వెంటనే భార్యకు ఫోన్ చేసి అర్జంట్ గా డబ్బు తీసుకురమ్మని చెప్పి ఆ విధంగా ఆ ఇబ్బందినుంచి బయటపడ్డాడు.
అయినా అతని ఆలోచనలు ఆగిపోలేదు. అలాంటి ఇబ్బందులను అధిగమించే వస్తువు కోసం అన్వేషించసాగాడు. ఆ అన్వేషణలోంచి ఉద్భవించిందే క్రెడిట్ కార్డ్ సిస్టమ్. కొత్త ప్రాంతాలకు వెళ్ళేప్పుడు, ఇతర నగరాలకు, దేశాలకు వెళ్ళేప్పుడు డబ్బు తీసుకెళుతుంటారు ఖర్చులకోసం. అయితే ప్రపంచంలో ప్రతిచోట దొంగల బెడద వుంటుంది. అలాగే అశ్రద్ధ, మతిమరుపువలన డబ్బు పోగొట్టుకొనే ప్రమాదమూ వుంటుంది. అలాంటి ఇబ్బందులను అధిగమించడానికి, తను ఎక్కడ కావాలన్నా తను మాత్రమే డబ్బును పొందగలిగే సిస్టమే క్రెడిట్ కార్డ్ సిస్టమ్.
రాల్ఫ్ ఇచ్చిన సలహాతో కొన్ని అంతర్జాతీయ బ్యాంకులు ఆ సిస్టమ్ ను ప్రవేశపెట్టాయి. అది బ్రహ్మాండంగా క్లిక్ కావడంతో ఈనాడు అన్ని దేశాలలో ఈ సిస్టమ్ ను ప్రవేశపెడుతున్నాయి బ్యాంకులు.
క్రెడిట్ కార్డు కావలసినవాళ్ళు బ్యాంకులో సభ్యులై కొంత డబ్బు కట్టాలి. అప్పుడు బ్యాంకువాళ్ళు ఒక ఫైబర్ కార్డు యిస్తారు. దానిమీద ఆ బ్యాంక్ పేరు, అడ్రస్సు, కార్డు హోల్డర్ పేరు, సంతకం, అదెంత కాలం పనికి వస్తుందనేది సరికొత్త పద్ధతిలో ఎంబోజ్ చేసి వుంటుంది. దాన్ని ఎట్టి పరిస్థితులలోను మార్చడానికి వీలుపడదు. ఈ కార్డు తీసుకొని ఎక్కడకు ప్రయాణం చేసినా ఆప్రాంతంలో ఈ కార్డును గుర్తించిన షాప్స్ లో, రెస్టారెంట్స్ లో కావలసిన వస్తువులను కొనుక్కోవచ్చు. రేటు మామూలుగానే వుంటుంది. విమాన ప్రయాణ సంస్థలు కూడా వీటిని అంగీకరిస్తాయి. ఎక్కడా డబ్బులు చెల్లించనక్కరలేదు. చెక్కులు, డబ్బు తీసుకునే ప్రయాణం చేయవలసిన అవసరం లేదు.
ఈ క్రెడిట్ కార్డ్ ఆయా వ్యక్తులకు సెక్యూరిటీ యిస్తుంది. సౌలభ్యంగా వుంటుంది. స్టేటస్ ను కూడా యిస్తుంది.
కార్డు హోల్డర్ ఏదైనా హోటల్ లో దిగితే ఉన్నవాళ్ళు వుండి వెళ్ళేప్పుడు బిల్లు బదులు కార్డు చూపించి, ఛార్జ్ స్లిప్ మీద వారి ఎదుట సంతకం చేసిస్తే చాలు. ఆ తరువాత, ఆ హోటల్ వాళ్ళు బిల్లును సదరు బ్యాంకునుంచి డ్రా చేసుకుంటారు.
బ్యాంకులే కాకుండా ప్రముఖ ప్రయివేట్ ఆర్ధిక సంస్థలు కూడా వీటిని రిలీజ్ చేస్తున్నాయి. అలా వచ్చిన మొదటి కార్డు 'డైనర్స్ క్లబ్' కార్డు.
ప్రపంచంలో తొలి క్రెడిట్ కార్డు 1924 లో ఒక గేసోలీన్ కంపెనీ ప్రవేశపెట్టింది. అది మెటల్ కార్డు. ఎన్నో సౌకర్యాలతో అభివృద్ధి పర్చబడిన కార్డు 1950లో న్యూయార్క్ లో పుట్టింది.
ఆ తరువాత దాని ప్రాముఖ్యాన్ని ఇతర బ్యాంకులు గుర్తించి తాము కూడా ప్రవేశపెట్టాయి. బ్యాంకులే కాకుండా ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలు కూడా అమెరికన్ ఎక్స్ ప్రెస్ కంపెనీకార్డు, కార్టేబ్లాంబే వీసాకార్డు, మాస్టర్ కార్డ్ లాంటివి ప్రవేశపెట్టాయి.
యూరోపియన్ దేశాలలో ప్రస్తుతం 700 మిలియన్ క్రెడిట్ కార్డ్సు వున్నట్లుగా అంచనా. ఇది ఇటీవలే ఇండియాలోకూడా ప్రవేశపెట్టబడింది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియావారి 'సెంట్రల్ కార్డ్' ఆంధ్రాబ్యాంక్ వారి 'బ్యాంకుకార్డు' ఇండియాలో బాగా పాపులర్ అయ్యాయి.