ఇప్పుడు ఇండియా సెంట్రల్ కార్డు అమెరికాకి చెందిన మాస్టర్ కార్డుతో, బ్యాంకార్డు వీసా ఇంటర్నేషనల్ కార్డుతో వ్యాపార సంబంధాలు పెట్టుకున్నాయి.
తెలియని నగరంలో కూడా క్రెడిట్ కార్డు చూపించి డబ్బు డ్రా చేసుకోవచ్చు సదరు బ్యాంకునుంచి. అమెరికాలో ఆఖరుకి టాక్సీ డ్రైవర్స్ కి కూడా క్రెడిట్ కార్డుమీద అప్పుపెడుతున్నారు.
చూశావా త్రినాధ్... ఒకే ఒక వ్యక్తి ఆలోచన ప్రపంచమంతటా ఎలా పాకిపోయిందో... ?
ఈ సిస్టమ్ మూలంగా ప్రపంచ వ్యాప్తంగా టూరిజమ్ ఎంతగానో డెవలప్ అయింది. విహార యాత్రికులు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నారు. ఒక వ్యాపారం మూలంగా వేరే వ్యాపారంకూడా అభివృద్ధి చెందుతోంది. వివిధ దేశాలకు ఫారెన్ కరెన్సీ లభిస్తోంది" ... ఆమె అలసటతో ఒకింతసేపు ఆగిపోయింది.
త్రినాధ్ ఆలోచిస్తున్నాడని ఆమె గ్రహించి మౌనంగా వుండిపోయింది.
ఆమెనా స్థితిలో వదిలి వెళ్ళటం ఇష్టంలేని త్రినాధ్ తన అంతరంగాన్ని ఆమెకు తెలియపర్చాడు. దానికి ఆమె మృదువుగా తిరస్కరించి అంది- "అనారోగ్యాలు అభివృద్ధికి ఆటంకం కారాదు. నీకు, సుదర్శన్ రావు, ప్రియాంకలకు మధ్య గేమ్ ప్రారంభమయింది. ఇప్పుడు నీ ప్రతిక్షణం విలువైనదే. నాకేం ఫర్వాలేదు. వెళ్ళిరా... " అంది ఒకింత స్థిరంగా.
త్రినాధ్ కి ఇష్టంలేకపోయినా వెనుదిరిగాడు.
* * * *
హిందూ ఆఫీసుకి బయలుదేరుతుండగా త్రినాధ్ జీప్ దిగాడు. మాలిని అనారోగ్యం గురించి చెప్పి ఆమెను మాలిని దగ్గరకు వెళ్ళమని తను ఆఫీసుకి బయలుదేరాడు.
సరీగ్గా ఇదే సమయంలో అక్కడ ఆఫీసులో ఉద్యోగులంతా తమ ఉద్యోగానికి రాజీనామాలిచ్చి, డిపాజిట్స్ వెనక్కు ఇచ్చివేయమని త్రినాధ్ పై వత్తిడి తెచ్చేందుకు సిద్ధంగా వున్నారు.
త్రినాధ్ జీప్ శరవేగంతో దూసుకుపోతోంది.
ఆఫీస్ లో వున్న ఇంజనీర్ సిబ్బంది పరిస్థితి చూసి, ఆందోళనగా త్రినాధ్ కోసం ఎదురుచూస్తున్నాడు.
ఎలా... వీళ్ళంతా ఇలా హఠాత్తుగా డిపాజిట్స్ వెనక్కు తీసుకుంటే త్రినాధ్ పరిస్థితి?! అతనికి బాధగా వుంది. త్రినాధ్ మీద జాలిగా వుంది. ఎన్నో కష్టనష్టాలకోర్చి దిగ్విజయంగా వ్యాపారాన్ని ప్రారంభించబోయే ఆఖరు క్షణంలో టెక్నీషియన్ అదృశ్యం- ఆ వెంటనే మరో ఉపద్రవం ఈ సిబ్బంది నిర్ణయం.
అతనికి పిచ్చెక్కినట్టుగా వుంది.
ఓపికగా సిబ్బందికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. వారి నిర్ణయాన్ని వెనక్కు తీసుకొమ్మని. కాని ఫలితం కనిపించడంలేదు.
ఏం జరగనుంది? ఎలా త్రినాధ్ ఈ ప్రమాదాన్ని అధిగమించగలడు? అధిగమించకపోతే ఇదే ఆఖరురోజా త్రినాధ్ కి?
సిబ్బందిలో అంతకంతకు ఆవేశం పెరిగిపోతోంది. అర్జంటుగా తమ డిపాజిట్స్ తిరిగి ఇచ్చేయమని- లేకపోతే త్రినాధ్ అంతు తేలుస్తామని పెట్రేగిపోతున్నారు.
అప్పుడే త్రినాధ్ జీప్ ఆఫీసు ముందాగింది.
త్రినాధ్ మెట్లెక్కుతూనే లోపల ఏదో అలజడి ప్రారంభమైందని గ్రహించాడు. నిశ్శబ్దంగా లోపలకు అడుగుపెట్టేసరికి కనిపించిన దృశ్యం అతన్ని ఒకింత ఆందోళనకు గురిచేసింది. ఇంజనీర్ చుట్టూ సిబ్బంది చేరిపోయారు. వారికేదో నచ్చచెప్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు ఇంజనీర్.
"ఏమిటి... విషయం... ? ఏం జరిగింది... ?" గంభీరమైన త్రినాధ్ కంఠస్వరం వినిపించగానే అందరి నోళ్ళు టక్కున మూసుకుపోయాయి.
ఒకతను మాత్రం ముందుకొచ్చాడు.
"టెక్నీషియన్ మిస్ అయ్యాడని గుప్తా చెప్పాడు. అతను లేకుండా మెషిన్ ఎలా రన్ అవుతుంది? రన్ కానప్పుడు వ్యాపారం ఎలా నడుస్తుంది?"
"అయితే...?" త్రినాధ్ రాబోతున్న కోపాన్ని బలవంతాన దిగమ్రింగుకుంటూ అడిగాడు. అతనికి అప్పటికే విషయం అర్ధమైపోయింది.
"అయితే ఏముంది? వ్యాపారం దివాళ తీస్తే మా డిపాజిట్స్ ఏమైపోతాయి?" అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
"ఏదో చెప్పేందుకు త్రినాధ్ ప్రయత్నిస్తుండగా లోపల రూమ్ లో ఫోన్ మ్రోగింది.
త్రినాధ్ వెంటనే తన గదిలోకి నడిచి ఫోన్ అందుకున్నాడు.
ఆవైపు చిత్రమైన పలకరింపు.
త్రినాధ్ వెంటనే గుర్తుపట్టాడు - ఫోన్ చేసిందెవరైంది. అతని పెదవుల మీద చిరుమందహాసం కదలాడింది ఓ క్షణం. అతను మాట్లాడేలోపే ఆమె తిరిగి మాట్లాడింది.
"డ్రామా బాగా రక్తి కడుతోందనుకుంటాను? వ్యాపారపు తొలి మెట్టుమీదే దెబ్బతిన్న బాస్ దగ్గర పనిచేయటానికి ఎవరికైనా ఎలా ధైర్యం వుంటుంది?"
పళ్ళు పటపట కొరికాడు త్రినాధ్.
"ఏమిటి పాపం మాట పడిపోయిందా?" ఆమె తిరిగి అంది సర్ కాస్టిగ్గా.
ఇక చెప్పక తప్పదనిపించింది త్రినాధ్ కి.
"మరో గంటసేపాగు. నీడ్రామా రక్తికడుతుందో, నా డ్రామా రక్తికడుతుందో తెలిసిపోతుంది. బుజ్జిముండకు అద్వితీయమైన అందం వుంది. కాని, పిసరంత తెలివితేటలు లేవు. నేను నా జీవితంలో పెట్టుకున్న తొలి ముద్దు ఓ మొద్దుముద్దుగుమ్మనా... వెరీ బాడ్... !
"యూ స్టుపిడ్... నీ దగ్గర పనిచేసే సిబ్బంది ఈ రోజుతో తోక ఝాడించేస్తారు..." ఫోన్ టక్కున పెట్టేసిన శబ్దం వినిపించింది.
త్రినాధ్ సాలోచనగా హాల్లోకి వచ్చాడు.
ఏం చెబుతాడు? డిపాజిట్స్ ఇచ్చేస్తానంటాడా? లేదంటాడా? సిబ్బంది ఆలోచిస్తోంది.
"మీలో ఎగ్రిమెంట్ చదివి బాగా అర్ధం చేసుకోగల వాళ్ళు ముందుకు రండి. ఇది చదవండి" అంటూ కొన్ని కాగితాలు అందించాడు త్రినాధ్.
ఇంజనీర్ కి అంతా అయోమయంగా వుంది. ఓ పక్క వ్యాపారం ప్రారంభం కాకముందే స్తంభించిపోయింది. మరో పక్క తమ డిపాజిట్స్ తమకిచ్చేయమని సిబ్బంది మొండికెత్తారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా త్రినాధ్ అంత తాపీగా ఎలా వ్యవహరించగలుగుతున్నాడో అర్ధం కాలేదు.
త్రినాధ్ ఇచ్చిన కాగితాన్ని చదివిన వ్యక్తి ముఖం వివర్ణమయింది. అతని పరిస్థితిని గమనించిన మిగతా సిబ్బంది అందులో ఏముందో అర్ధం కాక అయోమయంగా చూస్తున్నారు.
"టెక్నీషియన్ లేక వ్యాపారం ఆగిపోయిందని, దాంతో నేను దివాళా తీస్తానని మీరు భయపడటంలో తప్పులేదు. కాని మీ డిపాజిట్స్ కి గ్యారంటీ వుంది. మిమ్మల్ని మోసంచేసే ఉద్దేశ్యం నాకు లేదు. మీలో ఎవరైనా ఉద్యోగాలు మానదల్చుకుంటే నిరభ్యంతరంగా మానండి. కానీ, ఎగ్రిమెంట్ ప్రకారం డిపాజిట్స్ 5 సంవత్సరాలలోపు వెనక్కు తీసుకునే హక్కు మీకులేదు. కోర్టుకెళ్ళినా ప్రయోజనం వుండదు. నాకు తెలుసు మీ తిరుగుబాటు వెనుక ఎవరి హస్తం వుందో. నా కంపెనీమీద నమ్మకం లేనివాళ్ళు వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని రెచ్చగొట్టిన వాళ్ళ కంపెనీలోనే చేరవచ్చు. ఏదైనా గంటలోపే నిర్ణయించుకోవాలి" స్థిరంగా అంటూ లోపలకు వెళ్ళి ఇంజనీర్ ని పిలిచి ఏదో చెప్పి పంపించాడు.
సరీగ్గా గంట తర్వాత త్రినాధ్ ప్రియాంక నెంబర్ కు డయల్ చేశాడు.
"హలో... ప్రియా..." కావాలనే గొంతులో నాటకీయమైన మార్ధవం పలికించాడు.
"ఏమిటి... పాపం... స్టాఫ్ అంతా ఉద్యోగాలకు రాజీనామాలిచ్చి డిపాజిట్స్ కోసం నిన్ను ఘెరావ్ చేస్తున్నారా-" ఆ వైపు ప్రియాంక అంది త్రినాధ్ ని చావుదెబ్బ కొట్టానన్న ఆనందంతో.
"నా టెక్నీషియన్ ని ఏం చేసావ్?"
"ఏమీ చేయలేదు. నాదగ్గర రాచమర్యాదలు పొందుతున్నాడు."
"నిజమే?!"
అనుమానంతో ఆమె భ్రుకుటి ముడిపడింది.
"అంటే?"
"అంటే ఏముంది మరదలు పిల్లా..."
"పిచ్చి పిచ్చి వరసలు కలిపి మాట్లాడకు."
"నావి పిచ్చి పిచ్చి వరసలు కావు. కానీ, నీవి పిచ్చి పనులు అని మరికొద్ది క్షణాలలో ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నీ ఇంటి కాలింగ్ బెల్ మ్రోగుతుంది" త్రినాధ్ అంటుండగానే అక్కడ ప్రియాంక ఇంటి కాలింగ్ బెల్ మ్రోగింది.
"పైసా సంపాదించటం చేతకాదని నీవు విమర్శించిన బోస్ ప్రయోజకుడై నీ ముందు నిలుస్తాడు.
అంతలో పనిమనిషి వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా బోస్ నించుని వున్నాడు.
ప్రియాంకకు మతిపోయింది.
అంత సరిగ్గా త్రినాధ్ ఫోన్ లో ఎలా చెప్పగలుగుతున్నాడు?!
"కనిపించాడా?" చిరునవ్వుతో ప్రశ్నించాడు త్రినాధ్. పరధ్యానంతో వున్న ప్రియాంక "ఊ..." అంది.
"ఇప్పుడతని చేతిలో వున్న ఒక టిన్ నీముందున్న టీపాయ్ మీద పెట్టి అతనెళ్ళిపోతాడు."
ఆమె ఓ ప్రక్క ఫోన్ లో త్రినాధ్ మాటలు వింటూ, మరోప్రక్క బోస్ వేపే చూస్తోంది దిగ్భ్రాంతితో.
బోస్ తన చేతిలో వున్న టిన్ టీపాయ్ మీద పెట్టి ఆమెవేపు కోపంగా చూస్తూ వడివడిగా వెళ్ళిపోయాడు.
ఫోన్ మరలా గరగరమంది.
"ఆ టిన్ ఇచ్చేసి ఈపాటికి బోస్ వెళ్ళిపోయి వుంటాడు. ఇప్పుడు కాలం నా చేతిలో బందీ. ఇకపోతే ఆ టిన్ మీద ప్రింటయిన అక్షరాల్ని చదువు..."
ప్రియాంక ఫోన్ అలాగే చెవి కానించుకొని టిన్ ని చేతిలోనికి తీసుకొని చదివి షాక్ తింది.
"అలా షాక్ తినకు. నే చెప్పే డ్రామా విను, అది నా కంపెనీ తయారీ మొదటి టిన్. నీకు అందిస్తే నాకు శుభం. అందుకే నీకు పంపాను. ఇకపోతే నా టెక్నీషియన్ ప్రస్తుతం నా దగ్గరే వున్నాడు. నా యంత్రం ఇప్పుడు రోజుకు మూడు షిఫ్ట్ లు పనిచేస్తోంది-"
ఆ వేపు ఆమె అదిరిపడింది.
"ఎందుకు అన్నిసార్లు ఆశ్చర్యపోతావ్-? మరి నీ బందీగా వుందెవరన్నది పాపం నీకర్ధంకాక పిచ్చెక్కిపోతూ వుంటుంది. అతనో నిరుద్యోగి. పాపం వారం రోజులుగా పోషిస్తున్నావ్! నీ దయార్ద్ర హృదయానికి నా అభినందనలు" త్రినాధ్ ఫోన్ కట్ చేశాడు.
వారం రోజులుగా బోస్ ఏమయ్యాడో అర్ధంకాక పిచ్చెక్కిపోతున్న హిందూకి, త్రినాధ్ మాటల్లో కాని అతని అడ్రస్సు దొరకలేదు.
ఆమె భరించలేని ఉద్వేగంతో చూస్తోంది త్రినాధ్ వేపు.
"నీవిప్పుడు మన షెడ్ కి వెళ్ళు. ఫస్ట్ కన్ సైన్ మెంట్ ని పేలోడ్ వేన్ లో లోడ్ చేయించి, దాన్ని తీసుకువెళ్ళి ఆర్.టి.సి. పర్చేజ్ మేనేజర్ కి అప్పగించు. ఆయన నీచేతికి లక్షరూపాయలకి చెక్కు అందిస్తాడు. దాన్ని బ్యాంకులో కలెక్షన్ కి వేసి తిరిగి షెడ్ కి వెళ్ళు..." అన్నాడు ఓ ఫైల్ తిరగేస్తూ.
ఆమె ఆ నిజాన్ని నమ్మలేకపోతోంది. సరిగ్గా ఇదే టైమ్ లో ప్రియాంక తను బంధించిన వ్యక్తిని తన ఎదుటకు రప్పించుకుంది.
"నీవెవరు...?"
"నేను నిరుద్యోగిని..."
"నిజమా?!"
"నిజమే... "
"మరీ విషయం ఇన్నాళ్ళెందుకు చెప్పలేదు?" ప్రియాంక కళ్ళునిప్పులు చెరుగుతున్నాయి.


