Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 40


    చూస్తుండగానే బోస్ కి, ఆ ముగ్గురికి హోరాహోరీగా పోరాటం మొదలైంది. బోస్ కి ఉత్సాహంగా వుంది.

    ఇప్పుడతని కళ్ళముందు ముగ్గురు బలిష్టులు కనిపించటంలేదు. కుయుక్తితో వార్ని పంపించిన ప్రియాంకే కనిపిస్తోంది.

    ఒక్క మనిషి ఏం చేయగలడని ఊహించని ఆ ముగ్గురు నిమిషానికే బోస్ బలానికి షాక్ అయ్యారు.

    ఎవ్వరూ అరుచుకోవడం లేదు. నిశ్శబ్దంగా జరిగిపోతోంది యుద్ధం.

    ఉన్నట్టుండి ఒకడు బోస్ దెబ్బను భరించలేక కెవ్వున అరిచాడు. అంతే! అప్పటివరకూ నిద్రలో జోగుతున్న ప్రయాణీకులు ఉలికిపాటుగా లేచారు.

    కళ్ళముందు జరుగుతున్న భీభత్సాన్ని చూసి భయపడిపోయారు. ఎవరికి వారే ఏం చేయాలో తోచక బిగుసుకుపోయారు.

    అంతకంతకు బోస్ కి, వారికి మధ్య యుద్ధం తీవ్రతరమవటాన్ని చూసిన ఓ వ్యక్తి నిశ్శబ్దంగా పక్కకు జరిగి చటుక్కున ట్రైన్ లాగాడు.

    నిజానికి దానికోసమే ఎదురుచూస్తున్న ఆ నలుగురు వ్యక్తులలో ఒకడు ట్రైన్ లోంచి బయటకు చూసాడు. దూరంగా రెండు లైట్స్ వెలిగి ఆరిపోతున్నాయి. ఆ అర్దరాత్రి చీకటిలో, అతని కళ్ళు ఓ క్షణం మెరిసాయి.

    ట్రైన్ వేగం మెల్లగా తగ్గిపోతోంది. అప్పటికే పాతిక, ముప్పయి మందిదాకా చుట్టూ చేరిపోయారు.

    ఎంత గుండెనిబ్బరం గలవాడికైనా ఆ పోరాటం చూస్తే ఒళ్ళు జలదరించక తప్పదు. అప్పటికే ఆ నలుగురి ఒంటిమీద బట్టలు చిరిగిపోయి, అక్కడక్కడ రక్తం ఒడుస్తోంది. అటు మూడు, ఇటు మూడు బెర్తుల మధ్యనున్న్ అతి తక్కువ స్థలంలోనే వారి పోరు సాగుతోంది.

    వార్ని ఆపేందుకు ఎవరికీ ధైర్యం చాలటంలేదు.

    ఒకడి చేతిలో బిగుసుకుపోయిన గుప్తా మనస్సు కీడును శంకిస్తోంది. టెక్నీషియన్ ను అదృశ్యం చేసి త్రినాధ్ వ్యాపారాన్ని ఆదిలోనే దెబ్బకొట్టేందుకు సుదర్శన్ రావు చేసిన పన్నాగమే అది అని అతనికి అర్ధమయిపోయింది.

    అచంచలమైన ఆత్మవిశ్వాసం, అమోఘమైన తెలివితేటలున్న త్రినాధ్ కి ఓటమి... సంభవమా? ఇకతని ఆలోచనలు ముందుకు సాగలేదు. అతను నిస్సహాయంగా చుట్టూ మూగిన వారివేపు చూశాడు రక్షించమన్నట్లు.

    చుట్టూ మూగినవారికి అర్ధమయిపోయింది- ఆ పోరాటం జరుగుతున్నది డబ్బుకోసం కాదని- మరి దేనికోసం? చంపటానికా! వణకిపోయారా ఆలోచన రాగానే.

    బోస్ కి విజృంభించి ఆ ముగ్గుర్నీ మట్టుపెట్టాలనే వుంది. కాని ఆ ఇరుకైన ప్రదేశంలో గట్టిగా చేయి చాచటానికి కూడా సాధ్యపడటంలేదు.

    అప్పటికే బోస్ దెబ్బలకు రక్తసిక్తమయిపోయిన ఆ ముగ్గురిలో పిరికితనం ప్రవేశించింది.

    తమ బాస్ కూతురు తెలివితక్కువగా, నీ వ్యక్తిని అదృశ్యం చేస్తానని తన ప్రత్యర్ధికి తెలియపర్చి సవాల్ చేయటాన్ని బట్టే సుదర్శన్ రావు తమను నియమించాడు. అదృశ్యం చేస్తామన్నది ముందే త్రినాధ్ కి తెలిసింది. కనుక జాగ్రత్తపడతాడు. నా అంచనా ప్రకారం ఎవరినైనా వారికి రక్షణగా పంపిస్తాడు. కనుక జాగ్రత్తగా ఎదుర్కొండని చెబితే తాము అప్పుడు పెద్దగా లెక్క చేయలేదు. కానిప్పుడు, చూస్తుంటే చిచ్చరపిడుగులాంటివాడే రక్షణగా వచ్చాడు. వీడ్ని గెలిచి ఆ వ్యక్తిని చేజిక్కించుకోవటం దుర్లభం. కనుక ట్రైన్ ఆగీ ఆగగానే తెలివిగా ఆ వ్యక్తితో సహా తప్పించుకోవాలి- ఆ నలుగురు ఎవరికి వారే ఈ విధంగా ఆలోచిస్తున్నారు.

    అదే అదనుగా రెట్టించిన ఉత్సాహంతో బోస్ ఆ ముగ్గుర్ని అందిన చోటల్లా బాదేస్తున్నాడు.

    చూస్తుండగానే ట్రైన్ ఆగిపోవటాన్ని గమనించి ఏం జరిగిందో అర్ధంకాక ఇంజన్ డ్రైవర్, టీ.సీ.లు అయోమయంలో పడ్డారు.

    మరికొద్ది క్షణాలకు ట్రైన్ పూర్తిగా ఆగిపోయింది.

    అది గమనించిన ఆ నలుగురు అప్పటికే గుప్తా ప్రక్కనున్న వ్యక్తిని చేజిక్కించుకుని జనామమీదపడ్డారు. జనం భయంతో కకావికలమైపోయారు. సడన్ గా అలా తప్పించుకుపోతారని ఊహించని బోస్ వార్ని అనుసరించబోయే సరికి చెల్లాచెదరైన జనం అనుకోకుండా అడ్డుపడిపోయారు.

    వేగంగా వార్ని పక్కకు తోసి ముందుకు దూకాడు బోస్.

    గుప్తా తన నోటికున్న ప్లాస్టర్ లాగేసుకొని 'మా మనిషిని రక్షించండి' అంటూ పెద్దగా అరవటం ప్రారంభించాడు.

    జనాలు ఒక్కొక్కరే తరుకొని ఆ నలుగురు వ్యక్తులు పారిపోయిన వైపు రేసు కుక్కల్లా దూసుకుపోయారు.

    సరిగ్గా అదే సమయానికి ఆ నలుగురు తాము బంధించిన వ్యక్తితో సహా ట్రైన్ లోంచి దూకేయటం, రైలు పట్టాల వెంటే పరిగెత్తటం, చీకటిలో కల్సిపోవటం, మరికొద్ది క్షణాలకే కారు స్టార్టయిన శబ్దం వినిపించటం జరిగిపోయింది.

    అప్పుడర్ధమయింది నిస్సహాయంగా మిగిలిపోయిన బోస్ కి ముందుగానే వాళ్ళు ప్లాన్ వేసుకొని ఆ ప్రాంతానికి తమ కారును రప్పించుకున్నట్లు.

    గుప్తా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు జరిగింది తెలుసుకొని.


                                             *    *    *    *


    తెల్లవారుఝాము అయింది. నగరమంతా నిశ్శబ్దంలో నిదురపోతోంది. కాని ఒక వ్యక్తి మాత్రం కంటిమీద కునుకు లేకుండా ఫోన్ వైపే చూస్తూ కూర్చున్నాడు.

    ఎదురుగా హిందూ వుంది. ఆమె ఆలోచిస్తోంది- త్రినాధ్ మైకో టెక్నీషియన్ ని రప్పించుకునేందుకు గుప్తాని పంపిస్తున్నట్టు ప్రియాంకకు ఎలా తెలిసిందని.

    నిర్విఘ్నంగా తన తొలి వ్యాపార శంఖారావాన్ని పూరిస్తాడనుకున్న త్రినాధ్ ఆదిలోనే అపజయాన్ని ఎదుర్కొంటాడని ఆమెంత మాత్రం వూహించలేదు. ఆమెకు మనసంతా దిగులుగా వుంది. మరోపక్క త్రినాధ్ అంత తేలిగ్గా ఓడిపోతాడా అని ధైర్యంగా కూడా వుంది. అంతలో ఆమె ఆలోచనల్లో బోస్ చోటుచేసుకున్నాడు.

    అంత టెన్షన్ లోనూ ఆమెకో విషయం గుర్తొచ్చి ఆశ్చర్యమేసింది. ఈమధ్య తనకప్పగించే ప్రతి పనిని బోస్ తో కలిసి చేయమంటున్నాడు త్రినాధ్. అతని ఉద్దేశం ఏమై వుంటుంది?

    ఒకప్పుడు తనను నలుగురి ముందు రాక్షసంగా ముద్దు పెట్టుకున్నందుకు బోస్ మీద కోపంగా వుండేది. కానీ మధ్య తెలియకుండానే తను బోస్ పట్ల శ్రద్ధ కనబరుస్తోంది.

    బోస్ గుర్తుకురాగానే అతనికున్న అపారమైన భుజబలం కూడా గుర్తుకొచ్చింది. అప్పటికామెకు ఒకింత ప్రశాంతత చేకూరింది- బోస్ ఎలాగైనా ఆ టెక్నీషియన్ ని కాపాడగలడు అని.

    క్షణాలు... నిమిషాలు... నిశ్శబ్దంగా కరిగిపోతున్నాయి. ఆఫీసు మొత్తం మీద ఆ గదిలోనే లైట్ వెలుగుతోంది.

    తెల్లవారు ఝాము నాలుగు కావటానికి మరొక్క నిమిషం వుందనగా ఫోన్ మ్రోగింది. దానికోసమే ఎదురుచూస్తున్న త్రినాధ్ చటుక్కున ఫోన్ ఎత్తి చెవికానించుకున్నాడు.

    కొద్ది క్షణాలు అలాగే పట్టుకున్నాడు ఫోన్ ని.

    త్రినాధ్ ఏం చెబుతాడోనని హిందూ ఉద్వేగంగా ఎదురుచూస్తోంది.ఓ నిమిషం తర్వాత త్రినాధ్ ఫోన్ పెట్టేసి కుర్చీలోంచి లేచాడు మామూలుగా.

    అతనలా ఏం చెప్పకపోయేసరికి హిందూకి అరికాలి మంట నెత్తికెక్కింది.

    "ఏం జరిగింది? ఎవరా ఫోన్ చేసింది...? నేనిక్కడ అల్లాడిపోతుంటే అలా నిర్వికారంగా ఏం చెప్పకుండా లేచిపోతావేం?" కోపంగా అంది హిందూ.

    అతను ముందుకు కదులుతూ- "ప్రియాంక" అన్నాడు కూల్ గా.


                    *    *    *    *


    ఉదయం తొమ్మిది గంటల సమయం... అప్పటికే ఆఫీస్ కొచ్చాడు త్రినాధ్. ప్రశాంతంగా కూర్చుని ఒక్కొక్క ఫైలే తిరగేస్తున్నాడు నిశితంగా. అతనికింకా ఇంగ్లీష్ భాషను వేగంగా చదివే నేర్పు అలవడలేదు. కొన్ని కొన్ని ఇంగ్లీషు పదాలకు అర్ధం తెల్సుకోవడానికి డిక్షనరీ తిరగేయక తప్పడంలేదు.

    అది అంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు తను తయారుచేసి యిస్తానన్న ప్రోడక్టుకి శాంపుల్ గా యిచ్చిన ఆర్డర్.

    ఆఫీస్ స్టాఫ్ ఒక్కొక్కరే రావడం ప్రారంభమయింది.

    9-30 అవుతుండగా గుప్తా వచ్చాడు దిగులుగా.

    త్రినాధ్ గుప్తాని చూసి పలకరింపుగా నవ్వాడు.

    గుప్తా సిగ్గుతో తలవంచుకున్నాడు. మైకో టెక్నీషియన్ ని తప్పక తీసుకు వస్తానని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న త్రినాధ్ కి ఎలా జరిగింది చెప్పడం?

    అతని భావాన్ని అర్ధం చేసుకున్నట్టుగా అన్నాడు త్రినాధ్. చేతిలోని ఫైల్ ని మూసేస్తూ "వ్యాపార మన్నాక లాభానష్టాలేకాదు గుప్తాజీ- కష్టసుఖాలు కూడా వుంటాయి. ఎదుర్కొనక తప్పదు. ఇందులో మీ తప్పేం లేదు మీరేం బాధపడకండి. అంతా సవ్యంగానే జరుగుతుంది. మీరు ఇప్పుడో పనిచేసి పెట్టాలి.

    తన వ్యాపారానికి ఎంతో ముఖ్యమైన టెక్నీషియన్ చూస్తుండగానే అదృశ్యం కాబడితే దాని తాలూకు బాధను వ్యక్తపర్చకపోగా, ఎంతో ప్రశాంతంగా మరో వ్యాపారానికి పునాదులు వేస్తున్నాడంటే- ఏమిటితని ధైర్యం...?

    "గుప్తాజీ... ఈ రోజు పేపర్ చూశారా? రానున్న కాలంలో ఋతు పవనాలు అనుకూలంగా వుండవట. దాంతో వర్షాలు చాలినంతగా కురవవు. వర్షాభావ ప్రభావం ముందుగా మంచినీటిపై పడుతుంది. కనుక ప్రజలు త్రాగే నీరు లభ్యంకాక చాలా ఇబ్బందులు పడతారు. నీరు అసంఖ్యాక ప్రజల అవసరం. అదిప్పుడే తెలియదు. కనుక ప్రజల అవసరాన్ని మన వ్యాపారానికి అనుకూలంగా వాడుకుందాం. వెంటనే మీరు రంగంలోకి దిగి నగరంలో వున్న రిగ్గుల్ని లీజ్ కి తీసుకొనే ప్రయత్నాలు ప్రారంభించండి. ఎన్ని వీలైతే అన్నీ. ఈ పని తక్షణం ప్రారంభం కావాలి. ఇది చలికాలం. రానున్నది ఎండాకాలం. చలికాలానికే మంచినీటి ఎద్దడి అంతగా కనిపించదు. దాంతో నగరంలోవున్న రిగ్గులు ప్రస్తుతం ఖాళీగా వుంటాయి. కనుక తక్కువ అద్దెకు వాటిని లీజ్ కు తీసుకోండి" అన్నాడు త్రినాధ్ సాలోచనగా.

    వ్యాపారంలో ఎన్నో ఢక్కా మక్కీలు తిని, ఎంతో ఉన్నతస్థానానికి వెళ్ళినవాడిలో మాత్రమే కనిపించే నిగ్రహం త్రినాధ్ లో కనిపిస్తోంది.

    అప్పుడనుకున్నాడు గుప్తా- త్రినాధ్ చిన్నచిన్న తుఫాన్ లకు కూలిపోయే వాడు కాదని, ఎంతో లోతైన ఆలోచనలున్నవాడని.

    అయినప్పటికీ మొదటి వ్యాపార పరాజయాన్ని ఎలా తట్టుకోగలడు...?

    గుప్తా ఆలోచనల్లో వుండగానే త్రినాధ్ ఒక మేనేజర్ ని పిలిపించి "ప్రస్తుతానికి లూబ్రికేటింగ్ ఆయిల్ బిజినెస్ ప్రక్కనపెట్టి కొత్త వ్యాపారానికి ప్రత్యేకమైన ఫైల్ సిద్ధం చేయండి. ఈ రోజే మీరు గ్రవుండ్ వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్ కెళ్ళి ఈ నగరంలో ఎందరికి రిగ్గులు వున్నాయో వారి అడ్రస్సులు సేకరించండి..." త్రినాధ్ చెప్పుకుపోతున్నాడు అవిశ్రాంతంగా.

    పది నిమిషాలకు బయటకు వచ్చిన గుప్తా, ఆఫీసులో వాళ్ళు ఎవరూ అడక్కుండానే జరిగింది జరిగినట్టు చెప్పాడు. చివరగా తన అసమర్ధతను ఒప్పుకుంటూ, బోస్ ఏమయ్యాడో తెలియదని చెప్పి వాపోయాడు.

    గుప్తా మానసిక దౌర్భల్యాన్ని ముందే అంచనా వేశాడు త్రినాధ్.

    క్షణాల్లో ఆఫీసంతా పాకిపోయింది. త్రినాధ్ తన తొలిమెట్టుమీదే ప్రియాంక చేతిలో ఘోరంగా ఓడిపోయాడని.


                                              *    *    *    *


    ఆరోజు ప్రియాంక స్వయంగా తనే కాఫీ తెచ్చి ఇచ్చింది సైంటిస్ట్ కి.

    తనకు, ప్రియాంకకు మధ్య రోజు రోజుకు సాన్నిహిత్యం పెరుగుతోందని మహదానందపడిపోతున్నాడతను.

    "మంచి ఇన్ ఫర్మేషన్ ఇచ్చి త్రినాధ్ ని తొలిదెబ్బకొట్టే అవకాశం కల్పించావ్. త్రినాధ్ కి ఎంతో అవసరమైన టెక్నాలజిస్టు ఇప్పుడు నాబందీ" ఆమె నవ్వుతోంది మెల్లగా.    

 Previous Page Next Page