జవాబుగా తలవంచుకొని "అవును! ఇతన్ని పరమ మర్యాదగా తీసుకు రమ్మన్నాడు. రండి సార్! బయట కారు రెడీగా వుంది" అన్నాడు.
రిషి ఆశ్చర్యంగా మిగతా వాళ్ళవైపు చూసాడు.
మధు కంగారుగా "వెళ్ళకు! ఇందులో ఏదో కుట్ర వుండే వుంటుంది. ఆ లోకనాధం తక్కువ వాడు కాదు" అన్నాడు.
"మనం మాత్రం తక్కువా? అయినా ఎన్నాళ్లని దాక్కుంటాం? వెళ్ళి తాడోపేడో తేల్చేసుకొచ్చేస్తాను" అన్నాడు రిషి.
"తాడే తేల్చుకురా! పేడు వద్దు" అంది శ్రీజ. "పోనీ నేనూ రానా" అడిగాడు మధు.
"వద్దు ఇది నాకు సంబంధించిన వ్యవహారం. మీరు ఎవరూ అనవసరంగా ఇరుక్కోకండి" చెప్పాడు రిషి.
"పదండి సార్!" గుండువాడు మర్యాదగా జరిగి దారి ఇచ్చాడు.
"అబ్బో! చాలా మర్యాదస్తుల్లాగే కనిపిస్తు...." అని మధు జడవాడు క్రూరంగా చూసేసరికి ఆగిపోయాడు.
"రౌడీ వెధవలు వాళ్ళకి మర్యాదేంటి?" అంది శ్రీజ.
జడవాడు ఆనందంగా "అదీ.... అలా చెప్పు వాడికి" అని వెళ్ళిపోయాడు.
కారు డోర్ తీసి పట్టుకుని రిషి ఎక్కి కూర్చున్నాకా వాళ్ళిద్దరూ ఎక్కి "స్టార్ట్ చెయ్యమంటారా సార్?" అని అడిగారు.
రిషి "ఊ!" అన్నాక కారు కదిలింది.
* * * *
"ఏడవకమ్మా. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. రిషికి ఏమీ జరగదు నువ్వు ధైర్యంగా ఉండు" చెప్పాడు లింగం.
మంచంమీద కూర్చుని కిటికీలోంచి చీకటిని చూస్తున్న ఆశ్రిత లింగం వైపు తిరిగింది. ఆమె పెదవుల మీద అదోలాంటి చిరునవ్వు మెరిసింది. "ఎవరూ తమంతట తామే సుఖాలు నుదుట వ్రాసుకుని పుట్టరు. చేజిక్కించుకోవటానికి కొంత కష్టపడాలి. తప్పదు" పట్టుదల కురిపిస్తున్న కళ్ళతో చూస్తూ అంది.
ఇంతలో కారు వచ్చిన శబ్ధం అయింది. లింగం ఆశ్రితా ఒకేసారి కిటికీ దగ్గరగా నడిచారు. లోకనాధం కారు దగ్గరకి వెళ్ళడం, రిషితో ఏదో మాట్లాడ్తూ వెంట పెట్టుకుని లోపలికి రావటం కనిపించింది.
ఆశ్రిత భారంగా కనులు మూసుకుంది. ప్రతి ఆడపిల్లకీ ఈ పరిస్థితి ఓ అగ్ని పరీక్షలాంటిదే. ఆమెతో ఓ మనిషి జీవితాన్ని పంచుకోవడం అనే విషయాన్ని నిర్దేశించడానికి పెద్దవాళ్ళు సిద్ధంగా ఉంటారు. ప్రేమించి వరుడ్ని తనే వెదుక్కున్న అమ్మాయికి ఈ విషయంలో ఎంత టెన్షన్ గా వుంటుందో జీవితం అంతా తియ్యని పాటలా సాగిపోవాలనే ప్రతి కన్నెపిల్లా కోరుకుంటుంది. పుట్టగానే అమ్మ పాలు తియ్యన, పెరుగుతూ వుంటే మమకారం తియ్యన! వయసు వచ్చాకా వాడిమీద వలపు తియ్యన! నచ్చినవాడే తాళికడ్తే బ్రతుకంతా తియ్యన! పిల్లలు పుట్టాకా ఆడదాని జీవితంలో ఇంకా తియ్యనిదేం మిగుల్తుంది? అన్నీ తీసి అలా చేస్తుంది. తనకంటూ ఏమీ మిగుల్చుకోదు.
ఆశలో వున్నంత తియ్యదనం మరెందులోనూ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశని మాత్రం ఆశ్రయించకూడదు.
లింగం అడిగాడు "నేను వెళ్ళి చూసిరానా అక్కడ ఏం జరుగుతుందో?"
ఆశ్రిత కంఠం స్థిరంగా పలికింది. "అవసరం లేదు. రిషి సామర్ధ్యం మీద రిషికే నమ్మకం ఎక్కువ. Man Can Move mountains by faith ముందుకు వెళ్ళలేని ప్రతివాడూ వెనక్కి మరలి రావల్సిందే. చూద్దాం! ముందుకు ఎలా వెళ్తాడో?"
ఆమె కళ్ళు కారడవిలో ఖైదు చేయబడ్డ కాంతి పుంజాల్లా కనిపించాయి.
* * * *
లోకనాధం రిషివేపు అడుగులేస్తూ అన్నాడు- "అందరూ వెళ్ళిపోండి అతన్ని నాకు విడిచి పెట్టండి"
అందరూ అతని ఆజ్ఞ పాటించి వెళ్ళిపోయారు.
రిషి తలెత్తి సూటిగా లోకనాధం కళ్ళలోకి చూసాడు. అంత తీక్షణంగా కళ్ళల్లోకి గుచ్చిగుచ్చి చూస్తే శత్రువు ఎంతటి బలవంతుడయినా తత్తరపడక మానడని అతనికి నమ్మకం.
కానీ లోకనాధం తత్తరపాటు చూపలేదు.
"చొక్కాగుండీలు విప్పు" అధికారయుక్తంగా అన్నాడు.
రిషి కనుబొమలు చిట్లించి అడిగాడు "ఎందుకు?" లోకనాధం దగ్గరికొచ్చి కుడి అరచేత్తో రిషి ముఖంమీద పడుతున్న వెంట్రుకల్ని వెనక్కి తోసి "నీకు ఇక్కడ సుడి వుందికదూ!" అన్నాడు.
రిషి విస్మయంగా "అవును అయితే!" అన్నాడు. లోకనాధం ఆత్రుత పట్టలేనట్లు రిషి చొక్కాపై గుండీలు రెండు టపటపా లాగిపారేసి "హూ! ఆహా!" అని అరిచాడు.
రిషి అయోమయంగా తన మెడకింద గుబురుగా వున్న వెంట్రుకలనీ, వాటి మధ్యలో మెరుస్తున్న కంది బద్ధ అంత పుట్టుమచ్చని చూసుకున్నాడు.
లోకనాధం అంతటితో ఆగక రిషి చెవులు పట్టుకుని చూస్తూ ఆనందంగా "అరె.... ఒక చెవి కొద్దిగా ముందుకు వంగి అచ్చం అలాగే ఉంది" అని అరిచాడు.
"ఐతే ఏంటటా?" రిషి చిరాకుగా అడిగాడు. లోకనాధం ఆలస్యం చెయ్యలేదు. అతన్ని గట్టిగా వాటేసుకున్నాడు. ఆ హఠాత్ చర్యకి రిషి అవాక్కయిపోయి కెవ్వున కేకవేసాడు.
ఆ కేక వినగానే ఆశ్రిత గుండె కొట్టుకోవడం లిప్తపాటు స్థంభించి మళ్ళీ కొట్టుకోసాగింది.
"ఇంక లాభం లేదమ్మా వెళ్ళి చూద్దాం" కంగారుగా అన్నాడు లింగం.
"పద" అంటూ ఆమె నడిచింది.
రిషి లోకనాధం వున్న గది తలుపు తెరుస్తూనే ఆ దృశ్యం చూసి ఆశ్రిత, లింగం ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచి అలాగే నిలబడి పోయారు.
జీవితంలో మనం అన్నీ అనుకున్నట్లే జరుగుతూ వుంటే సోషల్ టెక్ట్స్ బుక్ లో చదివిన చరిత్రనే మళ్ళీ మళ్ళీ చదువుతున్నట్లూ, సైన్స్ లాబ్ లో ఎవరో కనిపెట్టిన ప్రయోగాన్నే మళ్ళీ చేస్తున్నట్లు పరమబోర్ గా వుంటుంది.