Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 39


    వీధివైపు తాళం వేసి వుంటుంది కాబట్టి పెరటి మార్గమే తనకి రాచమార్గం. పెరటి వైపు ఇంటివాళ్ళు వున్నారు. అయినా ఫరవాలేదు. గోడలు దూకటం చెట్లు ఎక్కటం వగైరాలలో తను గొప్ప శిక్షణ పొందింది. రాత్రి రెండుగంటల వేళ అంతా మంచి నిద్రలో వుంటారు. ఇక్కడ నుంచి వెళ్ళటానికి యిదే మంచి ముహుర్తం.

    ఆ రాత్రికి అవంతి నిద్రపోదల్చుకోలేదు.

    అవంతికి ఆలోచించి ఆలోచించి కొద్దిగా తల నొప్పి వచ్చింది. తను వెళ్ళిపోతున్నానన్నే ఉషారులో తలనొప్పిని పట్టించుకోలేదు. అప్పటికి టైము పదకొండు అయింది.

    ఆలోచన చాలించి అవంతి కుర్చీలోంచి లేచింది.

    భోజనం ఏడుగంటలకే చేయటం వల్ల కాస్త కడుపు ఖాళీ అయినట్లు అనిపించి గ్లాసు నిండా హార్లిక్స్ కలుపుకుని తెచ్చుకుంది. నెమ్మదిగా ఊదుతూ వేడి చల్లార్చుకుంటూ గ్లాసెడు హార్లిక్స్ తాగింది. గ్లాసుని అక్కడే పారేసి లేచింది.

    అవంతి ముందుగా నీరువా తెరిచింది. తనకి ఏ డ్రస్ బాగుంటుందో అని మొత్తం గుడ్డలు గాలించింది. పంజాబీ మగవాళ్ళు ధరించే డ్రస్సు తలపాగ సెలక్ట్ చేసి పెట్టుకుంది. ఒక ప్రాబ్లం తీరిపోయింది.

    అవంతి ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి అట్లకాడ చిన్న సుత్తి తీసుకుని వచ్చింది.

    పెట్టె తాళం పగలగొట్టే ముందు పెట్టెని ఎత్తి చూసింది. ఆ బరువు ఎత్తటం సాధ్యం కాలేదు. అది పూర్వకాలం ఇనప్పెట్టె. మూలల్లో గట్టి బందూకులు బిగించివున్నాయి. పెద్ద తాళం వేశాడు.

    "జై పాతాళభైరవి సాయం చేయరా సుత్తిగా" అనుకుని సుత్తితో తాళం మీద ఒక దెబ్బ వేసింది. అబ్బే తాళం తాళంగానే వుంది. ఈ సుత్తిగాడి దెబ్బ తాళం గాడికి సుతిమెత్తగా తగిలి వుంటుంది.

    అవంతి పెదవులు గట్టిగా బిగించి సుత్తి పిడిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని బలమైన దెబ్బలు తాళం మీద దబ దబ వేసింది. అలా మళ్ళీ మళ్ళీ వేసింది.

    ధన్ మని, వూడివచ్చింది.

    ఊడి వచ్చింది పెట్టె తాళంకాదు. సుత్తి తాలూకా పిడి. నీ దుంప తెగ నీవూ యిప్పుడే వూడాలా!" కింద పడిన సుత్తిని చేతిలో మిగిలిన పిడిని చూస్తూ అవంతి అనుకుంది.

    ఉత్త సుత్తితో కొడితే తాళంకి బలంగా దెబ్బతగలదు. పిడి వున్న సుత్తి అయితే పట్టుకోడానికి వీలుగా వుంటుంది. అవంతి కింద కూర్చుని సుత్తికి గట్టిగా అమర్చేపనిలో పడిపోయింది. సరీగా అప్పుడే.

    ఎవరో తలుపులు దడదడ బాదారు.

    అవంతి గాభరా పడుతూ లేచి నుంచుంది.

    మరోసారి తలుపులు బాదారు. అంతేకాదు. "నీ అమ్మ సిగదరగ తలుపు తియ్యవే" అన్న మాటలు వినపడ్డాయి.

    తలుపులకి బైట తాళం వేసి వుంది. తలుపు తట్టి మరీ పిలుస్తున్నాడు వాడెవడో, తను యింట్లో వున్నట్లు వాడికెట్లా తెలుసు? ఇప్పుడు తనేం చేయాలి! పలకాలా అక్కరలేదా! ఈ కొత్త ప్రమాదాన్ని ఎదుర్కోవాలి! ఇప్పుడు తనకి....

    అవంతి తీవ్రంగా ఆలోచిస్తుంటే బైట నుంచి మరో కొత్త కంఠం వినిపించింది.

    "వరె అప్పిగా! తలుపు బైట తాళం వేసి వుంది. తలుపులు విరగొట్టి ప్రయోజనం ఏంటిరా!"

    "ఏంటి తాళం వేసివుందా!"

    "చూడు నీకే తెలుస్తుంది."

    వాళ్ళలా మాట్లాడుకుంటుంటే అవంతి నెమ్మదిగా నడిచి తలుపు దగ్గరగా వచ్చి తలుపుకి చెవి ఆనించింది.

    బైటవాడు తాళం లాగి చూసినట్లున్నాడు. "అవునురోయ్! వెంకులూ! తాళం కప్ప నా తలకాయ అంతవుంది" అన్నాడు.

    "వుంది గందా!"

    "ఆ....వుంది. అమరి అదెట్టా పోయిందంటావ్!"

    "నాకేం తెల్సురా తలకమాసినావాడా."

    "నాకు తెల్సు"

    "అయితే చెప్పి తగలడు"

    "అది తాళం వేసి సినిమాకి తగలడింది."

    "మరెరోయ్!"

    "ఏ మొచ్చిందిరా తైనాతి వెధవా! చెవి కింద మేకలా అరిచావ్, నా చెవి గట్టిది కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ అరుపుకి ఊడి వచ్చేది."

    "సరేలే వెధవ చెవి వుంటే ఎంత వూదితే ఎంత అసలు విషయం ఏమిటంటేరా....!"

    "ఏంటి ఏంటంట?"

    "ఇది మీ ఇల్లు కాదు హె హ్హెహ్హె."

    "ఆసికాలు ఆడుతున్నావా?"

    "కాదురా, ఈ తలుపులు చూడు గట్టిగా వున్నాయి. మనింటి తలుపులు తడికతో వుంటాయి. అవునా?"

    "అవును."

    "ఇప్పుడేం చేద్దాం పోదామా?"

    "నాకు వోపికలేదు కాసేపు యిక్కడే తొంగుని ఆ తర్వాత లేచి వెళదాం" 

    "అయితే ఆ తలుపు నీది ఈ తలుపు నాది. నీవు దానికి అనుకో నేను దీనికి ఆనుకుంటాను"

    "అట్ట అన్నావ్ బాగుంది."

 Previous Page Next Page