Previous Page Next Page 
జయ - విజయ పేజి 39


    "రోజూ వస్తూండండి" చెప్పాడు చంద్రకాంత్ అతనితోపాటు రోడ్డువరకూ నడిచి.
    అతను తలూపాడు.
    "మీ ఇంటి అడ్రసేమిటి?" అడిగాడు చంద్రకాంత్.
    "నేను మా చిన్నాయన వాళ్ళింట్లో వుంటున్నానిక్కడ! అశోక్ నగర్ లో గుడి పక్కన ఇల్లే."
    "ఓకే!"
    అతను వెళ్ళిపోయాడు.
    చంద్రకాంత్ చాలాసేపు తన గదిలో కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయాడు.
    అసలు విజయ ప్రవర్తన మొదటినుంచే తనకు అనుమానం కలిగిస్తోంది. ఆమెకు ఆ వయసు కుండాల్సిన సరదాలు, కోరికలు, యివేమీ లేకపోవడం, జీవితం మీద ఆసక్తి లేనట్లు గడపడం, వీలయినంత వరకూ తన నుంచి తప్పించు తిరగడం అన్నీ సందేహాస్పదమైన అంశాలే!
    ఒకవేళ ఆమె కిషోర్ ప్రేమించుకున్నారేమో! ఏ కారణం చేతనో వివాహం చేసుకోలేకపోయారేమో!
    మొదటిసారి ఆమె ఆఫీసుకెళ్ళినప్పుడు యిద్దరూ కనిపించడం, తనను చూసి ఖంగారు పడడం యివన్నీ తన అనుమానాల్ని బలపరచే సంఘటనలు. ఒకవేళ ఆమెకూ కిషోర్ కి మధ్య కేవలం చక్కటి స్నేహమే ఉన్నట్లయితే ఆ విషయం తనతో మాట వరసకు కూడా ఏనాడూ ఎందుకు చెప్పలేదు? అసలు తనకు ఉత్తరాలు రాసింది విజయేనా? తనకింతవరకూ ఆమె దస్తూరీని పరిశీలనగా చూసే అవకాశంగానీ, అవసరంగానీ కలుగలేదు."
    హఠాత్తుగా అతనికో ఆలోచన వచ్చింది.
    "విజయా!" అంటూ పిలిచాడామెని.
    జయ "ఏమిటి?" అంటూ అతని దగ్గరకొచ్చి నిలబడింది.
    "ఇదిగో. ఈ కథను త్వరగా కాపీ చేసి ఇమ్మను మీ చెల్లిని" అన్నాడు టేబుల్ మీదున్న కాగితాలను ఆమెకందిస్తూ.
    జయ ఆ కాగితాలు తీసుకెళ్ళి విజయకిచ్చింది.
    రాత్రి పదకొండు గంటలవరకూ కూర్చుని ఆ పని పూర్తిచేసి చంద్రకాంత్ కి అందించిందామె. ఆమె దస్తూరీ చూస్తూనే స్పష్టంగా తెలిసిపోతోంది. తనకు ఉత్తరాలు రాసిన దస్తూరే యిది కూడా!
    అంటే ఈమే విజయ అన్న విషయం రుజువయింది. మరి జయే విజయలా ఎందుకు నటిస్తున్నట్లు?
    ఎంతసేపు ఆలోచించినా ఏమీ తట్టటం లేదతనికి! ఏదో బలమైన కారణం వుంటేనేగానీ యింతటి సాహసం చేసేందుకు పూనుకోరు ఎవరయినా? అదేమిటయి ఉండవచ్చు?
    మర్నాడు ఆఫీస్ కెళ్ళి నెలరోజులపాటు శెలవు పెట్టి మధ్యాహ్నానికల్లా యింటికి తిరిగి వచ్చాడతను.
    తన బట్టలన్నీ ఉతికి ఆరవేస్తోంది జయ. ఆమే విజయ అన్న విషయం రూఢి చేసుకోటానికి నిశ్చయించుకున్నాడతను.
    "విజయా!" అంటూ పిలిచాడు గడపలో నిలబడి.
    "ఏమిటండీ!" అతని దగ్గరకొచ్చి నిలబడిందామె.
    అతనికి సందేహ నిర్ధారణ అయిపోయింది.
    ఈమే విజయ! విజయ పేరుతో తన భార్య అయింది నిజానికి జయ.
    "మీరు పాపం చాలా శ్రమ పడుతున్నట్లున్నారు" సానుభూతి సూచకంగా అన్నాడతను.
    ఆ సాయంత్రం కిషోర్ ఇల్లు చేరుకుని చంద్రకాంత్ కాలింగ్ బెల్ నొక్కాడు.
    "మీరా! రండి!" అన్నాడు కిషోర్ ఆదరంగా.
    లోపలకు నడిచి కుర్చీలో కూర్చున్నాడు చంద్రకాంత్.
    "అలా తిరిగి వద్దామా కాసేపు? కిషోర్ నడిగాడతను.
    "ఎక్కడికి?" ఖంగారు అణుచుకుంటూ అన్నాడతను.
    "పార్క్ లో కూర్చుందాం!"
    అతను మారు మాట్లాడకుండా లోపలికెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాడు.
    ఇద్దరూ పార్క్ వైపు నడిచారు. పార్క్ అంతా చిన్నపిల్లల ఆటలతో సందడిగా ఉంది.
    కొద్దిసేపు ఏవేవో విషయాలు మాట్లాడాడు చంద్రకాంత్. చివరకు సంభాషణ జయ మీదకు మళ్ళింది.
    "అన్నట్లు జయ నాకు అన్నీ చెప్పేసింది. మీరిద్దరూ ప్రేమించుకోవడం, పెళ్ళి చేసుకోవాలనుకోవడం..." అతని మొఖం వంకే పరీక్షగా చూస్తూ అన్నాడతను.
    కిషోర్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. జయ అలాంటి పని ఎందుకు చేసిందో అతనికి అర్థం కావటం లేదు. ఇంతవరకూ వచ్చాక తను ఇంకా రహస్యంగా మసలటం అనవసరమనిపించిందతనికి.
    "అవునండీ! నా తెలివితక్కువ తనం వల్ల మా వివాహం జరగలేదు! అంతే! అంతకంటే వేరే కారణమేమీ లేదు!"
    చంద్రకాంత్ కి కోపం, దుఃఖం రెండూ కలుగుతున్నాయ్! తనను అందరూ మోసగిస్తున్నట్లు అనిపించసాగింది ఆ క్షణంలో.
    "మీరు జయను నిజంగా ప్రేమించారా?"

 Previous Page Next Page