"యీ నిరుద్యోగ సమస్య అంతా నానించే వచ్చినట్టు మాట్లాడుతున్నారు" ఉక్రోషంగా అంది ఆవిడ.
"నీవేకాడు, నీలాంటివాళ్లు ఇంకా చాలామంది వుంటారు...."
"అంటే స్త్రీ ఉద్యోగం చేయకూడదని, ఆర్ధిక స్వాతంత్ర్యం ఆమెకి వుండకూడదని మీ ఉద్దేశ్యమా?. పాపం! మళ్ళీ ఆడ డాక్టర్లు కావాలి. ఆడ లెక్చరర్లుండాలి. నర్సులు కావాలి...."
"నీవు నన్ను సరిగా అర్ధంజేసుకోడం లేదు... ఆడవాళ్లు ఉద్యోగం చేయకూడదని నేననడంలేదే?.... నీలాంటివాళ్లు ఉద్యోగం చేయడం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను... యీనాడు ఆడవాళ్ళు అన్నిరకాల చదువులు చదువుతున్నారు. అనేకమంది ఉద్యోగాలు చేస్తున్నారు. కాని ఆర్ధికంగా అవసరమున్న వారికి ఉద్యోగాలెక్కడ దొరుకుతున్నాయి? నీసంగతే చూడు. ఆ ఉద్యోగానికి నీకంటే ఎక్కువ అర్హతలున్నవారు చాలామందే వచ్చి వుండవచ్చు. కాని వాళ్ళందరిని కాదని, ఇంటర్వ్యూకూడా అక్కరలేదని నీకీ ఉద్యోగం ఇస్తున్నారంటే అర్ధం ఏమిటి.... ...."
"తమరి పేరు చూసి నాకు ఉద్యోగం ఇస్తున్నారు వ్యంగ్యంగా" అంది ఆమె.
"తప్పకుండా అదేకారణం. రామిరెడ్డిగారు మనకు కావల్సినవాడు కావడం, అతని కొడుక్కు నా క్రింది ఆఫీసరుగా ఉద్యోగం ఈయడం కారణాలు కావంటావా? లేకపోతే ఆ ఉద్యోగం నీకు వచ్చేదంటావా....?"
"నా ఒకర్తి వల్ల దేశంలో అందరికి ఉద్యోగాలు దొరకడం లేదంటారు? నేను ఒకర్తిని మానేస్తే యీ నిరుద్యోగ సమస్య వుండదంటారు....?" కోపంతోపాటు హేళనగా, వ్యంగ్యంగా విసిరింది ఆమె.
"నీవు, నీలాంటివాళ్ళు ఇలా ఆలోచించాలని నాకోరిక. నా విజ్ఞప్తి. ఎవరి సంగతో నీకు అవసరంలేదు. నీ చేతులో వున్నది నీవు చెయ్యి. అదే లోకాన్ని ఉద్ధరించిన ఫలం! నీ ఉద్యోగం ఏ ఒక్క నిరుద్యోగికో బ్రతుకు తెరువు చూపిస్తే అదేచాలు.... ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం దొరికినా నిరుద్యోగుల సమాఖ్య ఒకటి తగ్గినా తగ్గదమేగా.... నీలాభం కాస్త మానుకుని పొరుగువారికి ఈ మాత్రం తోడ్పడితే నీకొచ్చే నష్టం ఏమీలేదు...."
"హు! సరదాపడి ఉద్యోగం చేస్తానంటే ఎన్ని నీతులు వల్లిస్తున్నారు! ఉద్యోగాలు చేసేవాళ్ళంతా చేస్తూనే వున్నారు. నా ఒక్కర్తికే వచ్చింది." మూతి మూడు వంకర్లు తిప్పి విసురుగా లేచి లోపలికి వెళ్ళిపోయిందామె.
రామకృష్ణగారు భార్య వెళ్ళినవైపే చూస్తూ చిన్న నిట్టూర్పు విడిచారు. భార్య తత్వం తెలిసిన ఆయనకి తను యింతసేపు చెప్పింది ఆమె గాలికి వదిలేస్తుందనీ, చేయదల్చినపని చేస్తుందనీ తెలుసు. తన కంఠశోషే మిగులు, అంతే! అనుకున్నట్టుగానే మూడోరోజు భార్య ఉద్యోగంలో చేరడం ఆయనకి ఏం ఆశ్చర్యం కలిగించలేదు! బాధ అనిపించింది.
* * * *
వారం రోజుల తర్వాత ! సాయంత్రం తోటలో కూర్చుని టీ త్రాగుతూ పేపరు చదువుతున్నారు రామకృష్ణగారు.
తనమాట వినలేదని, నచ్చచెప్పినా అర్థం చేసుకోలేదని కాస్త కష్టం అనిపించి ఈవారం నించి భార్యతో కాస్త ముభావంగా వుంటున్నారాయన. ఆమెకూడా కాస్త దూరంగానే తప్పుకు తిరుగుతూంది.
"నేను .... నేను ఉద్యోగం మానేస్తున్నాను. రేపే రిజైనిస్తున్నా" .... పేపరులో మునిగిన ఆయన, శ్రీమతి ఎప్పుడొచ్చి ఎదురుగా కూర్చుందో చూడనేలేదు! చటుక్కున పేపరులోంచి తలెత్తి ఆశ్చర్యంగా భార్యవైపు చూశారు. ఆమె ఆయన చూపులు తప్పించుకుని కళ్లు వాల్చుకుంది. ఎందుకో ఆమె మొహం కళతప్పింది.
"ఏం?" కుతూహలంగా అడిగారాయన. "ఏం లేదు. మానేస్తున్నాను అంతే ...." పొడిగా ఆ మాట చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆమె. ఆయన ఆశ్చర్యంగా అలా కొన్ని క్షణాలు చూస్తూ వుండిపోయారు. ఆశ్చర్యంతో పాటు ఆయన ముఖంలో సంతోషం ఆవరించుకుంది.
"పోనీ, కాస్త ఆలస్యంగానైనా తన మాట వింది! తన ఉద్దేశం అర్ధం చేసుకుందన్నమాట! అంతే చాలు! తను యీ వారంనుంచి మాట్లాడ్డం లేదని కోపం వచ్చిందని అర్థం చేసుకుని మానేస్తూంది గాబోలు! లేక వారం రోజులకే ఉద్యోగం మొహంమొత్తిందా? ఏర్ కండిషన్ గదిలో పడుకోడం అలవాటయి గంట రెండు గంటలయినా నించుని పాఠం చెప్పడం కష్టం అనిపించింది గాబోలు! అవును సుకుమారి! ఉద్యోగం సరదా ఓ వారం రోజులు కాకుండానే తీరిపోయింది గాబోలు! పోనీ ఏ కారణం అయితేనేం గాక ఉద్యోగం మానేస్తూంది. ఆ ఉద్యోగం యింకో నిరుద్యోగికి దొరుకుతుంది! ఆనందిస్తాడు." ఆయన సంతృప్తిగా మళ్ళీ పేపరులోకి తలదూర్చారు.
పేపరులో ఓ వార్త మీద ఆయన దృష్టిపడింది. కుతూహలంగా చదువుతున్న ఆయన కనుబొమలు ముడివడ్డాయి.
__"నిరుద్యోగ యువకుని ఆత్మహత్య....
ఎమ్మే ప్యాసయి నిరుద్యోగిగా అనేక యాతనలు పడ్తూ తన జీవితం ఇంక వెలుగురేఖ చూడటం కల్ల అని నిరాశచేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఉత్తరం రాసి పెట్టుకుని స్టేషనులోకి వస్తున్న రైలు క్రిందికి దుమికి ఆత్మహత్య చేసుకున్న యువకుని పేరు ప్రభాకరరావు, వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు. ఎన్నో ఉద్యోగాలకి ఎంతగానో ప్రయత్నించాడు. ఆఖరిసారిగా వారంరోజుల క్రితం యూనివర్సిటీ కాలేజీలో లెక్చరరు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఉద్యోగమూ రానందున నిరాశకి తట్టుకోలేక యింత దారుణానికి పాల్పడ్డాడు."
ఆ వార్త చదువుతూ మ్రాన్పడిపోయారు రామకృష్ణగారు. భార్య ఉద్యోగం మానేయడానికి కారణం హఠాత్తుగా అర్థం అయింది. ప్చ్!.... ఆమె యీ నిర్ణయం కొద్దిరోజుల ముందు చేసివుంటే?.
ఆ ఉద్యోగం యీ యువకునికే తప్పకుండా వస్తుందన్న నిబ్బరం ఏమిటన్న ప్రశ్న రాలేదు ఆయనకి ఆక్షణాన!
(వసుధ'71)
* * * *