Previous Page Next Page 
నయనతార పేజి 39


                                         పడగనీడ

    అప్పుడే వచ్చి ఆగిన మెయిలు మూడో తరగతి పెట్టె చుట్టూ ముసిరారు ప్రయాణీకులు. అవధానిగారు అతి ప్రయాసతో గుంపును త్రోసుకుంటూ గుంపులోంచి జోరపడి యెక్కి చేతిసంచితో ఓ కిటికీవార కూలబడ్డారు. పై పంచతో చెమట వత్తుకుంటూ, ఇంకా పెట్టెలో కెక్కడానికి సఫలీకృతులు కాలేనివారి అవస్థ చూస్తూ ప్లాట్ ఫారంమీద తిరిగే జనాన్ని చూస్తూ, ఇంకా ఈ నరకంలో ఆరేడు గంటలు ఎలా గడపాలో అన్న చింతతో ఉన్న అవధానిగారికి 'మాష్టారు' అన్న పిలుపు వినిపించి అటు తిరిగారు. ఎవరో సూటూ, బూటూలో ఉన్న యువకునివంక ఒక్కక్షణం చూసి తనని గాదన్నట్టు చూపు మరల్చుకున్నాడు.
    "మాష్టారూ !" మళ్ళీ పిలిచాడతను.
    "నన్నా, బాబూ!"
    "అవును. నన్ను గుర్తుపట్టలేదా అండి !"
    "ఎక్కడో చూసినట్టుంది కాని, గుర్తురావడం లేదు నాయనా!" కళ్ళజోడు సవరించుకుని నిశితంగా చూస్తూ ఇబ్బందిగా అన్నారు.
    "నేనండి, మీ శిష్యుణ్ని కామేశాన్ని. గుర్తు రాలేదా!"
    "నువ్వా, కామేశానివా? కాకినాడలో చదువుకున్నావు కదూ!" ఆశ్చర్యానందాలతో మాష్టారి కళ్ళు మెరిశాయి.
    "అవునండి ఆ కామేశాన్నే. మరచిపోయారనుకున్నాను. ఎన్నాళ్ళయిందో చూసి! నేను మారిపోయుండవచ్చుగాని, మీరేం మారలేదు. ఇలా యెక్కడికి వెళ్తున్నారో?" ప్రశ్నలు కురిపించాడు కామేశం.
    "మా అమ్మాయి యింటికి వచ్చాను. మళ్ళీ విజయనగరం వెళ్తున్నాను. అయితే నీవెక్కడ వున్నావు? ఏం చేస్తున్నావు? ఏం ఉద్యోగం?"
    కామేశం అతని ఉద్యోగం చెప్పినప్పుడు మాష్టారికి దిగ్భ్రమ కలిగినట్టయింది. చెప్పలేని భావాలు ఎన్నో ఒక్కసారిగా కలిగి తత్తరపాటు కలిగింది. మొదట నమ్మలేకపోయినా తర్వాత తడబాటు అణుచుకుంటూ _
    "అలాగా ! చాలా సంతోషం బాబూ, ఇంతవాడివయినందుకు! నిన్నింత ఉచ్ఛస్థితిలో చూసినందుకు చాలా సంతోషం నాయనా!"
    మాష్టారి తడబాటు చూసి కామేశం చిన్నగా నవ్వుకున్నాడు.
    "రండి మాష్టారూ, ఇక్కడ మరీ రద్దీగా వున్నట్టుంది, మా కంపార్టుమెంటులోకి రండి. అక్కడ విశ్రాంతిగా కూర్చుందురుగాని!"
    "వద్దులే బాబూ, ఇది నాకలవాటే, క్రొత్త ఏంలేదు. టికెట్ అదీ కొనుక్కున్నాను. మళ్ళా మార్చడం ఇబ్బంది. ఎంతసేపు! కాస్తసేపు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది!" మొహమాటపడుతూ అన్నారు.
    "ఆ సంగతంతా నాకు వదిలిపెట్టండి, ముందు మీరు దిగిరండి, ఇక్కడ మీరు కూర్చోలేరు. పదండి, పైగా ఇన్నాళ్ళకి కల్సుకున్నాం, కాసేపు మాట్లాడుకోవచ్చు" అంటూ బలవంతపెట్టి దింపి ప్రక్కనున్న డవాలా బంట్రోతుతో ఏదో చెప్పి పంపించాడు కామేశం. మొహమాటపడుతూనే దిగి అతన్ననుసరించారు అవధానిగారు.
    ఎన్నడూ ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంటు ఎక్కని మాష్టారు ఆ సుఖాన్ని తనివితీరా అనుభవించారు కొన్ని నిమిషాలు. అంతకన్నా ఆయన ఆలోచనల్లో ఎక్కువగా నిండింది కామేశం అదృష్టం. ఇంకా నమ్మలేనట్టు ఆశ్చర్యం ఆయన మొఖంమీదనే స్పష్టంగా కనబడుతోంది. అది గమనించినట్లు కామేశం అన్నాడు.
    "అయితే, మాష్టారూ! ఇంకా మీకనుమానంగానే వుందా! నాలాంటి మొద్దబ్బాయి బళ్ళో ఏ పరీక్షా మొదటిసారి పాస్ కానివాడు, ఈరోజు ఇంత ఉన్నత పదవి యెలా పొందాడా అని."
    పట్టుబడ్డ దొంగలా తడబడుతూ "అదేమిటోయి, ఏదో చిన్నప్పుడు కొంచెం అజాగ్రత్తగా వుండేవాడివని ఎప్పుడూ అలాగే వుంటావా? నువ్వింతవాడివయినందుకు చాలా గర్వంగా ఉందోయ్. నా శిష్యులు మీరు పెద్ద చదువులు చదివి, పెద్ద హోదాల్లో వుండడం, నన్నింకా ఇలా గుర్తుంచుకుని అప్పటి మన సంబంధాన్ని మన్నించడం, ఇదంతా నాకెంత సంతోషానికి కారణం చూడు... అది సరేగాని పెళ్ళయిందా, పిల్లలా?" మాట మార్చారు అవధానిగారు.
    "పెళ్ళయి అప్పుడే ఒకబ్బాయి అమ్మాయి! అయితే మీ అబ్బాయి రామం ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?"
    అవధానిగారి మొహం వివర్ణమయింది.
    "రామం! ఇంకెక్కడి రామం నాయనా! అప్పుడే పోయి అయిదేళ్ళు అవుతూంది. రామమే వుంటే ఈనాడు ఇలా దిక్కులేకుండా ఒంటరిగా ఇలా ఈ ముసలితనంలో అవస్థ పడతానా?"
    "అదేమిటి రామం పోయాడా?"
    "అవును నాయనా! మహమ్మారి కలరా నానుంచి తీసుకుపోయింది. చేతికందిన కొడుకుని, ఒక్కగానొక్కణ్ణి! నా తలకొరివి పెట్టవలసినవాడిని తీసుకుపోయింది. వాడికి నేనే కొరివి పెట్టవలసిరావడం నా దౌర్భాగ్యం. ఆవిడ అదృష్టవంతురాలు. ఈ బాధలన్నీ నన్ను పడమని, న ఖర్మానికి నన్నొదిలి ముందే దాటిపోయింది. ఒక్క కూతురు వున్న పరాయిదే కదా! పాపం అక్కడికీ అది 'కూతురు కూడా చచ్చిపోయిందనుకున్నారా, నా దగ్గిర వచ్చి వుండకూడదా?' అని బలవంతం చేస్తుందిగాని ఎలా వుండగలను? ఎన్నాళ్ళు కూతురు ఇంట్లో కూర్చోడం? ఇంకా కాలు చేయి ఆడుతూండగా ఒకరి పంచన ఎందుకు జేరడం అని ఏదో పదిరోజులుండి వచ్చేస్తుంటాను... ఏదో, ఆ ఉన్న స్వంత కొంపలో, ఓపిక వున్నరోజున వండుకుంటూ లేనిరోజున పస్తుంటూ ఆ పెన్షన్ రాళ్ళతో జీవితం వెళ్ళదీస్తూ, ఆరోజు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను!"
    "పాపం, మీకీ పెద్దవయసులో రాకూడని కష్టమే వచ్చింది"
    "ఏం చేస్తాం, ఎలాంటివాడికైనా ఖర్మ అనుభవించక తప్పదు!"
    "మాష్టారూ, మీరు వైజాగ్ లో దిగి నా దగ్గర నాలుగురోజులుండాలి. కాదనకండి. మీరు తప్పకుండా వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి, మమ్మల్ని దీవించి మరీ వెళ్ళాలి!"
    "అబ్బే, అంతమాటనకు, ఇంత పెద్ద హోదా వుండి, చిన్ననాటి గురువు పట్ల ఇంత ఆదరాభిమానాలు చూపుతున్నావు, అన్తేచాలు. మీరంతా పదికాలాలపాటు చల్లగా వుండడమే నాకు కావాలి. ఏమనుకోకు, మరోసారి ఎప్పుడైనా వస్తాన్లే.
    "మొఖమాటపడకండి మాష్టారూ! మీకే ఇబ్బంది జరుగదు. మీ ఇల్లే అనుకోండి. ఇన్నాళ్ళకి కనబడ్డారు, మిమ్మల్నెలా వదలను? మీకోసం కాదు, ఇది నా ఆనమం కోసం. మీరు రాక తప్పదు."
    అవధానిగారి మొఖం ఆనందంతో వెలిగింది. కామేశం ఆదరం, అభిమానం ఆయన్ని వశం చేసుకున్నాయి.
    పోర్టికోలో కారు దిగగానే "రండి మాష్టారూ!" అంటూ ఆదరంగా లోపలికి పిల్చుకెళ్ళాడు కామేశం. పెద్ద అధునాతనమైన బంగళా. చుట్టూ విశాలమైన ఆవరణ. గేటుకి బంగళాకి మధ్య రోడ్డుకి రెండువైపులా చక్కని పూలతోట. ఆ వైభవాన్నంతటినీ చూస్తూ లోపలికి అడుగుపెట్టారు. పెద్దహాలు, ఖరీదయిన తివాచి, నిగనిగలాడే సోఫా సెట్టు, గుమ్మాలకి అందమైన తెరలు, గోడల్ని చక్కని దృశ్యాలు, పూలవాజులు అన్నీ పొందికగా అమర్చి ఉన్నాయి.

 Previous Page Next Page