"ఏమిటది? మమ్మల్ని వదిలేస్తారా ?" అన్నాడు సందీప్.
పరిహాసంగా నవ్వింది నెఫెర్. "కాదు ? నాతో సుఖాలు అనుభవిస్తాడు!" అంది అంతకంటే కోరుకోదగ్గ అదృష్టం ఈ ముల్లోకాలలోనూ ఉండబోదు! అన్నంత ఆత్మ విశ్వాసంతో.
చులకనగా ఆమెవైపు చూశాడు సందీప్. నిజమే! చెప్పలేనంత బాగుంటుంది నెఫ్రీతీతీ!
స్వప్న వైపు చూశాడు. తదేకంగా అతన్నే గమనిస్తోంది తను.
నిర్లక్ష్యంగా భుజాలు ఎగరేసి తన ప్రత్యర్థివైపు తిరిగాడు సందీప్. నల్లగా, మోటుగా, అడవి దున్నలా ఉన్న ఆ ప్రత్యర్థి నెఫెర్ వైపు ఆశగా, సందీప్ వైపు కసిగా, తన చేతికి ఉన్న పులిగోళ్ళ వైపు ఆప్యాయంగా చూసుకుంటున్నాడు.
తనకు అందించిన పులిగోళ్ళు నేలమీదకు విసిరికొట్టాడు సందీప్. తన ప్రత్యర్థిని జాలిగా పరికించి చూసి, "ఇతను పాపం నిరాయుధుడు. ఇతనితో నేను తలపడడం అన్యాయం అవుతుందేమో, పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం వేసినట్లు!" అన్నాడు.
ప్రత్యర్థి ఆగ్రహంతో ఊగిపోతున్నాడు.
"వెర్రివాడా! అతని చేతికి ఉన్న పులిగోళ్ళు ఎంత వాడిగా ఉంటాయో నీకు తెలియదనుకుంటాను! చూస్తావు!" అంటూ చప్పట్లు చరిచింది.
ద్వంద్వ యుద్ధం మొదలయింది. ప్రత్యర్థి సందీప్ మీదకు ఒడుపుగా చెయ్యి విసిరాడు. అది అతని ఛాతీని కొద్దిగా చీల్చింది.
ఇంక తటపటాయించలేదు సందీప్. తన శారీరక, మానసిక శక్తులన్నిటినీ చేతిలో కేంద్రీకృతం చేసి, విపరీతమైన ఏకాగ్రతతో కరాటే దెబ్బ వేశాడు.
మరుక్షణంలో, పూచిక పుల్లలా కిందపడిపోయాడు ప్రత్యర్థి.
అందరూ ఆశ్చర్యంతో లేచి నిలబడ్డారు.
రెండో జట్టులోని మొగాళ్ళ పోరాటం ఇంకా పూర్తికానేలేదు. ఇద్దరూ కోడిపుంజుల్లా పోట్లాడుకుంటున్నారు. వాళ్ళ శరీరాలు రక్తసిక్తమైపోతున్నాయి. వాళ్ళిద్దరు కూడా పోరాటం ఆపి, నోళ్ళు వెళ్ళబెట్టి నిలబడ్డారు.
"రండి" అన్నాడు సందీప్ మళ్ళీ సన్నద్ధమవుతూ. "మీలో గెలిచినవాడే కానఖ్కర్లేదు. మీరిద్దరూ కలిసి ఒకేసారి రావచ్చు. కానీ ముందుగా నా గురించి కొంత సమాచారం మీకు చెప్పడం ధర్మం! నేను కరాటే, జూడో, కుంగ్ ఫూ, టేక్ వాన్ దో విద్యలలో ఎక్స్ పర్ట్ ని! రండి!" అన్నాడు సిద్ధంగా నిలబడుతూ.
ప్రత్యర్థులకి అతని భాష అర్థం కావడంలేదు. కాని, చలనం లేకుండా కిందపడి ఉన్న మనిషి స్థితి, అతని మాటల అర్థాన్ని వాళ్ళకి ట్రాన్స్ లేట్ చేసి చెప్పింది.
"కమ్" అన్నాడు సందీప్.
వాళ్ళిద్దరూ జంకుతూ వెనక్కు తగ్గారు.
కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత చప్పట్లు చరిచింది నెఫెర్. "అదృష్టవంతుడివి! స్వర్గసుఖాలు అనుభవించబోతున్నావు!" అంది భావగర్భితంగా.
స్వప్న మొహంలో ఆందోళన తొంగిచూసింది.
"నో థాంక్స్! నువ్విచ్చే సుఖాలు నాకు అక్కరలేదు! మా దారిన మమ్మల్ని పోనిస్తే చాలు!" అన్నాడు సందీప్.
నెఫెర్ మొహంలో రంగు తగ్గింది. తనని తిరస్కరించిన మొగాడు ఇంతవరకూ తటస్థపడలేదు ఆమెకి.
తేరుకున్న తర్వాత "తెలిసింది! నువ్వు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి కారణం!" అంది సాలోచనగా స్వప్న వైపు చూస్తూ.
సందీప్ ఏమీ మాట్లాడలేదు.
"నువ్వు పోటీలో మిగతా ముగ్గురినీ ఓడించావు. వాళ్ళని చంపెయ్!" అంది నెఫెర్.
"నేను హంతకుడిని కాను."
తిరస్కారంగా చూసింది నెఫెర్. "వాళ్ళని నువ్వు చంపకపోతే నేనే చంపుతాను." అంది నిశ్చయంగా.
"ఎందుకు చంపడం ?"
"మీ మగ పశువుల సంఖ్యని అదుపులో ఉంచడానికి" అంది క్లుప్తంగా. ఆమె మొహంలో ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకపోవడం అతనికి చిత్రంగా తోచింది.