రెడ్డి వెంటనే అతన్ని పక్కకి లాగేసి, స్టీరింగ్ ముందు తను కూర్చుని, వాన్ ని రన్ వే మీద నుంచి పక్కకు తీసుకెళ్ళిపోయాడు.
తర్వాత తను వాన్ దిగాడు.
అతనికి విస్మయం కలిగింది.
ఏమిటిది? ఇక్కడ ఈ పల్లెలో పాడుబడిన ఎయిర్ స్ట్రిప్ ఒకటి ఉండటమే ఆశ్చర్యమయితే, దానిమీద ఇంత పెద్ద విమానం ఒకటి దిగడం కేవలం కాకతాళీయమే!
ఏదో ఎమర్జెన్సీ అయి ఉంటుంది.
అవును!
మహబూబ్ తో కలిసి అతను విమానంవైపు పరిగెత్తాడు.
ఎయిర్ బస్ లో బిగుసుకుపోయి కూర్చుని ఉన్నాడు సవ్యసాచి. తప్పిపోయిన ప్రమాదం ఎంత తీవ్రమైనదో అతనికి తెలుసు.
"కంగ్రాట్స్!" అన్నాడు శతృఘ్న. "ఇదే నైపుణ్యం మళ్ళీ టేకాఫ్ లో కూడా చూపించాలి గుర్తుంచుకో!"
సవ్యసాచి కర్చీఫ్ తీసి నుదురు తుడుచుకున్నాడు.
"ఇదిగో! నీ పేరేమిటో మర్చిపోయాను! ఈ తలుపు తెరు! అన్నాడు శతృఘ్న మోనికతో. విమానం తలుపు తెరిచింది మోనికా.
కిందికి తొంగి చూస్తూ అంచనావేశాడు శతృఘ్న నేలకు దాదాపు పదిహేను అడుగుల కంటే ఎత్తులోనే ఉన్నారు. ఎయిర్ పోర్టులో అయితే విమానం దిగగానే మెట్లు అమర్చిన ట్రక్కు పక్కన నిలబడుతుంది. ఇలాంటి చోట అయితే దిగడానికి ఏం చేస్తారు?
ఎమర్జెన్సీ ఎగ్జిట్!
"దీనికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా?" అన్నాడు మోనికాతో.
"ఉంది."
"తెరు."
మోనికా ఆ ప్రయత్నంలో ఉండగానే ఆ ప్రాంతాన్ని పరిశీలించి చూశాడు శతృఘ్న. పాడుబడిపోయిన ఎయిరోడ్రోమ్ బిల్డింగు, చిన్న ఎయిర్ స్ట్రిప్పు, దాన్ని ఆనుకుని తారురోడ్డూ కనబడ్డాయి.
దూరం నుంచి ఇద్దరు మనుషులు పరిగెత్తి వస్తున్నారు.
ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరుచుకుంది.
"ఇక్బాల్!" అని పిలిచాడు శతృఘ్న. "ఎవరో మనుషులు వస్తున్నారు! ఆ డెలివరీ అయిన అమ్మాయినీ, విషాహారం తిని పడిపోయిన మనుషుల్నీ వాళ్ళకి అప్పగించి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి పంపించేద్దాం! నువ్వూ విక్టర్ వాళ్ళని కిందికి దించండి!"
ఇక్బాల్ విక్టర్ వైపు చూశాడు. సినీతార శాలిని అందాలని ఆస్వాదించడంలోనే మునిగిపోయి ఉన్నాడు విక్టర్. తన చుట్టూ ఇంత గందరగోళం జరుగుతున్నా అతనికేమీ పట్టినట్టే లేదు.
"రేయ్!" అని గద్దించాడు ఇక్బాల్. విక్టర్ ఉలిక్కిపడి చూశాడు.
"ఇటు రా!" అని హెచ్చరించి విషం కలిసిన డ్రింకు తాగి పడిపోయి ఉన్నవాళ్ళని కిందకు చేర్చడం మొదలెట్టాడు ఇక్బాల్. విక్టర్ అతనికి సాయం చేస్తున్నాడు.
"డెలివరీ అయిన అమ్మాయిని ఆఖరున దింపండి! పసిపాపకి చలిగాలి తగులుతుంది లేకపోతే!" అన్నాడు శతృఘ్న.
సుజాత మెల్లిగా కళ్ళెత్తి అతన్ని చూసింది.
ఈ నరరూప రాక్షసుడిలో ఎదుటివాళ్ళ బాధ గురించిన చింత కూడా ఉందా? ఆశ్చర్యమే!
పేషెంటు లందరినీ దింపేసి, మళ్ళీ పైకి ఎక్కారు ఇక్బాల్, విక్టర్.
ఇక డాక్టర్ రంజన్ ఒక్కడూ మిగిలాడు పడిపోయిన వాళ్ళలో.
ఇక్బాల్, విక్టర్ కలిసి అతన్ని ఒకళ్ళు కాళ్ళూ, ఒకళ్ళు చేతులూ పట్టుకుని ఎత్తబోతుంటే, ఆ ప్లేను, అది దిగిన మైదాన ప్రాంతం ఎయిరోడ్రోము బిల్డింగూ వణికిపోయేటంత బిగ్గరగా అరిచాడు శతృఘ్న.
"వద్దు! వాణ్ణి యిక్కడే చావనివ్వండి! వాడు మనిషికాడు? మానవరూపంలో ఉన్న మృగం! మోహన అనే అమ్మాయి అన్యాయంగా చనిపోవడానికి కారణం వీడు! శతృఘ్న అనే మనిషి జీవచ్చవంలా మారడానికి కారణం వీడు. వీణ్ణి నాకొదిలెయ్యండి! దారుణమైన చావు చావాలి వీడు! అది తప్పదు!"
అప్పుడే విమానం దగ్గరికి చేరుకున్న రెడ్డికి ఆ మాటలు వినబడ్డాయి.
శతృఘ్న! షాట్ గన్! అతను ఈ విమానంలో ఉన్నాడా? ఏం చేస్తున్నాడు అక్కడ? ఏం జరుగుతోంది?
శతృఘ్న మాటలు వినగానే సుజాత చటుక్కున లేచి నిలబడింది. పట్టలేనంత ఆశ్చర్యం కనబడుతోంది ఆమె మొహంలో.
"శతృఘ్న! మీరేనా శతృఘ్న! మా అక్కయ్య మిమ్మల్ని గురించి ఎప్పుడూ చెబుతూ ఉండేది!"
నిదానంగా ఆమె వైపు తిరిగాడు శతృఘ్న.
"ఎవరు మీ అక్కయ్య!"
"మోహన!" అంది సుజాత. "మోహన! నేను మోహన చెల్లెలిని!"
సుజాత మోహన చెల్లెల్ని వినగానే ఆకాశం విరిగి తనమీద పడ్డట్లు అనిపించింది శతృఘ్నకి.
ఈ సుజాత మోహన చెల్లెలా?
ఏ అమ్మాయి మానమర్యాదలు కాపాడడానికి తను మొరటు మృగాలలాంటి రంజన్ గ్యాంగుమీద తిరగబడి,అందుకు ఫలితంగా తన కెరీర్ నీ, జీవితాన్నీ పాడుచేసేసుకున్నాడో, ఆ మోహన చెల్లెలేనా ఈ అమ్మాయి?