వింటున్న భిక్షగాళ్ళందరూ నిజమేనన్నట్టు తల వూపారు.
"మరి యిప్పుడేం చేయమంటావు బాబూ?" ఆ ముసలి భిక్షగాడు అడిగాడు.
ఎస్.ఐ. కానిస్టేబుల్ ముందు కూర్చుని వున్నారు కనుక తమ మాటలు వినే అవకాశం లేకపోయినా జాగ్రత్తకొద్దీ తాము ఏం చేయాలో మెల్లగా చెప్పాడు తిలక్.
అలానేనన్నట్టు భిక్షగాళ్ళందరూ తలలూపారు.
మరో నిముషంలో వ్యాన్ కీచుమంటూ ఆగింది.
ఎస్.ఐ. లక్ష్మీదీపక్ వ్యాన్ దగ్గరకు వచ్చాడు.
"హలో భయ్యా! ఏమిటి విశేషం! మన వ్యాన్ నే మీరు ఎందుకు ఆపుతున్నారు?" వ్యాన్ లోపలున్న ఎస్.ఐ. కిందకు దిగుతూ అడిగాడు.
"హలో గుర్నాధంగారా! మీరు ట్రాఫిక్ ఎస్.ఐ. కాబట్టి మీకు యిలాంటి సమస్యలు లేవు. ముగ్గురు ఖైదీలు జైలునుంచి పారిపోయారు. వాళ్ళ కోసం ఈ చెకింగ్. ఉదయం నుంచి ఇదుగో ఈ రోడ్డుమీద నిలబడి ఇలా కుక్కల్లా వెతుకున్నాం" దీపక్ నిట్టూర్చాడు.
"మా బాధలు మాకున్నాయి. మీకు ఇష్టం ఎక్కువైనా పై సంపాదన కూడా ఎక్కువే" కసిగా అన్నాడు గుర్నాధం.
"ఈ దొంగలతో ఖైదీలతో వేగేకన్నా సంపాదనలేని ట్రాఫిక్కే నయం."
"దొంగలతో డీల్ చేయడం మాటలు కాదనుకోండి. దానికి స్పెషల్ టెక్నిక్కులున్నాయి. నేను క్రైమ్ ఎస్.ఐ. గా వున్నప్పుడు నేరస్తులకు నిక్కర్లు తడిచేవి. లాఠీ ఎత్తితే వున్నవి వూడిపోయేవి, చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలతోపాటు నిజాలను కక్కించేవాడిని - యిప్పుడు ట్రాఫిక్ కి మారిపోయాక చేతులకు పని తక్కువై పోయింది. పోలీసుగా వుండి జనాన్ని చావబాదే ఛాన్స్ లేకపోవడం ఎమ్మెల్యేగా గెలిచీ మంత్రి పదవి రాకపోవడం లాంటిది" గుర్నాధం సేప్ఫ్ బూస్టింగ్ ప్రారంభించాడని, ఇక దానికి అంతుండదని అనుకున్నాడు దీపక్.
గుర్నాధం మళ్ళీ ప్రారంభించాడు. "పులికి వాడి కోరలుంటాయి. వాటితో జంతువును చీలుస్తుంది. పాము తాన విషంతో ప్రత్యర్థిని చంపుతుంది. అలానే పోలీసుకు అధికారం వుంటుంది. దాన్ని ఉపయోగించడం చట్ట సమ్మతం. కానీ ఇప్పుడున్న చాలామంది ఎస్.ఐ.లకు దాన్నెలా ఉపయోగించాలో తెలియదు. ఏదో నాలాంటి వాడికి తప్ప"
ఇక అతన్ని తప్పించుకుంటే తప్ప తనకు విముక్తి లభించదనుకున్నాడు దీపక్. "మీ వ్యాన్ ఎక్కడికి వెళుతోంది. లోపల ఎవరైనా వున్నారా? వుంటే ఓసారి తలుపు తెరవండి. చెక్ చేయాలి"
"లోపల భిక్షగాళ్ళున్నారు. టౌన్ లోని ముష్టి వెధవల్ని వూరవతలికి తోలెయ్యమన్నారు. రేపు ఇక్కడికి అమెరికా రాయబారి వస్తున్నాడు గదా! అందువల్ల కనిపించిన ప్రతి భిక్షగాడ్నీ లోపల కుక్కేశాను. అవునూ ఇంతకీ నీ ప్రమోషన్ ఏమైంది?" గుర్నాధం చాలా క్యూరియాసిటీతో ప్రశ్నించాడు.
దీపక్ కి విసుగు ప్రారంభమైంది. "ఏమో? ఎప్పుడొస్తుందో ఎలా చెప్పగలం?" అన్నాడు ఇబ్బందిగా ముఖంపెట్టి.
"నిజమే! ప్రమోషన్ అంత సులభంగా రాదు ఈ రోజుల్లో. నాకయితే పదేళ్ళు క్రితమే రావలసింది కానీ ఇంతవరకు రాలేదు. వెంకట్రావ్ అప్పుడే సి.ఐ. అయిపోయాడు. ఏమిటి వాడికున్నది నాకు లేనిది. ఈ మాటే ఎస్.పి. దొరగారిని అడిగితే వాడు మూడు లాకప్ హత్యలు, నాలుగు రేప్ లూ చేశాడు. మరి నువ్వు చేశావా? ప్రమోషన్ అని అరవడమేగానీ అలాంటి చరిత్ర సృష్టించావా అని ముఖంమీద నాలుగు చివాట్లు పెట్టాడు. ఇక లాభం లేదని వచ్చేశాను. నాలాంటి వాడికి ప్రమోషన్ రాకపోవడం కన్నా ఈ ప్రపంచంలో వేరే అన్యాయమేమైనా వుందా? క్షణాల్లో దొంగలను పట్టే నాలాంటి వాడికి డిపార్టుమెంట్ లో విలువలేదు..."
గుర్నాధం మాటలకు అడ్డు తగిలాడు దీపక్. "నిజమేననుకోండి. ఆ విషయం గురించి తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు వ్యాన్ తలుపు తెరిపించండి. వెనక రెండు లారీలు కూడా వచ్చి నిలబడ్డాయి. చెక్ చేయాలి" దీనంగా అడిగాడు.
విషయం ఏమిటో తెలియక అప్పటికే లారీలు హారన్ మ్రోగిస్తున్నాయి.
"ఆ లారీలు అప్పుడే కోర్టు బంట్రోతుల్లాగా అరవడం మొదలుపెట్టాయి. వెళ్ళి చెక్ చేయండి. మా వ్యాన్ లో భిక్షగాళ్ళే వున్నారు."
"ఎందుకైనా మంచిది ఓసారి చెక్ చేస్తాం" అసహనంగా అన్నాడు దీపక్. గుర్నాధాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని అతను తొందరపడుతున్నాడు.
"నా మాట నమ్మకపోతే అలానే కానివ్వండి. ఖైదీలు నా వ్యాన్ లో ఎక్కడమా? వాళ్ళకెన్ని గుండెలు? లాఠీ ఎత్తితే వున్నవి వూడిపోతాయని వాళ్ళకూ తెలుసు" గురునాధం సీరియస్ గా అన్నాడు.
"అది కాదు సార్. ఎస్.పి.గారు స్వయంగా చెప్పారు డిపార్టుమెంట్ వెహికల్ ను కూడా చెక్ చేయమని" ప్రాధేయపడ్డాడు దీపక్.
లారీలు అదే పనిగా అరుస్తున్నాయి.
దీపక్ ముఖం చిటపటలాడిపోతోంది.
"సరే, వెళ్ళి చూసుకోండి రేయ్! తలుపు తెరువ్" గురునాధం పక్కనున్న కానిస్టేబుల్ తో చెప్పాడు.
ముగ్గురూ వ్యాన్ వెనకకు వచ్చారు.
తలుపు తెరుచుకోవడం, లోపలున్న భిక్షగాళ్ళంతా "ధర్మం చేయండి బాబూ" అని కోరస్ గా అరిచి మూకుళ్ళను చాచడం ఒకేసారి జరిగాయి.
దీపక్ ఒక్కక్షణం అదిరిపడి సర్దుకున్నాడు.
"ఛీ ఛీ! డర్టీ బెగ్గర్స్! ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎదురయినా ముష్టి కోసం మూకుడుని చాచేటట్టున్నారు. షట్ డి డోర్" అని అరిచాడు కోపంగా.
"నేను చెబితే విన్నావా దీపక్? పోలీసు వ్యాన్ ఎక్కినా వాళ్ళ బుద్ధి పోలేదు. లోపలున్న వాళ్ళంతా భిక్షగాళ్ళేనని ఇంతకన్నా రుజువు కావాలా?" గురునాధం తన తెలివితేటలకు మురిసిపోతూ అన్నాడు.
"దట్సాల్ రైట్ గురునాధం! ఇక నువ్వు వెళ్ళచ్చు" అని లారీలను చెక్ చేయడానికి అటు దారితీశాడు దీపక్.
ఒక భిక్షగాడే ముష్టి అడిగితే విసుక్కునే జనం యింతమంది ఒక్కసారిగా భిక్షం అడిగితే అసహనంతోనూ, విసుగుతూనో రెచ్చిపోతారనే తన పాయింట్ సక్సెస్ అయినందుకు సంతోషపడి పోయాడు తిలక్.
వ్యాన్ కదిలింది.
భిక్షగాళ్లంతా ఓ పాట అందుకున్నారు.
* * * *