ప్రకాష్ నుదుట పట్టిన. చెమటని తుడుచుకుంటూ తన దగ్గర జవాబు లేదన్నట్టు మౌనంగా కుర్చీలో కూర్చుండిపోయాడు. ఇంట్లో శారదని ఎలా ఎదుర్కోవాలి, ఏమని చెప్పాలి నిలేస్తే! జవాబులకోసం ఆలోచనలో పడ్డాడు.
సుప్రియ అతని సీరియస్ నెస్ చూసి మాట్లాడకుండా తన కుర్చీ దగ్గరకి వెళ్ళి పని చూడసాగింది.
శారద ఆటోలో వెళుతున్నంతసేపూ ఏ ఆలోచనా రానంతగా మనసు మొద్దుబారిపోయింది. అలాంటి దృశ్యం చూస్తానని కలలో కూడా అనుకోని ఆమెకి, అదొక పెద్ద షాక్...
ప్రకాష్ సరే మగాడు... సుప్రియ... తన స్నేహితురాలు... తన భర్తని... దానిమీద జాలిపడి, సానుభూతితో ఉద్యోగం ఇప్పించి దాని బతుకు ఒక గాడిలో పడాలని ఆరాటపడే తనకే ఎలా ద్రోహం చేయగలిగింది? స్నేహితురాలి భర్తతో... ఛా... ప్రకాష్ ఎంత ఆనందంగా, ఎంత రొమాంటిక్ గా ఆమెతో నవ్వుతూ, ఆమెతో సరసాలాడుతున్నాడు!
ఆలోచనల మధ్య ఆటో స్కూలు చేరింది. స్కూల్లో ఫస్ట్ ఎయిడ్ చేసినట్లున్నారు. తలకి కట్టుతో, తెల్లచొక్కా అంతా రక్తంతో పడి వున్న రాహుల్ ని చూసేసరికి శారద గుండెలు జారిపోయాయి. "శారదగారూ... చాలా రక్తం పోయింది... వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళండి"అంటూ కారు తెప్పించి రాహుల్ ని కారులో పడుకోబెట్టించారు.
శారద తిన్నగా నీరద వున్న నర్సింగ్ హోమ్ కే తీసుకెళ్లింది. తలమీద దెబ్బకి నాలుగుకుట్లు వేసి కట్టుకట్టి ఇంజక్షన్ అదీ ఇచ్చారు డాక్టర్లు... ఆ రోజంతా అక్కడే వుంచమన్నారు. రాహుల్ కాస్త మగతగా నిద్రపోతున్నాడు. అప్పుడు శారద ఇంట్లో అత్తగారికి, ఇంట్లో వున్న తండ్రికి ఫోను చేసిచెప్పింది. ఇద్దరూ గాభరాపడివెంటనే వచ్చారు.
నారాయణమూర్తిగారు జరిగింది విని మనవడి తల నిమురుతూ శారద వంక తిరిగి "ప్రకాష్ ఏడమ్మా! చెప్పావా ఆయనకి... తెలిసిందా" అన్నాడు.
శారద మొహం మ్లానమైంది. తల తిప్పుకుంది. "లేదు నాన్నా, ఆయనెక్కడున్నారో, సెల్లో దొరకలేదు. తరువాత చెప్తాలెండి... ఇప్పుడింక ఆయనొచ్చిచేసేదేం వుంది" అంది ముభావంగా.
"కోర్టునించి వచ్చాక ఫోనుచేసి చెప్పమ్మా. చెప్పలేదని తరువాత కోప్పడతాడు" అంది సత్యవతి.
ఆ రాత్రి ఎనిమిదికల్లా ఇంటికి వచ్చేశాడు ప్రకాష్.
"రాహుల్ ని చూసోస్తున్నావా? ఎలావున్నాడు? జ్వరం అదీ రాలేదుగా" అంది సత్యవతి తలుపు తీయగానే.
ప్రకాష్ తెల్లబోతూ "రాహుల్ నా... ఏం, ఏం అయింది వాడికి... ఎక్కడున్నాడు?" ఆరాటంగా అడిగాడు.
సత్యవతి ఆశ్చర్యంగా "అదేమిటి, శారద నీకు చెప్పలేదా... రాహుల్ కి తలమీద పెద్దదెబ్బ తగిలింది. కుట్లు పడ్డాయి.. స్కూలుపిల్లలు దెబ్బలాడుకున్నప్పుడు వీడెళ్లి రాయిమీద పడడంతో తలమీద కన్నం పడింది. శారద స్కూల్ కి వెళ్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. నీరద వున్న నర్సింగ్ హోమ్ లోనే వున్నాడు" గబగబా అంది.
ప్రకాష్ కలవరంగా "రాహుల్ కి దెబ్బ తగిలిందా? శారద నాకు చెప్పనేలేదు. ఎలా వున్నాడు... ఉండు నేను వెళ్ళి చూసోస్తాను..." అంటూ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాడు. శారద చెప్పకపోవడం కాస్త వింతగా అనిపించింది సత్యవతికి.
కారులో వెళుతుంటే 'మైగాడ్... శారద రాహుల్ గురించి చెప్పడానికే పొద్దుట వచ్చినట్టుంది. చెప్పి ఇద్దరూ కలిసి స్కూల్ కి వెళ్ళాలని వచ్చివుంటుంది. తనని ఆ స్థితిలో చూసి చెప్పకుండా వెళ్ళిపోయింది. అందుకే ఇప్పటివరకుతనకి ఫోనన్నా చెయ్యలేదు. తల్లిమాటలు బట్టి ఆవిడకి శారద ఏం చెప్పినట్లు లేదు.
నర్సింగ్ హోమ్ కి వెళ్ళేసరికి రాహుల్ నిద్రపోతున్నాడు. నీరద ఓ పక్క, రాహుల్ ఓపక్క పడుకున్నారు. శారద కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతోంది. ప్రకాష్ రావడంతో తలెత్తిచూసి, మళ్ళీ తల పుస్తకంలోకి దించింది.
"రాహుల్ కి దెబ్బ తగిలిందని నీవు నాకు చెప్పలేదు. ఇంటికెడితే అమ్మ చెబితే వచ్చాను" అన్నాడు పొడిగా.
"చెప్పాలనే వచ్చాను... మీరు చాలా బిజీగా వున్నారని చెప్పలేదు..." అంది తల ఎత్తి అతనివంక సూటిగా చూసి.
అతని మొహంలో రంగులు మారాయి.
చప్పున ఏం తెలీనట్టు "ఎలా వుందిప్పుడు... డాక్టరేమన్నారు" ఆరాటంగా అడుగుతూ కొడుకు తల నిమిరాడు.
రాహుల్ కళ్ళు తెరిచి "డాడీ" అన్నాడు.
"ఎలా వుంది నొప్పెడుతుందా... ఎందుకు ఇలాంటి దెబ్బలాటలకి వెళ్తావు? చూశావా ఎంత పెద్ద దెబ్బ తగిలిందో..."రాహుల్ మాట్లాడకుండా కళ్ళు మూసుకున్నాడు. ఇంకేం చెయ్యాలో తెలియక "తర్వాత ఫోనన్నా చెయ్యచ్చుగా. రాహుల్ నా కొడుకుని మర్చిపోయినట్లున్నావు. నాకు చెప్పక్కరలేదనా నీ ఉద్దేశం..." శారద ఏమనడానికీ అవకాశం ఇవ్వకుండా తనే సెల్ప్ డిఫెన్స్ లో పడుతూ అన్నాడు.
శారద ఓసారి పుస్తకంలోంచి తలెత్తి, "థ్యాంక్స్, రాహుల్ మీ కొడుకనైనా గుర్తుంది" అంది కాస్త హేళనగా.
ప్రకాష్ మొహం ఎర్రబడింది. ఏమనాలో తెలియక "నేను వెళుతున్నాను. రేపొస్తాను" అంటూ వెళ్ళిపోయాడు.
శారద సాలోచనగా అటే చూసింది.
* * *
"శారదా నీకో గుడ్ న్యూస్... గెస్ చేసి చెప్పు..." సునీత ఫోన్ లో ఎగ్జయిటింగ్ గా అంది.
"ఏమిటంత ఆనందంగా వున్నావు... విషయంచెప్పు" అంది శారద.
"చెప్పేయనా... రవీంద్ర మళ్ళీ నావాడయ్యాడు. రంజనిని అతను వదిలేశాడు... నా దగ్గిరకి వచ్చి క్షమాపణ కోరాడు. ఎంతైనా నా పిల్లల తండ్రిగదా, వాళ్ళకోసమైనా అతన్ని అంగీకరించాలికదా... ఏమంటావు?"
"ఆహా... కంగ్రాచ్యులేషన్స్"అంది.
ఆమె గొంతులో ధ్వనించిన ఉదాసీనత సునీత గుర్తించింది.
"శారదా, ఏమిటలా వున్నావు? ఏమైంది... నీరదకెలా వుంది? ఈజ్ సమ్ థింగ్ రాంగ్" అంది ఆరాటంగా.
"సునీతా, నీతో మాట్లాడాలే... రేపు ఆదివారం... పొద్దుట వస్తాను ఇంట్లో వుంటావా?"