Previous Page Next Page 
సాహసి పేజి 40


    దానిని గుర్తుపట్టింది సింహిక. ఆ చీరకొంగు ఇందుమతిది. దానిని అందుకుని గబగబా ముందుకు నడిచింది.


                   *    *    *    *


    ఇటు సింహిక బృందం ఇందుమతి అన్వేషణలో వుండగా- కొంచెం వెనక్కి జరిగితే- వాగు దగ్గరికి వైశాలి సహాయంతో వెళ్ళిన యువరాజు పూర్తిగా స్నానం చేసి శిబిరం దగ్గరకొచ్చాడు. జొన్నరెట్టెల్ని పెట్టింది వైశాలి. మృత్యుముఖం నుండి బయటకొచ్చిన అనుభవం- అతన్నింకా వెంటాడుతూనే వుంది.

    మామూలుగా కూర్చున్నా అతనికింకా ఊబిలోకి దిగిపోతున్నట్టుగా వుంది.

    మొట్టమొదటిసారి మృత్యువుబాధ గురించిన ఆలోచన... 'ప్రతి సాహసి విజయం కోసమే కాకుండా మృత్యువు కోసం కూడా సిద్ధంగా వుండాలి'

    గ్రీకు షిప్ లోని కెప్టెన్ ఒకసారి తనతో అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు యువరాజు.

    ఆ సమయంలో సింహిక రాకపోతే- తనను రక్షించడానికే సింహిక ఈ బృందంలో కొచ్చిందేమో?

    సింహికపట్ల కృతజ్ఞతతో యువరాజు మనసు నిండిపోయింది.

    అదే సమయంలో...

    ఆచ్చాదనలేని అతని రొమ్మును రెండు చేతులు పెనవేసుకున్నాయి. ఆ చేతులు వైశాలివి.

    "ప్లీజ్ యువరాజూ... కాదనకు. ఇలాంటి సమయం మళ్ళీ ఎప్పుడోగాని రాదు" రెండు చేతులతో అతని ముఖాన్ని దగ్గరగా లాక్కుని, అతని చేతుల్ని తీసుకుని తన గుండెలమీద వేసుకుంది.


                  *    *    *    *


    మీద పడిన చేతి స్పర్శతో హఠాత్తుగా మెలుకువ వచ్చింది ఇందుమతికి.

    కళ్ళిప్పిన ఇందుమతి తన మీదకు కోరికగా వస్తున్న ఆ మానవ మృగాన్ని చూసి కెవ్వున అరిచి-

    లేని శక్తిని కూడదీసుకుని లేచి ఒక్క అంగలో రాతి చపటా మీద నుంచి లేచింది.

    ఆ మానవ మృగం పిచ్చిగా అరిచి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.

    అస్పష్టంగా కన్పిస్తున్న వెలుగులో మానవ మృగాన్ని, ఆ గుహలోని భాగాన్ని పరిశీలిస్తూ-

    చేతికందిన ఓ బండరాయిని ఎత్తి ఆ మృగం మొహం మీదకు విసిరి కొండగుహలోంచి బయటకొచ్చింది ఇందుమతి. బండరాయి దెబ్బకు ఆ మానవమృగం బాధతో అరవటం... బయట పరుగెడుతున్న ఇందుమతికి విన్పిస్తూనే ఉంది.


                                         *    *    *    *


    "ఇలాంటి పనులు నాకిష్టం లేదు..." రెండు చేతులతో ఆమెను ముందుకు తోసేస్తూ అన్నాడు యువరాజు. ఆ తోపుకు వెనక్కి తూలిపోయిన వైశాలికి కోపం వచ్చింది రుసరుసలాడుతూ చూస్తూ-

    "ఏం... నువ్వు మగాడివి కావా" అంది ఆ మాటకు యువరాజుకి కోపం వచ్చింది.

    "ఇందుమతి... ప్రమాదకరమైన పరిస్థితిలో వుంది. ఈ పరిస్థితిలో నువ్విలా ప్రవర్తించటం ఏం బాగోలేదు" అన్నాడు యువరాజు.

    "నాకు తెలుసు... నీ కన్ను ఇందుమతి మీదే వుంది. ఇందుమతి అంటేనే నీకిష్టం... ఎలాగయినా... ఇందుమతిని ఎట్రాక్టు చేసి ఆమెను పొందాలని నీ ఐడియా. నాకు తెలుసులే" ఉక్రోషంగా అంది వైశాలి.

    "ప్లీజ్....వైశాలీ- లేనిపోనివి ఊహించుకోకు..."

    "లేదు. నేను వూహించుకోవడం లేదు. ఐ లవ్ యూ... నేన్నిన్ను ప్రేమిస్తున్నాను- మనసారా ప్రేమిస్తున్నాను. ఈ హంటింగ్ పూర్తయే లోపల... నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలి... లేని పక్షంలో ఇక్కడే, ఈ అడవిలోనే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. గుర్తుంచుకో..." అక్కడ నుంచి విసవిసా నడిచి ముందుకెళ్ళిపోయింది వైశాలి.


                   *    *    *    *


    గాలిలా వస్తున్న సింహికను చూసి ఎదురుగా పరుగెత్తుకొస్తున్న ఇందుమతి భయంతో గట్టిగా పట్టేసుకుంది.

    "ఆ కానిబాల్ నన్ను వెంటాడుతున్నాడు. క్విక్... రన్... రన్..."

    సింహిక చెయ్యిపట్టుకొని ముందుకు పరుగెడుతూ అంది ఇందుమతి భయంగా.

    "ఆ జంతువు సంగతి తేల్చిరానా..." అంది సింహిక పొగరుగా.

    "లేదు... ముందు ఇక్కడనుంచి బయటపడదాం..." తొట్రుపాటుతో అంది ఇందుమతి. ఇందుమతిలో మరి పరిగెత్తటానిక్కూడా శక్తిలేదు.

    ఆ పరిస్థితిని గమనించిన సింహిక ఇందుమతిని ఆగమని చెప్పి రెండు చేతులతో ఎత్తుకొని భుజమ్మీద చిన్నపిల్లాడ్ని పడుకోబెట్టుకొన్నట్టుగా పడుకో బెట్టుకొని-

    గుట్టల మీద నుంచి శివంగిలా లంఘించింది. ఆమె భుజమ్మీద వున్న ఇందుమతి కళ్ళల్లో ఏదో తడి కదలాడింది. సింహికపట్ల కృతజ్ఞతా సూచకంగా. వెనక కపాలేశ్వర్, ముత్యాలనాయుడు.


                   *    *    *    *


    అందరూ నిద్రకుపక్రమించేసరికి రాత్రి రెండు గంటలు దాటింది. ఇందుమతి కళ్ళ ముందు మరికొన్ని గంటల క్రితం జరిగిన సంఘటనే కదలాడుతోంది. యువరాజు పరిస్థితి కూడా అలాగే వుంది. రాత్రంతా కేంప్ ఫైర్ ఆరిపోకుండా చూస్తూనే వున్నాడు ముత్యాలనాయుడు.

    నాలుగువేపులా రాకీ తిరుగుతూనే వుంది. ముందు జాగ్రత్త చర్యగా ఆ శిబిరం చుట్టూ తీగల ఫెన్సింగ్ ను తయారుచేసి ముఖద్వారం ముందు రాతిబండ మీద తెల్లవార్లూ నిద్రలేకుండా కాపలా కాసింది సింహిక.

    అక్కడకు సమీపంలో వున్న కొండ మీద... తూర్పున తెల్లవారేవరకూ ఆ మానవ మృగం, ఆ శిబిరం వేపు చూస్తూ కూర్చుందని అవకాశం దొరక్క వెనక్కి వెళ్ళిపోయిందని ఎవరికీ తెలీదు.


                    *    *    *    *


    ఉదయాన్నే ఇందుమతి నోటివెంబడి వచ్చిన ఆ మాటను నమ్మలేకపోయాడు యువరాజు.

    "ఈజిట్... ట్రూ...." కపాలేశ్వర్ నరాలు ఒక్కసారిగా పైకి ఉబ్బాయి.

    "అవును... రాజూ... ఆ మానవ మృగంలో నాకెక్కువ మనిషి లక్షణాలే కనిపించాయి. ఎందుకంటే కానిబాల్స్ ప్రధాన లక్షణం. మంచీ చెడూ విచక్షణలేకుండా ఎక్కడ మనిషి దొరికితే అక్కడే చంపేసి తినెయ్యడం... కానీ ఈ కానిబాల్ నన్ను ఒక స్త్రీగా చూసింది. ఒక స్త్రీ పట్ల ఆకర్షితుడైన ఒక పురుషుడు ఎంత ఉద్రేకాన్ని ప్రదర్శిస్తాడో... అంతటి ఉద్రేకాన్ని" ఏదో చెప్పబోయి... చటుక్కున ఏదో జ్ఞాపకం వచ్చి-

    "యువరాజూ... ఆ కానిబాల్ ని తక్షణం మనం వెంటాడాలి... నేను అనుకున్నదే... నిజమైతే... ఆ కానిబాల్ ద్వారా మనకు కొన్ని రహస్యాలు తెలియొచ్చు..." గంభీరంగా అంది ఇందుమతి.

    "అదుండే ప్రదేశం... మీరు పోల్చుకోగలరా?"

    "పోల్చుకోగలను" అంది ఇందుమతి తన జ్ఞాపకాలకి పదును పెట్టుకుంటూ-

    శిబిరం దగ్గర ముత్యాలనాయుడ్ని, కాపలాగా పెట్టి బృందం ఆ మానవ మృగం అన్వేషణకు, సాయుధులై కదిలింది.

    ఎట్టకేలకు ఆ కొండ గుహల్ని గుర్తు పట్టింది ఇందుమతి. నెమ్మదిగా ఒక్కొక్కరూ లోనికి ప్రవేశించారు... సింహిక, యువరాజు, ఇందుమతి, కపాలేశ్వర్, వైశాలి... గుహలో ఎక్కడా... ఆచూకీ లేదు.

    "రాత్రి మనం చూసిన లోయ దగ్గరకు వెళ్ళిందేమో?" ఇందుమతి అంది సందేహంగా.

    "ఇప్పుడక్కడికి వెళ్ళడం... ప్రమాదం... రాబందులు వచ్చేస్తాయి..." జ్ఞాపకం చేసాడు కపాలేశ్వర్.

    "భయపడి... పారిపోయిందేమో..." కామెంట్ చేసింది వైశాలి.

    "నిన్నూ- నీ బలాన్ని చూసి పారిపోయుంటుంది-" జోక్ చేసింది ఇందుమతి.

    ఆ మాటకు సింహిక ఫెళ్ళున మద్దిమాను విరగినట్టుగా నవ్వింది.

    "లేదు- యువరాజూ- నా సిక్త్స్ సెన్స్ ఏదో చెప్తోంది- ఆ కానిబాల్ చుట్టుపక్కల ఎక్కడో వుండి వుంటుంది. నో డౌట్- ఉయ్ మస్ట్ ట్రేస్ హిమ్" పట్టుదలగా అంది ఇందుమతి.

    "తలో దిక్కుకి వెళదాం..." సింహిక అంది.

    "తలో దిక్కుకా-" గొంతు తడారిపోయింది వైశాలికి.

    "సింహికా- ఏం చేద్దాం-" అడిగింది ఇందుమతి.

    "కపాలేశ్వర్, మీరు ఒక దిక్కుకి, యువరాజు ఒక దిక్కుకి, నేనో దిక్కుకీ-"

    "నువ్వు ఇక్కడే వుంటావ్- అనుకోకుండా ఇక్కడికి- ఆ మృగం వచ్చిందనుకో- కొండెక్కి నన్ను పిలు. నేనొస్తాను. నీకే ప్రమాదం లేకుండా చూసే పూచీ నాది-" హామీ ఇచ్చింది సింహిక.

    కరక్టు ప్లాన్- ఎందుకయినా మంచిది. ఈ పిస్టల్ని నీ దగ్గరుంచుకో-" జేబులోంచి పిస్టల్ తీసి, వైశాలికిచ్చాడు యువరాజు.

    ఎందుకో వైశాలి గుండె భయంతో గుబ- గుబలాడింది.

    మరో అయిదు నిమిషాల తర్వాత ఒక్కొక్కరూ ఆ గుహముందు నుంచి నాలుగువైపులకూ కదిలారు.

    మంచిని ప్రేమించే మనిషెప్పుడూ రహస్యంగా తిరగడు. వంచనకు అలవాటుపడ్డ మనిషికే రహస్యాలెక్కువ. అలాగే మనుష్యులకు భయపడని జంతువులూ అంతే బాహాటంగా తిరుగుతాయి. మనిషికి భయపడే జంతువులు- పగలు బయటకు తిరగవు- చీకటే దానికి శరణ్యం- ఈ ఆటవిక సూత్రం సింహికకు బాగా తెలుసు- 

    అందుకే సింహిక వైశాలి క్కూడా కనబడకుండా ఆ కొండ గుహ ప్రాంతంలోనే దాక్కుంది.

    నిముషాలు గడుస్తున్నాయి- సింహిక అంచనా తప్పు కాదు- తప్ప లేదు మనిషి, మృగం కాని, ఆ వాసనను వెంటనే గుర్తు పట్టింది సింహిక.

    అంతవరకూ గుహలోని పైభాగంలో దాక్కున్న మానవమృగం నెమ్మదిగా కిందకి దిగి-

    ముఖభాగంవేపు వస్తోంది. ఆ మృగానికి వైశాలి వీపు భాగం స్పష్టంగా కన్పిస్తోంది. ఏదో నవ్వు వినబడితే-

    చటుక్కున తల తిప్పిన వైశాలి ఎదురుగా కన్పించిన వికృతాకారాన్ని చూసి-

    కెవ్వున అరచి- చేతిలోని పిస్టల్ ని సరిచేసి వరసగా కాల్చేసింది. పెనుకేకలు.

    సింహిక కొండదిగి వచ్చేలోపే- ఆ వికృతాకారం నేల కూలిపోయింది. రక్తపు మడుగులో-

 Previous Page Next Page