డొంకదారి- ఆ తర్వాత గులకరాళ్ళ గుట్టలు... ఆ తర్వాత- ఇసక బాట అరఫర్లాంగు దూరం నడిచేసరికి-
ఆ దారి బురద- బురదగా జిగురుగా వుంది.
టార్చిలైటు వెలుగులో నెమ్మదిగా నడుస్తున్నారిద్దరూ.
మరికొంత దూరం నడిచారు.
గయ్ మని చప్పుడు చేస్తున్న కీచురాళ్ళ ధ్వని... ఎక్కడ నుంచో నక్కలు అరుస్తున్న చప్పుడు.
చెట్లమీంచి... గబ్బిలాల రెక్కల చప్పుడు- మనుషుల చప్పట్లులా విన్పిస్తున్నాయి.
మనిషి, జంతువు కలగలిసిన ఏదో మానవ మృగం... పెను విహ్లావత్వంతో ఘూర్జిల్లుతున్నట్లుగా ఏదో అరుపు.
ఆ అరుపు పేగుల్ని తోడేస్తున్నట్లుగా ఉంది.
అదే సమయంలో-
పరమ అసహ్యకరమయిన వాసన, ముక్కు పుటాలకి తగిలింది. ఇందుమతికి వాంతి వచ్చినట్లుగా అయింది.
యువరాజు పరిస్థితి కూడా అలాగే వుంది.
"ఏంటీ వాసన"
"కుళ్ళిపోయిన శవాల వాసన" టక్కున పోల్చుకున్నాడు యువరాజు.
"మనం శ్మశానం దగ్గర కెళుతున్నాం" నెమ్మదిగా అంది ఇందుమతి.
అటూ, ఇటూ టార్చివేసి చూస్తున్నాడు యువరాజు.
ఎండిపోయిన ఓ వాగు... లోయలా వుంది. ఆ లోయలో... వందలాది కపాలాలు... ఎముకలు... ఎముకల గుట్టలు.
మసక వెన్నెల్లో ఆ కపాలాలు... నవ్వుతున్నట్లుగా వున్నాయి. ఆ లోయను ఆనుకుని ఏదో దిగుడు బావి.
ఆ దిగుడు బావిలో కూడా గుట్టలు గుట్టలుగా మానవ కపాలాలు. అదొక రుద్రభూమిలా వుంది.
ఇందుమతి అకస్మాత్తుగా... దిగుడు బావి మెట్లమీద టార్చి ఫోకస్ చేసి ఆ వెలుగులో కనిపించిన దృశ్యానికి వణికిపోతూ నిల్చుంది... అర ఘడియలో ఆమె వంటిమీద జరజర పాక్కుంటూ.
చెమట.
"రాజూ" మెల్లగా గొణిగింది. కొంచెం దూరంలో యువరాజు ఆమె పక్కకొచ్చి, దిగుడుబావి మెట్లమీదకు టార్చి ఫోకస్ చేశాడు.
"దెయ్యం" తడారిపోయిన గొంతుతో అందామె.
"కాదు మనిషి" జవాబిచ్చాడు యువరాజు.
కొన్నివేల కపాలాల మధ్య మనిషి!
ఆశ్చర్యంగా ఉందతనికి. వెన్నులోంచి ఉబుకుతున్న భయం దేనికైనా సిద్ధపడే మనస్తత్వంగల యువరాజు ఉచ్చ్వాస నిశ్వాసాల వేగం పెరగడం అతనికి తెలుస్తూనే వుంది.
"మేడమ్ స్టాప్ ది లైట్" అనడంతో ఇందుమతి టార్చి ఆఫ్ చేసింది. తనూ లైటార్పేశాడు.
లోయ పైభాగం నుంచి మెట్లమీద వున్న ఆకారాన్ని పరిశీలిస్తున్నారిద్దరూ క్షణాలు గడుస్తున్నాయి.
చీకటికి, అలవాటుపడ్డాక కనిపించిన దృశ్యం చూసి వారిద్దరూ కొయ్యబారిపోయారు.
మెట్లమీద ఆకారం... ముందు ఒక శవం వుంది. ఆ శవాన్ని పీక్కుతింటోంది ఆ ఆకారం.
"కానిబాల్" ఇందుమతి గొంతులోంచి వచ్చిందా మాట.
మనుషుల్ని పీక్కుతినే మనిషి.
మెట్లమీద ఆకారం జంతువా? ఆటవికుడా?
వెనుకభాగం నుంచి ఏం కనబడటం లేదు. దిగుడు బావి. అంచు వెంబడి పాక్కుంటూ... చుట్టూ తిరిగి అటువేపు వెళ్లాడు.
అప్పుడు యువరాజు.
ఇందుమతికి సరిగ్గా ఎదురుగా వున్నాడు.
జంతువా? ఆటవికుడా? మరేమాత్రం ఆలస్యం చెయ్యకుండా యువరాజు పిస్టల్ పైకి తీసి కుడిచేత్తో గురిపెట్టి ఎడం చేతిలోని టార్చిలైటుని మెట్లవేపు ఫోకస్ చేసాడు.
తన కళ్ళమీద కాంతి పడటంతో మెట్లమీదున్న మానవ మృగం తలెత్తి చూసింది.
అప్పటికీ అది మనిషో, మృగమో తెలియడంలేదు. మెట్లమీంచి లేచి వికృతంగా అరుస్తూ పైకి వస్తుండడంతో దానివేపే గురి చూసి ట్రిగ్గర్ నొక్కి పరుగు తీశాడు యువరాజు.
మానవ మృగం మెట్లెక్కడం చూసిన ఇందుమతి వెనక్కి పరుగెత్తడం ప్రారంభించింది.
మెట్లు పైకెక్కగానే, పరుగెత్తుతున్న ఇందుమతిని చూసి ఆ మానవ మృగం... ఆమె వెనక పరుగెత్తడం ప్రారంభించింది వికృతంగా అరుస్తూ.
దిగుడుబావికి అటువైపు యువరాజు, అడ్డంగా పరుగెత్తుతూ రాబోయాడు.
కానీ-
అతని కాళ్ళు కదలడం లేదు.
కపాలాల మధ్యలోంచి... అతని కాళ్ళు కూరుకుపోతున్నాయి.
చేతిలోని పిస్టల్ టార్చి నేలమీదకు జారిపోయాయి. మెత్తగా, మెత్తగా కిందకు దిగిపోతున్న యువరాజుకు అప్పుడు స్ఫురించింది.
తనెంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడో!!!
ఎంత భయంకరమైన ఊబిలో తను దిగబడిపోతున్నాడో!
"మేడమ్ మేడమ్... ఇందుమతీ... ఇందుమతీ" అరుస్తున్నాడు యువరాజు.
ఆ అరుపులు వినబడనంత దూరంలో పరుగెడుతోంది ఇందుమతి.
అప్పటికే బాగా అలసిపోయింది.
చేతికి, కాళ్ళకు గుచ్చుకున్న ముళ్ళకంపలు. ప్రవహిస్తున్న రక్తధారలు... ఎర్రమట్టి దిబ్బల మధ్య.
దబ్బున పడిపోయింది... ఇందుమతి.
అక్కడకు కొంచెం దూరంలోనే వుంది... ఆ మానవ మృగం.
అటూ, ఇటూ ఆమె కోసం చూస్తూ.
* * * *
యువరాజు నడుం వరకూ కూరుకుపోయాడు.
తనని రక్షించమని అరుస్తున్నాడు.
"హెల్ప్... హెల్ప్... హెల్ప్"
రాత్రివేళ ఆ అరుపులు... అనంతకోటి పక్షుల అరుపుల్లో కలిసి పోతున్నాయి.
అదే తన చివరి క్షణాలు.
అరచి, అరచి అలసిపోయాడు.
సరిగ్గా ఆ సమయంలో-
నీరసంతో వాలిపోతున్న అతని కళ్ళకు బురద మట్టిమీద మెరుస్తున్న పిస్టల్ కనిపించింది.
అతికష్టంమ్మీద దాన్ని అందుకుని-
గాల్లో... బుల్లెట్స్ అయిపోయే వరకూ కాలుస్తూనే వున్నాడు.
బులెట్స్ అయిపోయాయి.
అతను ఆఖరిగా అరిచిన అరుపు.
"సింహికా... సింహికా... సింహికా"
అదే సమయంలో-
తాగుడు మత్తులో వున్న సింహిక తూలుతూ జోగుతూ వస్తోంది. బుల్లెట్ల శబ్దం వినగానే ఎలర్టయింది.
ఆ శబ్దం ఏ దిక్కునుంచి వస్తుందో తెలియడానికి ఆమెకు ఎంతోసేపు పట్టలేదు.
అటూ ఇటూ చూసి-
సింహంలా లంఘిస్తూ గాలికంటే వేగంగా పరుగెడుతోంది.
అప్పుడే-
ఆమె-
"సింహికా" అని తనని పిలిచిన యువరాజు చివరి పిలుపు విన్నది.
* * * *
సింహిక రావడం...
మరో నిమిషం ఆలస్యమైతే... యువరాజు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేవి...
ఊబిలోంచి బయటకు తీసి భుజమ్మీద వేసుకుని యువరాజుని... శిబిరం దగ్గరకు తీసుకొచ్చింది సింహిక.
అప్పటికే ముత్యాలనాయుడు, కపాలేశ్వర్, వైశాలి చుట్టుముట్టేశారు. "సింహికా... ఇందుమతిని ఏదో మృగం వెంటాడుతోంది... అనుసరించు" అని చెప్పి కపాలేశ్వర్ వేపు చూసి-
"కానిబాల్... కానిబాల్... ప్లీజ్ సేవ్ హర్" అంటూ నీరసంగా తల పక్కకు వాల్చేశాడు బాధగా యువరాజు.
యువరాజుకు కాపలాగా వైశాలి నుంచి- ఇందుమతి కోసం వెతకడానికి సింహిక, ముత్యాలనాయుడు, కపాలేశ్వర్ బయలుదేరారు.
* * * *
మానవ మృగం-
రెండు చేతులతో ఇందుమతిని ఎత్తుకొని శరవేగంతో పరుగెత్తుకొని వెళుతోంది... దాదాపు రెండు కిలోమీటర్లు వెళ్ళాక-
తనమీద ఎలాంటి శత్రువులు దాడి జరగదని రూఢి చేసుకున్నాక నెమ్మదిగా నడవడం మొదలుపెట్టింది. రెండు పెనుకొండల మధ్య సొరంగంలోకి ప్రవేశించింది. లోన విశాలంగా వుంది.
మెరుస్తున్న వింత రాళ్ళ వెలుగులో ఆ కొండ గుహ స్పష్టంగా కన్పిస్తోంది.
ఒకరాతి చపటా మీద-
ఇందుమతిని పడుకోబెట్టి ఆమె మొహంలోకి తేరిపార చూడటం మొదలుపెట్టింది ఆ మానవమృగం.
* * * *
గాయం తగిలినప్పుడు సింహం ఎలా లంఘిస్తుందో. అలా లంఘిస్తోంది సింహిక.
ఆమెతో పరుగెత్తడం సాధ్యం కాక కపాలేశ్వర్, ముత్యాలనాయుడు ఆయాసంతో రొప్పుతున్నారు.
చిమ్మ చీకటిలో ఎటు వెళుతున్నారో తెలీని ప్రయాణం-
ఒక కిలోమీటరు వెళ్ళాక-
ఆగింది సింహిక-
వెన్నెల వెలుగులో స్పష్టంగా కన్పిస్తోంది- ముళ్ళకంపలకు వేలాడ్తున్న చిరిగిపోయిన చీరకొంగు.