తుపాకీ చప్పుళ్ళు వినబడడంతో- అందరూ గుహ దగ్గరికి పరుగు- పరుగున వచ్చారు.
అది మానవ మృగం కాదు మనిషే మృగంగా మారిన అద్భుత వింత కథ. తూర్పు కనుమల్లో జరిగిన యధార్ధ గాధ-
"చూసావా- యువరాజూ- నా నమ్మకం అబద్ధం కాదు. మానవ మృగమూ కాదు. సహజమైన కానిబాల్ కాదు. హీ ఈజ్ ఏ మాన్" అంది ఇందుమతి ఊపిరి తీసుకుంటూ. ఆ వ్యక్తి సన్నగా, పొడవుగా, నగ్నంగా ఉన్నాడు. సంవత్సరాల తరబడి, దుమ్మూ, ధూళి, బురదల్లో తిరగడం వల్ల వళ్ళంతా మట్టి కొట్టుకుపోయాడు. జుట్టు అట్టలు కట్టేసింది.
"వైశాలీ- నువ్వు తప్పు పనిచేశావ్. అతన్ని చంపకుండా ఉంటే మనకు చాలా విశేషాలు తెలిసేవి. రాజూ కమ్ ఇన్ సైడ్-" గుహ లోపలికి అడుగు పెట్టింది ఇందుమతి.
యువరాజుకి అంతా విచిత్రంగా ఉంది. అరగంటసేపు ఇందుమతి లోపల, ప్రతి రాయినీ, ప్రతి రప్పనీ క్షుణ్ణంగా వెతికింది. ఆమె శ్రమ వృధా కాలేదు. నల్లటి ప్లాస్టిక్ బేగ్ ఒకటి దొరికిందామెకు- ఆ బేగ్ చాలా పాతబడిపోయి ఉంది.
ఇందుమతి ముఖం వికసించింది. వెంటనే ఆ బేగ్ ని ఓపెన్ చేసింది. అందులో కొన్ని ఫోటోలు-
ఒక డైరీ ఉంది. ఆ డైరీ అంతా ఇంగ్లీషులో రాయబడి ఉంది.
"రాజూ- ఇతనెవరో కాదు- ఇరవై ఏళ్ళక్రితం ట్రెజర్ హంటింగ్ కోసం వచ్చి, ఇక్కడ చిక్కుబడిపోయిన అమెరికన్ లలో ఒకడు" ఎక్సైటింగుగా అంది ఇందుమతి. ఆ మాట వినగానే షాక్ తినేసాడు యువరాజు.
"ఎక్కడో పుట్టి, ఏదో ఇంట్రెస్ట్ తో, ఏదో సాధిద్దామని యిక్కడ కొచ్చాడు. దుర్భరమైన జీవితం గడిపాడు. అనామకంగా, మన చేతుల్లో చచ్చిపోయాడు. ఒక విదేశీయుడికి, సగౌరవంగా దహన సంస్కారం చేయడం మన కర్తవ్యం. ఆ ఏర్పాట్లు చూడు యువరాజు-" అంది ఇందుమతి. ఇందుమతి హృదయ సంస్కారానికి ముగ్ధుడై పోయాడు యువరాజు.
ఎక్కడయితే అమెరికన్ ఇన్నాళ్ళు రహస్య జీవితం గడిపాడో అక్కడే ఆ గుహముందే అతని శవదహన కార్యక్రమం జరిగిపోయింది. అది జరిగిన మూడు గంటల తర్వాత-
డైరీలోని విశేషాలన్నీ తెలుసుకొన్నాక, అసలు కథ చెప్పడం ప్రారంభించింది ఇందుమతి.
"తాటిపూడి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో- ఫారెస్టాఫీసర్- శంతన్ కుమార్ చెప్పారు జ్ఞాపకం వుందా? జిమ్ హాకిన్స్ అనే అమెరికన్, భార్య విజ్ హాకిన్స్ కూతురు, ఫ్రెండ్ తో పాటు ఇరవై ఏళ్ళక్రితం- ట్రెజర్ హంటింగు కోసం ఇక్కడ కొచ్చారని ఇన్నాళ్ళూ దుర్భరంగా కానిబాల్ లా బతికిందీ, మన చేతిలో చచ్చిపోయిందీ- ఆ జిమ్ హాకిన్సే"
"జిమ్ హాకిన్స్?" అప్రయత్నంగా కపాలేశ్వర్ గొంతులోంచి వచ్చిందా మాట.
"ఈ డైరీ- ఆయన మదనపడ్డ బాధకు నిదర్శనం. మన చేతుల్లో చనిపోవడానికి అయిదు సంవత్సరాల క్రితం వరకూ ఆయన బాగానే వుండేవాడు. ఆ తర్వాతే ఆయనకు పూర్తిగా మతి స్థిమితం తప్పి పోయింది.
అమెరికాలోని ఫ్లోరిడా సిటీకి చెందిన వ్యక్తి జిమ్ హాకిన్స్. ఫేమస్ ఆర్కియాలజిస్ట్. ఆయన హాబీ ట్రెజర్ హంటింగ్. రెండుసార్లు ఇండియా వచ్చినప్పుడు మన తూర్పు కనుమల గురించి తెల్సుకున్నాట్ట. ఇక్కడ నిధి నిక్షేపాల గురించి తెలుసుకున్నాట్ట! ఆరునెలలపాటు ఈ తూర్పు కనుమల్లో పరిశోధించడానికి భార్య విజ్ హాకిన్స్ కూతురు షెర్రీ హాకిన్స్, అసిస్టెంట్ హారిసన్ బ్రౌన్ తో ఇక్కడికొచ్చాడు. ఇంతమంది గిరిజనుల కన్ను గప్పి ఇంతదూరం ఎలా వచ్చారో తెలీదు.
నెలరోజుల పరిశోధన సజావుగా సాగింది. అప్పుడే ప్రారంభమయ్యాయి కష్టాలు. ఒక అర్ధరాత్రి ఒక ఆటవిక తెగ ఆ కుటుంబమ్మీద దాడి చేసింది. విజ్ హాకిన్స్ ని ఎత్తుకుపోయారు. అడ్డొచ్చిన హారిసన్ ని చంపేసారు. భార్య అదృశ్యమై పోయింది. జిమ్ హాకిన్స్ బాగా గాయపడ్డాడు. కూతురితోపాటు హాకిన్స్ తన భార్య కోసం కొన్ని సంవత్సరాలు వెతికాడు.
ఆఖరి అయిదేళ్ళ తర్వాత బక్కచిక్కి పోయిన దశలో రాబందులు తిరిగిన ఆ దిగుడు బావిలో కనిపించింది విజీ. తనని ఇన్నాళ్ళూ పరమ పాశవికంగా రోజూ రేప్ చేస్తూ అనుభవించారని చచ్చిపోయే ముందు వదిలేసారని చెప్పి అందుకు కారణమైన వ్యక్తులెవరో చెప్పి చచ్చిపోయింది విజ్ హాకిన్స్.
జిమ్ హాకిన్స్ రక్తం సలసల మరిగిపోయింది. ఒక రాత్రి ఆ గిరిజన గ్రామం... ఆదమరిచి నిద్రపోతున్న వేళ- ఒక్కడే మెరుపుదాడి చేశాడు. భార్య చావుకు కారకుడైన వాడిని చంపేసాడు.
కానీ- మర్నాడు... తనూ, కూతురు ప్రాణాలతో బయటపడదామని భావించిన జిమ్ హాకిన్స్ కూతురు షెర్రీతో సహా అడవిలోంచి బయటపడదామని భావించి రహస్యంగా వస్తున్న సమయంలో ఆయన్ని పట్టుకొని చెట్టుకు కట్టేసి తండ్రి ఎదురుగానే కూతురిని చిత్రహింసలు పాలు చేసి, రేప్ చేసి ఆ అమ్మాయిని తమతో తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పట్నుంచి ఇప్పటివరకూ కూతురు షెర్రీ కోసం వెతుకుతూనే ఉన్నాడు జిమ్ హాకిన్స్. వీలయినప్పుడల్లా వాళ్ళమీద మెరుపుదాడులు చేస్తూ గాయపరుస్తూనే ఉన్నాడు" చెప్పడం ఆపింది ఇందుమతి.
"కానిబాల్ లా ఎప్పుడు మారాడు!" అడిగాడు కపాలేశ్వర్.
"జిమ్ హాకిన్స్... అసలు కానిబాల్ లా మారలేదు. తను మనుషుల్ని శవాల్ని తినే కానిబాల్ గా మారిపోయాడని ఆ గిరిజనుల్ని నమ్మించడం కోసం నటించాడు. ఎప్పుడయితే హాకిన్స్ కానిబాల్ అయ్యాడని ఆ ఆటవికులు అనుకున్నాడో ఈయన జోలికి రావడం మానేశారు"
"మొట్టమొదటిసారి మనకు జిమ్ హాకిన్స్ ఆ స్మశానం దగ్గర దిగుడుబావిలో ఎందుకు కనబడ్డాడు."
ప్రశ్నించాడు యువరాజు.
"నా అంచనా ప్రకారం... ఆయన శవాన్ని తినడంలేదు... ఓ అస్తిపంజరాన్ని చూసుకొంటున్నాడు... ఆ అస్థిపంజరం ఆయన భార్యది కావచ్చు..." నెమ్మదిగా చెప్పింది ఇందుమతి.
ఆ కథ వింటుంటే వైశాలి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "మనం ఆటవికులం కాదుగదా మనతో ఆ విషయాలు చెప్పొచ్చుగదా..." అడిగింది వైశాలి.
"అప్పటికే ఆయనకు మతిస్థిమితం సరిగా లేదని నా అనుమానం. మనకు గనుక ఆయన ప్రాణాలతో దొరికుంటే... మారేవాడేమో అన్ పార్చునేట్ ఇదిగో ఆయన ఫోటో..."
డైరీలోంచి రంగు వెలసిపోయిన ఓ ఫోటోని తీసి చూపించింది ఇందుమతి.
"పక్కన భార్య విజ్, కూతురు షెర్రీతో నవ్వుతూ నుంచున్నాడు జిమ్ హాకిన్స్"
ఆ ఫోటో చూసిన ఎవరికీ నోటంట మాట రాలేదు. కళ్ళంట కన్నీళ్ళు తప్ప.
"ఇంత దారుణం... ఏ గిరిజనులు చేసుంటారు..." అడిగాడు యువరాజు.
ఒకసారి యువరాజు వేపు కపాలేశ్వర్ వేపు చూసి-
"చంద్రకోన ట్రైబల్స్... అని ఆయనే ఒకచోట రాసుకొన్నాడు" నెమ్మదిగా చెప్పింది ఇందుమతి. "చంద్రకోన ట్రైబల్స్ అంత భయంకరమైన వ్యక్తులా...? ఆశ్చర్యపోతూ అడిగాడు కపాలేశ్వర్.
దీర్ఘంగా ఆలోచిస్తున్న ఇందుమతి, ఆ ప్రశ్నకు జవాబివ్వలేదు.
డైరీలో జిమ్ హాకిన్స్ రాసుకొన్న ఒక ఇంపార్టెంట్ పాయింటు గురించి చాలాసేపు ఆలోచించింది ఇందుమతి.
అటూ ఇటూ నిద్రపట్టకుండా దొర్లుతున్న ఇందుమతిని అడిగాడు యువరాజు-
"ఏంటి... మేడమ్... చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు... హాకిన్స్ గురించేనా?"
"ఎప్పుడయినా, ఎవరయినా తన కూతుర్ని చూస్తే ఆమెను వారి చెర నుండి విడిపించి అమెరికాలోని తన ఎస్టేట్ పంపించమని ఒకచోట హాకిన్స్ రాసుకొన్నాడు రాజూ"
"హాకిన్స్ కూతురు షెర్రీ ఎక్కడుందో తెల్సుకోవాలి..." నిర్ణయించుకున్నాడు యువరాజు మనస్పూర్తిగా.
* * * *
మర్నాడు ఉదయం, మళ్ళీ ప్రయాణం మొదలైంది. "ఇకనుంచి- ఎవరు కన్పించినా... బతకనివ్వకండి..." కపాలకోనలో... సింహిక తండ్రి, పగడం దొర కసిగా, చెప్పిన విషయం జ్ఞాపకానికొస్తోంది యువరాజుకి.
జిమ్ హాకిన్స్, దయనీయమైన కథ... అతని మెదడులో గింగిర్లు తిరుగుతోంది.
పగడం దొర ఎందుకామాట అన్నాడో, అప్పుడర్ధమైందతనికి.
వారం రోజులు గడిచాయి.
పదిరోజులు గడిచాయి.
ఏ ప్రత్యేకమైన సంఘటనా జరగలేదు.
పదకొండో రాత్రి... అకస్మాత్తుగా చెప్పాడు ముత్యాలనాయుడు-
"అమ్మా... ఇందుమతీ... తెచ్చిన ఆహారమంతా... అయిపోయింది.
బిత్తరపోయింది ఇందుమతి.
"ముందు పరిస్థితులెలా వుంటాయో... మనం ఏదైనా... సమృద్ధిగా ఆహారాన్ని సంపాదించుకోకుండా... ముందుకెళ్ళడం మంచిది కాదు" సలహా ఇచ్చాడు ముత్యాలనాయుడు.
"ఏం చేద్దాం..." యువరాజును చూస్తూ అడిగింది ఇందుమతి.
"కొన్ని అడవి జింకల్ని, కుందేళ్ళని... తేనె... ఫ్రూట్స్ ని... సంపాదిస్తే బావుంటుంది. ఓ మూడురోజులు... ఆ పనిలో వుంటే మంచిదేమో" సలహా ఇచ్చాడు కపాలేశ్వర్.
"అవును... రెస్టు తీసుకొన్నట్టుగా ఉంటుంది. ఆహారాన్ని సమకూర్చుకున్నట్టుగా ఉంటుంది" అన్నాడు ముత్యాలనాయుడు.
"దబ్బలపాడు ఇంకెంతదూరం" సింహికను అడిగాడు యువరాజు.
చెప్పింది సింహిక.
దట్టమైన అడవిలో, గుబురు చెట్ల మధ్యలో-
ఆటవికులకు ఏమాత్రం అనుమానం రాకుండా, నేలను చదును చేసి, టెంట్ లను వేసాడు యువరాజు.
"ఎవరు ఎక్కడికి వెళ్ళినా, ఒంటరిగా వెళ్ళొద్దు" ఆర్డర్ జారీ చేసింది ఇందుమతి.
"నేను-తప్ప" నవ్వుతూ అంది సింహిక.
సింహిక, యువరాజు, వైశాలి, కపాలేశ్వర్ అడవిలో కెళ్ళారు. వాళ్ళ వెనక రాకీ.
అందరూ వెళ్ళిపోయాక, ముత్యాలనాయుడు, ఇందుమతి దగ్గరకొచ్చాడు-
"అమ్మా- ఇందూ- ఇంతకీ- నిధి వుందంటావా?" అడిగాడు ఒకింత నిరాసక్తంగా.


