Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 39


    నీరసంగా ఆ యంత్రాన్ని తీసుకొని ఎడిసన్ వెనుదిరిగాడు.

    అంతలో చైర్మన్ మరలా అన్నాడు- "చూడుబాబు ఈ యంత్రాన్ని అమెరికాలోనే కాదు- ఓటింగ్ ప్రోసెస్ వున్న ఏ దేశంలోనూ నీవు అమ్ముకోలేవు. ఎందుకంటే, ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నాయకుల మెదళ్ళన్నీ ఒకే క్షణాల్లో తయారుకాబడి వుంటాయి. నిన్ను చూసి నేను జాలిపడుతున్నాను. వెళ్లిరా బాబు - రాజకీయ నాయకులకు నీతి, నిజాయితీని అంటగట్టే యంత్రాన్ని కనిపెట్టకు. అది చాలా 'ప్రమాదకరం' అన్నాడు."

    ఆ తరువాత ఎడిసన్ తను చేసిన తప్పుకి రియలైజ్ అయ్యాడు. ఇక్కడ నీవో విషయాన్ని గమనించాలి. జనబాహుళ్యానికి అవసరమైన వస్తువుల్ని శోధించకూడదు. ఆ జనబాహుళ్యం యొక్క అభిరుచులకు, బలహీనతలకు నీవు కనిపెట్టే వస్తువు వ్యతిరేకంగా పనిచేయరాదు.

    నువ్వు కనిపెట్టేది అద్భుతమైన పరికరమైనా, అలాంటిది గతంలో ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా దాని అవసరం ప్రజలకు లేనప్పుడు ప్రయోజనం శూన్యం.

    అంతవరకు అవసరంలేని వస్తువును నీవు కనిపెట్టినా, ఆ తరువాతైనా దాని ప్రయోజనాన్ని ప్రజలు గుర్తించి దానికోసం వెంపర్లాడాలి. దానికి ఉదాహరణ జీన్ పాంట్స్, హిప్పీ జుత్తును పొందికగా లోపలకు గుండ్రంగా తిప్పగల గుండ్రటి దువ్వెన.

    ఈ వస్తువుల అవసరాలు, ప్రజల్లో పాత ఫ్యాషన్స్ పై వెగటు, కొత్త ఫ్యాషన్స్ పై మోజు వున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.

    నీవు కనిపెట్టిన వస్తువు వలన వారి జీవితానికో, లైఫ్ స్టయిల్ కో, ఫ్యాషన్ కో, అభిరుచికో, నలుగురిలో గొప్ప అనిపించుకోవడానికో, లేక నలుగురిలో ఆకర్షింపబడటానికో, మోహింపబడటానికో, మోజుపడటానికో పనికిరావాలి. అప్పుడు ఆ వస్తువుతో ప్రత్యేక అవసరం లేకపోయినా కొంటారు..." మాలిని చెప్పటం ఆపింది.

    త్రినాధ్ లోని జ్ఞాన దాహం అంతకంతకు పెరిగిపోతోంది. ఆమె చెప్పకుండా ఆగిపోవటం అతనికి అసహనంగా వుంది. ఆమె ఎదురుగా వున్న ప్రతి క్షణం ప్రపంచాన్ని జయించినంత తృప్తి- గెలవగలనన్న ఆత్మవిశ్వాసం తనలో పరవళ్ళు తొక్కుతుంటాయి.

    ఆమె ఇంకా కళ్ళు తెరవలేదు, నోరు విప్పలేదు. అతను ఆశగా చూస్తున్నాడు. సరిగ్గా ఇదే టైమ్ లో బెంగుళూరులో గుప్తా, బోస్ వ్యవహారాలు చిత్రంగా మలుపు తిరుగుతున్నాయి.

    బోస్ తనకు త్రినాధ్ చెప్పిన పథకాన్ని సక్రమంగా నిర్వర్తించే విషయంలో గుప్తాని బాగా ప్రిపేర్ చేశాడు.

    ఆ వెంటనే స్టేషన్ కి వెళ్ళి హైదరాబాద్ ట్రైన్ కి మూడు టిక్కెట్స్ తీసుకొచ్చాడు. ఆ టిక్కెట్స్ తీసుకొనేప్పుడే కొద్దిగా శ్రమపడ్డాడు.

    అప్పటికే గుప్తా తనకు మైకోలో వున్న తన పాత ఫ్రెండ్స్ ద్వారా టెక్నీషియన్ ని ఎక్కువ జీతం మీద ఒప్పించగలిగాడు.

    గత రాత్రే బెంగుళూర్ నగరంలో దిగిన సుదర్శన్ రావు మనుష్యులు నలుగురు, గుప్తాని నీడలా వెంటాడుతున్న విషయాన్ని గుప్తా గ్రహించలేకపోయినా బోస్ పసిగట్టగలిగాడు.

    ఏం జరగబోతోందన్న విషయం గుప్తా అడిగినా బోస్ మాత్రం ఒక్కటే చెప్పాడు- మీ ఇద్దర్ని నేను అనుక్షణం కాపుకాస్తాను అని.

    ట్రైన్ కి టైమ్ అవుతోంది. గుప్తా లేచి తన లగేజి సర్దుకొని హోటల్ రూమ్ ఖాళీచేసి స్టేషన్ కి బయలుదేరాడు. గంటకు ముందే బోస్ మైకోకి వెళ్ళి టెక్నీషియన్ ని తీసుకొని సరాసరి స్టేషన్ కి వస్తానని చెప్పి వెళ్ళాడు.

    ట్రైన్ ఫ్లాట్ ఫాం మీద బయలుదేరేందుకు సిద్ధంగా వుంది. అయినా బోస్, టెక్నీషియన్ జాడలేదు. అతనికి ఆందోళనగా వుంది. టెక్నీషియన్ ని అదృశ్యం చేసేందుకు సుదర్శన్ రావు మనుష్యులు రంగంలోకి దిగారని తెలుసు. కాని వాళ్ళు ఎప్పుడు ఎలా ఎటాక్ చేస్తారన్నది తెలియదు. అయితే తనకొక్కటే ధైర్యం - చిరుతపులి లాంటి బోస్ తన ప్రక్కనుండటం, అతనే టెక్నీషియన్ ని రక్షించటానికి సిద్ధపడటం.

    క్షణాలు- నిమిషాలు- దొర్లిపోతున్నాయి. గుప్తాలో అంతకంతకు ఆందోళన ఎక్కువయిపోతోంది.

    ట్రైన్ కి గంటకొట్టారు.

    గుప్తా ఉలిక్కిపడ్డాడు. వాళ్ళ జాడింకాలేదు. వాళ్ళు రాకుండా తను ఎలా వెళ్ళగలడు? ట్రైన్ ఎక్కాలా లేదా అనే సంశయంలో పడిపోయాడు. కాని త్రినాధ్ సూచనల మేరకు తను బోస్ చెప్పినట్లు చేయాలి.

    అంటే తనిప్పుడు తన బెర్త్ నెంబరు 36 లో వెళ్ళి కూర్చోవాలి. టెక్నిషియన్ కి రిజర్వ్ చేసిన బెర్త్ నెంబర్ 37 లో అతనే వచ్చి కూర్చుంటాడు. తమకు ఎదురుగా వుండే బెర్త్ నెంబర్ 41 లో బోస్ వుంటాడు. అనుక్షణం అప్రమత్తంగా తమను కాపలా కాస్తుంటాడు.

    బోస్ తనకు చెప్పింది గుర్తుకు రాగానే మరొక్క క్షణం ఆలస్యం చేయకుండా తమకు రిజర్వ్ అయిన బోగీ దగ్గరకు వెళ్ళి మరోసారి ప్లాట్ ఫామ్ అంతా కలియజూసి ట్రైన్ ఎక్కేసాడు.

    తన దగ్గర ఒక టిక్కెట్ మాత్రమే వుంది. అది తనది. తన బెర్తు కోసం చూసుకుంటూ వెళ్ళి కొద్ది క్షణాల్లోనే 36 బెర్తు దగ్గరకు చేరుకొని ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు.

    37 నెంబర్ బెర్త్ లో ఒక వ్యక్తి వున్నాడు. ప్రక్కకు చూశాడు. 41 బెర్త్ పై బోస్ కూర్చుని వున్నాడు.

    గుప్తా గుండెనిండా ఊపిరి తీసుకొని 37 నెంబర్ బెర్త్ పై వున్న మనిషి వేపు చిరునవ్వుతో చూశాడు. అతను చిరుమందహాసం చేశాడు. సరిగ్గా అదే సమయానికి ట్రైన్ కదిలింది.

    అదే బోగీలో వేరే బెర్త్ లో వున్న ఆ నలుగురు వ్యక్తులు నిశ్శబ్దంగా కూర్చుని అప్పుడప్పుడు తమ వాచీల వేపు చూసుకుంటున్నారు.

    బోస్ అప్పుడప్పుడు 37 నెంబర్ బెర్త్ వేపు చూస్తూకూర్చున్నాడు.

    ట్రైన్ బయలుదేరిన అరగంటకు ఆ నలుగురు వ్యక్తులలో ఒకరు మెల్లగా లేచి టాయ్ లెట్ రూమ్స్ కన్నట్లు బయలుదేరారు.

    బోస్ వాళ్ళు కూర్చున్న ప్రాంతానికి రాగానే ఓరగా ఆ వేపుచూసి ముందుకు సాగిపోయారు.

    సరీగ్గా ఆ సమయంలోనే బోస్ 37 బెర్త్ వేపే చూస్తున్నాడు.

    ఆ సమయంలో బోస్ ఆలోచనలు వేరుగా వున్నాయి. తనూ ఒక మనిషేనని ముందుగా గుర్తించింది త్రినాధ్. తనకు జరిగిన అవమానానికి సమాధానం చెప్పే విధంగా తనను తీర్చిదిద్దబోతున్నదీ అతనే. ముఖ్యంగా తన తల్లి తనపట్లపడే మానసిక క్షోభను తొలగించగలిగింది త్రినాధ్. అలాంటి త్రినాధ్ కి అవసరం వస్తే ప్రాణాలు అర్పించటానికైనా తను సిద్ధపడాలి. అతనికి కుడిభుజంగా వుంటూ అతని విజయానికి తోడ్పడి, తనూ ప్రయోజకుడు కావాలి. తనకు జరిగిన అవమానానికి తగిన సమాధానం చెప్పాలి.

    ఇవన్నీ జరగాలంటే తను ముందు ఆ టెక్నీషియన్ ని తన ప్రాణాలు ఒడ్డయినా కాపాడాలి.

    ప్రమాదం ఏ క్షణంలోనైనా ఏ వేపు నుంచైనా విరుచుకుపడవచ్చు.

    చాలా కాలంగా ఎలాంటి గొడవలు, కొట్లాటలు లేక చేతులు దురదగా వున్నాయి. దాన్నిప్పుడు తీర్చుకోవాలి.

    మరో అరగంటకి మరో వ్యక్తి అటుగా వచ్చి వెళ్ళాడు.

    బోస్ పెదాలు దాటకుండా నవ్వుకున్నాడు. అప్పుడప్పుడు తనవేపు ఆందోళనగా చూస్తున్న గుప్తాని కళ్ళతోనే భయపడవద్దన్నట్టుగా సంజ్ఞచేశాడు బోస్.

    సరిగ్గా ట్రైన్ బయలుదేరిన రెండో గంటకి మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి వళ్ళు విరుచుకుంటూ లేచారు. ఒక్కొక్క అడుగే మెల్లగా వేస్తూ బోస్ వున్న వేపుకి రాసాగారు.

    బోస్ కి మరో ఆలోచన కూడా వుంది. జరగబోతున్న ఘర్షణలో గుప్తాకి ఎలాంటి ప్రమాదం జరక్కూడదని. గుప్తాతో త్రినాధ్ కి చాలా అవసరాలు వున్నాయి. అందుకని తానిప్పుడు రక్షించవల్సింది ఒకర్ని కాదు ఇద్దర్ని.

    అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటలు. ట్రైన్ బెంగుళూర్ నగరం దాటి అప్పటికి కరక్టుగా రెండు గంటలయింది.

    కంపార్టుమెంట్ లోని ప్రయాణీకులు ఒక్కొక్కరు మెల్లగా నిద్రలోకి జారుకుంటున్నారు.

    మరికొద్ది నిమిషాల్లో అక్కడో భీభత్సం సృష్టించబడబోతోందని అక్కడున్న ఎవరికీ ఊహకి అందని ఉపద్రవం.

    బోస్ చేతుల్ని, కాళ్ళను ఒకసారి విదిలించి, ఒళ్ళు విరుచుకున్నాడు. ఇప్పుడతను ఒక మహా ప్రళయాన్ని అడ్డుకోబోయే కాలరుద్రుడిలా వున్నాడు.

    ఇప్పుడతని ఆలోచనలన్నీ ప్రియాంక మీదే వున్నాయి. తను ప్రయోజకుడని నిరూపించుకొనేలోపే ఆమె ఎత్తును చిత్తుచేసి ఒక్కసారైనా అవమానించాలని వుంది.

    తానాశించిన పధకం ప్రకారం అయితే రానున్న ప్రియాంక మనుష్యుల్ని మట్టిగరిపించి, రెండు రకాలుగా దెబ్బకొట్టేపని. కాని త్రినాధ్ శాసించిన పధకం మరో రకంగా వుంది. తనకు వ్యక్తిగతంగా ఇష్టంలేకపోయినా బాస్ గా త్రినాధ్ పధకాన్నే అమలుపర్చితీరాలి.

    రైలు వెళుతున్న శబ్దం ఆ చీకటిరాత్రి నిశ్శబ్దంలో అపశ్రుతిలా వినిపిస్తోంది దిగులుగా కూర్చున్న గుప్తాకి.

    ఏవైపునించి ఎలా ప్రత్యక్షమయి తన పక్కనున్న మనిషిని అదృశ్యం చేస్తారోనని గుప్తాకి ఆందోళనగా వుంది.

    అర్దరాత్రి కావటానికి మరొక నిమిషమే వుంది.

    అప్పుడు లేచారు ఆజానుబాహుల్లాంటి నలుగురు మనుష్యులు, ఒకర్నొకరు కళ్ళతోనే సైగచేసుకొని నిశ్శబ్దంగా ముందుకు సాగారు. ఆ నలుగురులో ఒకరు వాచీవేపు చూసి తలపంకించాడు. మిగతా ముగ్గురు దాన్ని గ్రీన్ సిగ్నల్ గా భావించి హుషారుగా అడుగులేసారు.

    పై బెర్త్ మీద కూర్చుని, క్రిందకు కాళ్ళు వదిలేసి విలాసంగా ఊపుతున్న బోస్ చెవుల్లో అడుగుల సవ్వడి పడింది.

    అంతే... ప్రమాదాన్ని శంకించి చేతుల్ని ఉక్కుముక్కల్లా చేసి సిద్ధంగా వున్నాడు.

    అంతలో ఆ నలుగురు వచ్చి గుప్తా ముందు నిల్చున్నారు.

    వారికి అందిన సమాచారం ప్రకారం గుప్తా, టెక్నీషియన్ వస్తారు. వారికి కాపలాగా మరో మనిషి నీడలా అనుసరిస్తాడని కూడా తెలుసు.

    తనముందు నిల్చిన ఆ నలుగురు దృఢకాయుల్ని చూసి గుప్తాకి అప్పటికే చెమటలు పట్టేశాయి. గుప్తా ప్రక్కన కూర్చున్న వ్యక్తి వారివేపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

    "మర్యాదగా మాక్కావల్సిన మనిషిని అప్పగించు. ఎలాంటి గొడవలేకుండా వెళ్ళిపోతాం" ఆ నలుగురిలో ఒకడన్నాడు కర్కశంగా.

    అప్పటివరకు భయపడుతున్న గుప్తా ఓ సారి బోస్ ని చూసి ఒకింత ధైర్యం తెచ్చుకున్నాడు.

    "నేనుగాని, నా మనిషిగాని మీకెలాంటి హాని చేయలేదు. పైగా శత్రువులం కూడా కాదు. మర్యాదగా వెళ్ళిపోండి..." గుప్తా మాటలు పూర్తి కాలేదు- జాగిలాల్లా ఒక్కసారి ఆ నలుగురూ విరుచుకుపడ్డారు. కేకలు వేయకుండా వుండేందుకు ముందు జాగ్రత్తగా గుప్తాకి, ప్రక్కనున్నతని నోళ్ళకి టేప్ అంటించేసారు చకచకా.

    జరుగుతున్నదేమిటో అర్ధంకాక ఆ వ్యక్తి గింజుకుంటూ ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు.

    ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న బోస్ చెంగున శివంగిలా పై బెర్త్ మీంచి వారి మీదకు దూకాడు.

    ఆ హఠాత్పరిణామాన్ని ఊహించని నలుగురు ఓ క్షణం ఉలిక్కిపడ్డారు. అంతలోనే తేరుకుని ముగ్గురు బోస్ మీదకు ఉరికితే ఒకడు తన రెండు చేతులతో గుప్తాని, ప్రక్క మనిషిని బంధించివేశాడు.

 Previous Page Next Page