ఇందర్ మరికొన్ని జాగ్రత్తలు చెప్పి డ్రస్ అయి వెళ్ళిపోయాడు. ఆ యింట్లో వంటరిగా మిగిలిన అవంతి ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయింది.
* * *
రాత్రి పదీనలభై.
అంతటా నిశ్శబ్దంగా వుంది.
ఉండి ఉండి బైట ఒక కుక్క మోర ఎత్తి ఏడుస్తున్నది. అంతకు మించి ఏ చప్పుడూ లేదు. ఆ నిశ్శబ్దంలో వంటరిగా బైట తాళం వేసి వున్న ఆ యింట్లో అవంతి ఒక్కతీ పడక్కుర్చీలో పడుకుని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నది. అది ఒక ఆలోచన కాదు. వంద ఆలోచనల సముదాయం.
అవంతికి యిది గోల్డెన్ ఛాన్స్. చక్కగా ప్లాన్ ప్రకారం ఆలోచించి ఇక్కడ నుంచి మకాం ఎత్తేయాలి. ఈ లోపల చేయవల్సిన పనులు కొన్ని వున్నాయి. ఎవరినీ వదలకూడదు. ఏదీ పోనీయకూడదు. ఇందర్ వెళ్ళేటప్పుడు పెట్టె తెర్చి ఏదోచిన్న తోలు ప్యాకెట్ ని జేబులో కుక్కుకుని ఆ పెట్టెతాళం వేసి తాళం సరీగా పడిందా లేదా అని ఒకటికి రెండుసార్లు లాగి చూసి తాళంచెవి జేబులో పెట్టుకుని వెళ్ళాడు, ఆ పెట్టెలో ఏముంది?
అతను తీసుకున్న తోలు ప్యాకెట్ పదునైన మడతకత్తి భద్రపరిచేది. నిజంగా ఆ తోలు ప్యాకెట్ లో కత్తివుందా! అలా అయితే....ఆ కత్తితో పని ఏముంది?
ఆ కత్తిని మామూలు వాళ్ళు వుపయోగించరు. అది యిక్కడ తయారు కూడాకాదు. అత్యంత చాకచక్యంగా మారణాయుధాలు వుపయోగించగలవాళ్ళే ఆ కత్తిని చేపడతారు. ప్రాణరక్షణకన్నా ప్రాణం తియ్యడానికే ఆ కత్తిని వుపయోగిస్తారు. దాన్ని గురించి తనకి తెలుసు ఇందర్ చిన్నకంపెనీలో వుద్యోగి అన్నమాట అబద్ధం. నాటకాల్లో వేషాలు వేస్తాడన్న మాట అంతకన్నా అబద్ధం. నాటకాల్లో వేషాలు వేస్తే మాత్రం ఇన్ని రకాల డ్రస్ లు ఎవరూ కొని పెట్టుకోరు. అవి అర్ధరూపాయికి కాదుకదా అయిదు రూపాయిలకి కూడా రావు. ఎంత ఎక్కువ చెప్పుకున్నా ఎనిమిది వందల కన్నా పైన కానీ రాదు. సూటు ఒక్కటీ వెయ్యి రూపాయల పై మాట. చవకరకం గుడ్డలువున్నాయి. లక్షాదికార్లు ధరించేవి వున్నాయి. ఇందర్ సామాన్యుడుగా తోచడం లేదు. పైగా అతను అబద్దాలకోరు. చాపకింద నీరులాంటివాడు. నెమ్మదిగా ప్రవహించి నిలువునా తడిపేరకం. అవసరం వస్తే ఆ నీటిలో ముంచేసేరకం. చంద్ర యింట్లో తెలివిగా స్థానం సంపాదించి ఇక్కడ వుండి ఎక్కడెక్కడి పనులో చేస్తున్నాడు.
ఇందర్ సామాన్యుడుకాదు స్మగ్లర్ కాదు. అంతకన్నా పెద్ద హ్యాండు. ఒకసారి నవ్వుతూ అన్నాడు "నాకు పాపభీతి భయభక్తులు బొత్తిగా లేవు. నేను అరవై పైనే హత్యలు చేసి వుంటాను" ఆ మాట చాలా సిన్సియర్ గా అన్నాడు. వెంటనే "ఆ హత్యలు ఎవరిని ఎక్కడ అని అడగవేంటి! సరే నేనే చెపుతాలే. ఈ ఇంట్లో కొచ్చిన మొదట్లో ఇరవై నాలుగు ఎలుకలని ముప్పయి ఆరు బొద్దింకలని మందు పెట్టి హత్యచేశాను తెలుసా!" అంటూ పకపక నవ్వాడు. తను చాతగాని నవ్వొకటి నవ్వి వూరుకుంది.
తన వంటిమీద సొమ్ములు చూసినప్పుడు ఇందర్ ముఖంలో ఎన్నెన్ని భావాలు కదిలాడాయి! అతను చాలా మంచిప్లానులో వున్నాడు. బంగారుబాతుని పక్కవాడువుంచుకొని రోజుకో బంగారు బాతుగుడ్డు వాడు యిస్తున్నా తృప్తిగా వుండదు. ఆ బాతు తన సొంతమైతే బాగుండునని కోరుకుంటాడు. ఆశపడతాడు. ఆ ఆశతో ఎంతకైనా తెగిస్తాడు.
తనవంటిమీద సొమ్ములలెక్క ఇందర్ కిదేనికి! తనగురించి అంత ఆరాలు దేనికి! అంత జాగ్రత్తదేనికి! ప్రేమదేనికి! బాతుగుడ్డు కన్నా బాతునే పడితే? అదేకారణం. నెమ్మదిగా తనని మంచి చేసుకుని మంచివాడుగా నమ్మించి తనని ప్రేమతో ఆకర్షించి దగ్గరి ఆపై తాళికట్టి తనదాన్ని చేసుకుంటే దెబ్బ ఒకటి పిట్టలు రెండు. సొమ్ములు దక్కుతాయి పిల్ల దక్కుతుంది. ఏకంగా కోటలో పాగా వెయ్యవచ్చు.
తను చెప్పిన కథ ఎంత పిచ్చిగా నమ్మాడు! నమ్మకేం చేస్తాడు. చాలా చక్కటి కథ ఒక్కో పాత్రని ప్రవేశపెడుతూ అమాయకురాలైన ధనవంతుల బిడ్డలా గొప్ప సస్పెన్స్ కథ సృష్టిస్తే పాపం బిడ్డడు నమ్మేశాడు. ఆ ధనవంతుడి ఇల్లు ఎక్కడ వుందో అని ఆరా తియ్యబోయాడు. పాపం పిచ్చినాయనా. తన పాత్ర మాయం అవుతుందని వూహించలేదు.
ఇందర్ రకరకాల డ్రస్ లు బీరువాలో చూసినప్పుడే అతనిపై తనకి అనుమానం వచ్చింది. రహస్యాల పెద్ద పెట్టె ఒకటి నాటకాల్లో వేషం వేసేరోజు డ్రస్ తీసుకెళ్ళవచ్చుకదా! ఉహు అవసరానుకూలంగా డ్రస్ ధరిస్తున్నాడు.
ఇప్పుడు సమయం తనకి అనుకూలం అయింది. ఇందర్ లేడు కాబట్టి ఈ సమయంలో తను వెళ్ళిపోవాలి. చంద్ర వస్తే మరో చిక్కు. వెళ్ళే లోపల ఈ పెద్దపెట్టె తాళం బద్దలు కొట్టి దానిలో రహస్యాలు బైటికి లాగి తన సామానులతోపాటు ఆ రహస్యాలను కూడా ఎత్తుకు వెళ్ళాలి. ఆ తర్వాత ఇందర్ సంగతి చూడాలి. పులులతో, సింహాలతో చెడుగుడు ఆడగల తనని అమాయకురాలిగా, పిరికిదానిలాగా భావించాడు. పాపం సమయం వస్తే తను ఎంత పెద్దదెబ్బ తీస్తుందో అతను ఎరుగడుకదా! అవంతి అలా ఆలోచిస్తూ నవ్వుకుంది.