"అదికాస్తా చావుదెబ్బ తింటుంది. అంటే మొదటి ఆట నుంచే కలెక్షన్స్ నిల్"
"కానీ ఎంత చెత్త సినిమా అయినా చూసేవాళ్ళు కొంతమంది వుంటారు కదా?"
"ఉన్నా సరే! మనం కొనబోయే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనూ వేటాడి తరిమి తరిమి కొడుతుందన్న నమ్మకం నాకుంది."
సుధీర్ కుమార్ ఆలోచనలోపడ్డాడు. భవానీశంకర్ మాటలు నమ్మాలనిపించటం లేదతనికి. కానీ గుడిశెల్లో పుట్టిపెరిగినవాళ్ళే జీనియస్ లవుతారని "హట్స్ అండ్ జీనియస్ పీపుల్" అనే పుస్తకంలో తను చదివాడు. కనుక భవానీ జీనియస్ అయ్యుండవచ్చని అనిపిస్తోంది.
"మనం కొనే సినిమా రిలీజ్ చేస్తే ఒక్క పైసా కూడా తిరిగి రాదని గ్యారంటీ ఇస్తాను. పైగా తమాషా ఏమిటంటే ఆ దెబ్బకు బ్లాక్ మనీ అంతా ఆ లాస్ కి వైట్ అయిపోతుంది! ఇన్ కమ్ టాక్స్ వాళ్ళు మటాష్ అయిపోతారు."
సుధీర్ కుమార్ ఓ క్షణం ఆలోచించాడు "ఈ ఐడియా బాగానే వున్నట్లుంది. గానీ మనకు మరీ ప్లాప్ సినిమాలు ఎక్కడ దొరుకుతాయి?"
"ఎక్కడేమిటి సార్? మన తెలుగు సినిమాల్లో మూడొంతులు ప్లాప్ సినిమాలేగా? అయినా అదంతా మాకొదిలేయండి! కోటీ డెబ్బయ్ లక్షలకు ఒక సినిమా బేరమాడాం. అది తప్పకుండా రిలీజైన రెండు రోజుల్లో మట్టికొట్టుకుపోతుంది. దాంతో కోటీ డెబ్బయ్ లక్షలూ గోవిందా! ఆ డబ్బుతోపాటు పబ్లిసిటీకి మనం మరో కోటి రూపాయలు ఖర్చు పెడతాం! ఆ సినిమా చూసిన వారందరికీ కుంకుమ బరిణెలు, జాకెట్ బట్టలు ఉచితం అంటాం."
సుధీర్ కుమార్ కి ఆ ఆలోచన నచ్చింది.
"వెరీగుడ్! అద్భుతమైన ఐడియా! కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరిచ్చిన ఆరునెలల గడువులో ఇంకా అయిదు నెలలే మిగిలివుంది. ఈలోగా ఆస్తి మొత్తం ఆర్పేయకపోయారంటే మా అమ్మాయి మృదులను ఈ సగం గుడిశెలో వుండే భవానీశంకర్ కిచ్చి పెళ్ళి చేస్తాను."
ఆ మాటకు విజయ్ తో పాటు భవానీశంకర్ కూడా ఉలిక్కిపడ్డాడు.
"ఏమిటీ, నాకిచ్చి చేస్తారా?" ఆశ్చర్యంగా అడిగాడు భవానీశంకర్.
"అవును! అసలు నాకు మొదటినుంచీ వుందా కోరిక. మా అమ్మాయిని ఎప్పటికయినా గుడిశెలో ఉంటూ గొర్రెలను, మేకలను కాసుకుని బ్రతికే బీద కుర్రాడికిచ్చి చేయాలని, ఎటొచ్చి ఈ ఆస్థిని వదిలించుకోవటం కోసం విజయ్ కిచ్చి చేస్తానని ఒప్పుకున్నాను. కనుక మిగిలిన అయిదు నెలల్లో నా ఆస్థినంతా హారతి కర్పూరంలా ఆర్పేయకపోతే మా మృదులను ఈ భవానీశంకర్ కిచ్చి పెళ్ళి చేసేది ఖాయం. ఆ!"
భవానీశంకర్ ఏడుపుకి సిద్ధంగా వున్న విజయ్ భుజం తట్టాడు.
"అయితే పదండి. త్వరగా మనం వెళ్ళి ముందా సినిమా కొనేద్దాం"
"ఆల్ రైట్ పదండి!"
ముగ్గురూ మార్కండేయులు ఆఫీస్ కి బయల్దేరారు.
సుధీర్ కుమార్ కోటీ డెబ్బయ్ లక్షల క్యాష్ టేబుల్ మీదుంచి వెళ్ళిపోయి పావుగంటయినా మార్కండేయులు ఇంకా కోలుకోలేదు. అంత డబ్బుని చూడాలంటే భయం వేసి స్కాచ్ 'రా' కొట్టేశాడు. ఎంతో కాలం తర్వాత అంత డబ్బు ఒకేసారి చూస్తుంటే మత్తు వచ్చేస్తోంది.
కళ్ళు మూసుకుని ఆ నోట్ల కట్టల మీద పడి నిద్రపోవాలనిపిస్తోంది.
ఆ డబ్బుని కౌగిలించుకుని మనసారా ఏడవాలని కూడా అనిపిస్తోంది.
వ్యాపారంలో లాభాలు వచ్చే రోజుల్లో చూశాడు అంత డబ్బు. ఆ తరువాత ఒక వ్యాపారం నుంచి మరో వ్యాపారం నష్టాలమయం అయిపోవడంతో వంద నోటు చూడటానికి కూడా నోచుకోని పరిస్థితి ఏర్పడింది.
హఠాత్తుగా అతనికి విజయ మీదా, భవానీశంకర్ మీదా అమితమైన ప్రేమ కలిగింది.
అమాంతం లేచి ఇద్దరినీ కౌగిలించుకున్నాడు. ఆనందానికి తోడు మందు కిక్ ఎక్కువయ్యేసరికి భోరున ఏడ్చేయసాగాడు.
"ఒరే విజయ్! నీలాంటి మేనమామ మేనల్లుడిగా వున్నందుకు నేను చాలా పొగరు పడుతున్నాను" అన్నాడు తడబడుతూ.
ఠక్కున అతనికి అనుమానం వచ్చేసింది. తను మాట్లాడిన మాటల్లో ఎక్కడో ఏదో అపశృతి పలికినట్లనిపించింది.
అందుకని కొంచెం జాగ్రత్తగా అదే సెంటెన్స్ మళ్ళీ మాట్లాడాడు "నీలాంటి మేనత్తను మేనల్లుడిగా సంపాదించి పొంది కలిగినందుకు నేను చాలా తిక్కపడుతున్నాను. ఊహు తిక్క కాదు తిక్క తప్పు పడిపోయింది. నో తిక్క అదేంటంటే ఆ గుర్తుకొచ్చింది. అయామ్ ప్రౌడాఫ్ యు విజయ్, అయామ్ ప్రౌడాఫ్ భవానీశంకర్ ఆల్సో! అయామ్ ప్రౌడాఫ్ మై డాటర్ ప్రతిమా ఆల్సో అయామ్ ప్రౌడాఫ్ మాట కుక్! ఆల్సో మై డాగ్, అయామ్ ప్రౌడాఫ్ మై సెల్ఫ్" అంటూ నోట్ల కట్టలమీదే పడి అమాంతం గురకపెట్టేయసాగాడతను.
* * * *
"ఆహ్హహ్హహ్హ" అద్దం ముందు తన ప్రతిరూపాన్ని చూసుకుంటూ నవ్వాడు సుధీర్ కుమార్. తరువాత తన జుట్టు పీకేసుకుంటూ నవ్వాడు మళ్ళీ. అప్పుడు ఎదురుగ్గా వున్న డబ్బు కట్టలు చూసుకుని వికటాట్టహాసం చేస్తూంటే మృదుల పరుగుతో అతని గదిలోకొచ్చింది.
"ఏంటి డాడీ! ఏమయింది? ఎందుకలా వికటాట్టహాసం చేస్తున్నారు?"
సుధీర్ కుమార్ మృదుల వైపు కోపంగా చూశాడు.
"ఎందుకా? పిచ్చెక్కి నవ్వుకుంటున్నాను."
"పిచ్చెక్కితే నవ్వాలని రూలెక్కడుంది డాడీ?"
"ఎక్కడపడితే అక్కడే వుంది! ఏరి వాళ్ళిద్దరూ? ఇద్దరినీ కనిపిస్తే కాల్చిపారేయాలనుంది నాకు"
"ఎవరు డాడీ వాళ్ళు?"
"వాడే! నువ్వు రికమెండ్ చేసిన ఆ విజయ్ గాడూ, సగం గుడిశె భవానీశంకర్ గాడు."
"ఎందుకు డాడీ వాళ్ళని కాల్చటం"
"ఎందుకా? ఆ సినిమా ప్లాప్ అవుతుందని నాతో కొనిపించారు కదా!! ఇప్పుడు చూడు అన్ని సెంటర్స్ లో సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. జనం విరగబడి సినిమా చూస్తున్నారట. అయిదు రూపాయల టిక్కెట్ బ్లాక్ లో డెబ్బయ్ రూపాయలు అమ్ముతున్నారట. ఈ లెక్కలో కోటీ డెబ్బయ్ లక్షల పెట్టుబడికి ఆరు కోట్ల తొంభై లక్షలు లాభం వస్తుందని ఎకౌంటెంట్ చెప్తున్నాడు."
ప్రతిమ గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లయింది కాసేపు "ఆరు కోట్ల తొంభై లక్షలే?"
"హ! అంతే కాదు. అది కూడా వైట్ మనీ! ఫ్యూర్ వైట్! మిల్క్ వైట్! వాళ్ళిద్దర్నీ షూట్ చేయటం తప్ప గత్యంతరం లేదు నాకు."
"తొందరపడకు డాడీ! విజయ్ చాలా జీనియస్. తప్పకుండా ఆరు నెలల్లో విజయం సాధిస్తాడు."