Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 38


    హూ! తనేం పిచ్చివెధవ కాదు. వాళ్ళ వలలో పడిపోవడానికి! ఫ్యాక్టరీలో వచ్చిన లాభాలన్నీ బ్యాంకులో వాళ్ళ ముఖాన్నే కొట్టి ఇన్ కమ్ టాక్స్ వాళ్లకు రహస్యంగా ఫోన్ కొట్టి చెప్పేస్తాడు. దాంతో ఇద్దరినీ అరెస్ట్ చేసిపారేస్తారు.
    కాసేపు కాలుగాలిన పిల్లిలానూ, ఇంకాసేపు కాలుగాలని పిల్లిలాగానూ తిరిగి చివరకు కోపం ఆపుకోలేక అప్పటికప్పుడు కారేసుకుని బయల్దేరారు.


                              *    *    *    *


    ప్రతిమ భయంగా భవానీశంకర్ వైపు చూసింది.
    "ఇప్పుడేం చేద్దాం?" అంది ఆందోలనగా "మా డాడీ మీరు చెప్పిన మాటలన్నీ నిజం అని నమ్మి ప్రొద్దున్నే రడీ అయి ఆఫీసుకెళ్ళిపోయి ఆ సినిమా కొనే బయ్యర్స్ కోసం ఎదురుచూస్తున్నారు."
    భవానీశంకర్ చిరునవ్వు నవ్వాడు "చూసి చూసి మళ్ళీ ఇంటికెళ్ళిపోతారు డియర్! అదేం పట్టించుకోకు."
    "నిన్న మా యింటి ముందు మీరు నిలబెట్టినవాళ్ళు నిజంగా బయ్యర్స్ కాదనీ, వాళ్లకు మీరే డబ్బిచ్చి అలా నటించమని చెప్పారని కూడా డాడీకి తెలిసింది."
    భవానీశంకర్ ఉలిక్కిపడి కె.యస్.ప్రకాష్ వైపు చూశాడు.
    ప్రకాష్ మరింత గాబరాపడిపోయాడు. "ఎలా తెలిసింది?" ఆశ్చర్యంగా అడిగాడతను.
    "వాళ్ళల్లో ఒకడు తాగి మళ్ళీ ఇవాళ పొద్దున్నే వచ్చి తను బయ్యర్ గా ఆ రోజు కూడా నటించానని, అందుకని ఇంకా వంద రూపాయలిమ్మనీ డాడీతో పేచీ పెట్టుకున్నాడు. దాంతో డాడీకంతా తెలిసిపోయింది."
    ప్రకాష్ మొహంలో కళ తప్పింది.
    "ఒకవేళా సినిమా మీరు చెప్పినట్లు బ్రహ్మాండమైన లాభంతో అమ్మేయకపోయినట్లయితే ప్రకాష్ ఆస్థంతా లాక్కుని మీ ఇద్దరినీ ఇంటి నుంచి బయటకు గెంటివేస్తానంటున్నాడు."
    భవానీశంకర్ ఓ క్షణం ఆలోచించాడు. దాంతో అతని మొహం ఆరు మెగావాట్ల కాంతితో నిండిపోయింది. "నో ప్రాబ్లమ్ డియర్! ఆ సినిమా అమ్ముడయిపోయినట్లే" అన్నాడు చిరునవ్వుతో.
    "అమ్ముడయిపోయినట్లేనా?"
    "అవును"
    "ఎలా?"
    "వేర్ దేరీజ్ విల్ దేరీజ్ వే."
    "ఆ సంగతి మాకూ తెలుసు. కానీ ఇప్పుడా భయంకరమైన సినిమా ఎవరు కొంటారు? మీరు నక్సలైట్లు పేరు ఎంత ఎక్స్ ప్లాయింట్ చేసినా ఎవరూ బయ్యర్స్ రావటంలేదు కదా?" అడిగింది ప్రతిమ.
    "అదంతా మాకొదిలేసెయ్ డియర్. మైడియర్ ప్రకాష్! నువ్వు వెళ్ళి ఆ సినిమా కోటీ డెబ్బయ్ లక్షలకు అమ్మేసినట్లు మా ఫాదరిన్లాకు చెప్పేసెయ్. నేను వెళ్ళి కాసేపట్లో ఆ బయ్యర్స్ నీ, క్యాష్ నీ తీసుకొస్తాను."
    "నిజంగానే వాళ్ళున్నారా?" అడిగాడు ప్రకాష్.
    "ఇది భారతదేశం బ్రదర్! అండర్ ఎస్టిమేట్ చేయకు మన ప్రజల్ని! బేవకూ ఫోంకో కమీనహీగాలిబ్! ఏక్ డూండో హజార్ మిల్ తే హై."
    "అంటే?"
    "అంటే తెలివితక్కు సన్యాసులకు కొదవలేదు. ఒకడి కోసం వెతికితే వెయ్యి మంది దొరుకుతారు అని అర్థం. అంచేత నువ్విక జాబులు జవాబులు కార్యక్రమం మానేసి రంగంలోకి దూకు మిత్రమా! నేను బేవకూఫ్ ల వేట కెళ్తాను" అనేసి భవానీశంకర్ బయటకు నడిచాడు.
    ప్రతిమ అతను వెళ్ళిపోతూంటే అతనివంకే దిగులుగా చూసింది.
    "భవానీకి కొంచెం పిచ్చి వుందని డాడీ అంటూంటే కోపంలో అంటున్నారని అనుకున్నాను. కానీ కొంచెం డౌట్ వస్తుందిప్పుడు" అంది భయంగా.


                             *    *    *    *


    "హాయ్! గుడ్ మార్నింగ్" అన్నాడు భవానీశంకర్.
    "గుడ్ మార్నింగ్ సర్" అన్నాడు విజయ్.
    సుధీర్ కుమార్ పళ్ళు కొరుకుతూ వాళ్ళిద్దరివైపూ చూశాడు.
    "రండి మీ కోసమే చూస్తున్నా" అన్నాడతను.
    "తెలుస్సార్ రోజురోజుకి పెరిగిపోతున్న ఫ్యాక్టరీ సమ్మె తాలూకూ నష్టాలు చూసి ఆనందం పట్టలేక మమ్మల్నిద్దరినీ తనివితీరా కౌగిలించుకోవాలని తహతహలాడుతున్నారు మీరు! కదూ?" అడిగాడు భవానీశంకర్.
    "కాదు. మిమ్మల్ని మెడబట్టి స్వయంగా గెంటాలని తహతహలాడుతున్నాను."
    భవానీశంకర్ తోపాటు విజయ్ కూడా గాబరాపడ్డాడు "వాట్! బయటకు గెంటుతారా?"
    "అఫ్ కోర్స్! ముందు మూతిపళ్ళు రాలగొట్టాకే గెంటుతాను. లేకపోతే ఏమిటీ మీరు చేసిన నిర్వాకం? ఆ ఫ్యాక్టరీ వర్కర్సు అమెరికా పద్ధతిలో చేస్తున్న సమ్మె వల్ల మన లాభాలు మూడింతలు పెరిగాయి. బ్లాక్ మనీ త్రిబులయిపోతోంది. ఇప్పుడేం చేయాలి మీ ఇద్దరినీ?"
    భవానీశంకర్ నిశ్చేష్టుడయ్యాడు.
    విజయ్ భయంగా బుర్ర గోక్కున్నాడు.
    "ఏంటలా నోర్మూసుక్కూచున్నారు? ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ సమ్మె వల్ల పెరిగిపోయిన బ్లాక్ మనీ అంతా మీ మొఖాన కొట్టి మీ దగ్గర బ్లాక్ మనీ వుందని ఇన్ కమ్ టాక్స్ వాళ్లకు ఫోన్ చేసి చెప్తాను" కసిగా అన్నాడు సుధీర్ కుమార్.
    భవానీశంకర్ చిరునవ్వుతో నవ్వాడు "ఆవేశపడకండి సార్! ఫ్యాక్టరీవాళ్ళు ఎంత బ్లాక్ మనీ రప్పించినా పర్లేదు మనదగ్గరున్న బ్లాక్ మనీలో సగం ఆర్పేయటానికి ఇంకో బ్రహ్మాండమైన ప్లాన్ దొరికింది."
    సుధీర్ కుమార్ అతనివైపు అనుమానంగా చూశాడు. "ఏమిటది?"
    "మనం బ్రహ్మాండమైన ఫ్లాప్ సినిమా ఒకటి కొంటే దెబ్బకు సగం బ్లాక్ మనీ వైట్ అయిపోతుంది."
    సుధీర్ కుమార్ ఆశ్చర్యపోయాడు "ఫ్లాప్ సినిమా కొంటామా?"
    "అవును సార్! అద్భుతమైన గ్యారంటీ ఫ్లాప్ సినిమా. అది బోలెడు డబ్బుపెట్టి కొని రిలీజ్ చేస్తాం."
    "చేస్తే?"

 Previous Page Next Page