Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 40


    "ఇప్పుడే మన ఆఫీస్ లోకెళ్ళారు డాడీ"
    "అయితే పద అక్కడే తేల్చుకుందాం" ఇద్దరూ ఆఫీసులోకి నడిచారు.
    విజయ్, భవానీశంకర్ ఏ.సి. రూమ్ లో కూర్చుని ఎకౌంటెంట్ తో మాట్లాడుతున్నారు.
    "నిన్న బ్రాకెట్ ఫిగర్ ఏం వచ్చిందో కనుక్కున్నావా?" అడిగాడు భవానీశంకర్.
    "డబుల్ జీరో వచ్చింది సార్!"
    "అయితే ఇవాళ అదే ఫిగర్ మీద రెండు కోట్ల రూపాయలు ఆడెయ్! ఒక్కరోజు వచ్చిన ఫిగర్ వెంటనే ఛస్తే రాదు."
    "అలాగే సార్." అతను వెళ్ళిపోయాడు.
    "విజయ్" అరిచాడు సుధీర్ కుమార్ కోపంగా.
    "ఏమిటి సార్?" అదిరిపడి లేచి నిలబడ్డారిద్దరూ.
    "ఏమిటా? వంకాయ్! మీరు ఆస్తి ఆర్పడానికొచ్చారా, ఇంకా పెంచ్ నన్ను చిత్రవధ చేయడానికొచ్చారా?"
    "అదేమిటి సార్ అలా మాట్లాడతారు? మొన్నేగా ప్లాప్ సినిమా కొనిపించి కోటీ డెబ్బయ్ లక్షలు నష్టం తెప్పించాం" అడిగాడు భవానీశంకర్.
    "సిగ్గులేకపోతే సరి. ఆ సినిమా సూపర్ హిట్ అయి మొదటివారంలోనే నాకు రెండు కోట్లు వచ్చేసింది. ఇంకా నాలుగు కోట్లు తేలిగ్గా వస్తుందని అంటున్నారు."
    విజయ్, భవానీశంకర్ కి కొద్దిక్షణాల వరకూ నోట మాట రాలేదు.
    ముందు భవానీశంకరే కోలుకున్నాడు.
    "అహ్హహ్హ" అని నవ్వాడు ఆలోచించుకునే వ్యవధి కోసం.
    "డోంట్ లాఫ్!" అరిచాడు సుధీర్ కుమార్.
    "ఇంకోసారి మీ ముఖాల మీద నవ్వు కనిపించిందంటే షూట్ చేస్తాను."
    "మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు సార్. పెరుగుట విరుగుట కొరకే! అనే పద్యం మీరు చదవలేదూ?"
    "చదవలేదు"
    "వెరీ బాడ్! రేపే శతకాలన్నీ కొని తెచ్చేస్తాను. చదవండి."
    "షటప్! నాక్కావలసింది శతకాలు కాదు. యాక్షన్! ఆ ఆస్తినంతా వెంటనే ఆర్పేసే యాక్షన్."
    "మీకేం పర్లేదు సార్! ఆరు నెలల్లోగా అడుక్కుతినే స్థితికి తెచ్చే పూచీ మాది."
    "ఓ పక్క ఆ వెధవ ఫ్యాక్టరీ స్ట్రయిక్ వల్లా, ఈ పాడు సినిమా వల్లా ఆస్తి ఏడు కోట్లకి పెరిగిపోయింది. ఇక అడుక్కుతినే స్థితికెలా వస్తాను."
    "డోంట్ వర్రీ బ్రదర్! ఇంతకుముందే రెండు కోట్లు రేసుల్లో ఆడేశాం. అదికూడా పరమ ముసురు గుర్రం మీద. దాని తండ్రీ, తల్లీ అన్నీ ఒక్క రేసు కూడా గెలవని గుర్రాలే. చూస్తూండండి ఇంకాసేపట్లో రేస్ ఫలితాలొచ్చేస్తాయి . ఒక్క నిముషంలో మొత్తం రెండు కోట్లూ గోవిందా."
    సుధీర్ కుమార్ ముఖంలో ఆనందం, ఆశ కనిపించినాయి "నిజంగా పది కోట్లూ పోతాయా?"
    "మీరే చూస్తారుగా ఇంకాసేపట్లో."
    అప్పుడే ఫోన్ మోగింది. సుధీర్ కుమార్ అందుకున్నాడు. "సార్! నేను జూనియర్ ఎకౌంటెంట్ ని మాట్లాడుతున్నాను. రేస్ లో మనం ఆడిన గుర్రమే గెలిచింది. దానికంటే ముందు పరుగెడుతున్న గుర్రాలకు హఠాత్తుగా కాలు బెణికిందట. అందుకని ఈ గుర్రం తేలికగా గెలిచింది. అందువల్ల ఆరుకోట్ల రూపాయల డబ్బు వచ్చింది సార్."
    సుధీర్ కుమార్ మొహం జేవురించింది.
    మండిపడుతూ విజయ్, భవానీశంకర్ వైపు చూశాడు.
    "ఫోన్ ఎక్కడినుంచో తెలుసా?" అడిగాడు విజయ్, భవానీశంకర్ ల వైపు తీక్షణంగా చూస్తూ.
    "తెలీదు సార్!"
    "రేస్ కోర్స్ నుంచి."
    "హా!" ఆనందంగా అరిచాడు విజయ్. "మొత్తం రెండు కోట్లు పోయిందని చెప్పాడా?"
    "నా శ్రాద్ధం పోయింది. ఆరుకోట్లు వచ్చిందంట. ఆ నికృష్టపు గుర్రం గెలిచింది."
    "ఇంపాజిబుల్" అరిచాడు భవానీశంకర్.
    "షటప్! చేసిన పని చాలక ఆ అరుపులేమిటి? ఇప్పుడేం చేయాలి నేను మిమ్మల్ని?"
    "ఆహ్హహ్హ!" నవ్వబోయాడు భవానీశంకర్.
    సుధీర్ కుమార్ కోపం పట్టలేక జేబులో నుంచి రివాల్వర్ తీశాడు "నవ్వకు. నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాను" అన్నాడు గురిపెట్టి.
    భవానీశంకర్ నవ్వటం ఆపేశాడు.
    "మీకే ఆప్షన్ ఇస్తున్నాను. ఏం చేయాలి మిమ్మల్ని?" అరిచాడతను.
    "ఏం చేయలేరు. మాకు మీరిచ్చిన గడువింకా పూర్తికాలేదు" అన్నాడు విజయ్.
    "అవును గడువు పూర్తయ్యేలోగా దివాళా తీయించలేకపోతే అప్పుడు మమ్మల్ని అడగండి."
    "ఆల్ రైట్! అప్పుడే అడుగుతాను. అడగటం కాదు కాల్చిపారేస్తాను" అనేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
    "ఆల్ ఈజ్ వెల్" అన్నాడు భవానీశంకర్.
    "సింప్లీ సూపర్బ్" అన్నాడు కె.యస్.ప్రకాష్.


                                           *    *    *    *


    "ఇవాళే మనం మా డాడీతో మన పెళ్ళి గురించి మాట్లాడదాం" అంది ప్రతిమ.
    "అలాగే! నేను సుష్మను పెళ్ళి చేసుకునే విషయం మాట్లాడతాను" అన్నాడు ప్రకాష్.
    "సినిమా వల్ల పాతిక లక్షలు లాభం చూపించాం గనుక ఇక కాదనడానికి ఏమాత్రం ఆస్కారం లేదు" అన్నాడు భవానీశంకర్.
    అందరూ కలసి ఆనందంగా మార్కండేయులు రూమ్ లో జొరపడ్డారు.
    మార్కండేయులుకి చెరో వైపు జనరంజనీ పబ్లికేషన్స్ ఇన్ ఛార్జ్ మోహన్రావ్, జనరల్ మేనేజర్ జగన్నాథం నిలబడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చదువుతున్నారు.
    "నేను తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల, తెలివైన టెక్నిక్స్ వల్లా మన జనరంజనీ పబ్లికేషన్స్ కి ఎనిమిది లక్షల రూపాయల లాభం వచ్చింది సార్" అన్నాడు మోహన్రావ్.

 Previous Page Next Page