"మీరూ మా మిసెస్ మంచి స్నేహితులట కదా! మరి ఎప్పుడు మా ఇంటికి రారేం?" అడిగాడు చంద్రకాంత్.
"నేనీమధ్య మన రాష్ట్రంలోనే లేను!"
"ఓహో! అదా౧ ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నారు కదా! రోజూ కాసేపు వచ్చి వెళ్తూండండి. ఆమెకు పాపం కంపెనీ లేకే ఈ ఉద్యోగం చేస్తోంది. మీరుంటే ఉద్యోగానికి రేపే సెలవిచ్చేస్తుంది."
"సరేనండీ! తప్పక వస్తాను." ఆనందంగా అన్నాడు కిషోర్! అతనికి లోలోపల ఇంకా భయం తొలగలేదు.
"రండి! ఇప్పుడు నాతో వచ్చి మా ఇల్లు చూద్దురుగాని ఓసారి" అన్నాడు చంద్రకాంత్.
"ఇప్పుడా...మరోసారి..."
"మరేం ఫర్వాలేదు. రండి! ఆటోలో వెళ్దాం!"
చంద్రకాంత్ ప్రవర్తన అతనికి ప్రాణంమీద కొచ్చినట్లు ఉంది.
ఇద్దరూ హోటల్నుంచి బయటికొచ్చారు.
హోటల్ బయట ఉన్న ఆటోలో కూర్చున్నారిద్దరూ. అయిదు నిమిషాల్లో చంద్రకాంత్ ఇల్లు చేరుకున్నారు.
అప్పుడే జయ కూడా రిక్షా దిగి ఇంట్లోకి నడుస్తోంది.
"చూశావా! మీ ఫ్రెండ్ ని తీసుకొచ్చేశాను." చిరునవ్వుతో జయతో అన్నాడు చంద్రకాంత్.
జయ మొఖం పాలిపోయింది.
అతనూ, కిషోర్ ఎక్కడ కలుసుకున్నారో, అతనిని ఇంటికెందుకు తీసుకువచ్చాడో అర్థంకావడం లేదామెకి.
"రండి!" అంది ముక్తసరిగా.
"ఎవరతను?" హాల్లో కూర్చున్న వ్యక్తి ఎవరో తెలీక అడిగింది విజయ జయని.
"అతనేనక్కా! కిషోర్!"
విజయ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి.
"అంటే..."
"అవునక్కా! నన్ను మోసం చేసినతను"
"మళ్ళీ ఎందుకొచ్చాడు?"
"ఆ మధ్య ఆఫీస్ కొచ్చాడు! తన తప్పు యిప్పుడు తెలుసుకున్నాడట! ఇప్పుడు నన్ను తనతో వచ్చేయమంటాడు. నేను లేందే బ్రతకలేడట! అలాంటి పిచ్చిమాటలు మాట్లాడ వద్దని చెప్పాను."
"ఆరోజు అతనుండగానే ఈయన కనిపించారు. దాంతో ఇద్దరినీ పరిచయం చేయక తప్పలేదు."
కొద్దిక్షణాలు విజయ మౌనంగా వుండిపోయింది.
"జాగ్రత్త జయా! అతన్ని దూరంగా వుంచు! అసలు కలుసుకోకుండా చూడు! లేనిపోని అనర్థాలు తెచ్చుకోకు" హెచ్చరించిందామె.
లోపలకు రాబోతూ వారి మాటలు విన్న చంద్రకాంత్ కి మతిపోయినట్లయింది. తన అనుమానాలు చాలావరకూ నిజమయ్యాయి. కానీ ఇప్పుడో కొత్త విషయం తలెత్తింది. విజయను "జయా" అని పిలుస్తోంది జయ. "జయ"ను "అక్కా" అంటోంది విజయ.
తనకేమాత్రం అర్థంకావటం లేదీవిషయం.
తల్లి చనిపోయాక జయ ఇక్కడికొచ్చిన కొత్తలో కూడా వారు ఒకరినొకరు ఇలా పిల్చుకోవడం గమనించాడు గానీ ఎంచేతో అంతగా పట్టించుకోలేకపోయాడు.
తను ఈ మిస్టరీని వెంటనే ఛేదించాలి.
అసలు రహస్యమేమిటో తెలుసుకోవాలి.
ఒకవేళ విజయ కిషోర్ ని ప్రేమించి వుంటే తననెందుకు వివాహం చేసుకున్నట్లు?
"ఏమిటి? మన అతిథికి కాఫీ ఇచ్చే ఆలోచనేమైనా ఉందా?" విజయ బయటకు రాబోవడం గమనించి తనే లోపలకు నడిచాడు చంద్రకాంత్.
"ఇదిగో ఇప్పుడే తెస్తున్నాను" అంది విజయ.
అతను బయటికొచ్చేసరికి కిషోర్ లేచి నిలబడ్డాడు.
"నేను వెళ్తానండీ!" అన్నాడు.
"అదేమిటి? మరోసారి కాఫీ తాగుదురుగాని! కూర్చోండి"
"ఊహు! ప్లీజ్! బలవంతం చేయకండి. నాకు మా ఫ్రెండ్ ని కలుసుకోవాల్సిన పని వుంది"
చంద్రకాంత్ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు.
"వెళతానండీ!" అంటూ బయటకు నడవబోయాడు.
"ఆగండి! మీ ఫ్రెండ్ కి చెప్పకుండానే వెళ్ళిపోయారేం. విజయా! మీ ఫ్రెండు వెళ్ళిపోతానంటున్నారు" లోపలకు చూస్తూ పిలిచాడతను.
ఆమె బైటకు వచ్చింది.
"నేను వెళ్తాను! మరోసారి వస్తాను" జయతో చెప్పి పెద్ద గండం గడిచినట్లు బైటకు నడిచాడతను.
ఆమె కళ్ళల్లో యింకా బెదురు తొలగిపోలేదు.