"అబ్బే మీరెందుకు మళ్ళీ రావడం. నే పంపిస్తాలెండి కాగితాలు...." అన్నాడాయన.
ఆమె కృతజ్ఞతా పూర్వకంగా నవ్వింది, "సారీ, మీకు ట్రబుల్ ఇస్తున్నాను." అంది.
"దట్సాల్ రైట్, గుడ్ ఆఫ్టర్ నూన్" అంటూ నవ్వుతూ నమస్కారం చేశాడాయన. కారు కదలి వెళ్ళిపోయింది.
ఆమె ఎవరో అక్కడున్న వారికి ఎవరికీ తెలియదు. ఆమెకూడా వారిలాగే ఉద్యోగానికి వచ్చిందన్న ఊహ అంతమందిలో ఏ ఒక్కరికి రాలేదు.... తరువాత ఇంటర్వ్యూ చకచక సాగిపోయింది. తనని అడిగిన రెండు ప్రశ్నలకి బాగానే సమాధానం చెప్పానని ప్రభాకరం అనుకున్నాడు.
* * * *
ఆదివారం ఆరోజు, సాయంత్రం ఐదు గంటలయింది.
రామకృష్ణగారు తమ బంగళాముందు లానులో శ్రీమతితో సహా టీ త్రాగడానికి కూర్చున్నారు. కాస్త దూరంలో ఖరీదయిన రబ్బరు బొమ్మల్లా ముద్దొస్తున్న వారి పిల్లలిద్దరూ ముద్దుముద్దుగా ఇంగ్లీషులో మాట్లాడుకుంటూ చెంగుచెంగున గెంతుతూ బంతాట ఆడుతున్నారు! వాళ్ళని ఆడించడానికి పెట్టిన ఆయా మట్టి గిట్టి వాళ్ళకి తగలకుండా కాపాడుతోంది. రంగు రంగుల అందమైన పూల మధ్య నల్లటి గండుతుమ్మెదలాంటి తోటమాలి రబ్బరు గొట్టంతో జాగ్రత్తగా మొక్కలకి నీళ్ళు పోస్తున్నాడు. పోర్టికోలో చేతులు కట్టుకుని నిలబడ్డాడు డ్రైవర్. నల్లటి వంటవాడు తెల్లటి బట్టలు ధరించి టీ సరంజామా తెచ్చి వారి మధ్య టేబిల్ మీద పెట్టాడు. రామకృష్ణ గారి శ్రీమతి సుతారంగా టీపాయ్ లోంచి "టీ" కప్పులలోకి వంపి భర్తగారికి ఒక కప్పు ఇచ్చి తనొకటి తీసుకుంది.
ఆ బంగళా లాంగ్ షాట్ లో చూచినా, క్లోజప్ లో చూచినా ఖరీదయిన హిందీ సినిమా సెట్టింగులా వుంటుంది! ఆ బంగళాను ఆ బంగళా యజమానుల్ని, వారి పిల్లల్ని చూసిన ఎవరైన "అదృష్టవంతులు" అని అనుకోకుండా వుండలేరు. అసూయపడకుండా వుండేవారూ తక్కువే!
టీ త్రాగి పేపరు తెరిచారు రామకృష్ణారావుగారు. టీ త్రాగుతూనే హఠాత్తుగా గుర్తు వచ్చినట్టు "నిన్న యూనివర్సిటీకి వెళ్ళానండి" అంది ఆయన మిసెస్.
పేపరులోంచి తలెత్తి చూశారాయన ప్రశ్నార్థకంగా.
"నిన్న ఇంటర్వ్యూ వుంది .... అఫ్ కోర్స్ జస్ట్ ఫార్మాలిటీకి అనుకోండీ ...."
అప్పటికి ఆ సంభాషణ తుదీ మొదలూ అంతుబట్టక అర్ధంకానట్టు చూశారాయన.
"మరచిపోయారా అప్పుడే, యూనివర్శిటీ కాలేజీలో లెక్చరర్ పోస్టు వుందని అప్లై చేశానని చెప్పానుగదూ! నిన్న వెళ్ళి వచ్చాను. మన రామిరెడ్డిగారున్నారుగా! 'ఇంటర్వ్యూ ఎందుకండీ, అపాయింట్ మెంట్ పంపేస్తాగా' అన్నాడు."
రామకృష్ణగారు భార్య మొహంలోకి చూస్తూండిపోయారు కొన్ని క్షణాలు, "ఉద్యోగం చేయడానికే నిశ్చయించావన్నమాట" ఆఖరికి అడిగారు.
"అదేమిటీ, మళ్ళీ క్రొత్తగా అడుగుతున్నారు. ఆరోజు చెప్పాగా- ఇంట్లో ఏం తోచడం లేదని, అలా ఓ గంటో రెండుగంటలో వెళ్ళి వస్తే కాలక్షేపానికి కాలక్షేపం, నెలతిరిగేసరిగి ఐదువందలు చేతిలో పడతాయి...." నవ్వుతూ అంది ఆమె.
కానీ ఆయన నవ్వలేదు.
"చూడు శశీ, నెలకి నాజీతం ఎంత?"
"రెండువేల పైన .... ఎందుకు అడుగుతున్నారు?"
"నీకు డబ్బవసరం నిజంగా వుందంటావా?"
"పూర్తిగా డబ్బుకోసం కాదనుకోండి, కాలక్షేపం కోసం అన్నాగా...."
"కాలక్షేపం కోసం ఉద్యోగం చెయ్యాలా! ఇంట్లో వంటపని నౌకర్ల మీద వదిలే బదులు స్వయంగా చేసుకుంటే డబ్బు ఆదాయే కాక తోచకపోవడం అన్న ప్రశ్న వుండదు. అలాగే పిల్లల ట్యూటర్ కి ఇచ్చే వంద ఆదా చేస్తూ వాళ్ళని కూర్చోపెట్టి చదివించవచ్చు, ఇంటినిండా చదువుకోడానికి పుస్తకాలున్నాయి. రేడియోగ్రాం వినవచ్చు. హాబీ క్రింద గార్డెనింగ్ చేయవచ్చు. సాయంత్రానికి సినిమాలు, షికార్లు వుండనే వున్నాయి. చేయదలిస్తే ఎన్ని పనులుంటాయి! ఇంకా తోచకపోవడమన్న ప్రశ్నేది? నీకోసం ఉద్యోగానికి బయలుదేరాల్సిన అవసరం నాకేం కనపడలేదు..."
"అబ్బ, వండుకో, అంట్లు తోముకో, బట్టలుతుక్కో అంటూ చెప్తారేమిటి? యీ పనులన్నీ ఎవరు చేస్తారు! బోర్...." ఆవిడ కాస్త విసుగ్గా అంది.
"యింటిపని బోర్, వూర్లో ఉద్యోగాలు బోర్ కాదన్నమాట...." మిసెస్ మొహం ఎర్రపడడం మొదలుపెట్టింది.
"చూడు శశీ! నీకు కోపం రావచ్చు కానీ, నీకు హాబీ క్రింద, కాలక్షేపం క్రింద కనిపించే యీ ఉద్యోగం ఎందరికో బ్రతుకుతెరువు అని గుర్తించావా? పాపం, ఎందరెందరు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో నీకు తెలియదా? అలాంటప్పుడు ఉద్యోగం అవసరం లేని నీలాంటివాళ్ళు ఉద్యోగాలకి ఎగబడుతూంటే యీ నిరుద్యోగ సమస్య ఎలా తీరుతుందో కాస్త ఆలోచించిచూడు..."
ఆమె మొహం మరికాస్త ఎర్రబరుచుకుంది. కోపంగా చూసింది. 'ఎందుకీ ఉపన్యాసాలు! మీ పెళ్లాం ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదని సూటిగా చెప్పకుండా ఈ నీతులెందుకు వల్లించడం? హు, అందుకే మనదేశం ఇలా ఏడుస్తోంది. ఆడదాన్ని ఇంట్లోంచి బయటికి రానీయకూడదనే మన మగవాళ్ల ప్రవృత్తి మారనంతవరకు మనదేశం గతి ఇంతే!" ఆవేశంగా మాటలు విసిరింది ఆమె. ఆయన ఆవిడ కోపానికి బెదరలేదు. మరింత నిశ్చలంగా చూశారు.
"అవును, నువ్వు ఈ ఉద్యోగం చెయ్యడం నాకిష్టంలేదు. కాని కారణాలు నీవనుకుంటున్నవికావు! నీ ఆరోపణలు నిజంకాదని నీకు తెల్సు. నీవు చెప్పిన స్టేజీలు మనం దాటి చాలా రోజులయింది. ఆడవాళ్లు చదువుకోవడం అన్న విషయం పాతబడి పోయింది. అలాగే ఆడవాళ్లు ఉద్యోగాలు చేయడమూ మామూలు విషయం అయిపోయింది. కనక నీ ఆరోపణ నిజంకాదు. భార్యని పైకి వదలడం ఇష్టంలేకకాదు; ఇంట్లో అణిచిపెట్టి వుంచాలన్న ఉద్దేశమూ నాకు లేదు. ఆ సంగతి నీకు తెల్సు! నీ కనవసరంలేని యీ ఉద్యోగం యింకే అత్యవసరమున్న వ్యక్తీకేనా లభిస్తే ఎంత సంతోషిస్తాడో అన్న కోణంలో చూసి అంటున్నాను.... ...."
"అవును లెండి. అందరూ మీలాగే ఉంటే యీనాడు ఇంతమంది ఆడవాళ్లు ఉద్యోగాలెలా చేస్తున్నారు? ఐదువందలు చేదని మీలాంటి వాళ్లు అనుకోవాలిగాని, బుద్ధివున్న వాళ్లెవరూ అనుకోరు" వ్యంగ్యంగా ఎత్తిపొడిచింది.
"డబ్బు నాకు చేదుకాదు. ఆ ఐదువందలలో నీ వింకో అరడజను చీరెలు కొనుక్కోవచ్చు, మరో డజను సినిమాలకి వెళ్ళచ్చు, బ్యాంకిలో దాచుకోవచ్చు. మరో మేడ కట్టించుకోవచ్చు....కాని నే చెప్పదలచింది ఏమిటంటే నీ ఐదొందల సంపాదన లేకపోయినా మనకు ఏ లోటు రాదు. హాయిగా, సుఖంగా బ్రతకడానికి కావల్సిన సంపాదన నాకుంది. కానీ, ఆ ఐదొందలే జీవనోపాధిగా కలవాళ్లు వేలమంది వుంటారు ... ఆ ఉద్యోగం దొరికితే ఆ ఆధారంతో పెళ్లాం పిల్లల్ని పోషించుకోవాలని ఆరాటపడేవాళ్లు అనేకులుండగా ఏ అవసరంలేని నీకు ఆ ఉద్యోగం కావాలనుకోడం అన్యాయం అని నా ఉద్దేశం! విదేశాలలో మాదిరి స్త్రీ పురుషులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా, అందరికీ పుష్కలంగా ఉద్యోగాలు లభించే అంత సుభిక్షంగా మన దేశం లేదు. మనదేశంలో యీ నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా వుందో నీకు తెలియని సంగతికాదు.... నిజంగా ఆర్ధికంగా అవసరమున్న కుటుంబాల్లో స్త్రీలు ఉద్యోగం చేసి సహాయపడ్డంలో అర్ధం వుంది.... కానీ నీలా హాబీ క్రింద, కాలక్షేపంకోసం ఉద్యోగంలో చేరడం నిజంగా అవసరమున్నవారి నోట దుమ్ముకొట్టడం అనే నా ఉద్దేశం"- తీవ్రంగా అన్నారాయన.