"ఫరవాలేదమ్మమ్మా.....అని నవ్వుతూ దిగి, కిటికీదగ్గిరికి వచ్చి నిలబడింది.
"ఏమండీ, రాధకి ఓ ఇరవై రూపాయలివ్వండి, చీర కొనుక్కుంటుంది" పార్వతమ్మ భర్తకి పురమాయించింది.
"అదేమిటిప్పుడెందుకు?.....వద్దు......వద్దు....." అని మొహమాటపడింది అనూరాధ.
"నీ ఇరవైరూపాయల చీర లెందుకే దాని కిప్పుడు! అది ఉద్యోగస్థురాలని మరచిపోయావేమిటి?" పర్సులోంచి నోట్లు తీసి రాధ చేతిలో పెడుతూ అన్నాడు జగన్నాథంగారు.
"అది ఎంత సంపాయిస్తే మనకేం?.....ఏదో స్టేషనికి వచ్చింది కదా అని..."
రైలు కదిలింది.
"వస్తా, తాతగారూ!......ఉంటానమ్మా...." చేయి వూపుతూ అంది రాధ.
"ఆరోగ్యం చూసుకో వంటమనిషిని పెట్టుకుంటే సరి-" పార్వతమ్మ మాటలు గాలిలో కలిసిపోతూంటే రాధ నవ్వుతూ చెయ్యి ఆడిస్తూ వెనక్కి వుండిపోయింది. రైలు సాగిపోయింది.
"పిచ్చిపిల్ల! హాయిగా పెళ్ళి చేసుకుని సుఖంగా ఉండకుండా ఎందుకో ఉద్యోగం ఉద్యోగం అని ఇలా ఎగబడింది" అని పార్వతమ్మ గొణుక్కుంది.
* * *
వాల్తేరులో సుందర్రావు స్టేషనుకి వచ్చాడు, మామగారిని ఆహ్వానించడానికి.
సుందర్రావు వాల్తేరు అప్ లాండ్స్ లో యూనివర్శిటీకి దగ్గరలో చిన్న బంగళా కట్టుకున్నాడు. ఇల్లు చిన్నదైనా పొందికగా ఆధునికంగా సదుపాయంగా అన్నీ అమర్చుకుంది పూర్ణ. ఇంట్లో చిన్నపిల్ల లెవరూ లేరేమో, ఇల్లు ఎప్పుడూ నీట్ గా ఉంటుంది. ఇంటికి కావలసినవన్నీ ఒక్కొక్కటి సమకూర్చుకుని దేనికి లోటులేకుండా చేసుకుంది పూర్ణ.
పూర్ణ చుట్టుప్రక్కల ఆడవాళ్ళని పోగుచేసి, ఓ లేడీస్ క్లబ్ స్థాపించింది. వారానికో రోజు ఏదో కాలక్షేపంతో అందరూ సరదాగా గడుపుతారు. పూర్ణ అన్నింటిలో చలాకీగా ఉంటూ, ఎప్పుడూ ఏదో పనిపెట్టుకుని ఉషారుగా ఉంటుంది. సుందర్రావు భార్యకి అన్ని విషయాలలో సహకారం అందిస్తూ, ఆమె సాంఘిక కార్యకలాపాలను ప్రోత్సాహిస్తూంటాడు.
సుజాత పి.యు.సి. ప్యాసయి. పి.పి.సి. చదువుతూంది. ఒక్కగా నొక్కకూతురేమో, సుజాతకి ఇంట్లో అంతా యింతా ముద్దుగాదు అందులో సుందర్రావుకి సుజాత అంటే మరీ పంచప్రాణాలు! కూతురు కొండమీదికోతి కావాలన్నా మరుక్షణం హాజరు పెడతాడు. సుజాతకి ఓ డిగ్రీ జ్వరంవస్తే అతని హడావిడి, గాభరా చూసి తీరాలి. పద్దెనిమిదేళ్ళు వచ్చినా సుజాతని దగ్గిరకూర్చోపెట్టుకుని ఇది తిను అది తిను అంటూ చిన్నపిల్లకి తినిపించినట్టు తినిపిస్తాడు. పాలు, పళ్ళరసాలు, బ్రెడ్ టోస్టులు, జామ్ లు-రకరకాల పుష్టికర ఆహారాలు ఆరగించచేస్తూంటాడు.
ఇంక చీరలు, అవీ సరేసరి! రకరకాల చీరలు, చెప్పులు, బాగ్ లు, గాజులు-సుజాత పిచ్చికి తగినట్టుగా, కాదనకుండా కొంటాడు సుందర్రావు. కూతురు ఓరోజు చీరగట్టి, ఇంకోరోజు సల్వార్ కమీజులు తొడిగినా, మరోరోజు స్కర్టు, బ్లౌజు వేసినా ఏమీ అనడు. అన్నపూర్ణ వారించబోయినా, "ఈ కాలపుపిల్ల లందరూ ఇంతే, దాని సరదా పాడుచెయ్యకు" అంటాడు. అన్నపూర్ణ పొరపాటుగానైనా సుజాతకి ఏపనీ చెప్పకూడదు!
ఆ ఇంట్లో సుజాత వైభోగం చూస్తూంటే, పుడితే కలవారి యింట ఒక్కగానొక్క పిల్లగా పుట్టాలి అనిపిస్తుంది.
సుందర్రావు సుజాత భవిష్యత్తు గురించి రంగురంగుల కలలు కంటూ ఉంటాడు. కూతురిని డాక్టరీకి చదివించాలి. స్కాలర్ షిప్ దొరక్కపోయినా, సొంతడబ్బు ఖర్చుపెట్టయినా ఫారిన్ పంపాలి. తరవాత ఓ ఫారిన్ వెళ్ళివచ్చిన డాక్టర్ని చూసి పెళ్ళిచేయాలని ఆశలు పెట్టుకున్నాడు సుందర్రావు. ఒక్కత్తే కూతురు కనక, ఉన్నదంతా ఆ కూతురికే కనక-డబ్బుకోసం చూడకుండా కూతురికి ఉజ్వల భవిష్యత్తు కల్పించాలని ఆ దంపతుల కోరిక.
అన్నపూర్ణ సంసారం జగన్నాథంగారికి ఎంతో ముచ్చట కలిగిస్తుంది. చదువుకున్న కూతురు, అనుకూలుడైన అల్లుడు. వారి అన్యోన్యం చూసి పూర్ణ అదృష్టానికి పొంగిపోతారు ఆయన. పూర్ణ ఇంట్లో ఆయనకి ప్రశాంతత లభ్యమయినట్లు ఉంటుంది. వస్తే తిరిగి వెళ్ళాలనిపించదు. ఇదివరకు రెండు మూడు సార్లు వచ్చి ఉన్నా ఆ తోవను వెడుతూ దిగకపోతే కూతురు బాధపడుతుందని, రెండు రోజులు ఆగి వెడదామని వాల్తేరులో ఆగారు జగన్నాథంగారు.
తల్లికీ, తండ్రికీ వీధి గుమ్మంలోనే ఎదురువచ్చింది నవ్వుతూ పూర్ణ.
"కాసిని మంచి నీళ్ళు తెచ్చిపెట్టవే అమ్మా! అబ్బ.....శీతాకాలం కూడా ఇంత ఎండగా ఉందేమిటి?" పార్వతమ్మ ఆపసోపాలుపడుతూ లోపలికి వచ్చి గోడకి చేరగిలబడి కూర్చుంది.
"ఈ వూళ్ళో శీతాకాలం ఏమిటమ్మా?.....మాకు ఒకటే కాలం ఇక్కడ-ఎండాకాలం!...." నవ్వుతూ మంచినీళ్ళు అందించింది పూర్ణ.
"కాఫీ పట్టుకురా, అమ్మా కాఫీ టైముకి చేరుకుంటామని రైల్లో తాగలేదు. బండి ఓగంట లేటయింది. తలనొప్పి వస్తూంది."
"ఇదిగో తెస్తున్నా...." అని కదిలింది పూర్ణ.
"సుజాత కనపడదేం?" కూతురితో వంట ఇంట్లోకి వెడుతూ అడిగింది పార్వతమ్మ.
"మాటినీ సినిమాకి వెళ్ళింది."
"అదేమిటే, ఆడపిల్ల ఒక్కర్తీ సినిమాలకి వెళ్ళడం ఏమిటే!"
"ఒక్కర్తీ కాదులే....ఎవరో స్నేహితురాళ్ళతో వెళ్ళింది." పూర్ణ కాఫీ కలుపుతూ అంది.
మర్నాడు ఆదివారం. కారులో సింహాచలం వెళ్ళడానికి అందరూ నిశ్చయించారు. "నేను రాను. నేను చదువుకోవాలి.....మీరు వెళ్ళండి!" అంది సుజాత.
"అదేమిటి, ఒక్కర్తివీ ఎలా వుంటావు? ఆదివారం.....ఒక్క పూట చదవకపోతే ఫరవాలేదులే...రా..." అంది అన్నపూర్ణ.