"ఊహుఁ....నేను రాను. ఆదేఁవుడు గుళ్ళకి వెళ్ళడం నాకునచ్చదు." చిరాకుగా అంది సుజాత.
"తప్పమ్మా...అలా అనకూడదు..." అన్నాడు సుందర్రావు నెమ్మదిగా.
"ఏం చోద్యాలొచ్చాయి ఈ పిల్లకి!..." పార్వతమ్మ విస్తుపోయింది.
సుజాత మూతి బిగించింది.
"అయితే, నేనుండిపోతాను ఇంట్లో. మీరు వాళ్ళని తీసుకువెళ్ళండి." అంది పూర్ణ.
"నువ్వెందుకు ఉండడం?.....నేనేం చిన్నపిల్లనా ఏమిటి? సాయంకావాలా? నువ్వూవెళ్ళు..." అంది సుజాత విసుగ్గా.
"కాదులే ... నేను చాలాసార్లు వెళ్ళాను ... ఎన్నిసార్లు చూస్తాను?"
"అయితే, పదండి. నేను వస్తాను.....నాకోసం నువ్వెందుకు మానడం?....అయినా, ఏమిటింత చాదస్తం! నన్నెవరో ఎత్తుకు పోతారని బెంగ" అని సణుగుతూ కోపంగా బయలుదేరింది సుజాత. కారులో ముఖం ముడుచుకు కూర్చుంది. దేవాలయం లోపలికి రమ్మంటే రాకుండా బయట చెట్లమధ్య కూర్చుంది. పూర్ణ కూతురి మంకుతనానికి విసుక్కుంది. సుజాత మొండితనం అతిముద్దువల్ల వచ్చిందని జగన్నాథంగారు గ్రహించారు.
పార్వతమ్మ కయితే సుజాత సంగతి అంతా ఆశ్చర్యంగానే ఉంది. సుజాత ఎందుకనో ఈ మధ్య చాలమారిందనుకుంది ఆవిడ. మనిషి ఈలోకంలో ఉండకుండా ఎప్పుడూ ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూంటుంది. రెండు మూడుసార్లు పిలిస్తేనే కాని జవాబియ్యదు. ఎవరైనా మాట్లాడిస్తే చిరాకుపడి కసురుతుంది. చదువంటూ పుస్తకాలు ముందు వేసుకు కూర్చుంటుంది. కాలేజీనుంచి వచ్చినదగ్గిరనుంచీ పుస్తకాలు పట్టుకు డాబాఎక్కి కూర్చుంటుంది. చీకటిపడేవరకు దిగి రాదు. ఇంక సుజాత వేసే డ్రస్సులు అవీ చూస్తుంటే పిల్లని మరీ ముద్దుచేసి పాడుచేస్తున్నారన్న భావం ఆవిడకీ కలిగింది. ఉండబట్టలేక కూతురి దగ్గిర తెచ్చింది ఈ విషయం.
"ఏమిటి పూర్ణా, సుజాత మరీ ఇలా తయారయింది? ఆ పరధ్యానం ఏమిటి, ఆ కోపం ఏమిటి, ఆ చిరాకేమిటి మాటాడితే? ఆడపిల్ల ధోరణి ఇలా ఉంటే రేపుపొద్దున్న పెళ్ళి అయాక చిక్కుసుమా. ఆ డ్రస్సులేమిటి పంజాబీ పిల్లలాగ! శుభ్రంగా చీరకట్టుకోకుండా!"
"ఏమిటో నమ్మా......చెపితే వినదు. దానికి ఆయన వత్తాసు! నా మాట వినరు ఇద్దరూ.....ఇలాంటి బట్టలు అందరి పిల్లలూ కట్టుకుంటున్నారులే గాని.....దానికి ఎలాగినా మంకుతనం, పట్టుదల కోపం ఎక్కువయిపోయాయి. దానిమాటే చెల్లాలంటుంది....ఆయన మరీ ముద్దుచేస్తారు.....ఒక్కతే పిల్ల అయితే ఇదే గొడవ!"
"బాగుంది.....పిల్ల లంటే అందరికి ముద్దే.....అయితే. ఇంత చేటా! చెప్పవలసివచ్చినపుడు చెప్పవద్దూ?.... సరే....దానికి ఏమన్నా సంబంధాలు చూస్తున్నారా?"
"అప్పుడే? ఇప్పుడెక్కడ దాని పెళ్ళిమాట? దానిని డాక్టరీకి చదివిస్తారట. అదంతా అయేసరికి అయిదేళ్ళ పైమాట. పెళ్ళి గురించి ఇప్పటినుంచీ ఎందుకు ఆలోచించడం?"
"ఆడపిల్లలకి అంతలేసి పెద్దచదువు లెందుకే! పోనీ ఏ బియ్యేనో చదివించి ఇరవయ్యేళ్ళకల్లా పెళ్ళిచెయ్యకుండా?" అంది పార్వతమ్మ.
"ఏమో! ఆయన ఇష్టం.....దాని ఇష్టం...." తల్లితో వాదించడం ఇష్టం లేక సంభాషణ తుంచివేసింది పూర్ణ.
* * *
మర్నాడు ప్రయాణ మయారు జగన్నాథం దంపతులు.
"అదేమిటి నాన్నా, రెండురోజులయినా ఉండకుండా అప్పుడే ప్రయాణం?" అంది పూర్ణ.
"ఇదివరకు ఎన్నిసార్లు రాలేదు? ఎన్నాళ్ళుండి వెళ్ళలేదు! ఈసారి దేశాటనం పెట్టుకున్నాంగా బయలుదేరకపోతే ఎలా? ప్రోగ్రామ్ అంతా అప్ సెట్ అవుతుంది!"
తల్లికి చీర, తండ్రికి పంచలచాపు ఇచ్చింది పూర్ణ. "వచ్చి నప్పుడల్లా ఈచాదస్తం ఏమిటి? ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లూనా?" అని కేకలేశారు జగన్నాథంగారు.
"మాకు మీ రివ్వడం లేదూ, వచ్చినప్పుడల్లా?" సుందర్రావు నవ్వుతూ అన్నాడు.
"బాగుందోయ్! నువ్వు ఇంటి అల్లుడివి. అది ఇంటి ఆడబడుచు. నేను మీ కివ్వడం, మీరు నాకివ్వడం ఒకటేనా?"
"తీసుకోండి.....పెద్దవారు.ఇంటికి వచ్చిన వాళ్ళని ఉత్తచేతుల్తో ఎలా పంపిస్తాం!" అని బలవంతంగా చేతిలో పెట్టాడు.
పూర్ణ తీపి, కారం ఫలహారంచేసి డబ్బాలో పెట్టి ఇచ్చింది.
"ఎందుకే ఇవన్నీ?.....చిన్న పిల్లలమా, చిరుతిళ్ళు తినడానికి!"
"ఉంచవమ్మా. అటు పక్క అంతా మన భోజనాలు, అవీ సరిగా దొరకవు.....కాస్త చేతిపట్టున ఉంటే నయంగా!"
తరవాత రైలెక్కిస్తూ-"మధ్య మధ్య ఎక్కడున్నదీ ఉత్తరం రాస్తూండండి!" అంది పూర్ణ.
14
"వాల్తేరునుంచి పూరీ ఎక్స్ ప్రెస్ లో పూరీ వెళ్ళి, అక్క డా పూట ఆగి జగన్నాధుని దర్శనం చేసుకుని, రాత్రికే కలకత్తా ప్రయాణం అయ్యారు వృద్ధ దంపతులు. కలకత్తా తను చూసిందే అయినా పార్వతమ్మ కోసం ఓ టాక్సీ మాట్లాడి ఊరంతా తిప్పి చూపించారు జగన్నాథంగారు. కలకత్తా కాళికాలయం, జూ, విక్టోరియా మెమోరియయల్ అన్నీ చూపించారు. అక్కడ రెండు రోజులున్నారు.
కలకత్తానుంచి తిన్నగా బనారస్ వెళ్ళి సత్రంలో గది తీసుకుని రెండు రోజు లున్నారు. గంగలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నారు. అలహాబాదు దగ్గిర త్రివేణీ సంగమంలో పితృదేవతలకి తర్పణాలు విడిచారు. అక్కడినుంచి ఢిల్లీ చేరుకున్నారు.
మనవరాలు ఉషకి తమ రాక తెలుపుతూ ముందే ఉత్తరం రాశారు. స్టేషనుకి ఉష వచ్చింది. ఇదివరకటి కంటే కాస్త ఒళ్ళు రంగు వచ్చి ఎంతో నిండుగా ఉంది మనిషి. ఉండేది ఢిల్లీ పట్టణం గనక ఫాషన్లకి ఏం లోటు! వాలు జడ కాకుండా, ఆధునికంగా జుట్టు ముడి వేసుకుంది. ఆ చీరకట్టు, ఆ జాకెట్టు అంతా చాలా ఫేషన్ గా ఉంది. ఉషని చూస్తూ రైలు లోంచే సంతోషంగా చెయ్యి ఊపారు జగన్నాథంగారు. దిగగానే ఆప్యాయంగా ఉషని దగ్గిరికి తీసుకున్నారు.


