Previous Page Next Page 
కొత్తనీరు పేజి 38


    "గొడవా!.....అడక్కండి ఆ భాగోతం!....." శకుంతల జరిగిన సంగతంతా చెప్పుకొచ్చింది.
    "బాగానే వుంది! అనూరాధ ఇంత మొండి దనుకోలేదు సుమా! ఎంత అమాయికంగా ఉండేది చిన్నప్పుడు!....."
    "అయింది ఏదో అయిందిగాని......అది వెళ్ళాక నా ప్రాణం కాస్త తెరిపిన పడింది. ఇంట్లో గొడవ తగ్గింది. దానికి యేదో ఉద్యోగం దొరికింది, నెల్లాళ్ళకే, రాజమండ్రి విమెన్సు కాలేజిలో! ఇంక దాని అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది, పెళ్ళి కావాలంటే అదే చేసుకుంటుంది. లేకపోతే దాని బతుకు అది బతుకుతుంది." నిట్టూర్చింది శకుంతల.
    "ఉద్యోగంలో చేరాక రాధ ఏమంటోంది?"
    "బాగానే ఉంది అంటోంది.....అయినా యింకా కొత్త మోజు గదా! కాలేజి హాస్టల్లోనే ఉంటూంది....నెల కో నూట ఏభై నా పేర పంపుతూంది......"
    "కానీ యిలా కొన్నాళ్ళు జరగనీ......తరువాత ఎలావస్తుందో చూద్దాం!.....ఈ రోజుల్లో ఆడపిల్లలు పాతికేళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కాకుండా ఉండడం వింత కాదుగా!"
    "ఇంక దాని విషయం ఆలోచించడం మానేశాను నాన్నా! దాని కెలా తోస్తే అలా చేస్తుంది." శకుంతల అంది.
    శకుంతల దగ్గిర రెండు రోజులుండి, తిన్నగా మద్రాసు ప్రయాణం అయ్యారు జగన్నాథం దంపతులు.
    
                                  *    *    *
    
    మద్రాసులో రామం ఇంట్లో పదిరోజులున్నారు జగన్నాథం గారు, పార్వతమ్మ, చుట్టుపట్ల చూడవలసివన్నీ కారులో తిప్పి చూపించాడు రామం.
    కంచి వెళ్ళి కామాక్షిని, మధుర వెళ్ళి మీనాక్షిని దర్శించారు. పక్షితీర్ధం, మహాబలిపురం చూశారు. తిరుపతివెళ్ళి కాటేజ్ తీసుకుని రెండు రోజులుండి స్వామి సేవలన్నీ తృప్తిగా చూశారు. స్వామికి కల్యాణోత్సవం చేయించారు. రామేశ్వర యాత్ర కూడా చేసుకున్నారు.
    తరవాత మైసూరు, బెంగుళూరు ప్రయాణం పెట్టుకున్నారు. తనకి సెలవ లేదని మీనాక్షిని తోడిచ్చి పంపాడు కారులో రామం. బెంగుళూరులో మీనాక్షి అన్న శ్రీనివాసన్ యింట్లో బసచేశారు. శ్రీనివాసన్ ఊరంతా చూపించాడు. అక్కడినుంచి మైసూరు వెళ్ళారు. అంతా కలిసి మైసూరులో చాముండేశ్వరిని దర్శించారు. లలితా మహల్ చూశారు. కన్నులపండువచేసే బృందావన్ గార్డెన్సు చూసి మద్రాసు తిరిగి వచ్చారు. ఎన్నిచోట్లు తిరిగినా అలు పన్నదే కనపడలేదు జగన్నాథంగారికి, పార్వతమ్మకి. ఎంతో ఉత్సాహంగా చిన్నపిల్లల్లా తిరిగారు ఇద్దరూ.
    మద్రాసు నుంచి విజయవాడకి రైల్లో రిజర్వు చేయించుకున్నారు. అత్తగారికి పసుపురాసి, బొట్టు పెట్టి పట్టుచీర పెట్టింది మీనాక్షి. రాత్రికి ఫలహారం తయారుచేసి ఇచ్చింది. విజయవాడలో కృష్ణలో స్నానం చేసి, కనకదుర్గని దర్శించుకుని, ఆ రాత్రికే మళ్ళీ రైలెక్కారు వృద్ధదంపతులు.
    తాతగారిచ్చిన టెలిగ్రాం చూసుకుని, అనూరాధ రాజమండ్రి స్టేషన్ కి వచ్చి కలుసుకుంది.
    "అదేమిటి రాధా....అలా చిక్కిపోయావు? బంతిలా ఉండే దానివి, ఇలా తయారయ్యావేమిటి?" పార్వతమ్మ మనవరాలిని కుశల ప్రశ్న చేసింది. అనూరాధ నవ్వి ఊరుకుంది.
    "మరెలా ఉంటుందీ! ఇంట్లో కమ్మగా అమ్మ వండి పెడితే తిని కూర్చున్నట్లు ఉంటుందా?.....ఉద్యోగం అంటే తమాషా అనుకున్నావా?"
    అనూరాధ ఫ్లాస్కులో కాఫీ, బుట్టతో అరటిపళ్ళు, బత్తాయిలు, సపోటాలు తెచ్చి పార్వతమ్మకి అందించింది. "కాఫీ తీసుకోండి తాతగారూ, మీ రింకేమీ తినరని పళ్ళు మాత్రం తెచ్చాను......ముందా కాఫీ తాగెయ్యండి!"
    "నా తల్లే!.....ఈ మర్యాదలన్నీ ఎక్కడ నేర్చుకున్నావే అమ్మా!.....చూశారా, పాపం మన కోసం ఆప్యాయంగా పళ్ళు తెచ్చింది," మనవరాలి అభిమానానికి మురిసిపోయింది పార్వతమ్మ.
    "అమ్మ ఎలా ఉంది అమ్మమ్మా!.....కాస్త కోలుకుందా?"
    "ఇప్పుడు కాస్త నయంలే.....రెండు రోజులు సెలవ పెట్టి వెళ్ళలేకపోయావా. అమ్మ కంత జబ్బు చేసింది."
    "ఉద్యోగంలో చేరి అప్పటికి రెండు నెల లయినా కాలేదు. సెలవు ఎవరిస్తారు?.....అయినా, అమ్మా వాళ్ళూ నాకు వారం రోజుల వరకు అసలు సంగతే రాయలేదు.....నాకెలా తెలుస్తుంది? తరవాత వెళ్ళి చేసేదేముందని వెళ్ళలేదు, ఎలాగా ఇంకో ఇరవై రోజుల్లో దసరా సెలవు లిస్తారు. అప్పుడు వెడతాను."
    "అయితే ఈ లైఫ్ ఎలా ఉంది రాధా?.....నీకునచ్చినట్టేనా?" కాఫీ తాగడం ముగించి అన్నారు జగన్నాథంగారు.
    అనూరాధ వెంటనే జవాబియ్యలేదు.
    "అంత నచ్చకపోవడానికి ఏముంది? రొటీన్ లైఫ్."
    "అంత చిక్కావు.....నీకు ఇక్కడ భోజనం సరిపడలేదేమిటి?"
    "అదే కాస్త ఇబ్బందిగా ఉంది. హాస్టలు కారాలు, సాంబార్లు నాకు పడడం లేదు."
    "పోనీ, వేరే ఇల్లు తీసుకుని ఎవరినైనా వంటమనిషిని పెట్టుకో కూడదూ?"
    "మళ్ళీ వంటా గింటా అంతా ఓ సంసారం తయారవుతుంది. ఆ గొడవ ఎవరు పడతారు?"
    "బాగుందే! ఆరోగ్యం కంటే ముఖ్యం ఏముంది? తిండి సౌఖ్యం లేకపోతే ఇంక ఈ సంపాదన ఎందుకు?" అంటూ పార్వతమ్మ సాగదీసింది.
    "అయితే, నాన్న ఇంకా నామీద కోపంగానే ఉన్నారా? నన్ను బాగా తిడుతున్నారా?" నవ్వుతూ అడిగింది అనూరాధ.
    "ఇంకేం అంటాడు? మాట వినని కూతురని తెలిసిపోయిందిగా!"
    అనూరాధ తల వంచుకుంది. గార్డు విజిల్ ఊదాడు.
    "దిగు, దిగు-రైలు కదులుతుంది!.....తొందరగా దిగు" పార్వతమ్మ కంగారు పెట్టేసింది.

 Previous Page Next Page