Previous Page Next Page 
నయనతార పేజి 38


    చలికి ఇంకా ముడుచుకు పడుతున్న సీతమ్మని చూసి అతను జాలిపడ్డాడు. తనకిచ్చిన దుప్పటి ఆమెకి కప్పితే  బాగుండుననుకున్నాడు. తన చలి ఎలాగూ ఈ దుప్పటి తీర్చలేదు. కాని ఆవిడ ఎమనుకుంటుందో!......
    అతను లేచి విసుగ్గాకాసేపు కూర్చున్నాడు. మరో సారి పడుకున్నాడు. ఒకసారి తలుపు కాస్త తెరచి చూశాడు. ఇంకా తగ్గని వర్షాన్ని మరోసారి తిట్టుకున్నాడు. నిరుత్సాహంగా మంచ మీద వ్రాలాచు. కాల్చడానికి సిగరెట్టన్నా లేదు.
    దీపంలో కిరసనాయిలు అయిపోయిందో గాలి కో గానీ టపటప కొట్టుకుని ఆరిపోయింది. అతని గుండెలోంచి చలి పుట్టుకొస్తుంది. వేడి .....వేడి ....నీలూ ఇచ్చే వేడి కోసం అతని మనసు శరీరం ఏకమై కలవరిస్తున్నాయి.
    ---- మంచి నిద్రలో వున్న సీతమ్మకి మంచి కల వచ్చింది. భర్త వచ్చాడు. వస్తూనే క్రింద పడుకున్న సీతని గట్టిగా కౌగలించుకున్నాడు. రెండేళ్ళ తరువాత వచ్చిన భర్త కౌగిలిలో సీత కరిగిపోయింది. అతన్ని అల్లుకు పోయింది. అతని గుండెల మీద తల ఆన్చి పరవశించింది. ఇన్నాళ్ళూ నన్నొదిలి ఎందుకు వెళ్ళిపోయారు అంటూ అనురాగంతో గుండెలకి హత్తుకుంది. అతని చెంపలు నిమిరింది. జుత్తు సవరించింది. "మంచం మీద పడుకొందాం రా సీతా, ఇలా క్రింద పడుకొన్నావేమిటి' అంటూ ఆమెని లేవనెత్తి పొదుపుకుని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. రెండేళ్ళుగా పురుష స్పర్శని ఎరుగని ఆమె దేహం అతని చేతిలో , కౌగిలిలో కరిగిపోయింది. పరవశించిపోయింది. ఆర్తితో అతన్ని అల్లుకుపోయింది. "మరెప్పుడూ విడిచి వెళ్ళకండెం" అంది. "ఇలా ఇంత సన్నగా అయిపోయారేమిటి" "నీ మీద బెంగ సీతా! నీవు లేకుండా ఎలా వుంటాను" అన్నాడు భర్త . రెండేళ్ళ తరువాత ఆ రాత్రి తిరిగి ఆమెకి మొదటి రాత్రి అయింది. అమర సుఖాలని చవి చూసి అలసిపోయిన ఆమె శరీరం విడుస్తే మళ్ళీ కంట బడకుండా పారిపోతాడనట్టు అతన్ని హత్తుకుని అతని చేతుల్లో రెండేళ్ళ తరువాత తృప్తిగా ఆనందంగా, హాయిగా ఆదమరచి నిద్ర పోయింది సీత.
    'అమ్మా, అమ్మా లే అమ్మా .....' కొడుకు కుదిపి కుదిపి పిలుస్తుంటే కళ్ళు విప్పిన సీతమ్మ తుళ్ళిపడి లేచింది.
    బయట బారెడు ప్రొద్దెక్కింది. వర్ధం తగ్గినా గాలి  వేస్తుంది ఇంకా. రాత్రి వర్షం బీభత్సం సద్దుమణిగింది. ఆకాశం నిర్మలంగా వుంది.
    చుట్టూ కాసేపు అయోమయంగా చూసింది సీతమ్మ. "మీ నాన్న ఏరిరా , ప్రొద్దునే ఎక్కడికి కెళ్ళారు ?" అంది.
    కుర్రాడు తెల్లబోతూ చూచాడు. "నాన్నేమిటమ్మా.... నాన్న చచ్చిపోయాడుగా" ఉలిక్కిపడింది సీతమ్మ. అవును చచ్చిపోయారుగా! మరి రాత్రేలా వచ్చారు! కలా అది ! కలే అయితే.
    తనున్న స్థితి విస్తుపోయి చూసుకుంది సీతమ్మ. క్రింద పడుకున్న తను మంచం మీద కెప్పు డోచ్చి పడుకుంది! తన వంటి మీద జాకెట్టు మంచం క్రింద కెలా వెళ్ళింది! చీర ఎలా వూడిపోయింది! తన మీదకి ఈ దుప్పటేలా వచ్చింది!?....
    'అబ్బ! అమ్మ దగ్గర ఎంత మంచి వాసన వేస్తుందో కదురా అన్నయ్యా. నిన్నరాత్రి మనింటి కొచ్చిన అయన దగ్గర లాంటి వాసన కాదూ..." అంది కూతురు అమాయకంగా తల్లి దగ్గర వేస్తున్న సువాసనని ఆస్వాదిస్తూ.
    మరోసారి ఉలిక్కిపడింది సీతమ్మ. అతను! అవును అతనేమయ్యాడు!? "నిన్న వచ్చిన అతను ఎప్పుడు వెళ్ళిపోయాడురా, నన్ను లేపకపోయారా?" కొడుకుని అడిగింది. " మేం లేచే సరికే లేడమ్మా అయన."
    సీతమ్మకేం అర్ధం గాలేదు. తెలియని ఏదో భయంతో ఆమె గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. వంటికి అంటిపెట్టుకున్న సెంటు వాసన ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తను తనుగా లేనన్న సంగతి శరీరంలోని ప్రతి అణువూ స్పష్టపరుస్తోంది. ఆమె శరీరం గజగజ వణికింది. చీర దగ్గరికి లాక్కొని లేవబోతుంటే కాళ్ళు వణికాయి. సీతమ్మ మొహం ఎర్రబడిపోయింది. ఆమె కంతా అయోమయంగా వుంది. ఆమె స్థితి ఏమిటో ఆమెకే అర్ధం కావడం లేదు.
    వింతగా  చూస్తున్న పిల్లలని....."వెళ్ళండవతలికి, వస్తున్నాను, ఏమిటలా చూస్తున్నారు. నా మోహన కోతులాడుతున్నాయా, పదండవతలికి...." అనవసరంగా కసిరింది. పిల్లలు అలా తిరిగాక లేచి చీర కట్టుకుని క్రింద పడిన జాకెట్టు తీసుకుని తొడుక్కుటుటే.....
    ఆ ప్రయత్నంగా తలగడ క్రింద నుంచి కనిపిస్తున్న నోటు మీద ఆమె దృష్టి పడింది. చటుక్కున తీసింది , నూరు రూపాయల నోటు!!
    నూరు రూపాయలు! ఆ నోటు చూడగానే అంత వరకు వున్న కాస్త అనుమానం ఆమెకి తీరిపోయింది! ఆ నోటు చేత్తో పట్టుకుని నిలువెల్లా సిగ్గుతో చితికిపోతూ ఆలాగే నిలబడిపోయింది సీతమ్మ.
    కోపమో , అవమానమో, సిగ్గో , ఆవేదనో ఏదో తెలియని భావం ఆమె మనసుని పిండుతుంది.
    తల్లి ఎంతకీ రాకపోవడంతో పిల్లలిద్దరూ మళ్ళీ గదిలోకి వచ్చారు. నోటు చేతిలో పట్టుకొని నిల్చున్న తల్లిని చూసి కొడుకు ఆరాటంగా ముందుకు వచ్చి ఆమె చేతిలో నోటు అందుకున్నాడు. "అమ్మో.... నూరు రూపాయలే.... ఎవరిచ్చారమ్మా...." మొహం నిండా సంతోషం, ఆశ్చర్యం నింపుకొని నోటుని అపురూపంగా చూస్తూ అన్నాడు పదకొండేళ్ళ కొడుకు. వాడికి తమ దరిద్రం సంగతి, నెలకి డెబ్బై ఐదు రూపాయలు సంపాదించడానికి తల్లి పడే కష్టం తెలుసు. తమ బ్రతుకులో ఒక్కసారిగా నూరు రూపాయలు దొరకడం అన్నది అదృష్టం అనీ, అందులో వున్న అనందం ఎంతో - వాడికి అర్ధం చేసుకోగల వయసుంది. "అమ్మా , ఎవరిచ్చారమ్మా ......నిన్న వచ్చినాయనా.... ఎందుకిచ్చాడమ్మా....." ప్రశ్నలు కురిపిస్తున్నాడు కొడుకు.
    సీతమ్మ తెలివి తెచ్చుకొని కొడుకు చేతిలో నోటు అందుకుంది ఆవేశంగా. "ఇలా ఇయ్యరా అది. ఈ పాపిష్టి   డబ్బు మనకు వద్దు ...." అంటూ ఆవేశంగా నోటు చింపబోయింది.
    అమ్మా !" బాబు గాభరాగా తల్లి చేతిలోంచి నోటు లాగేసుకున్నాడు . తల్లి మాటకి అర్ధం తెలియక ఆశ్చర్యంగా చూశాడు.
    'అది ఇలా యియ్యి...." కోపంగా అంది సీతమ్మ. "ఇలా ఇచ్చేయి .... ఆ డబ్బు ఇంట్లో వుండడానికి వీలు లేదు." లాక్కుంది సీతమ్మ.
    "అమ్మా...!" కొడుకు దీనంగా తల్లి ముఖంలోకి చూస్తూ, అపురూపంగా నోటు వంక చూశాడు. అర్ధం తెలియని, చేసుకోలేని వయసులో వున్న కూతురు బిక్కమొహం వేసుకు చూస్తుంది.
    "అమ్మా....!' కొడుకు మొహంలోని దీనత్వం చూసిన సీతమ్మ, ఆ నోటు వంక చూసింది. పిల్లల మొహాలు చూసింది. ఆమె ఆవేశం చప్పున దిగజారింది. నోటు పట్టుకున్న ఆమె చెయ్యి వణికింది. చూస్తూ చూస్తూ ఆ నోటు చిమ్పలేకపోయింది. నిస్సహాయంగా పిల్లల వంక చూసింది.
    "అమ్మా ఎందుకమ్మా ఆ డబ్బు. నూరు రూపాయలు చిమ్పెస్తావా?" దైన్యంగా అడిగాడు ...."ఎవరిచ్చారమ్మా.... నిన్నను వచ్చినాయనా .... ఎందుకిచ్చారమ్మా. మనకి డబ్బు లేదని ఇచ్చారు గదూ!" సీతమ్మ కొడుకు వంక చూసింది.
    సీతమ్మ ఒక్క క్షణం ఆలోచించింది ..... తరువాత నోటు జాగ్రత్తగా మడత పెట్టి పెట్టెలో పెట్టింది. కొడుకు సంతోషంతో చూశాడు.... పిల్లలిద్దరిని చూస్తూ ....."అవునురా .... నిన్న వచ్చిన ఆయనే ఇచ్చాడు. మనం బీదవాళ్ళం  అని , డబ్బు లేదని ఇచ్చాడు.... మనం బీద వాళ్ళమని దేవుడే ఆయన్ని పంపాడు. వాన దేముడు ఆయన్ని మనింటికే పంపించాడు..... మనకి డబ్బు యీయమని ....." అంది తడబడ్తూ.
    పిల్లలు ఆశ్చర్యంగా విన్తున్నారూ..... "చూడండి .... ఇలా మనకి డబ్బు ఇచ్చిన విషయం మీరెవరితో అనకండెం." అంది. పిల్లలిద్దరూ సంతోషంగా తలలూపారు.
    వారం రోజుల తర్వాత మధ్యాహ్నం మూడు గంటల వేళ ..... దట్టంగా మబ్బు పట్టింది. సీతమ్మ నూరు రూపాయలు పెట్టి ..... తనకి రెండు కట్టుడు చీరలు,  రెండు దుప్పట్లు , పిల్లలిద్దరికీ చేరి రెండు జతల బట్టలు కొంది. కొన్న గుడ్డలలో గౌను గుడ్డ చింపి సూది దారం పుచ్చుకుని, వీధి గుమ్మంలో కూర్చుని గౌను కుడ్తుంది. పిల్లలిద్దరికీ చాలా సంతోషంగా వుంది. క్రొత్త బట్టలు - అందులో రెండేసి జతలు! సంతోషంగా తల్లి దగ్గర కూర్చున్నారు చూస్తూ.
    "అమ్మా...... వాన వస్తుందా అమ్మా!" అంది ఏడేళ్ళ కూతురు. సీతమ్మ ఆకాశం వైపు చూసి ....." వచ్చేట్టే వుంది మబ్బు పట్టింది బాగా...." అంది.
    "అమ్మా..... అయితే అయన మళ్ళీ వస్తారా అమ్మా మనింటికి.... వానదేముడు పంపిస్తాడా అమ్మా.... ఈసారి .....వాళ్ళ జయ కుట్టించుకున్న జరీ పరికిణీ కొంటావా ఆశగా అడిగింది.
    "అన్నయ్య వర్షం వస్తే బాగుంటుంది కదూ!" అంది అమాయకంగా. సీతమ్మ ఉలిక్కిపడింది. పిల్ల పరిగెత్తి కెళ్ళి .... "వానలు కురవాలి , వరిచేలు పండాలి ---- వాన దే,ముడు పంపాలి ...... జరీ పరికిణీ కొనాలి ..." తాను పుస్తకంలో చదువుకున్న పాటకి స్వంత కవిత్వం జోడించి గిరగిర తిరుగుతూ సంతోషంగా పాడుకుంటుంది. సీతమ్మ మొహం ఎర్ర బడింది. కూతురిని ఏమనలేక చటుక్కున లేచి లోపలికి వెళ్ళిపోయింది.

        
                                    ---------   

 Previous Page Next Page