"సీగరం కోన్ తోలో!" అంది స్వప్నని చూపిస్తూ.
స్వప్నని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు కొంతమంది అమ్మాయిలు.
స్వప్నని రక్షించడానికి అప్రయత్నంగానే అడుగు ముందుకు వేశాడు సందీప్.
వెంటనే ఒకరి మీద ఒకరుగా వందమంది అమ్మాయిలు అతనిమీద పడిపోయారు.
టన్ను బరువున్న పూలకుప్ప కింద ఊపిరాడకుండా నలిగిపోతున్నట్లు అనిపించింది సందీప్ కి. గట్టిగా బలం ఉపయోగించడానికేమో, ఆడపిల్లలన్న సింపతీ అడ్డు వస్తోంది.
అతను పెనుగులాడుతూ ఉంటే నెఫ్రెతీతీ ఏదో చెప్పింది తమ భాషలో. ఇదంతా తనకేం పట్టనట్లు అనాసక్తిగా చూస్తున్న భూతాలరాజు అనువాదం చేసి చెప్పాడు.
"నీ ప్రియురాలికి - దాని పేరేమిటో - ఏం భయంలేదు. నువ్వు అతి తెలివి ఉపయోగించాలని చూస్తే మాత్రం మీరు ముగ్గురూ దారుణమైన హింసలకు గురి అవుతారు. జాగ్రత్త?"
అలా హెచ్చరించి వయ్యారమూ, హుందాతనమూ కలిసిన నడకతో వెళ్ళిపోయింది నెఫెర్.
ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా ఇళ్ళుగానీ గుడిసెలు గానీ లేకపోవడం గమనించాడు సందీప్. అక్కడక్కడ పూల తీగెలనే పొదలలా అల్లుకునేటట్లు చేసి, వాటినే ఆవాసాలుగా ఉపయోగిస్తున్నారు. వసంత క్రీడల్లో చెట్లన్నీ ఒక దానిమీద మరొకటి బుక్కాయీ రంగులూ జల్లుకున్నట్లు ఏ చెట్టుమీద చూసినా రంగు రంగుల పూలు!
ఒక పూల పొదలో అతన్ని బంధించి ఉంచారు చీకటి పడేదాకా.
స్వప్ననీ, భూతాలరాజునీ కూడా అలాగే వేరు వేరు పొదలలో ఉంచి ఉంటారని అనుకున్నాడు సందీప్.
బాగా పొద్దుపోయి చంద్రోదయం అయ్యాక, మృదువుగా వాద్యమేదో మోగడం మొదలెట్టింది.
కొంతమంది యువతులు వచ్చి అతన్ని బయటికి తీసుకెళ్ళారు.
ఒక చిన్న మైదానం, సన్నటి, మెత్తటి గడ్డి పెరిగి పచ్చటి పర్షియన్ కార్పెట్ పరచినట్లు వుంది. దానిమధ్య, ఆ సాయంత్రమే రేకులు విచ్చుకున్న పూలతో చిన్న ఆసనంలా అమర్చి వుంది. దానిమీద దర్పంగా తూర్చుని వుంది సెఫెర్. ఆమె తలలో నక్షత్రాలలా ఏవో మెరుస్తున్నాయి.
కళ్ళు చిట్లించి చూశాడు సందీప్.
అవి మిణుగురు పురుగులు! చీకట్లో అలంకారంగా కనబడడానికి మిణుగురు పురుగులను తన కేశాలలో అమర్చుకుంది నెఫెర్!
స్వప్ననీ, భూతాలరాజునీ కూడా అక్కడికి తీసుకొచ్చారు.
చక్రాలు దొర్లుతూ వస్తున్న శబ్దం వినబడింది. పెద్ద బోనులాంటి బండివచ్చి ఆగింది.
బలిష్టమైన ఆంబోతుల్లా ఉన్న మొగాళ్ళు ముగ్గురిని దింపారు ఆ బండిలోనుంచి.
ఆశ్చర్యంగా చూస్తున్నాడు సందీప్. సర్కస్ లో జంతువులని బోనులో తీసుకొచ్చి రింగులో వదిలినట్లు అనిపించింది.
అక్కడ వృత్తాకారంలో కూర్చుని ఉన్న యువతుల మొహాల్లో ఆపుకోలేని ఉత్సుకత కనబడుతోంది.
సందీప్ చెయ్యి పట్టుకుని ఆ రింగ్ లోకి తీసుకెళ్ళింది ఒక అమ్మాయి.
అతనితో కలిసి నలుగురు మొగాళ్ళు అయ్యారక్కడ. వాళ్ళని ఇద్దరేసి చొప్పున, రెండు జట్లుగా విడదీసింది ఆ అమ్మాయి. అతని చేతికి పులిగోళ్ళు అమర్చబోయింది.
చేతులు వెనక్కి తీసేసుకున్నాడు సందీప్. "ఏమిటిది?" అన్నాడు చిరాగ్గా. తక్కిన మొగవాళ్ళు ముగ్గురి చేతివేళ్ళకీ అప్పటికే పులి గోళ్ళు ఉండడం గమనించాడు అతను.
"మీరు రెండు జట్లుగా విడిపోయి ద్వంద్వ యుద్ధం చేస్తారు. రెండు జట్లలో గెలిచిన వాళ్ళిద్దరి మధ్యా మళ్ళీ పోరాటం జరుగుతుంది. గెలిచిన వాడికి అపురూపమైన బహుమతి!" అంది నెఫెర్. భూతాలరాజు అనువాదం చేశాడు.