Previous Page Next Page 
హైజాక్ పేజి 38

తను విమానాన్ని రన్ వే మీదే ఆపలేకపోయినా, అది ఒకవేళ ఆ తారు రోడ్డుమీదికి వెళ్ళిపోతుంది. అంతే!
అయితే ఆ సమయంలో రోడ్డుమీద ఎదురుగా మనుషులుగానీ, వాహనాలు గానీ రాకూడదు.
అది సంభవమా?

                                                    *    *    *    *

సరిగ్గా అదే క్షణంలో ఆ తారు రోడ్డు ఎక్కింది పోలీసు వ్యాను.
మహబూబ్, రెడ్డితో చెబుతున్నాడు. "ఈ విమానాలు దిగే రోడ్డులాంటిది ఉంటుంది చూడండి సార్. ఆ దారిలో దాన్ని ఆనుకునే తారురోడ్డు ఒకటి వెయ్యాల్సి వచ్చింది. పాత ఇమానాల రోడ్డుని తవ్వేద్దాం అని జెమాజెట్టీల లాంటి కూలీల గేంగుని పెడితే, వాళ్ళు పొద్దు పొడిచిం దెగ్గెర్నెంచీ మధ్యాహ్నం దాకా సెమటలు కక్కుతూ గునపాలతో తవ్వినా, ఒక్క అడుగు సెక్కని కూడా పెళ్ళగించ లేకపోయారండీ! అంత బందోబస్తుగా కట్టించారన్నమాట రాజావారు! చివరికి ఆ రోడ్డుని తవ్వలేక అలాగే వదిలేసి, దానితో కలిపేసే కొత్త రోడ్డు పోశారు."
తల పంకించాడు రెడ్డి.
తుమ్మెద ఝుంకారంలాంటి శబ్దం వినబడుతోంది ఆకాశంలో.
మహబూబ్ కిటికీలో నుంచి తల బయటికి పెట్టి చూశాడు.
చాలా ఎత్తున, చిన్న పిట్టలాగా కనబడుతోంది ఒక విమానం.
"ఇమానం సార్! సచ్చ ప్రమాణంగా ఇమానం సార్!" అన్నాడు మహబూబ్ ఆనందాన్ని అణుచుకోలేక. ఆ పల్లెల మీదగా సాధారణంగా విమానాలు వెళ్ళవు. ఒకవేళ వెళ్ళినా మేఘాలపైన కనబడకుండా వెళ్ళిపోతాయి గానీ కిందగా ఎగరవు.
రెడ్డి కూడా చూశాడు.
ఉత్సాహం పట్టలేక పోతున్నాడు మహబూబ్ "సార్! ఇమానం ఎక్కడం ఎంత అదృష్టం సార్! ఒక్కసారన్నా ఇమానం ఎక్కని జన్మ ఎందుకు సార్! థూత్! ఇప్పుడా ఇమానంలో ఎగురుతున్నవాళ్ళు ఎంత అదృష్టవంతులయి ఉంటారు సార్!
ఆ విమానంలో ఉన్నవాళ్ళకి అతని మాటలు వినబడవు గానీ వినబడి ఉంటే వాళ్ళు విషాదంగా నవ్వుకుని ఉండేవాళ్ళే!  
ఆకాశంలో దూరమైపోతున్న విమానాన్ని కనబడినంతసేపూ కళ్ళార్పకుండా చూశాడు మహబూబ్. కాసేపటి తర్వాత విమానం కనబడకుండా పోయింది. శబ్దం కూడా వినబడటం లేదు.
"వెళ్ళిపోయింది!" అన్నాడు మహబూబ్, కొంచెం దిగులుగా.
"ఉండు!" అన్నాడు రెడ్డి, అతను చెవులు రిక్కించాడు.
దూరమైపోయిన విమానం శబ్దం మళ్ళీ దగ్గరవుతోంది. ఈసారి రెండో వైపునుంచి, చాలా పెద్దగా.
"అర్రె! అర్రె! అర్రె ఇమానం మళ్ళీ వస్తోంది!" అన్నాడు మహబూబ్ ఎగ్జయిటెడ్ గా.

                                                   *    *    *    *

ఆ ప్రాంతంమీద నాలుగోసారి ఎగిరి, అంతా పరిశీలనగా చూసుకున్న తర్వాత, దూరంగా వెళ్ళిపోయి, అక్కడినుంచి విమానాన్ని ఏటవాలుగా దింపటం మొదలెట్టాడు సవ్యసాచి.
కణకణానికి దగ్గరవుతోంది నేల.
చివరిక్షణంలో కనబడింది సవ్యసాచికి అప్పటిదాకా ఖాళీగా ఉన్న రోడ్డుమీద నలుసులా. ఏమిటది?
కలవరపడ్డాడు అతను. కానీ అప్పటికే ఆలస్యమయిపోయింది. ఇంకేమీ చెయ్యడానికీ వ్యవధి లేదు.
భూమికి బాగా దగ్గరగా వచ్చేసింది విమానం.
"మెహబూబ్!" అన్నాడు రెడ్డి.
"చూడు విమానం ఇటే వస్తోంది."
హఠాత్తుగా స్పృహ వచ్చినట్లయింది రెడ్డికి, పెద్దగా అన్నాడు "డ్రయివర్! వాన్ ని రోడ్డు పక్కకు తీసుకెళ్ళిపో! విమానం ఇక్కడే దిగుతోంది."
"ఆఁ!" అని భయంతో నీలుక్కుపోయాడు డ్రయివరు. అతని మెంటల్ రిఫ్లెక్సెన్ పనిచెయ్యడం మానేశాయ్. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు అతను. వాన్ ముందుకు దూసుకుపోతూనే ఉంది.
విమానం భూమిని సమీపించింది. ఎదురెదురుగా వస్తున్నాయి - విమానం, వానూ.
వాన్ డ్రైవర్ స్టీరింగ్ గట్టిగా పట్టుకుని కళ్ళు మూసేసుకున్నాడు.
అప్పుడు -
ఒక సెకండు తేడాలో జరిగింది ఆ అద్భుతం!
రన్ వేమీద ఆ పాయింటుని దాటి ముందుకెళ్ళిపోయింది వాను.
అదిటు వెళ్ళగానే విమానం చక్రాలు సరిగ్గా అదే పాయింటుని తాకాయి, అంటే దాదాపు విమానం కింద నుంచి వెళ్ళిపోయిందన్న మాట వాను!
ఒకే ఒక్క సెకండు తేడాతో తప్పిపోయింది అతి ఘోర ప్రమాదం!
వేగంగా రన్ వేని దాటేసి, తారురోడ్డు మీదకి ఎక్కి చాలా దూరం పరిగెత్తింది విమానం.
వేగం కొంచెం అదుపులోకి వచ్చాక బ్రేక్స్ అప్లయ్ చేశాడు సవ్యసాచి.
మెల్లిగా ఆగింది ఎయిర్ బస్.
ముందుకు వెళ్ళిపోయిన వాన్ డ్రైవరు కూడా వాన్ ఆపి, నిస్త్రాణగా సీటుమీద చేరగిలబడి పోయాడు.

 Previous Page Next Page