Previous Page Next Page 
ఆఖరి మలుపు పేజి 39


    తల పంకించాడు.


    వంగి, తమకంగా అతని పెదిమల మీద గట్టిగా ముద్దు పెట్టింది ఆ అమ్మాయి.


    ఆ అమ్మాయి అలా ఆర్భాటం చెయ్యగానే అప్పుడు తెలిసింది తక్కిన ఇండియన్స్ కి అతని విలువ!


    అప్పుడందరూ అతన్ని చుట్టేశారు.


    ఆటోగ్రాఫులు కావాలనీ....


    అడ్రెసు కావాలనీ....


    అప్పుడు గమనించాడు రాజా - అతన్ని.


    అతనే....


    కీర్తి....


    ఎందుకొస్తున్నాడు ఈ ఫ్లయిట్ లో.


    ఏమన్నా అఘాయిత్యం చేస్తాడా?


    కీర్తి వైపే కళ్ళార్పకుండా చూస్తూ వుండిపోయాడు కానీ అతను ఊహించినట్లు కీర్తి ఏమీ చెయ్యలేదు.


    బాంబేలో లాండ్ అయింది ఫ్లయిట్. లగేజ్ కలెక్ట్ చేసుకోవడం కోసం నిలబడ్డాడు రాజా.


    లగేజ్ వచ్చింది.


    కీర్తి ఒక పెద్ద ట్రంక్ పెట్టెని పట్టుకుని కస్టమ్స్ కౌంటర్ దగ్గరికి వచ్చాడు.


    "చెక్ చేస్తే చెయ్యండి. నేను అర్జెంటుగా వెళ్ళాలి" అన్నాడు అదో రకమయిన గీర కలిసిన గొంతుతో.


    ఒకసారి అతని మొహంలోకి చూసి, ట్రంకు తెరిచాడు కస్టమ్స్ అధికారి. లోపలంతా తడిమి చూశాడు.


    ఏమీ లేదు.


    విజయగర్వంతో నవ్వాడు కీర్తి.


    "అయ్యిందా?" అన్నాడు అపహాస్యంగా.


    ఇంకోసారి అతని మొహంలోకి చూసి, "వెళ్ళొచ్చు" అన్నట్లు తలపంకించాడు అధికారి.


    "థాంక్స్!" అని వ్యంగ్యంగా బయటికి నడిచాడు కీర్తి.


    అతన్నే పరిశీలనగా చూస్తున్నాడు రాజా.


    దిస్ బగర్ ఈజ్ ఆఫ్ టూ సమ్ మిస్చిఫ్!


    అకారణంగా తనే అడిగాడు కస్టమ్స్ వాళ్ళని - తనని చెక్ చెయ్యమని.


    వీడు పెద్ద యాంటీ నేషనల్! ఇంటర్నేషనల్ క్రూక్.


    ఇవాళేమిటి ఇంత జెంటిల్మన్ లాగా కస్టమ్స్ వాళ్లకి తనే ఆఫర్ యిస్తున్నాడు - తనని చెక్ చెయ్యమని.  


    అంటే కస్టమ్స్ వాళ్ళ కళ్ళలో దుమ్ము కొట్టొచ్చని అంత నమ్మకంగా ఉన్నాడన్న మాట.


    ఏమయి ఉంటుంది వీడి గేమ్?


    చేతిలో ట్రంకు పెట్టి ఉంది. దాన్ని త్వరగా చెక్ చేసేశారు కస్టమ్స్ వాళ్ళు.


    అందులో ఏమీ లేదు.


    కీర్తి జేబులు కూడా వెదికారు వాళ్ళు.


    ఏం దొరకలేదు.


    మరి....మరి....


    ఇందులో ఏదో హిచ్ వుంది. కీర్తిగాడి మొహంలో భావం చూస్తుంటే ఆ అనుమానం మరీ బలపడుతోంది.


    హఠాత్తుగా ఏదో స్ఫురించింది రాజాకి. గబగబా ముందుకి నడిచాడు. రాష్ గా వెళ్ళి కీర్తికి డాష్ కొట్టాడు.


    ఆ ఇంపాక్ట్ కి కీర్తి చేతిలోని ట్రంక్ పెట్టె ధభాలుమని కింద పడిపోయింది. పడగానే దానికి వేసివున్న పెయింటు కొద్దిగా గీరుకుపోయింది.


    వంగి, ఆ రంగుపోయిన చోట చూశాడు రాజా. తరువాత కస్టమ్స్ అధికారి వైపు తిరిగి అన్నాడు -  


    "సర్! మీరు ఇతన్ని అరెస్ట్ చెయ్యొచ్చు. ఈ పెట్టెలో ఏమీలేదు. కానీ పెట్టె మొత్తం ప్రపంచంలోని అతి ఖరీదయిన లోహం ప్లాటినంతో చేసి వుంది. సాలిడ్ ప్లాటినమ్! ప్లాటినమ్ స్మగుల్ చేస్తున్నాడు ఇతను."


    కస్టమ్స్ ఆఫీసర్ వచ్చి అభిమానంగా రాజా భుజం తట్టాడు.


    "స్మార్ట్! వెరీ స్మార్ట్! థాంక్స్ బడ్డీ!"


    నవ్వి, డొమెస్టిక్ టెర్మినల్ లో వున్న హైదరాబాద్ వెళ్ళే ఫ్లయిట్ వైపు నడిచాడు రాజా.


                              *    *    *    *


    పోలీస్ డిపార్టుమెంట్ లో ఉద్యోగానికి అప్లయ్ చేస్తూ కేరాఫ్ పోస్ట్ మాస్టర్, జనరల్ పోస్టాఫీస్, హైదరాబాద్ అని అడ్రసు యిచ్చాడు రాజా.


    ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా పోస్టాఫీసుకి వెళ్ళాడు.


    అతను ఊహించినట్లే అక్కడ అతని కోసం ఎదురుచూస్తోంది ఇంటర్వ్యూ లెటరు.


    ఇంటర్వ్యూ తతంగం న్యాయంగానే గనక జరిగితే, తనకి సెలెక్షన్ తప్పదని రాజాకి తెలుసు. చాలా నిబ్బరంగా వెళ్ళాడు ఇంటర్వ్యూకి.


    అతని టర్న్ వచ్చింది.


    ఖడక్ గా నడుస్తూ లోపలికి వెళ్ళాడు.

 Previous Page Next Page