సెలెక్టు కావాలంటే లాబీయింగ్ చెయ్యాలి.
ఎన్నో ఎన్నెన్నో లాబీలు అక్కడ.
పంజాబీ లాబీ... మహారాష్ట్రియన్ లాబీ.... తమిళ లాబీ... మళయాళ లాబీ...
ఎవరి కాండిడేట్లని వాళ్ళు పుష్ చేసుకోవడానికి ప్రయత్నాలు, పంతాలు, పట్టింపులు... వంచన.
కానీ తెలుగువాళ్ళకి మాత్రం ఏ ఫీల్డులోనూ లాబీ ఉండదు.
పైగా...పొరబాటున పైవాడు గనక తెలుగువాడు అయి ఉంటే, వాడు ఇంకో తెలుగువాడు వెలుగులోకి రాకుండా తొక్కెయ్యాలని చూస్తాడు.
చిలిపి బుద్ధి!
తెలుగువాడి తత్వం బాగా తెలుసు రాజాకి. అతను ఎంతో లోకం చూశాడు.
తెలుగువాడు చాలా నిష్పక్షపాతంగా ఉంటాడు.
నిష్పక్షపాతంగా ఉండడంలో మళ్ళీ రెండు రకాలు.
తనవాళ్ళూ, పరాయివాళ్ళూ అని లేకుండా అందరిపట్లా ఒకే సమభావంతో ప్రవర్తించడం.
తను నిష్పక్షపాతి అనిపించుకోవాలనే కుతితో తన వాళ్ళని తొక్కేసి ఎదుటివాళ్ళని అందలం ఎక్కించడం.
తెలుగు వాళ్ళంటే ఎట్లాంటివాళ్ళు?
రెండేళ్ళక్రితం కాబోలు. ఢిల్లీలో కొందరు కలిసి ఒక ప్రయత్నం మొదలెట్టారు. ఢిల్లీలో వున్న తెలుగు ప్రముఖులందరి వివరాలూ సేకరించి ఒక డైరెక్టరీగా వెయ్యాలని.
దానికి తెలుగువాళ్ళ రెస్పాన్సు ఎలా ఉందీ? ముప్పాతిక మూడొంతుల మంది మేము తెలుగు వాళ్ళమని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. పేపర్లలో వ్యంగ్యంగా రాశారు ఈ విషయం గురించి.
అట్లాంటివాళ్ళు తెలుగువాళ్ళు.
ఒలింపిక్స్ సెలెక్షన్ కమిటీలో అలాంటి "తెగులు" వాడే ఒకడు తగిలాడు రాజాకి. అతని వల్ల తన ఛాన్సెస్ మట్టికొట్టుకు పోతాయని ముందే గ్రహించాడు రాజా.
అందుకని సీదా ఆయనింటికి వెళ్ళిపోయాడు ఆ రాత్రి.
అతను అక్కడ ఉన్నది ఒక్క నిమిషమే, చెప్పిందీ ఒక్కమాటే!
"చూడు గురూ! నీకు చిత్రమైన భావాలు ఉండొచ్చు! కానీ ఆ భావాలవల్ల నాకు చిత్రవధ జరిగితే బావుండదు కదా! రేపు సెలెక్షన్స్ లో నాకు ఫేవర్ చెయ్యమని అడగడం లేదు. అన్యాయం చెయ్యొద్దని హెచ్చరిస్తున్నాను."
అంతే!
ఆ మాటలు చెప్పి తిరిగి వచ్చేశాడు రాజా.
తన సొంత "బ్రాడ్ మైండ్ నెస్" గురించి అప్పటిదాకా ఎవరితోనో గప్పాలు కొట్టి వున్న ఆ తెలుగు వీరుడు నోరు మూతబడి, నిలువు గుడ్లు పడి, నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు.
మొత్తానికి సెలెక్షన్స్ లో రాజాకి అన్యాయం జరగలేదు.
ఒలింపిక్స్ కి వెళ్ళాడు అతను.
ఎనభై కోట్ల మంది జనం ఉండే ఈ దేశంలోని పౌరుడు ఒక్కడు కూడా ఇన్నాళ్ళనుంచీ సాధించలేనిది, తను సాధించాడు.
మూడు మెడల్సు - గోల్డ్ మెడల్సు - తను ఒక్కడే సాధించాడు.
అక్కడ నుంచి మొదలవుతుంది అసలు కథ.
* * * *
ఇండియాకి తిరిగివచ్చే ఎయిర్ ఇండియా ఫ్లయిట్ లో విండో సీట్లో కూర్చుని ఉన్నాడు రాజా. ఉల్లాసంగా ఉంది అతని మనసు. మూడు రంగుల భారత జాతీయ పతాకం అతని రొమ్ము మీద వుంది. దానికి తగిలించి వున్నాయి మూడు మెడల్సు.
తన పర్పస్ సర్వ్ అయ్యింది.
తనేమిటో ప్రూవ్ చేసుకున్నాడు.
ఇంక తన డ్యూటీ మొదలెట్టాలి.
అందుకు మొదటి మెట్టు...పోలీసు ఆఫీసర్ కావాలి.
పోలీసు ఆఫీసరుగా ఉంటే తప్ప తను దేశసేవ చెయ్యలేడని కాదు.
కానీ పోలీసు ఆఫీసరయి కృష్ణాజీ కోరిక తీర్చాలి.
బహుశా తను వెళ్ళేటప్పటికి ఇంటర్వ్యూ కాల్ కూడా వచ్చెయ్యవచ్చు.
రాజా అంత ఆనందంగా వున్నాడు గానీ ఆ ఫ్లయిట్ లో ఉన్న ఇండియన్స్ లో ఎవరూ అతని ఉత్సాహాన్ని షేర్ చేసుకుంటున్నట్లు లేదు.
నిజం చెప్పాలంటే ఇండియన్స్ కి స్పోర్ట్స్ అంటే అంత అభిమానం లేదు.
ఇండియన్స్ వేలం వెర్రిగా చూసే గేమ్ క్రికెట్ ఒక్కటే!
క్రికెట్ ప్లేయర్స్ కి సినీ స్టార్స్ ని మించిన క్రేజ్ వుంది ఈ దేశంలో. కోట్లు సంపాదించగలుగుతున్నారు క్రికెట్ ప్లేయర్స్.
క్రికెట్ తరవాత ఇండియన్స్ కి అంత అభిమాన పాత్రమైన స్పోర్ట్స్ బహుశా రాజకీయాలే అయి ఉంటాయి.
తక్కిన గేమ్స్ అన్నీ, స్పోర్ట్స్ అన్నీ చిన్నచూపే ఇండియన్స్ కి.
ఆ ఫ్లయిట్ లో ఎక్కువమంది ఇండియన్సే ఉన్నారు. వాళ్ళలో ఎవరూ అసలు రాజాని గమనించలేదు కూడా.
అయితే ఇంతలో ఒక అమెరికన్ అమ్మాయి తన సీట్లో నుంచి లేచింది.
రాజా దగ్గరికి వచ్చింది.
"ఆర్ యూ రాజా ఆఫ్ త్రీ మెడల్స్ ఫేమ్?" అంది ఎగ్జయిటెడ్ గా.