లోపలికి వెళ్ళీవెళ్ళగానే అతను గమనించాడు.
ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లలో ముఖ్య స్థానంలో కూర్చుని వున్నది...
ఇంకెవరో కాదు....
కృష్ణాజీ!
అతను కృష్ణాజీనే!
తన గురువు! తన దైవం!
తనకి తెలియకుండానే రెండు చేతులూ జోడించాడు అతను.
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు చూస్తున్నాడు ఈయనని.
రాజా కళ్ళలో తడి!
రాజా అభివాదాన్ని అందుకున్నట్లు తల పంకించాడు కృష్ణాజీ. కానీ అతను రాజాని గుర్తుపట్టలేదు.
అదీ సహజమే కదా!
తొమ్మిదేళ్ళ క్రితం చూశాడు రాజాని అతను.
అప్పట్లో రాజా చిన్నపిల్లవాడు!
ఇప్పుడు ఎదురుగా ఉన్న రాజా సూపర్ మాన్ లా కండలు తిరిగివున్న యంగ్ మాన్!
"నీ పేరు..." అన్నాడు కృష్ణాజీ.
"రవిరాజ్ కుమార్" అన్నాడు రాజా.
అంతేగానీ తను ఫలానా అని చెప్పి గుర్తు చెయ్యలేదు కృష్ణాజీకి.
కృష్ణాజీకి తనెవరో తెలిస్తే రెండు రకాలుగా వుండవచ్చు పరిస్థితి.
ఒకటి....
కృష్ణాజీకి ఇంకా తన మీద కోపం పోయి వుండకపోవచ్చు.
ఆనందరావు మాటల ఎఫెక్ట్ ఇంకా ఆయన మనసులో ఉండి తనంటే వ్యతిరేకత ప్రకటించవచ్చు.
ఆయనకు తెలియకుండానే, ఆయన మనసులో ఉన్న వ్యతిరేకత వర్క్ చేసి,అది తను పోలీసు డిపార్ట్ మెంటులో చేరే ఛాన్సెస్ ని దెబ్బతియ్యవచ్చు.
అలా కాకపోతే....
కృష్ణాజీకి తనపట్ల ఉన్న అపోహలు ఈ మధ్యకాలంలో తొలిగిపోయి వుండవచ్చు.
ఆయన ఎప్పటిలాగా తనంటే వాత్సల్యం చూపించి, తనకు అనవసరంగా ఫేవర్ చెయ్యాలని చూడవచ్చు.
అది కూడా సంభవమే!
అలా ఒకరి దయాదాక్షిణ్యాల మీద సెలెక్షన్ రావడం తనకి ఇష్టం లేదు.
తనకి సెలెక్షన్ అంటూ వస్తే, అది కేవలం తన ప్రతిభ వల్లే రావాలి అంతే!
మరో కారణం వల్ల...అది ఏదయినా సరే... వస్తే తనకి నచ్చదు! దానికి మాత్రం తిరుగులేదు.
పెద్దవాడయిన రాజాని కృష్ణాజీ గుర్తుపట్టలేదు - సహజంగానే.
కృష్ణాజీ కూడా మారాడు.
అయితే గుర్తు పట్టలేనంగా మాత్రం కాదు. మనిషి ధృఢంగానే ఉన్నాడు. కానీ జుట్టు చెంపల దగ్గర నెరిసింది. ముందువైపు జుట్టు కాస్త పలచబడి, బట్టతల రాకని సూచిస్తోంది.
తన ముందువున్న పేపర్స్ కాసేపు పరికించి, తరువాత ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు కృష్ణాజీ.
ముందుగా రొటీన్ క్వశ్చన్స్.
ఆ తరవాత రాజా వ్యక్తిత్వాన్నీ, మనస్తత్వాన్నీ ప్రోబ్ చేస్తూ...డీప్ గా, తరచి తరచి చూస్తున్నట్లు ప్రశ్నలు!
గుర్రానికి పై పళ్ళు ఎన్ని?
గాడిద తోకలో ఉండే వెంట్రుకలు ఎన్ని? అన్న వెకిలి పద్ధతిలో అనవసరమైన "జనరల్ నాలెడ్జి" ప్రశ్నలు కాకుండా.
నిజంగా మనసు లోతులని త్రవ్వి చూసే ప్రశ్నలు!
ఈ ఉద్యోగం అంటే ఎందుకు అభిరుచి కలిగింది?
పొట్ట కూటికా?
కమిట్ మెంట్ కోసమా.
పెడదారుల్లో సంపాదన కోసమా?
సాటి మనుషుల కోసం, దేశం కోసం ఏం చెయ్యాలని ఉంది?
ఏం చెయ్యగలవు?
ఇంతవరకూ ఏం చేశావు?
నిప్పులాంటి నిజాయితీపరుడు మాత్రమే నిస్సంకోచంగా అడగగలిగిన ప్రశ్నలు అవి!
కృష్ణాజీ వరసబెట్టి అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ తడుముకోకుండా, మెషిన్ గన్ తో రాపిడ్ ఫైరింగ్ చేసినట్లు గబగబా జవాబులు చెప్పేస్తున్నాడు రాజా.
అరగంటసేపు అలా అడిగాక, అప్పుడు తృప్తిగా అన్నాడు కృష్ణాజీ.
"దిస్ ఈజ్ రియల్లీ ఎక్స్ ట్రార్డినరీ! నీ లక్ష్యం గురించీ, ఆ లక్ష్యం సాధించడానికి అనుసరించవలసిన మార్గం గురించీ నీకు పూర్తిగా అవగాహన ఉంది. ఎక్కడా, ఏ విషయంలోనూ ఏమాత్రం కన్ ఫ్యూజన్ లేదు నీకు. కమిట్ మెంటూ, క్లియర్ థింకింగూ రెండూ కలిస్తేగానీ ఇలాంటి వ్యక్తిత్వం ఏర్పడదు! వెల్ డన్ యంగ్ మాన్!"
"థాంక్యూ సర్!" అన్నాడు అతను చిరునవ్వుతో.
కొద్ది క్షణాలపాటు అతనివైపు తదేకంగా చూశాడు కృష్ణాజీ.
తరువాత అన్నాడు.