రామాయణంలో మనకు గుళ్ళుగాని విగ్రహాలు కాని కన్పించవు.
రాముడు ధర్మార్థ కామాలను గురించే చెపుతున్నాడు. మోక్షాన్ని గురించి చెప్పడం లేదు. అది మోక్షాన్ని గురించిన ఆలోచనలేని కాలం అయ్యుండాలి.
రాముడు చెప్పిన నీతికి ఎంతో అర్ధం ఉంది. అది అన్ని కాలాలకు వర్తించేది. ధర్మం అర్థం, కామం మూడున్నాయి. ఈ మూడింటిలో రెంటిని సాధించడానికి ధర్మమార్గం అవలంబించాలంటాడు. ధర్మమార్గాన ఆర్జించిన అర్ధమే అంటే విత్తమే న్యాయమైంది. అర్ధం ధర్మాన్ని వదిలి సాధిస్తే అధర్మ విత్తం అవుతుంది. ఇవ్వాళ్టి భాషలో చెప్పాలంటే "నల్లధనం" అవుతుంది. అలాగే ధర్మాన్ని అనుసరించిన కామం ఉండాలంటాడు. ఆయా కాలాల్లో అమల్లో ఉన్న ధర్మాన్ని అనుసరించే కోర్కెల్ను సాధించాలి. కాని నాడు అది అధర్మం అవుతుంది.
వీడ్కోలు:
రాముడు, సీత తమకున్న ఆస్తినంతా బ్రాహ్మలకు, పురజనులకు దానం చేశాడు. అప్పుడు "త్రిజటుడు" అనే దరిద్ర బ్రాహ్మడు వచ్చాడు. తాను ఉంఛవృత్తిలో జీవిస్తున్నానన్నాడు. తనకేదైనా దానం ఇవ్వాల్సిందని అర్ధించాడు. అందుకు రాముడు "అందరికి ఎన్నో వేల ఆవులు ఇచ్చాను. నీకేమీ ముట్టలేదా? అయినా ఒక కర్ర విసరు. అది ఎంత దూరంపోతుందో అన్ని ఆవులు ఇస్తా" అన్నాడు.
త్రిజటుడు శక్తికొద్ది కర్ర విసిరాడు. అది అనేకవేల ఆవులను దాటి సరయూనది ఒడ్డున పడింది. రాముడు అతనికి అన్ని వేల ఆవులు దానం చేశాడు. త్రిజటుడు సంతోషించాడు. రాముని ఆశీర్వదించాడు. వెళ్లిపోయాడు. అలా ఉన్నదంతా దానం చేసి, సీతారామలక్ష్మణులు దశరథుని దగ్గరికి వెళ్లారు.
పట్టాభిషేకం చూడ్డానికి చాలమంది జనం వచ్చారు. వారితో వీధులు కిటకిటలాడుతున్నాయి. వారు రాముడ్ని చూచారు. అతడు రాజలాంఛనాలు వీడాడు. పాదచారి అయి వెళ్తున్నాడు. అది చూచి జనం దుఃఖించారు.
రాముడు ధర్మావలంబి. అతడు నరులకు మూలం లాంటివాడు. జనులు ఆ చెట్టుకు ఆకులూ, పూలలాంటివారు. చెట్టు నరుకుతే పూలూ, ఆకులూ ఉండవు. అలాగే రామునికి విపత్తు వస్తే జనులు తల్లడిల్లారు. వారు ఇలా అనుకున్నారు.
రాముడు అడవులకు వెళ్తున్నాడు. అతని వెంట మనమూ వెళ్దాం. భార్యాబిడ్డల్ను తీసుకొని వెళ్దాం. మనం వెళ్ళిపోతే నగరం పాడుపడుతుంది. పాడుపడిన నగరాన్ని కైక పాలిస్తుంది.
పాదచారి అయిన రాముడు దశరథుని భవనం చేరాడు. తనరాకను గురించి విన్నవించాల్సిందని సుమంత్రునితో చెప్పాడు.
సుమంత్రుడు లోనికి వెళ్లాడు. అక్కడ దశరథుడు నిట్టూర్పులు విడుస్తున్నాడు. రాహుగ్రస్తుడైన సూర్యునిలా ఉన్నాడు. నివురుగప్పిన నిప్పులా ఉన్నాడు. నీరులేని చెరువులా ఉన్నాడు.
సుమంత్రుడు దశరథుని చూచాడు. "రాజా! రాముడు తన ఆస్తినంతా బ్రాహ్మలకు, పరిజనులకూ ఇచ్చేశాడు. అందరివద్దా శెలవు తీసుకున్నాడు. ఇక్కడికి వచ్చాడు. నీ దర్శనం కోసం వేచి ఉన్నాడు. అతనికీ దర్శనం ఇవ్వాల్సింది అన్నాడు.
దశరథుడు దుఃఖంతో కుంగిపోయాడు. భార్యలందరితో గూడా రాముణ్ని చూస్తానన్నాడు. భార్యలందరినీ తీసుకొని రావలసిందని సుమంత్రుణ్ని ఆదేశించాడు. సుమంత్రుడు వెళ్లాడు. దశరథుని మూడు వందల యాభైమంది భార్యలను తీసుకొనివచ్చాడు. రాముని తీసుకురావలసిందని సుమంత్రుని ఆజ్ఞాపించాడు.
రాముడు వస్తున్నాడు. దూరం నుంచి చూచాడు దశరథుడు. రాముడు చేతులు కట్టుకొని వస్తున్నాడు. వినయం మూర్తీభవించినట్లున్నాడు. అది చూచాడు. దశరథుడు లేచాడు. అతని భార్యలంతా లేచారు. రామునికి ఎదురు వెళ్దామనుకున్నాడు దశరథుడు. అడుగులు ముందుకు వేశాడు. నడవలేకపోయాడు. మూర్ఛవచ్చి పడిపోయాడు.
రామలక్ష్మణుడు పరిగెత్తివచ్చారు. తండ్రిని లేవనెత్తారు. అంతఃపుర స్త్రీలంతా రాముని చూచారు. దశరథుని అవస్థ చూచారు. అందరూ గొల్లుమన్నారు. కైకతప్ప. వారి ఏడుపులో రాజప్రసాదం ప్రతిధ్వనించింది. రామలక్ష్మణులకు సీత సాయం చేసింది. ముగ్గురూ కలిసి దశరథుని మంచంమీద పడుకోబెట్టారు. దశరథుడు రోదన ధ్వనులు విన్నాడు. కళ్లు తెరిచాడు. చూచాడు.
రాముడు చేతులు జోడించాడు. తండ్రిముందు నుంచున్నాడు. "తండ్రీ! అడవులకు వెళ్లిపోతున్నాను. మీ వద్ద శెలవు తీసుకోవడానికి వచ్చాను. సీత, లక్ష్మణుడు నా వెంట వస్తామంటున్నారు. వారించాను, వినడం లేదు. వారిని వెంట తీసికెళ్లడానికి అనుమతించండి" అని ప్రార్థించాడు.
మహారాజు భరించలేకపోయాడు.
"నాయనా! రామా! కైకకు వరం ఇచ్చింది నేను. మోసపోయింది నేను. నీవు నన్ను ఓడించరాదూ! అయోధ్యకు రాజువు కారాదూ!" అన్నాడు డగ్గుత్తుకతో.
"తండ్రీ! మీరు వేల సంవత్సరాలు రాజ్యం పాలించారు. ధర్మాత్నులన్నీ, సత్యవాదులనీ కీర్తిపొందారు. అలాంటి మీ మాటను అసత్యం చేయడం నాకు ఇష్టం లేదు. పధ్నాలుగు సంవత్సరాలు త్వరలోనే గడిచిపోతాయి. తిరిగి వచ్చేస్తాను."
రాముని నిశ్చయం దశరథునికి తెలుసు. అయినా ఆ రాత్రికి మాత్రం అయోధ్యలో ఉండమన్నాడు. తెల్లవారి అడవులకు వెళ్లాల్సిందన్నాడు.
"నేను ఒక్కక్షణమైనా అయోధ్యలో ఉండను. నాకు రాజ్యం అక్కరలేదు. సీత అక్కర్లేదు. స్వర్గం అక్కరలేదు. నాకు కావలసింది మీరు సత్యవాదులు కావడమే. శలవిప్పించండి వెళ్లిపోతా"
ఆ మాటలు విన్నారు. కైకతప్ప. రాజభవనం సాంతం పెద్దగా ఏడ్చింది. దశరథుడు రాముని కావలించుకున్నాడు. మళ్లీ మూర్ఛపోయాడు.
ఇదంతా చూచాడు. సుమంత్రుడు భరించలేకపోయాడు. కైకను అనేక రకాలుగా నిందించాడు :-
"వేపచెట్టుకు పాలుపోసి పెంచినా దానిఏళ్లు చేదుగానే వుంటాయి. నీ తల్లి నీచురాలు. ఆమెకు పుట్టావు. నీకూ ఆ గుణాలే అబ్బాయి.
"నీ తండ్రి ఒక వరం సంపాదించాడు. ఆ వరంవల్ల అతనికి జంతువుల భాషలు తెలిశాయి. ఒకప్పుడు నీ తండ్రి పడకగదిలో ఉన్నాడు. ఆ గదిలో చీమలు పాకుతున్నాయి. అతడు వాటి భాషవిన్నాడు. నవ్వాడు. ఆ నవ్వడం చూచింది నీ తల్లి. అందుకు కారణం చెప్పమన్నది. మొండిపట్టుపట్టింది. అది చెపితే తన తల పగిలి చస్తానన్నాడు నీ తండ్రి. నీ తల్లి భర్తచావును కూడా లెక్కచేయలేదు. ఆ రహస్యం చెప్పమని వేధించింది. నీ తండ్రి విసిగాడు. నీ తల్లిని వదిలివేశాడు.