Previous Page Next Page 
సీతాచరితం పేజి 38


    సీత కలత చెందింది.  "ఏమిటలా వున్నావు? పుష్యమి నక్షత్రం వచ్చేసింది. నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? నీ రాజ లాంఛనాలేవి? వంది మాగధులు లేరి? మంత్రులూ, సేనానులు, మిత్రులు, పురోహితులు నీ వెంటలేరేమి? అని సీత అడిగింది.


    రాముడు జరిగినదంతా చెప్పాడు.


    "భరతుడు రాజవుతున్నాడు. అప్పుడు అతడు నీకు మరిది మాత్రమేగాక దేశానికి రాజవుతాడు. కాబట్టి నీవెల్లకాలం అతనికి అనుకూలంగా వుండు. నేను అడవులకు వెళ్లుచున్నాను" అన్నాడు రాముడు.


    సీత రాముని మాటలు విన్నది. చిరుకోపంతో యిలా అన్నది.


    "రామా! ఎందుకలా మాట్లాడుతావు? నన్ను పరిహసిస్తున్నావా? మిగతావాళ్లు తమతమ పుణ్యపాపాలు అనుభవిస్తారు. కాని భార్య అలా కాదు. ఆవిడ భర్త భాగ్యంలో భాగం పంచుకుంటుంది. నిన్ను అడవులకు వెళ్లమంటే నన్ను వెళ్లమన్నట్లే నీతో వచ్చి నిన్నేం  బాధపెట్టను. నీతో వేల సంవత్సరాలైనా అడవులో వుండగలను. నిన్ను విడిచి స్వర్గం సహితం సహించదు. నిన్ను మినా, మరెవ్వరినీ కన్నెత్తి చూడని దానను. నీకంటే అనురాగం కలదాన్ని. నీవు నన్ను విడిచిపోతే, నా ప్రాణాలు నన్ను విడిచిపోతాయి. నన్ను వెంట తీసుకెళ్లు, నీకెలాంటి కష్టం కలగనివ్వను. అని జలజల కన్నీరు రాల్చింది సీత. రాముడు సీత దుఃఖం చూశాడు. భరించలేకపోయినాడు. కరిగిపోయినాడు. వెంటదీసికొని పోవడానికి సిద్ధమయ్యాడు. వనవాసానికి వెళ్లడానికి గల ఏర్పాట్లు చేసుకోమన్నాడు. త్వరగా పనులు ముగించుకొని సిద్ధం కమ్మన్నాడు.


    లక్ష్మణుడక్కడే వున్నాడు- అదంతా చూశాడు. భోరున ఏడ్చి రాముని కాళ్లు పట్టుకున్నాడు. అడవులకు వెళ్లడమే నిశ్చయమయితే నేనూ నీవెంట వస్తాను. నీవు లేకుంటే నాకు దేవలోకం కూడ అక్కరలేదు. నన్ను వెంటతీసుకొని వెళ్లు అని కన్నీటితో రాముని పాదాలు తడిపాడు.


    రాముడు లక్ష్మణుని లేవనెత్తాడు. కన్నీరు తుడిచాడు. తనవెంట రావద్దని అనేక విధాల చెప్పాడు. తుదకు "నీవు లేకుంటే సుమిత్రకు, కౌసల్యకు సేవచేసేవారుండరు. కైక రాజ్యాన్ని ఆక్రమించుకున్నది. ఆమె సవతులకే మాత్రం మేలుచేయదు. భరతుడు భరతుడు రాజయినా, తల్లి చెప్పుచేతల్లో వుంటాడు. కాబట్టి తల్లుల సేవకోసం నీవిక్కడ వుండవల్సిందే. నా మాట విను. మనిద్దరం లేకుంటే తల్లులకు సుఖం లేదు అన్నాడు.


    లక్ష్మణునికి రాముడు వాదన ఏమాత్రం నచ్చలేదు. "అన్నా! నీకీ సందేహము అక్కరలేదు. నీ తేజస్సుకు ముగ్ధుడై భరతుడు మన తల్లులను చక్కగా పూజిస్తాడు. వాడికి రాజ్యగర్వం వచ్చిందనుకో- వాడు తల్లులను సరిగా చూడలేదనుకో - నేను భరతుణ్ణి చంపేస్తాను. అదిగాక కౌసల్య దరిద్రురాలనుకున్నావా! ఆమె నాలాంటి వేలమందిని పోషించగలదు. నన్ను సేవకునిగా చేసుకో- అలా చేసుకుంటే నేను నీకు కృతజ్ఞుడనై ఉంటాను. నావల్ల నీకు కొంత ప్రయోజనం కల్గుతుంది. ధనుర్బాణాలు దాల్చి గునపం, చిన్న గుంప పట్టుకొని నీకు మార్గం చూపుతూ నీకుముందు నడుస్తాను. ఫలములూ ఆహారాలు మున్నగునవి తెచ్చిపెడ్తాను. నీవు సీతతో కొండ నెత్తములపై విహరిస్తున్నప్పుడు నీవు మేల్కొని ఉన్నప్పుడు, నిద్దురపోతున్నప్పుడు సమస్త పరిచర్యలు చేస్తానని ప్రార్థించాడు.


    రాముడు కాదనలేకపోయాడు. వారించి ప్రయోజనం లేదనుకున్నాడు. వెంట తీసికెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. లక్ష్మణుని బంధుమిత్రులతో శెలవుతీసికొమ్మన్నాడు. అతనికున్న యావదాస్తిని పంచిపెట్టమన్నాడు. ప్రయాణానికి సిద్ధం కమ్మన్నాడు.


    అలా సీతారామలక్ష్మణులు అడవికి వెళ్లడానికి సిద్ధమైనారు.


    ఈ భాగం త్యాగమయం, ఇందులో కుటుంబంలోని సభ్యుల పరస్పర అనురాగాలు, ప్రేమలు, దుఃఖాలు, ఆనందాలు వ్యక్తమవుతాయి.


    తండ్రి మాట నిలబెట్టడానికి రాముడు రాజ్యాన్ని త్యజించాడు. అడివికి వెళ్లడానికి సిద్ధమయినాడు. అతడు అడవికి పోవడానికి కారణం తండ్రి. కాని సీత వెళ్లడానికి కారణం లేదు. కైక సీతను అడవికి వెళ్లమనలేదు. అయోధ్యలో ఉంటే ఆమె రాజ్యభోగాలు అనుభవించవచ్చు. ఇక్కడ ఆమెకేం తక్కువలేదు. కౌసల్య ధనవంతురాలు. ఆమెను పూవుల్లో పెట్టి పూజించగలదు. కాని సీతను రాముని విషయంలో గల అనురాగం అపారమైంది.


    ఇక్కడ అనురాగం, రాజ్యభోగాలు రెండు ఉన్నాయి. సీత ఈ రెండింటిలో దేనినైనా కోరుకోవచ్చు. అడ్డేవారుగాని, అభ్యంతరం చెప్పేవారుగానీ ఎవరూ లేరు. కాని తండ్రి మాటకోసం రాముడు రాజ్యం వదులుకున్నట్లే, భర్తమీద వుండే అనురాగంతో సీత సకల రాజ్యభోగాలను వదలుకుని భర్తవెంట అడవికి వెళ్లడానికి నిశ్చయించుకుంది. ఇది స్వచ్ఛందమైన నిర్ణయం. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. వాస్తవానికి రాముడు రావద్దని అన్నాడు. ఐనా భర్తతో సుఖదుఃఖాలు పంచుకోవడమే భార్య కర్తవ్యమని సీత అడవులకు బయలుదేరింది.


    రాముడు పితృభక్తితో రాజ్యాన్ని త్యజించాడు. భర్తమీద ఉండే అనురాగంతో సీత రాజ్యభోగాలను త్యజించింది.


    ప్రేమలో ఎంతటి త్యాగాలనైనా జయించగల శక్తివుంది.


    లక్ష్మణునికి రాముడంటే ఎనలేని ప్రేమ. దాన్నే భక్తి అన్నా అనవచ్చు. ప్రేమ, భక్తి రెండు ఒకలాంటివే. చిన్నవారిమీద కల్గెదాన్ని ప్రేమ అంటాం. తనకంటే పెద్దవారిమీద కల్గేదాన్ని భక్తి అంటాం. భక్తిలో, వీరభక్తి, ఆవేశభక్తి యిలాంటివెన్నో వున్నాయి. భక్తితో ప్రాణాలర్పించిన కథలు చాలా ఉన్నాయి.


    లక్ష్మణునికి రాముని విషయంలో భక్తి వుంది. రాముని మీద ఈగ వాలితే అతడు సహించడు. రాముడు రాజు కావడం లేదంటే అతనిలో కాపజ్వాలలు రేగాయి. తండ్రిని సైతం చంపి, అన్నను రాజును చేస్తానన్నాడు. కాని అన్నకు యిష్టం కాదని తెల్సుకొని మానుకున్నాడు. అన్నను ఒప్పించి అడవులకు బయలుదేరాడు. అతన్ని రాముడు రమ్మనలేదు. దశరథుడు పొమ్మనలేదు. కైక ఆజ్ఞాపించలేదు. ఐనా రాముని వెంట బయలుదేరాడు. రాజ్యభోగాలు వదలి రామునికి సేవకునిగా వుంటానని ప్రార్థించి, వెళ్లాడు. ఇతని నిర్ణయం స్వచ్ఛందమైందే.


    లక్ష్మణుడు సేవకుడైనాడని ఈసడించుకోవల్సిన పనిలేదు. ఎందుచేతనంటే మనమంతా ఏదోరకంగా సేవకులమే. కొందరు ప్రజాసేవకులు. కొందరు దేశ సేవకులు. మరికొందరు భార్యాసేవకులు, ఇంకొందరు పుత్ర సేవకులు. ఈ సేవ అన్న పదం 'Slavary'  కి పర్యాయ పదం అనుకోవడం తప్పు. Slavary అంటే బానిసత్వం. సేవ అనేది ఇంగ్లీషులో 'Slavary' అనే పదానికి సరియైనది కావచ్చు. బానిసత్వంలో బయట నుంచి బలప్రయోగం వుంది. సేవలో స్వచ్చందత వుంది.


    ఇక్కడ దైవాన్ని గురించి రెండు బలమైన ఉపన్యాసాలున్నవి. ఒకటి అనుకూలంగానూ, రెండు వ్యతిరేకంగాను. రాముడు దైవం అనే పదార్థాన్ని, ఇప్పుడు మనము వాడుకొనే 'విధి' అనే పదార్థానికి బదులుగా వాడినట్లు కనిపిస్తుంది. దైవానికి ఒక స్వరూపం వున్నట్లు చెప్పలేదు. కంటికి కనిపించని ఏదో ఒక శక్తి దైవమంటున్నారు. అంటే ఆనాటికి దైవం ఒక స్వరూపాన్ని ఏర్పరచుకున్నట్లు కనిపించదు. దైవాన్ని పురుష శక్తితో గెలుస్తానంటాడు. దీన్ని బట్టి పరశక్తి కంటే జనం స్వశక్తిమీదే ఎక్కువ ఆధారపడినట్టు కనిపిస్తుంది. "దైవ సంపాదితో దోషో మానుషేణ మయా జితః"

 Previous Page Next Page