Previous Page Next Page 
హ్యూమరాలజీ - 3 పేజి 39


    వెంకట్రామయ్య వెళ్ళి తలుపు తెరచాడు.

 

    ఎదురుగ్గా అంతకుముందు మమ్మల్ని అటకాయించిన కానిస్టేబుల్సే నిలబడి వున్నారు. మమ్మల్నందరినీ చూడగానే వాళ్ల మొఖాలు సంతోషంతో విప్పారినయి.

 

    "నేను చెప్పలే వాళ్ళే వీళ్ళయి ఉంటారని!" అన్నాడొకతను.

 

    "పదండి? బయట వాన్ లో సర్కిల్ గారున్నారు-"

 

    "నాతో ఏం పని?"

 

    "అదే ఆయన్నడగండి!"

 

    అయన వెనుకే నేనూ రంగారెడ్డి కూడా వెళ్ళాం.

 

    "ఎవర్రా నువ్వు?" అదే గొంతు.

 

    "వెంకట్రామయ్యనండీ-"

 

    "తెలుసోయ్- వెంకట్రామయ్యవని తెలుసు! ఎవర్నువ్వు?"

 

    "మాది పోలీస్ డిపార్ట్ మెంటేనండీ! అయిదేళ్ళయింది రిటైర్ అయి"

 

    "తెలుసోయ్ పోలీస్ డిపార్ట్ మెంటనీ- ఎవరు?"

 

    "ఎవరంటే ఇంకేం చెప్పనండీ?"

 

    "అర్థరాత్రి మీ ఇంట్లో మీటింగ్ ఎవరి పర్మిషన్ తీసుకుని పెట్టావ్?"

 

    "ఇది మీటింగ్ కాదండీ! బంధువులొచ్చారు!"

 

    "అయినా మీటింగే అది! పర్మిషన్ చూపించు-"

 

    "బంధువులతో మాట్లాడ్డానికి పర్మిషనెందుకండీ-"

 

    "నీకు పోలీస్ బిల్ గురించి తెలీదా? ఎవరు గుమికూడినా, గుమి కూడినచోట ఏ సబ్జెక్ట్ మాట్లాడాలన్నా పోలీసులే పర్మిషనివ్వాలి! నీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ మాట్లాడకూడదు-"

 

    "మేము కేవలం మా క్షేమ సమాచారాల గురించి మాట్లాడుతున్నామండీ-"

 

    "దానిక్కూడా పర్మిషనుండాలి- ఏయ్ త్రీనాట్ ఫోర్-"

 

    "యస్సార్-"

 

    "వీళ్ళందరూ లోపల ఏం మాట్లాడుతుండగా విన్నావ్?"

 

    "తాగుబోతు అయిన పోలీస్ అధికారివల్ల ప్రజలంతా నానా ఇబ్బందులూ పడుతున్నారని మాట్లాడుకుంటున్నారండీ-"

 

    "వేసేయ్ లోపల వీడిని-"

 

    "దిసీజ్ టూమచ్- మేము..."

 

    అతని మాటలు వినిపించుకోకుండా అతనిని వాన్ లో వేసేశారు- అది చూసి పార్వతీదేవికి మండిపోయింది.

 

    "పోలీస్ డిపార్ట్ మెంట్ వాళ్ళనికూడా చూడకుండా అరెస్ట్ చేస్తారా- మీకేమయినా సిగ్గుందా?" అందామె కోపంగా.

 

    "ఆడెవడు?" అడిగాడు సర్కిల్.

 

    "వాడు కాద్సార్! ఆమె! లేడీస్-"

 

    "నీయమ్మ! ఈ లేడీస్ తెగ బరితెగించిపోయారే ఇవాళ. వేసేయండి లోపల వాడితో పాటు"

 

    పార్వతీదేవిని వాన్ ఎక్కించిపోయేసరికి నేను వెళ్ళి అడ్డుపడ్డాను.

 

    "సార్! ఆమెను వదిలేయండి! తెలీక పొరబాటు మాట్లాడింది-"

 

    "తెలీక మాట్లాడిందా?"

 

    "అవునండీ!"

 

    టార్చ్ లైట్ పార్వతీదేవి మొఖం మీద పడింది.

 

    "ఆర్నీయమ్మ- ఇది సిల్కుస్మిత కదూ?" అన్నాడతను ఆశ్చర్యంగా.

 

    మేం ఉలిక్కిపడ్డాం.

 

    "అబ్బే కాదండీ! మా కాలనీలోనే ఉంటుందామె-" గాబరాగా అన్నాను.

 

    "పోవోష్! నాకు తేడా తెలీదేంటి? ఇది సిల్కుస్మితే!- ఏయ్ స్మితా! నేను నీ ఫ్యాన్నే! నీ సెక్స్ డాన్ష్ లన్నీ తెగ షూస్తా- ఆ షినిమాలో డాన్స్ షేషావ్ షూడు- అది ఒక్కసారి షేయవే- వదిలేస్తా నిన్ను-"

 

    మాకేం మాట్లాడాలో అర్థంకాలేదు-

 

    "అయ్యో వీడి మొఖం మండిపోనూ- నన్ను సిల్కుస్మిత అంటాడేమిటి?" కోపంగా అంది పార్వతీదేవి.

 

    "డాన్స్ షేష్తావా - లేదా- త్రీ' అనే లోపల షేయకపోతే లాకప్ లో కెళ్ళిపోతావ్-"

 

    "ఈమె షిల్కుష్మిత కాదుసార్-" అన్నాడు యాదగిరి. సర్కిల్ కి కోపం ముంచుకొచ్చింది.

 

    "వీడిని కూడా లోపలవేషేయండి-"

 

    పోలీసులు యాదగిరిని కూడా వాన్ లోకి తోసేశారు.

 

    "ఏయ్ షిల్క్ ష్మితా- త్రీ అనే లోపల డాన్స్ చేస్తావా? చేస్తే- వదిలేస్తా! లేకపోతే జీప్ లో వేసేస్తా!"

 

    "నేను సిల్క్ స్మితనా? నీ కళ్ళుపోయినయ్యా? మా కాలనీలో అందరూ నేను విజయశాంతి లాగున్నానని అంటూంటే- నీకు సిల్క్ స్మితలా కనబడుతున్నానా!" మండిపడుతూ అంది పార్వతీదేవి.

 

    "వన్-" అన్నాడు సర్కిల్.

 

    మాకు భయం వేసింది- వాడు పార్వతీదేవిని కూడా జీప్ లో వేసుకెళ్ళిపోతాడేమోనని.

 

    'టూ-" అన్నాడతను.

 

    "చూడండీ! ఆడాళ్ళతో అలా ప్రవర్తించటం..." సర్దిచెప్పబోయాడు రంగారెడ్డి.

 

    'త్రీ' గట్టిగా అరిచేశాడతను.

 

    "పోనీ ఓసారి ఏదొక డాన్స్ చేసేస్తే పోతుందిగదా?" అన్నాడు రంగారెడ్డి నెమ్మదిగా పార్వతీదేవి చెవిలో. మా గొడవంతా విని ఆ చుట్టుప్రక్కల ఇళ్ళవాళ్ళందరూ నిద్రలేసి కిటికీల్లోనుంచి చూడటం ప్రారంభించారు.

 

    "ఒరేయ్- దీన్ని జీప్ లో వేసేయండి" అరచాడతను.

 

    వాళ్ళు పార్వతీదేవి దగ్గరకొచ్చేసరికి ఆమె గట్టిగా కేకలు వేయటం ప్రారంభించింది. దాంతో నలుగురయిదుగురు స్టూడెంట్స్ పరుగుతో వచ్చారక్కడికి. స్టూడెంట్స్ ని చూసి ధైర్యం తెచ్చుకొని మరికొంతమంది ఇళ్ళవాళ్ళు బయటికొచ్చారు.

 

    పార్వతీదేవిని బలవంతంగా జీప్ ఎక్కించగానే, జీప్ ళు రెండూ వెళ్ళిపోయాయ్.

 

    రంగారెడ్డి విషయమంతా చెప్పేసరికి అందరికీ పౌరుషం పొడుచుకొచ్చింది.

 

    'ఇలా ఊరుకుంటే లాభంలేదు! ఇవాళ ఆమెను సిల్క్ స్మిత అని డాన్స్ చేయమన్నాడు- రేపు మన ఆడాళ్ళను జయమాలిని డాన్స్ చేయమంటాడు- చేయకపోతే జీప్ లో వేసుకుపోతాడు-" అన్నాడొకతను.

 

    "ముందు మనమందరం డిప్యూటీ కలెక్టర్- గారింటికి వెళ్ళి రిపోర్టుచేద్దాం!" అన్నాడు స్టూడెంట్ లీడర్ రాజేశ్వర్రావ్. అరగంటసేపు నడిచాక అందరం డిప్యూటీ కలెక్టర్ గారింటికి చేరుకున్నాం. ఇల్లంతా లైట్లు వెలుగుతున్నాయ్ అప్పటికే.

 

    మేము గేటు దగ్గర కెళ్ళేసరికే ఆయన భార్య ఆత్రుతగా బయటకు పరుగుతో వచ్చింది.

 

    "ఏమయింది? ఆయనను వదిలేశారా?" అడిగిందామె.

 

    మేము తెల్లబోయాం.

 

    "ఎవరినండీ?"

 

    "ఆయనే - డిప్యూటీ కలెక్టర్ గారిని!"

 

    మాకేమీ అర్థం కావటం లేదు ఆమె మాటలు.

 

    "డిప్యూటీ కలెక్టర్ గారితో మాట్లాడ్డానికి వచ్చామండీ మేము-" అన్నాడు రంగారెడ్డి.

 

    "అంటే ఆయనను వదిలేశారా?"

 

    "వదిలేయట మేమిటండీ- మాకేమీ అర్థం కావటం లేదు!"

 

    ఆమె చిరాకు పడింది.

 

    "మీరెవరసలు?"

 Previous Page Next Page