"మేం హైదరాబాద్ నుంచి వచ్చామండీ! సిటీలోకి రాగానే మావాళ్ళను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఈ విషయం డిప్యూటీ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేద్దామని ఇక్కడి కొచ్చాం-"
ఆమె రెండు చేతులతో తల పట్టుకుంది.
"ఏడిచినట్లుంది! రాత్రి డిప్యూటీ కలెక్టర్ గారే కాంప్ నుంచి తిరిగి వస్తూంటే ఆయనో రౌడీ లాగున్నాడని అనుమానించి జీప్ డ్రైవర్ తో సహా అందరినీ అరెస్ట్ చేసి లాకప్ లో పడేశారు. ఆయన డిపార్ట్ మెంట్ వాళ్ళు ఇంతమంది వెళ్ళి బ్రతిమాలినా ఆయనను వదలటం లేదు-"
మాకు మతిపోయింది.
"పోనీ కలెక్టర్ గారికి ఫోన్ చేయకపోయారా?" అన్నాన్నేను.
"ఆ పనేప్పుడో చేశాం, ఇంకెక్కడయినా తను జోక్యం కలుగజేసుకుంటారటగానీ విజయవాడ పోలీసులతో మాత్రం పేచీకి దిగటం తన ప్రిన్సిపుల్స్ కి వ్యతిరేకమని అన్నారాయన"
"ఇలాక్కాదు- వెంటనే ముఖ్యమంత్రికి టెలిగ్రాం ఇద్దాం!" అన్నాడు రాజేశ్వర్రావ్.
అందరం టెలిగ్రాఫ్ ఆఫీస్ కెళ్ళాం. అప్పటికే ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడ నిలబడి ఉన్నారు.
"మీ దగ్గర్నుంచీ టెలిగ్రాం తీసుకోం సార్-" అన్నాడు టెలిగ్రాఫ్ క్లర్క్.
"ఎందుకని?"
"ఇప్పుడేటెలిగ్రామ్స్ తీసుకోవటం స్టాప్ చేయమని పోలీస్ డిపార్ట్ మెంట్ ఆర్డర్స్ వచ్చాయ్-"
"అదేంటి? మిమ్మల్ని ఆజ్ఞాపించటానికి వాళ్ళెవరు?"
"పోలీస్ బిల్ ప్రకారం వాళ్ళకి మా డిపార్ట్ మెంట్ మీద పూర్తి అధికారం ఉంది-"
"ఎవరయ్యా ఇలాంటి తెలివితక్కువ బిల్ తయారు చేసింది?" అరచాను నేను కోపంగా.
"మన ముఖ్యమంత్రీ, హోమ్ మంత్రిగారూ కలసి చేసిన పనండీ ఇది-"
"వాళ్ళెవరూ విజయవాడ వచ్చి ఏం జరుగుతుందో చూడరా."
"వాళ్ళది చాలా జాలిగుండె అండీ! ప్రజలిలా కష్టాలు పడుతూంటే చూడలేరు. అందుకే ఇక్కడికి రావటం మానేశారు..."
"ఓ పనిచేద్దాం!" అన్నాడు రాజేశ్వర్రావ్. "మా డాక్టరుగారింట్లో ఫోన్ ఉంది. అక్కడికెళ్ళి ఐజీపీకి ముఖ్యమంత్రిగారికీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఫోన్ చేద్దాం!"
"అయితే ఆలస్యం ఎందుకు? త్వరగా పదండి?" అందరం డాక్టరు గారింటికి బయల్దేరాం! అప్పటికే తెల్లారిపోవటం మూలాన మా అందరినీ చూచి మరికొంతమంది జనం పోగయ్యారు. డాక్టర్ గారు సంగతంతా విని మండిపడ్డాడు.
"వెంటనే ట్రంక్ కాల్ చేయండి! లైట్ నింగ్ కాల్ చేయండి! డైరెక్ట్ డయిలింగ్ కొట్టండి?" అన్నాడు.
రంగారెడ్డి హడావుడిగా రింగ్ చేశాడు. 'హలో-'
"హలో హలో హలో-" అంది అవతలి గొంతు.
"ముఖ్యమంత్రిగారితో అర్జంటుగా మాట్లాడాలి-"
"ముఖ్యమంత్రిగార్తొ మాట్లాడాలా? మాట్లాడండి-"
రంగారెడ్డి ఆశ్చర్యంగా ఫోన్ నాకిచ్చాడు "ఇట్లా మాట్లాద్తున్నా రేమిటో చూడు-"
నేను ఫోన్ అందుకున్నాను.
"హలో ఎవరు మాట్లాడుతున్నారు?" అడిగాను నేను.
"ఎవరేమిట్రా? నేనే ముఖ్యమంత్రిని-"
"ముఖ్యమంత్రిగారా?"
"అవునని చెప్తుంటే చెవుడేరా.. రాస్కెల్!"
"మేం హైదరాబాద్ నుండి విజయవాడ పనిమీద వచ్చామండీ! ఇక్కడ ఓ తాగుబోతు పోలీస్ అధికారి మమ్మల్ని అరెస్ట్ చేసి మా ఆడాళ్ళను ఎత్తుకుపోయాడు-"
"అవున్రా ఆడిష్టం! ఎత్తుకుపోతార్రా! నువ్వెవర్రా అడగటానికి! నిన్ను కూడా లోపల వేసేస్తాం! నోర్మూసుకుని ఫోన్ పెట్టేయ్-
నాకు అర్థమయింది.
"అవతల ఉన్నది మనని ఎటాక్ చేసిన సర్కిల్ ఇన్ స్పెక్టరే- మనం మాట్లాడుతోంది ముఖ్యమంత్రిగారితో కాదు-"
"అదేమిటి హైదరాబాద్ కి ఫోన్ చేస్తే సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎలా వచ్చాడు ఫోన్లోకి?"
అందరం ఆశ్చర్యపోయాం.
"మైగాడ్! మర్చిపోయాను! మన విజయవాడ ఫోన్ లన్నీ పోలీస్ డిపార్ట్ మెంట్ టాపింగ్ చేస్తోంది! ఎక్కడికి రింగ్ చేసినా ముందు పోలీస్ ఆఫీసుకే వెళ్తుంది-"
"అందుకు టెలిఫోన్ డిపార్ట్ మెంట్ ఎలా వప్పుకుంది?"
"పోలీస్ బిల్ ప్రకారం పోలీసుల కధికారం ఉంది"
అందరం నిశ్శబ్దమయిపోయాం.
"ముందు పోలీస్ స్టేషన్ కెళ్దాం- పదండి- అవతల ఆ తాగుబోతు మన రాజేశ్వరి వాళ్ళను ఏం చేస్తున్నాడో ఏమో-" అంది సుభద్ర ఆదుర్దాగా.
"అవును- అక్కడికే వెళ్దాం పదండి-" అన్నాడు రాజేశ్వర్రావ్. అందరం నడిచే బయల్దేరాం, అప్పటికే తెల్లారిపోవటంతో రోడ్డుమీద జనం తిరగటం మొదలయింది.
పోలీస్ స్టేషన్ బయట ఒక వాన్, జీప్ ఆగి ఉన్నాయ్. వాటిని చూడగానే మా అందరికీ కోపం ముంచుకొచ్చింది.
"పోలీస్ దౌర్జన్యం నశించాలి! చెరపట్టిన స్త్రీలను వదిలేయాలి-" అంటూ అరవసాగాం.
ఈలోగా ఇద్దరు కానిస్టేబుల్స్ తుపాకులు తీసుకుని మా దగ్గర కొచ్చారు.
"ఇక్కడి నుంచి అందరూ త్వరగా వెళ్ళిపోండి రెండు నిమిషాల క్రితమే ఈ ఏరియా అంతా ఎమర్జెన్సీ ప్రకటించారు మా కమీషనర్ గారు-" అన్నాడొకతను. మాకేమీ అర్థం కాలేదు-" ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడమేంటి?"
"ఎమర్జెన్సీ అంటే తెలీదా? నీ యమ్మ- ఇలాంటోళ్ళు కూడా ఉన్నారన్నమాట దేశంలో. ఎమర్జెన్సీ అంటే మాకు ఎదురు తిరిగిన వారందరినీ జైల్లో వేసేయటం- ఇదివరకోసారి చేయలా?"
"అంటే. మేం ఇక్కడినుంచి వెళ్ళకపోతే మమ్మల్ని కూడా జైల్లో వేస్తారా?" అడిగాడు యాదగిరి.
"చావగొట్టి మరీ వేస్తాం- అయినా ఎందుకొచ్చిన గొడవ మీకిది? ఇంకా ఒకటి రెండు గంటలు ఓపిక పట్టండి! మా సర్కిల్ కి 'నిషా' దిగిపోతుంది.
* * * * *