Previous Page Next Page 
హ్యూమరాలజీ - 3 పేజి 38


    "తెస్తే తప్పేముంది?"

 

    "తేకూడదని నేను చెప్తున్నా!"

 

    "తేవచ్చని నేను చెప్తున్నాను-" మొండిగా అందామె.

 

    "వీడిని కూడా లోపల వేసేయండ్రా-" అరిచిందా గొంతు.

 

    కానిస్టేబుల్ ఆశ్చర్యపోయాడు.

 

    "ఈమె మగాడు కాద్సార౧ లేడీ!"

 

    "మొగాడు కాదా?"

 

    "కాద్సార్!"

 

    అతను మళ్ళీ రాజేశ్వరి మొఖం మీద టార్చిలైట్ వేశాడు.

 

    "అయితే మన జీప్ లో వేసేయండి! రూమ్ కి తీసుకెళ్దాం!"

 

    ఇంక లాభంలేదని జనార్ధన్ కల్పించుకున్నాడు.

 

    "చూడండి! ఈ పత్రిక తేకూడదని మాకు తెలీదు-"

 

    "ఎవర్నువ్వు?" టార్చిలైట్ జనార్ధన్ మొఖం మీద పడింది.

 

    "పేరు జనార్ధన్"

 

    "అది తెలుసోయ్- ఎవరు?"

 

    "సినిమా హీరోనండీ-" సినిమా హీరోవని తెలుసోయ్- ఎవరు?"

 

    "అంటే సినిమాలో హీరోగా నటించానన్నమాటండీ."

 

    "అంటే- పోలీస్ ఇన్ స్పెక్టర్ వేషం వేసి, రౌడీ చేతిలో పోలీస్ మర్డరయినట్లు నటించిన పోలీస్ నువ్వేనా?"

 

    "అది నేను కాదండీ..."

 

    "పోలీస్ లు అంత చేతకాని వాళ్ళనుకున్నావా? ఆల్ రైట్- అలాంటి వేషం వేసినందుకు వీడినికూడా లోపల వేసేయండి-"

 

    పోలీసులు జనార్ధన్ ని పట్టుకున్నారు.

 

    "ఆ పాత్ర వేసింది నేను కాదండీ- ఇంకో ఆర్టిస్ట్-"

 

    "ఎవడయితే మాకేంటి? అంతా మీ సినిమా వాళ్ళేగా- వేసేయండి-"

 

    జనార్ధన్ కూడా వాన్ ఎక్కక తప్పలేదు.

 

    రంగారెడ్డికి కోపం ముంచుకొచ్చింది.

 

    "మా వాళ్లందరినీ వదలకపోతే ఇప్పుడే కలెక్టర్ కి ఫోన్ చేస్తాను-"

 

    ఆ మాటతో అక్కడున్న వారంతా విరగబడి నవ్వారు.

 

    "కలెక్టర్ కి చేస్తావా! ఇప్పుడు పవర్సన్నీ పోలీస్ దే- ఇంకెవరికి లేవ్-"

 

    కానిస్టేబుల్స్ రిక్షా తీసుకొచ్చి రాజేశ్వరిని రిక్షా ఎక్కమన్నారు.

 

    "ఆమెకు తీసుకెళ్ళడానికి వీల్లేదు" అంది సావిత్రమ్మ.

 

    "ఎవడామాట అంది!"

 

    "మగాళ్ళు కాద్సార్- లేడీస్"

 

    "దాన్ని కూడా జీప్ లో వేసేయ్-"

 

    "ఓరి దొంగముండా కొడకల్లారా! దొంగల్ని పట్టలేక పోయినా మా హైదరాబాద్ పోలీసులే నయం కదురా-" అంటూ తిట్లు మొదలు పెట్టిందామె.

 

    బలవంతంగా వాళ్ళిద్దర్నీ రిక్షా ఎక్కించి పోలీస్ స్టేషన్ కి లాక్కెళ్ళి పోయారు.

 

    "ఈళ్ళనేం చేస్తారో ఏమో! పదండి మనం కూడా పోలీస్ స్టేషన్ కెళదాం!" అన్నాడు రంగారెడ్డి, అందరం మళ్ళీ బస్ ఎక్కబోయాం-

 

    కాని డ్రైవర్ వప్పుకోలేదు.

 

    "మీ మూలాన నా బస్ లాగేసుకుంటారు సార్! మీరు వెళ్ళండి స్టేషన్ కి" అంటూ బస్ స్టార్ట్ చేసుకెళ్ళిపోయాడు.

 

    మనం పోలీస్ స్టేషన్ వెళ్ళి కూడా లాభంలేదిప్పుడు! మన వెంకట్రామయ్యగారింటికెళ్ళి ఆయనతో చెప్దాం పదండి-" అంది పార్వతీదేవి.

 

    "అవును అదే బెటర్" అన్నాడు రంగారెడ్డి.

 

    అందరం రిక్షాల్లో వెంకట్రామయ్యగారింటికి చేరుకున్నాం. ఆయన పోలీస్ ఆఫీసర్ గా హైదరాబాద్ లో ఉద్యోగం చేసి రిటైరయ్యాడు. పార్వతీదేవికి బంధువవటం వల్ల మా అందరికీ బాగా తెలుసు. పార్వతీదేవి తలుపు కొట్టింది. గాని అయిదు నిమిషాలయినా ఎవరూ తలుపు తీయలేదు. ఈసారి రంగారెడ్డి గట్టిగా తలుపులు బాదటం మొదలు పెట్టేసరికి పక్కింటివాళ్ళు లైటు స్విచ్ వేసుకుని కిటికీలోంచి చూసారు.

 

    "ఎవరూ-" ఒకతను అడిగాడు.

 

    "మేము వెంకట్రామయ్యగారికోసం వచ్చాం-" చెప్పాడు రంగారెడ్డి.

 

    "అలాగా! తలుపుకొడుతోంది ఒకవేళ పోలీస్ లేమో అని భయపడ్డాం! వెంకట్రామయ్యగారు తెల్లారుజామున నాలుగ్గంటలకు గానీ తిరిగి రారు-" అన్నారు వాళ్ళు.

 

    "ఎక్కడికెళ్ళారు?"

 

    "ఎక్కడికేంటి? కృష్ణాబారేజ్ అవతలవేపుకి? ఇవాళ శనివారం కదా" మాకేమీ అర్థం కాలేదు. "శనివారానికీ, కృష్ణాబారేజ్ కీ ఏమిటి సంబంధం" అడిగింది పార్వతీదేవి.

 

    వాళ్ళు మావంక అనుమానంగా చూశారు. "మీదీ ఊరుకాదా?"

 

    "కాదండీ! హైదరాబాద్ నుంచి వచ్చాం-"

 

    "అద్గదీ సంగతి! అందుకే మీకు తెలీలేదు! ఇవాళ బహిష్కరించబడ్డ వారిని కలుసుకునే రోజయ్యా!" మాకు మరీ ఆగమ్యం అయింది.

 

    "బహిష్కారమేంటి?"

 

    వాళ్ళు విసుక్కున్నారు. "అదేనయ్యా పోలీసులతో తగూ పెట్టుకున్న వారందరినీ పోలీసులు సిటీ నుంచి బహిష్కరిస్తున్నారు కదా!వాళ్ళంతా మరి సిటీ వదిలి తాడేపల్లి వెళ్ళి కాపురం ఉంటారు. ప్రతి శనివారం రాత్రి అటు- వాళ్ళూ, ఇటు వాళ్ళు బంధువులూ వెళ్ళి విజయవాడ సరిహద్దుల్లో వాళ్ళను కలుసుకుని రెండు మూడు గంటల వాళ్ళతో గడిపి తిరిగివస్తుంటారు-" మాకు పరిస్థితి అర్థమయింది.

 

    "మరి వెంకట్రామయ్యగారెందుకు వెళ్ళినట్లక్కడికి?"

 

    "ఎందుకేంటి? వాళ్ళ పెద్దబ్బాయిని వారంకిందటే సిటీ నుంచి బహిష్కరించారు కదా!"

 

    "ఎందుకని?"

 

    "పోలీస్ వాళ్ళు అమ్మే లాటరీ టిక్కెట్లు కొనడానికి వప్పుకోలేదట! అందుకని బహిష్కరించారు-" అనేసి కిటికీ తలుపులు మూసేసుకున్నారు వాళ్ళు.

 

    అందరం ఆ అరుగుమీదే కాసేపు కూర్చున్నాం.

 

    "బుద్ధి తక్కువయి వచ్చినాం ఈడకి!" అన్నాడు యాదగిరి.

 

    "అవును! ఇదంతా మీపాడు సినిమావల్లే జరిగింది" అంది పార్వతీదేవి యాదగిరి వంక కోపంగా చూస్తూ. పిల్లలు అరుగుమీదే నిద్రలోకి జారిపోయారు.

 

    మూడవుతోండగా ఆటోలో నుంచి దిగారు వెంకట్రామయ్యగారూ- ఆయన సతీమణి, వాళ్ళ రెండో అబ్బాయీ. మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయారాయన.

 

    "ఏమిటింత రాత్రివేళ ఇలావచ్చారు?" అన్నాడు భయంగా.

 

    సంగతంతా చెప్పాం ఆయనకు.

 

    "విజయవాడ పోలీసుల చేతిలో పడకుండానే ఉండాలి! పడ్డారంటే ఖాళీయే- ముఖ్యంగా ఆ తాగుబోతు సర్కిల్ ఒకాయన ఉన్నాడు. అతను రాత్రంతా తాగి వీరవిహారం చేసి కనబడ్డ వారందరినీ లాకప్ లో పడేస్తుంటాడు..."

 

    "అంతా అతనిష్టమేనా?" అడిగాడు రంగారెడ్డి.

 

    "పోలీస్ బిల్ పవర్స్ అలా ఏడ్చినయ్. ఎవరేం చేయగలం?"

 

    అందరం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుతూ కూర్చున్నాం. పదినిమిషాలయినా గడపక ముందే గట్టిగా పోలీస్ విజిల్స్, ఆ తరువాత పోలీస్ వాన్, జీప్ వచ్చి వెంకటరామయ్యగారింటి ముందు ఆగినయ్. మరుక్షణంలో మా తలుపులు గట్టిగా బాదసాగారు బయట నుంచి.

 Previous Page Next Page