ఉత్తరుడు అయితే నిజంగానే ఏడుస్తున్నాడు.
బుద్ధుడు నిస్సహాయతతో కుంగిపోతున్నాడు.
వాళ్ళు ఎక్కగానే డోర్ మూసుకుంది.
వ్యాన్ ఒక్క కుదుపుతో ముందుకు కదిలింది.
* * * *
టౌన్ అవుట్ స్కర్ట్స్ లోకి రోడ్లమీద అప్పటికప్పుడు పోలీసులు తనిఖీ ప్రారంభించారు. ఎస్.పి. దగ్గరనుంచి స్పెషల్ ఆర్డర్స్ రావడంతో డి.ఎస్.పి.లు స్వయంగా వాహనాలను చెక్ చేస్తున్నారు. జైల్లోంచి తప్పించుకు పోయిన ముగ్గురు ఖైదీలను యెలాగయినా సాయంకాలానికి పట్టుకోవాలని ఎస్.పి. స్వయంగా, వైర్ లెస్ మెసేజ్ ఇచ్చాడు. దీంతో ఠారెత్తిన పోలీసులు ఉదయం నుంచి అలుపు, ఆయాసం లేకుండా తిలక్, బుద్ధుడు, ఉత్తరుడి కోసం గాలిస్తున్నారు.
ఆ టౌన్ నుంచి నేషనల్ హైవే పోతుంది. ఉత్తరంవైపు, దక్షిణం వైపున రెండు గ్రూపుల పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి వదులుతున్నారు. ఏదైనా వాహనం ఆగకుండాపోతే ఛేజ్ చేసి పట్టుకునేందుకు జీపులు రెడీగా వున్నాయి. పారిపోయిన ముగ్గురి ఖైదీల ఫోటోలు పోలీసుల దగ్గరున్నాయి.
ఇవే ఫోటోలను పేపర్లో ప్రకటించేందుకు కూడా సన్నాహాలు చేశాయి. వీరిని పట్టించిన వారికి ఇరవై ఐదువేలు రూపాయల బహుమానం కొట్టెయ్యాలని డి.ఎస్.పి. దగ్గర్నుంచి ట్రైనింగ్ ఎస్.ఐ. వరకూ ఉబలాటపడిపోతున్నారు.
ఖైదీలు పారిపోయి అప్పటికి మూడు గంటలే కావడంవల్ల ఇప్పటికీ వాళ్ళు టౌన్ దాటి వుండరని ఎస్.ఐ. లక్ష్మీదీపక్ బలంగా నమ్ముతున్నాడు. అతను నేషనల్ హైవే ఉత్తరంవైపున చెక్ చేస్తున్న బృందానికి నాయకత్వం వహిస్తున్నాడు. మూడుగంటల నుంచి ఎండలో వుండడంవల్ల అతను మరీ చిరాకు పడిపోతున్నాడు.
ఇదిలా కొనసాగుతుండగా పోలీస్ వ్యానులో వున్న తిలక్, బుద్ధుడు, ఉత్తరుడు, లాలస జాలీగా "కృష్ణాముకుందామురారీ" పాట పాడుకుంటూ ఆనందంగా వున్నారు. పోలీసు వ్యానులో వుండీ, వాళ్ళంత జాలీగా వుండడానికి కారణం ఏమిటో తెలియాలంటే మనం పదినిముషాలు వెనక్కి పోవాలి.
వీధిమలుపు తిరగడానికి ఆగిన వాళ్ళ నలుగురికీ పోలీస్ వ్యాన్ కనపడడంతో పై ప్రాణాలు పైనే పోయాయి.
ఎస్.ఐ. "వున్నవి వూడిపోతాయ్" అని తొందర చేయడంతో నలుగురూ వ్యాన్ దగ్గరకు నడిచారు.
వెనకనున్న తలుపు తెరుచుకుంది.
లోపలకు చూసిన తిలక్, లాలస ఆశ్చర్యంతో బిగుసుకుపోయారు. వ్యాన్ బాడీలో దాదాపు పదిహేనుమంది బిక్షగాళ్ళున్నారు.
అప్పుడు విషయం అర్థమైంది. వాళ్ళకు. తమను పారిపోయిన ఖైదీలని గుర్తించకుండా భిక్షగాళ్ళని మాత్రమే ఎస్.ఐ వ్యాన్ ఎక్కిస్తున్నాడని తెలిసింది.
అయితే భిక్షగాళ్ళను వ్యాన్ లో ఎక్కడకు తీసుకెళుతున్నారో తెలియడం లేదు.
పెద్ద ప్రమాదం తప్పిందని బుద్ధుడు, ఉత్తరుడు లోలోపలే సంతోషించారు.
ఎస్.ఐ. కానిస్టేబుల్ ముందు సీట్లో కూర్చోవడం వల్ల వెనుక బాడీలో భిక్షగాళ్ళు తప్ప ఎవరూ లేరు.
వ్యాన్ ముందుకు కదలడంతోనే తిలక్ భిక్షగాళ్ళతో మాటలు కలిపాడు.
"పెద్దయ్యా! ఎందుకు పట్టుకు పోతున్నారు మనల్ని!" అని అడిగాడు ఓ ముసలి వ్యక్తిని.
"వాడెవడో రేపు మన టౌన్ కు వస్తున్నాడంట. విమానంలో దిగి ఈ రోడ్డంటే వెళతాడట. ఆయనకంట భిక్షగాళ్ళు పడకూడదని మనల్ని వూరికి దూరంగా వదిలివేయడానికి తీసుకెళుతున్నారు. మనల్ని అక్కడక్కడా తిరిగి రెండు రోజులు తరువాత రమ్మన్నారు. అప్పటికి అమెరికా దొర వెళ్ళిపోతాడట."
ఆ మాటలకు మరింత కుదుటపడ్డారు నలుగురూ.
పెద్ద ప్రమాదం తృటిలో తప్పిపోయినప్పుడు కలిగే రిలాక్సేషన్ వాళ్ళ ముఖాల్లో పోలీసు వ్యాన్ లోనే సురక్షితంగా వూరు దాటుతున్నందుకు ఎంతో ఆనందపడిపోయారు.
అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు.
ఏదో అనాలోచితంగా ముందున్న కంతలోంచి రోడ్డుమీదకు చూసిన తిలక్ కొయ్యబారిపోయాడు. అతను అలా అయిపోయవడంతో కీడును శంకిస్తున్న మనుషులతో మిగిలిన ముగ్గురూ ముందుకు చూశారు.
దూరంగా వాహనాలను ఆపి చెక్ చేస్తున్న పోలీసులు కనిపించారు.
"ఇప్పుడెలా! ఇక్కడ మనల్ని పట్టుకోవడం గ్యారెంటీ?" ఉత్తరుడు భయపడిపోతూ అన్నాడు.
"ఇక చేసేదేమీలేదు. తిరిగి జైలుకి వెళ్ళి మరో రెండు సంవత్సరాలపాటు అక్కడ మగ్గడమే" బుద్ధుడు నిరాశతో చెప్పాడు.
తిలక్ ఏమీ మాట్లాడలేదు.
లాలస ఆందోళనతో అతన్నే చూస్తోంది.
ఇప్పుడు పోలీసుల్ని యెలా తప్పించుకోవాలా అతను ఆలోచనలో పడ్డాడు. పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలుచుకోవడమే విజ్ఞుల లక్షణం. వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుని, వాటిని అం,అమలు చేయడం ధీరుల సుగుణం. ప్రస్తుతం అతను అదే చేస్తున్నాడు.
పోలీసుల్ని ఓవర్ పవర్ చేసి పారిపోవడం చాలా కష్టం. వాళ్ళ చేతుల్లో తుపాకులున్నాయి. తాము పరిగెత్తితే వెంబడించేందుకు జీవులున్నాయి. కనుక అలా తప్పించుకోవడం వీలు కాదు. మరెలా?
చిన్న ట్రిక్ ప్లే చేస్తే ఫలితం వుంటుందనిపించింది తిలక్ కి. మరిక వెనక్కి చూడలేదు అతను. ఫలితం కోసం చూడకుండా తమ ప్రయత్నాన్ని చేయాలనే భగవద్గీత సైతం ఘోషిస్తోంది. ఇక యెలాంటి అనుమానాలు పడకుండా తను అనుకున్నది తాను చేయాలనుకున్నాడు.
పోలీసులు ఉదయం నుంచి వాహనాలను చెక్ చేస్తున్నారని అతనికి తెలుసు. ఇప్పటికే వాళ్ళు అలసిపోయుంటారు. అసహనం పెరిగిపోయి వుంటుంది. కరెక్టుగా అక్కడే దెబ్బ తీయాలనుకున్నాడు తిలక్.
వ్యాన్ ముందుకు పోతోంది.
చుట్టూ వున్న వారివైపు చూసి తిలక్ కంఠం విప్పాడు. "పెద్దయ్యా! ముందు పోలీసులు ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. పోలీసుల విషయం మీకు తెలియందికాదు. వాళ్ళు జైలు నుంచి పారిపోయిన ముగ్గురు ఖైదీల కోసం వెదుకుతున్నారు. మనల్ని చూసి ఖైదీలని అనేస్తారు. సాక్షాత్తూ ఆ భగవంతుడు దొరికినా ఆయనమీద రెండు మర్డర్ కేసులూ, మూడు రేప్ కేసులూ బనాయిస్తారు. కనుక మనం పోలీసుల్ని తప్పించుకోవాలి" అన్నాడు.