రాహుల్ శని, ఆదివారాలొచ్చి తల్లిదగ్గిర వుంటున్నాడు.
డాక్టర్ రౌండ్స్ కి వచ్చారు. నీరదని పరీక్షించి, రిపోర్టులు, టెస్టులు అన్నీ మళ్ళీ పరీక్షించి "గుడ్ ఇంప్రూవ్ మెంట్. రక్తంలో మత్తు డెబ్భైశాతం తగ్గింది. ఫిజికల్ గా ఆమె కోలుకుంటోంది. ట్రీట్ మెంట్ కి మంచి రెస్పాన్స్ వుంది. ఎటొచ్చీ మానసికంగా ఇంకా కోలుకోవాలి. ఇంకో వారం పదిరోజుల్లో ఆ మార్పూ రావచ్చని ఆశిద్దాం... మీరు కొద్ది కొద్దిగా ఘనాహారం నోటిద్వారా తినిపించండి. తెలివిలో వున్నప్పుడు కొద్దికొద్దిగా ఆహారం ఎలాగైనా తినిపించడానికి ప్రయత్నిస్తూ వుండాలి."
అన్నీ శ్రద్ధగా విపులీకరించారు డాక్టరుగారు.
శారద థ్యాంక్స్ చెప్పింది సంతోషంగా.
* * *
"సునీతా! ఇవాళ రంజని ఆఫీసుకి వచ్చి చాలా గొడవ చేసింది. స్టాఫ్ అందరిముందూ చాలా అసహ్యంగా సీన్ క్రియేట్ చేసింది. ఆమెని ఎలా ఫేస్ చెయ్యాలో, ఎలా వదిలించుకోవాలో అర్థంకాలేదు. అందరిముందూ తల దించుకునే పరిస్థితి తెచ్చింది..." ఆఫీసునుంచి ఇంటికొచ్చి తలపట్టుకుని కూర్చుని అన్నాడు.
సునీత ఒక్కక్షణం ఆలోచించింది.
"రేపు ముందు ఆమెకి మూడు నెలల జీతం ఇచ్చి ఉద్యోగంలోంచి టెర్మినేట్ చేయండి. సజావుగా వినకపోతే ఆఫీసులో న్యూసెన్స్ క్రియేట్ చేస్తోందని పోలీసు కంప్లయింట్ ఇస్తానని బెదిరించండి... ముందామెని ఆఫీసుకి రాకుండా చూడండి. వీలయితే ఎవరైనా మధ్యవర్తి ద్వారా పరిష్కారం జరిగేట్టు చూడండి... సామరస్యంగా పని జరిగేట్టు చూడండి వీలైనంతవరకు. డిమాండ్ చేస్తే కొంత డబ్బు ముట్టచెప్పండి పరిహారంగా, చేసిన తప్పుకి... రంజనిలాంటి వాళ్ళు సాధారణంగా డబ్బు ఆశకి లొంగుతారు" అంది సునీత.
సాలోచనగా చూశాడు రవీంద్ర.
* * *
"ఏమిటి ప్రకాష్... ఈమధ్య ఇంత ఆలస్యం చేస్తున్నావు రావడం? టైమెంతయిందిప్పుడు? పదకొండు... ఇంత రాత్రివరకు ఆఫీసులో పనేమిటి... రాహుల్ కోసం అన్నా త్వరగా రా. శారద ఎలాగో లేదు... నీవన్నా కాస్త తొందరగా వచ్చి వాడితో కాసేపు గడపకపోతే ఎలా... సరే పదా, బట్టలు మార్చుకురా అన్నం తిందువుగాని" సత్యవతి అంది ఆవలిస్తూ.
"అన్నం తినే వచ్చాను... ఏవో ఇంపార్టెంట్ కేసులున్నాయి. కాగితాలు చూసుకుంటుంటే ఆలస్యం అయింది..." అన్నాడు ప్రకాష్ తల్లిముఖం చూడకుండా.
సుప్రియ జీవితంలో ప్రవేశించాక అతనికి పనిపట్ల శ్రద్ధ తగ్గింది. బలవంతంగా ఏడుగంటలవరకు ఆఫీసుపని చూసి సుప్రియ ఇంటికి చేరడం ఆమె ఇచ్చే విందుతోపాటు, అందాల విందులు చవిచూసి ఏ పదకొండింటికో ఇల్లు చేరడం... వారంలో కనీసం మూడురోజులు ఇదే దినచర్య అయింది.
* * *
బ్యాంక్ మొదటి విడత డిపాజిట్ కట్టడానికి కమిటీ, కోర్టు ఇచ్చిన ఆఖరి తేదీ నాటికి కోర్టు ఆర్డర్ ప్రకారం నలభైశాతం అప్పు చెల్లగొడుతూ చెక్కులు పంపారు పెద్ద మనుషులు. పేపర్లలో ఆ వార్త చూసిన డిపాజిటర్ల ఆనందానికి హద్దులు లేవు. ఇన్నాళ్ళకి మంచిరోజులు వచ్చాయి అని ఆనందపడ్డారు.
కనీసం డిపాజిట్ లో నలభయ్యో వంతు అయినా వచ్చి కొద్దిగానైనా వెసులుబాటు లభిస్తుందని సంబరపడ్డారు.
'ఉషోదయం' పత్రికకి లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ చేసి వారి పుణ్యాన తమకి కాస్త పోయిన ప్రాణం వచ్చిందని అభినందించారు. తమకు అన్యాయం జరిగినా కనీసం తమవల్ల కొంతమందికైనా న్యాయం జరిగిందని నారాయణమూర్తిగారు సంతోషించారు.
"అంకుల్, నీరదకిది తెలిసిననాడు ఎంత సంబరపడుతుంది! ప్చ్, ఆమెకి తెలివివచ్చి ఇది తెలిస్తే ఎంత బాగుండును" ఉద్విగ్నంగా అన్నాడు శ్రీను.
"బి పేషన్స్ మై బాయ్... భగవంతుణ్ణి నమ్ముదాం. మంచిచేసినవారికి ఏదోరోజు న్యాయమే జరుగుతుందని అంటారు. అది నమ్ముదాం" అన్నారు.
బ్యాంక్ డిపాజిటర్లకి ఫలానా తేదీనించి నలభై శాతం డిపాజిట్టు చెల్లింపులు ఇస్తాం అన్న ప్రకటన నాలుగురోజుల తర్వాత వెలువడింది.
* * *
ఆ రోజు శారద ఆస్పత్రిలో వుండగా స్కూలు ప్రిన్సిపాల్ రాహుల్, ఇంకో అబ్బాయి కొట్టుకున్నారని, ఆ దెబ్బలాటలో రాహుల్ ని ఆ అబ్బాయి తోసిన తోపుకి రాహుల్ వెళ్లి ఒక రాయిమీద పడ్డాడని, అతని తల చిల్లుపడి బాగా రక్తం కారిందని, స్పృహ కోల్పోయాడని వెంటనే రమ్మని హడావిడిగా ఫోను చేసి చెప్పింది.
శారదకి ఖంగారు, భయంతో కాళ్ళూ, చేతులూ ఆడలేదు.
టైమింకా పది కాలేదు. ప్రకాష్ కోర్టుకెళ్ళి వుండడు. అతనికి ఫోను చేస్తే సెల్ ఆఫ్ లో వుంది. రెండుసార్లు ప్రయత్నించి దొరకక ఇంక ఫోన్ చేస్తూ కూర్చుంటే ఆలస్యం అవుతుందని నీరద దగ్గర ఒక నర్సుని బతిమాలి కూర్చోపెట్టి గబగబా ఆటోలో ఆఫీసుకెళ్ళింది. పరుగులాంటి నడకతో అతని రూమువైపు వెళ్ళి తలుపుతీసి "ఏమిటి సెల్ ఆఫ్ చేసి కూర్చున్నారు" అంటూ లోపలికి అడుగిడబోయిన శారద, గుమ్మంలోనే నిశ్చేష్టురాలై నిలబడిపోయింది.
ప్రకాష్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుండగా, సుప్రియ వెనకనించి అతని రెండు భుజాలమీదా చేతులువేసి తలకి తల దగ్గర చేర్చి చెవిలో ఏదో అంటోంది. ప్రకాష్ ఎడమ చెయ్యి వెనక్కి జాపి చాలా జాలీమూడ్ లో ఆమె మొహాన్ని తన మొహంవైపు లాక్కుంటున్నాడు. ఆ దృశ్యం చూసి శారద నిర్ఘాంతపోయి నిలబడిపోయింది.
శారదని చూసి ప్రకాష్, సుప్రియల మొహాలు తెల్లబడ్డాయి.
ఒక్క ఉదుటున లేచాడు ప్రకాష్... మాట కూడదీసుకుని ఏదో అనేలోపల శారద అతనివంకా, సుప్రియవంకా మార్చి మార్చి చూసి ఒక్కమాట మాట్లాడకుండా గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.
ప్రకాష్ మొహం మాడిపోయింది.
సుప్రియ గాభరాగా "శారద మనల్ని చూసింది. ఇప్పుడెలా..." భయంగా అంది.