"మనుషుల్ని తినే... ఆటవిక జాతి ఏమైనా ఉందా" ఆ మాటకు నవ్వాడు పగడం దొర.
"ఏ ఆటవికుడూ మనుషుల్ని తినడు. ఆకలేస్తే ఎక్కడా తిండి దొరక్కపోతే... ఆటవికుడైనా... నాగరికుడైనా మనుషుల్ని తింటాడు" చెప్పాడు పగడం దొర.
కపాలకోన ఆటవికులు వాయిద్యాల హోరుతో, ఊరు శివార్ల వరకూ వచ్చి ఇందుమతి బృందానికి వీడ్కోలు పలికారు.
* * * *
"ఆ సామాను అందరూ మొయ్యడం ఎందుకు నాకివ్వండి నేను మోస్తాను" దారిలో సింహిక అంది.
ఇందుమతి అంగీకారంతో అందరూ తమ లగేజీని సింహికకు ఇచ్చేసారు.
దాదాపు యాభై కేజీలు లగేజీ.
ఆ లగేజీ భుజాన వేసుకుని, కుందేలు పిల్లలా- చెంగు చెంగున కొండమీదకు దూసుకెళుతున్న సింహిక బలాన్ని చూసిన యువరాజుకే తల తిరిగిపోయింది.
"ఇది మనిషి కాదు రాక్షసి" కపాలేశ్వర్ చెవిలో గొణిగింది వైశాలి.
"గట్టిగా అనకు నన్ను నమిలేస్తుంది" కపాలేశ్వర్ హెచ్చరించాడు.
"డోన్ట్ పుట్ కామెంట్స్" ఇందుమతి కోపంగా అంది.
* * * *
కాలంలా కొడలు వెనక్కిపోతున్నాయి. పగలూ, రేయి కన్నిప్పి కళ్ళు మూసేటంతలో మాయమైపోతున్నాయి.
అడవిలో ప్రతి పుట్టా, గుట్టా విషయం తెలిసిన సింహిక ఉండడంవల్ల వారి ప్రయాణం మరింత సులభతరమైంది.
వారం రోజులు గడిచాయి. మధ్యలో అరడజను ఎలుగుబంట్లను రెండు కొండ చిలువల్ని చంపేసింది సింహిక. "ఇక నుంచి, మా తుపాకులు... ఈటెలు... బల్లేలు... ట్రాంకిలైజర్స్ అనవసరమే" యువరాజు మాటలకు నవ్వింది సింహిక.
"ఎంతయినా నేనూ ఆడమనిషినే మగవాడి ముందు దిగదుడుపే కదా..." అలవోకగా అనేసి ముందుకెళ్ళిపోయింది సింహిక.
ఆ మాట అర్ధమై మనసులోనే నవ్వుకుంది ఇందుమతి.
"హమ్మ... రాక్షస గుంట. ఎంత గూఢమైన మాటందోయ్ యువరాజూ" చెవిలో గొణిగాడు కపాలేశ్వర్.
"ఇదే... ఇలా ఉంటే... దీని మొగుడెలా వుండేవాడో" ఆశ్చర్యపోతూ అంది వైశాలి.
"తీరుబడి చూసుకుని అడుగు చెప్తుందేమో" జోకేసింది ఇందుమతి.
"అలాంటి పిచ్చి ప్రశ్నలు... అడక్కండి- మొగుడ్ని జ్ఞాపకం చేస్తే... అదెలా రియాక్టు అవుతుందో" యువరాజు అన్నాడు.
దారిలో అలుపు తెలియకుండా ఉండడానికి, కపాలేశ్వర్ అప్పుడప్పుడు తనకు తెలిసిన విషయాలు చెప్పడం ప్రారంభించాడు.
"మన భారతదేశంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎన్నో వనదుర్గాలున్నాయమ్మా- ఉత్తర భారతదేశంలో ఆరవిల్లి కొండల్లో వున్న అంబర్ కోట, రాంతంబోర్ కోట, శివాజీ మరాఠాకోట... ఇవన్నీ వనదుర్గాలే.
చరిత్రలో అంబర్ కోటకి, దేవులపల్లి కోటకి, చాలా దగ్గర పోలికలున్నాయి భూమాత పేరు మీద వెలసిన కోట అంబర్ పేట... గిరిజనుల్లో ఒక తెగ అయిన మీనా తెగ ఆధీనంలో ఉండేదా కోట. మీనా తెగ ఆటవికులు. విలువిద్యలో నిపుణులు... సమీపంలో నున్న కచేవకోట మీద దాడి జరిగినప్పుడు... ఆ కచేవ మహారాణి, తన కొడుకు ధోలారావుతో మీనా తెగ ఆటవికులు దగ్గరకొచ్చి ఆశ్రయం కోరింది. వాళ్ళు ఆశ్రయం ఇచ్చి, ఆ యువరాజు ధోలారావుకి, విలువిద్య నేర్పడంతో పాటు, యుద్ధ విద్యలన్నీ నేర్పి, వీరుడిగా తయారుచేశారు. పెద్దవాడైన ధోలారావు 1150 సంవత్సరంలో తన శత్రువులమీద పగ తీర్చుకున్నాడు. సామ్రాజ్యాన్ని కోటని విస్తరింప చేశాడు.
అంబర్ కోట అనగానే చరిత్రలో నిలిచే రాజులు ఇద్దరే ఉన్నారు. ఒకరు రాజా మాన్ సింగ్, జైసింగ్. మొట్టమొదట మన దేశంలో మార్షల్ ఆర్ట్స్ ని ప్రవేశపెట్టిన రాజు మాన్ సింగ్. 1555 నుంచి 1700 వరకూ అంబర్ కోట అద్భుతమయిన పరాక్రమానికి గుర్తుగా పరిఢవిల్లింది. ఆ తర్వాత 1728లో రెండవ జైసింగ్, జైపూర్ ని రాజధానిగా చేసి అక్కడ కోట కట్టడంతో అంబర్ కోట వైభవం తగ్గిపోయింది. ఏడుగేట్లతో విశాలమయిన అంబర్ కోట ప్రస్తుతం విదేశీ యాత్రికులనే ఆకర్షిస్తోంది. గొప్ప విషయమేమంటే, అంబర్ కోటను పరిపాలించిన రాజులు... శ్రీరాముని వంశంలోని వారట... అంటే సూర్యవంశం రాజులు.
ఆర్కియాలజిస్టులు చెప్పిన దాని ప్రకారం... అంబర్ కోట 'మీనా తెగ' ఆటవికులు వెయ్యి సంవత్సరాల క్రితమే వనదుర్గాన్ని నిర్మించడమే కాకుండా... ఆ దుర్గంలోంచి... వనంలోకి... అంటే ఆరావళి కొండల్లోకి రహస్య మార్గాన్ని నిర్మింపజేశారు... వనంలోకి... అంటే ఆరావళి కొండల్లోకి రహస్య మార్గాన్ని నిర్మింపజేశారు... వందేళ్ళక్రితం, ఆ రహస్య మార్గం ఆర్కియాలజిస్టుల పరిశోధనలో బయటపడింది. అడవిలోని సగభాగం వరకే, ఆ మార్గాన్ని వారు కనుక్కోగలిగారు... ఆ మార్గమే వందమైళ్ళ పొడవు వరకూ ఉంది" చెప్పడం ఆపేడు కపాలేశ్వర్.
దేవులపల్లి కోటకు నీటి సరఫరా విషయంలో దబ్బలపాడు జలపాతం దగ్గర ముఖ్యమైన సమాచారం దొరకడానికి ఆస్కారం ఉందని, అలాగే ఫూల్ బాగ్ ప్యాలెస్ నుంచి రహస్య మార్గం విషయం విశ్వరూప శర్మ చెప్పడం జ్ఞాపకాని కొచ్చింది ఇందుమతికి.
"దబ్బలపాడు... ఇంకెంత దూరం ఉంది" అడిగింది ఇందుమతి.
"పదిహేను గవ్యూతులుంది" చెప్పింది సింహిక.
గవ్యూతుల్ని, మైళ్ళల్లోకి అనువదించాడు ముత్యాలనాయుడు.
అక్కడికి-
ముప్పై మైళ్ళ దూరంలో వుంది దబ్బలపాడు.
దబ్బలపాడు నిధి అన్వేషణలో ప్రధానమైన మలుపుకి కారణమౌతుందన్న నమ్మకంతో ఉంది ఇందుమతి.
ఆమె నడకలో జోరు హెచ్చింది.
* * * *
సాయంత్రం నాలుగు గంటలు దాటింది. వరసగా, అంతెత్తునున్న ఎర్రమట్టి దిబ్బల్లోంచి నడుస్తున్నారు.
పడమర సూర్యుని ఎండలో ఎర్రమట్టి దిబ్బలు, నెత్తురు గడ్డల్లా మెరుస్తున్నాయి.
ఎవరో రాక్షస విసనకర్రల్తో, విసురుతున్నట్లుగా పెనుఝంఝానిల షడ్జధ్యానం వినిపించడంతో-
సింహిక ఉలిక్కిపడింది.
అందర్నీ ఆగమన్నట్లుగా చేత్తో సూచించి, తను గట్టెక్కి చూసింది కుడివేపు చివర-
వందలాది రాబందులు... కేరు కేరుమంటూ ఎగురుతున్నాయి. అవి మామూలు రాబందులకంటే, రెండు రెట్లు పెద్దవిగా వున్నాయి.
అవి మనుషుల్ని, నిలువునా, పీక్కుతినే రాబందులు, సింహిక భయంగా గుట్టదిగిపోయి-
"మనం దారి తప్పిపోయాం... ప్రమాదంలో పడ్డాం" అరుస్తూ చెప్పింది.
"ఏం జరిగింది" అడిగింది ఇందుమతి.
"రాక్షస రాబందులు... మనుషుల్ని చూస్తే ఎత్తుకెళ్ళిపోయి తినేస్తాయి."
"అన్ని రాబందులు ఒక్కచోటే ఎందుకున్నాయి" అడిగాడు యువరాజు.
"నాకు తెలీదు. ఈ ప్రాంతానికి నేనెప్పుడూ రాలేదు" చెప్పింది సింహిక.
"రాబందులు శవాలున్నచోట... ఉంటాయి... అంటే అది ఆటవిక స్మశానమేమో"
కపాలేశ్వర్ వేపు అనుమానంగా చూసింది ఇందుమతి.
"చీకటి... పడితే రాబందులు వెళ్ళిపోతాయి. అప్పుడా ప్రాంతానికి వెళితే" యువరాజు అన్నాడు.
"వెళితే... ఏం ఉపయోగం" అడిగింది వైశాలి.
"ఏదైనా క్లూ దొరుకుతుందేమో" ఇందుమతి కళ్ళవేపు చూస్తూ అన్నాడు యువరాజు.
"ఓకే రాజూ- ఈ రోజు రాత్రికి ఇక్కడే స్టేచేద్దాం" ఇందుమతి మాటతో మళ్ళీ అందరూ వెనక్కి దట్టమయిన చెట్ల మధ్యకు వచ్చారు. అప్పటికప్పుడే.
టెంట్లు తయారయాయి.
నెమ్మదిగా ఆకాశం ఎరుపురంగులోంచి బూడిద రంగులోకి, బూడిద రంగులోంచి నల్లటి రంగులోకి మారుతోంది.
ఆకాశంలో-
వింతలు వింత చాపలు ఎగురుతున్నట్లు, రాబందులు... అక్కడ నుంచి వెనుదిరగటం ప్రారంభించాయి.
రాబందులన్నీ అక్కడ నుంచి, వెనుదిరిగాక, నిప్పురాజేసి... జొన్నరొట్టెలు చెయ్యడం మొదలుపెట్టాడు ముత్యాలనాయుడు. వైశాలి సహాయం చేస్తోంది.
రాబందులు తిరిగిన ప్రదేశానికి వెళ్లడానికి ఉద్యుక్తులౌతున్నారు యువరాజు, ఇందుమతి.
"మీరు మీ పని మీదుండండి. నేను నా పని మీదుంటాను" ఇందుమతి చెవిలో మెల్లగా అంది సింహిక.
"ఏంటా పని"
"జీలుక్కల్లు"
"వెళ్ళు... త్వరగా వచ్చేస్తావా?"
తలూపుతూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ చీకటిలో కెళ్ళిపోయింది సింహిక.
కపాలేశ్వర్, వైశాలి ఒకరి మీదొకరు, జోకులేసుకుంటూ... వంట కార్యక్రమంలో ముత్యాలనాయుడికి సహాయం చేస్తున్నారు.
"బయలుదేరదామా" అన్నాడు యువరాజు.
"ముత్యాలూ... మేం వెళుతున్నాం... జాగ్రత్త" చెప్పింది ఇందుమతి. ముందుకు నడిచారిద్దరూ.
* * * *
సన్నటి వెన్నల వెలుగు- అడ్డదిడ్డంగా ఉన్న దారంట నడుస్తున్నారిద్దరూ.
"మేడమ్... నేనూహించిందే నిజమయితే... ఇక్కడ మనకు కీలకమయిన ఇన్ ఫర్ మేషన్ దొరకాలి. ఎందుకంటే... ట్రెజర్ హంటింగ్ కోసం... ఫారెస్ట్ లో కొచ్చిన అమెరికన్స్... మరి బయటకు రాలేదు. అలాగే ఒక విమానం ఈ అడవుల్లో పడిపోయిందన్నారు ఈ రెంటికి సంబంధించిన ఏదో ఒక క్లూ మనకు దొరకాలి" యువరాజు ఉద్దేశ్యంతో ఇందుమతి కూడా ఏకీభవించింది.
"ఇవ్వేవీ దొరక్కపోతే... అది స్మశానమైనా కావాలి. స్మశానంలోనైనా, ఏదో క్లూ దొరక్క మానదు" మళ్ళీ అన్నాడు యువరాజు.