20 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి లక్షల్లో డిపాజిట్స్ వసూలుచేసి వాటితోనే వ్యాపారాన్ని ఆరంభించాడు. కనీసం లైసెన్స్ కన్నా అడ్డం తగలమంటే పట్టించుకోలేదు. లైసెన్స్ వచ్చింది. ఫారెన్ నుంచి మెషినరీ కూడా వచ్చింది. గుప్తాని, ఛటర్జీని తనవేపు తిప్పుకున్నాడు. ఇంకా మీరు నమ్మలేకపోతున్నారు. అందుకే ఎలాంటి చర్య తీసుకోవటం లేదు. అతను ప్రయోజకుడిగా నిరూపించబడితే మీరు అతనిముందు ఓటమితో తలవంచాలి, నేను అతని కాళ్ళదగ్గరకు వెళ్ళాలి.
నా ప్రతి చెమటచుక్క ఒక లక్షగా మారుతుంది. దెబ్బతిన్న పులిలో పగబట్టిన పాములో వుండే కసికి లక్ష్యశుద్ధి తోడైతే ఎంతటి వేటగాడికైనా దుర్మరణం తప్పదని ప్రతినబూనాడు గుర్తుందా నాన్నగారు... ?"
చదువు నేర్పేది చాలా తక్కువ. నేర్పనివి చాలా ఎక్కువ. ఆ ఎక్కువతో అలాంటి తక్కువల్ని నా గుప్పిట్లోకి తెచ్చుకుంటానని కూడా అన్నాడు- మర్చిపోయారా?
నా మూడో కన్ను తెరుచుకొనే వరకే నీ బతుకు అని కూడా అన్నాడు. అప్పుడే మర్చి..."
"స్టాపిట్ బేబీ" సుదర్శన్ రావు అరిచిన అరుపుకు ఆ గది ప్రతిధ్వనించి పోయింది.
"అదే నాన్నగారు, నేను నీనుంచి ఆశించింది" ఆనందంగా అంది ప్రియాంక కోపంతో ఊగిపోతున్న తండ్రిని చూసి.
"వాడు రేపటి పొద్దు చూడకుండా చేస్తాను" అన్నాడు ఆవేశంగా సుదర్శన్ రావు.
"అలా అనుకుంటే ఈ దేశంలో ప్రధానిని చంపటం కూడా తేలికే అది రుజువయింది కూడా. కానది బలవంతుల పిరికితనం క్రిందకొస్తుంది అతన్ని చంపటం అంటే, అతనిమీద తెలివిగా గెలవటం నాకు చాతకాదని ఒప్పుకున్నట్టేగా...?"
కూతురువేపు ఆశ్చర్యంగా చూసాడు సుదర్శన్ రావు.
"అంటే...?" కూతురు అంతరంగాన్ని అర్ధం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు సుదర్శన్ రావు.
"అంటే ఏముంది? అతనెక్కడ గెలుస్తాడో అనే భయంతో చంపేయటమే గదా? అతనూ మిమ్మల్ని చంపుతానని శపధం చేస్తే అప్పుడిక ఒకర్నొకరు చంపేందుకు సిద్ధపడటంలో తప్పులేదు. కాని అతనన్నదేమిటి? మీకంటే ఎక్కువ సంపాదిస్తానని. చేతనైతే మన సంపదని పెంచండి. అతనెప్పటికీ మనకన్నా ఎక్కువ సంపాదించలేడని రుజువు చేయండి. లేదంటే అతను సంపాదించకుండా అడ్డు పడండి--"
"ఇంతకీ నీవనేదేమిటి?" యోగేష్ ఒకింత కోపంగా అన్నాడు.
"అతన్ని చంపే ప్రయత్నాలు అనవసరం. అతని అభివృద్ధిని అడ్డు కోవటమే మనం తక్షణం తీసుకోవల్సిన చర్య."
ప్రియాంకకు ఎందుకోగాని త్రినాధ్ ని మట్టుబెట్టటం ఎంతమాత్రం ఇష్టంలేదు. ఈ 'ఎందుకో' అనేది ఆమెకే తెలియదింకా.
"సరే బేబీ... ఇప్పుడు మనం చేయవల్సిందేమిటి-?
కూతురులో వచ్చిన మార్పుకు అతను ఆనందిస్తున్నాడు.
తను సంపాదించిన యావదాస్తిలో సగభాగానికి వారసురాలు కాబోయే తన కూతురు ప్రత్యర్ధిని చిత్తు చేయాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టిందంటే, తను సంక్రమింపజేసే ఆస్తిని నిలబెట్టుకోగలదు- అదే సుదర్శన్ రావు ఆనందం.
అతను తెప్పించిన మెషనరీని ఆపరేట్ చేయగల టెక్నిషియన్ ఇండియాలో ఒక్కడే వున్నాడు. అతనిప్పుడు మైకో, బెంగుళూరులో ఉన్నాడు. అతన్ని రప్పించుకొనేందుకు త్రినాధ్ గుప్తాని బెంగుళూరు పంపించాడు. ఎల్లుండే గుప్తా ఆ వ్యక్తిని తీసుకొని బెంగుళూరు నుంచి బయలుదేరుతున్నాడు... ఆమె చెప్పుకుపోతోంది.
వాళ్ళిద్దరూ నిశ్శబ్దంగా వింటున్నారు.
* * * *
జీప్ ఆగిన శబ్దానికి బోస్ పరిగెత్తుకు వచ్చాడు.
"బోస్... నువ్వు ఈ సాయంత్రమే బెంగుళూరు వెళ్ళాలి..." అన్నాడు త్రినాధ్ జీప్ దిగుతూ.
"గుప్తా వెళ్ళారుకదా?" బోస్ కి అర్ధం కావటంలేదు. త్రినాధ్ తనను గూడా ఎందుకు వెళ్ళ మంటున్నాడో.
"వెళ్ళినా సరే" స్థిరంగా అన్నాడు త్రినాధ్.
బోస్ వెంటనే తను వెళ్ళక తప్పదనే నిర్ణయానికొచ్చాడు.
"మరి... ఈ మెషనరీ రక్షణ...?" బోస్ ఆలోచన వేరుగా ఉంది. తను మెషినరీకి రక్షణగా లేకుంటే సుదర్శన్ రావు మనుష్యులు ఏ క్షణానైనా వచ్చి దాన్ని ధ్వంసం చేస్తారేమోనని.
"ప్రియాంక మనస్తత్వం నాకు తెలుసు. మన మెషినరీని నాశనం చేయకుండా ఆమే వాళ్ళ నాన్నని ఆపేస్తుంది.
ప్రియాంకపై త్రినాధ్ కున్న నమ్మకమేమిటో బోస్ కి అర్ధంకాలేదు. ఇంకా సందేహిస్తూనే వున్నాడు.
"మెషినరీ ఎంత ముఖ్యమో, దాన్ని నడిపించగల వ్యక్తి కూడా మనకంతే ముఖ్యం. నీవు ఈవెనింగ్ ఫ్లైట్ కే బెంగుళూరు వెళుతున్నావ్. నేను అప్పగించబోయే పనిని నీవు సక్రమంగా నెరవేర్చుకు రావటానికి. మెషనరీ ఏమయిపోతుందోనన్న భయం నిన్ను మానసికంగా వెనక్కు లాగవచ్చు. ప్రియాంక ఆ పని చేయనివ్వదనే నా విశ్లేషణను నీకు అర్ధమయ్యేరీతిలో చెప్పే టైమ్ ఇప్పుడు లేదు కనుక నేనే నీవు వచ్చేవరకూ ఈ మెషినరీకి కాపలాగా వుంటాను. అదీ కేవలం నీ తృప్తి కోసం. ఇక నీవు చేయవలసింది..." చెప్పుకుపోతున్నాడు త్రినాధ్ సీరియస్ గా.
మరుసటిరోజు ఉదయం ఆరుగంటల సమయం- మాలినిని ఎక్కించుకున్న జీప్ సరాసరి ఆఫీసుకి వెళ్ళకుండా షెడ్ వైపు బయలుదేరింది.
జీప్ షెడ్ ముందాగింది.
ఆమె జీప్ దిగుతూనే ప్రశాంత వదనంతో షెడ్ వైపు చూసింది.
త్రినాధ్ షెడ్ షట్టర్ ను పైకిలేపి ఆమెను లోపలకు రమ్మన్నట్లుగా చూసాడు.
మాలిని లోపలకు నడిచి నలువైపులా పరికించి చూసింది. నీట్ గా వున్న పెద్ద ఖాళీ షెడ్- ఓ చివర బిగించి వున్న పెద్ద యంత్రం. దానిపై కప్పిన పాలిథిన్ పేపర్. సంతృప్తిగా తల పంకించి ఆ షెడ్ ఓ చివరకు వెళ్ళి నిల్చుంది. ఆ చివర కొన్నివందల డ్రమ్ములు పొందికగా పేర్చి వున్నాయి.
"నీకీ రోజు అమెరికాలో జరిగిన ఒక చిత్రమైన సంఘటన గురించి వివరిస్తాను. దీని నుంచి నీవో గుణపాఠం తప్పు చేయకుండానే గ్రహించాలి.
అప్పటికే సర్వేంద్రియాలు ఆమె చెప్పే విషయాలపై కేంద్రీకృతమయ్యాయి.
"ప్రపంచ ప్రఖ్యాత పరిశోధకుడు- పరిశోధకులకెల్లా భాగ్యవంతుడు ఒకరున్నారు. అతనే థామస్ ఆల్వా ఎడిసన్. అతను 'ఫైండ్ ఏ నీడ్ అండ్ ఫిలిట్' సూత్రం విలువను గుర్తించాడు. ఆ పద్ధతిలో అతను ఎన్నో కొత్త వస్తువుల్ని కనిపెట్టాడు. వాటితో కోట్లకు కోట్లు గడించాడు. అయితే అతను చిన్న వయస్సులో వుండగానే ఒక యంత్రాన్ని కనిపెట్టాడు. అది ఓట్ రికార్డింగ్ మెషిన్. ప్రజా ప్రతినిధుల సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టినప్పుడు సభ్యులంతా దానికి అనుకూలంగానో, అననుకూలంగానో ఓటు చేస్తుంటారు. ఓటు వేసే విధానం జాప్యంతో కూడుకున్నది. ముందు అందరికి స్లిప్స్ పంచటం, వారు తమ ఓటు ముద్ర వేయగానే మరలా ఒక వ్యక్తి వెళ్ళి ఒక పెట్టెలో వాటన్నిటిని కలెక్ట్ చేసుకురావటం ఆ తరువాత ఆ పెట్టెను ఓపెన్ చేసి వాటిని లెక్కించటం- అప్పుడు ఆ తీర్మానం నెగ్గిందో, వీగిందో సభకు తెలియపర్చటం- అంత తతంగం వుండటం మూలంగానే ఎంతో జాప్యం జరిగేది.
ఈ విషయాన్ని ఎడిసన్ గ్రహించాడు. ఆ ఓటింగ్ ప్రాసెస్ ని వేగతరం చేసే పరికరాన్ని కనిపెట్టగలిగితే అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజా ప్రతినిధుల సభల్లోనేకాక, విదేశీ సభల్లో సయితం బాగా అమ్ముడుపోతుందని ఒక నిర్ణయానికొచ్చి రాత్రింబవళ్ళు శ్రమించి ఓటింగ్ మెషిన్ కనుగొన్నాడు.
ప్రతి లెజిస్లేటర్ టేబుల్ కి ఒక స్విచ్ బిగించి దాన్ని స్పీకర్ ప్రక్కనే ఏర్పాటుచేసిన ఓట్ రికార్డింగ్ మెషిన్ కి కనెక్ట్ చేస్తారు. సభలో తీర్మానం చదవగానే ప్రతినిధి తన అభిప్రాయాన్ని ఆ స్విచ్ ని ఎడంవేపుకిగాని, కుడివైపుకిగాని ప్రెస్ చేయటంద్వారా క్షణాల్లో తెలియపర్చవచ్చు.
వందలమంది లెజిస్లేటర్స్ వున్న సభలో అయినా కేవలం కొద్ది నిమిషాల్లోనే ఆ తీర్మానం నెగ్గటమో, వీగిపోవడమో జరిగిపోతుంది.
అలాంటి ఓటింగ్ యంత్రాన్ని తీసుకొని తక్షణం వాషింగ్టన్ బయలుదేరాడు ఎడిసన్. అతని ఉద్దేశం- ఆ యంత్రాన్ని కాంగ్రెషనల్ కమిటీస్ చైర్ మన్ కి చూపించి పెద్ద మొత్తంలో ఆర్డర్ సంపాదించటమే.
అంత చిన్న వయస్సులోనే ఒక కొత్త పరికరాన్ని కనిపెట్టాడని చైర్ మన్ ఎడిసన్ ని చూసి ఆశ్చర్యపోయి అతనికి టైమ్ యిచ్చాడు.
ఎడిసన్ తను కనిపెట్టిన యంత్రం గురించి వివరంగా తెలియపర్చాడు.
విన్న వెంటనే చైర్ మన్ 'యంగ్ ఫెలో యువర్ మెషిన్ ఈజ్ ఎక్స్ లెంట్' అని అభినందించాడు.
ఎడిసన్ కి చైర్ మన్ ప్రశంస చాలా ఆనందాల్ని కలిగించింది. ఎంత మొత్తంలో ఆర్డర్ ఇస్తాడో అని ఎడిసన్ ఆశగా ఎదురుచూస్తుండగా చైర్ మన్ అన్నాడు -
"ఈ యంత్రం మాకు అవసరంలేదు. నిజం చెప్పాలంటే ఇది కొత్త ఇబ్బందుల్ని తెచ్చి పెడుతుంది. మాకంత త్వరగా ఏ తీర్మానం ఒక కొలిక్కి రాగూడదు. తీర్మానం వినిపించిన కొద్ది క్షణాల్లోనే దాని భవిష్యత్ నిర్ణయించబడితే మాకు చాలా నష్టం. ఒక మంచి తీర్మానాన్ని సయితం తిరగ్గొట్టాలంటే మాకు టైముంటేనే సభ్యుల్ని బెదిరించగలిగేది. లేదంటే ఒక చెడు తీర్మానాన్ని నెగ్గించుకోవాలన్నా డ్రామా ఆడటానికి, ప్రలోభ పెట్టటానికి మాకు టైముండాలిగదా? నిజానికి నీ మెషిన్ చాలా కాలాన్ని పొదుపు చేస్తుంది. ప్రజల డబ్బుతో నిర్వహింపబడే లెజిస్లేచర్ సమావేశాల ఖర్చు తగ్గిపోతుంది.
కానిక్కడ ప్రజలకు సంబంధించిన మంచి నిర్ణయాలు జాప్యం లేకుండా తీసుకుందామనే ఆలోచన ఉన్న ప్రజా ప్రతినిధులు పదిశాతం కూడా లేరు. ఇప్పుడు నేను ఆర్డర్ ఇచ్చి నీ యంత్రాన్ని కొంటే నా చైర్ మన్ పదవి వుంచాలా లేదా అన్న విషయంపై తీర్మానాన్ని పెట్టి, నీ యంత్రం ద్వారానే క్షణాల్లో నన్ను తొలగిస్తారు.
ఈ యంత్రం లేనప్పుడు నా పదవిపై తీర్మానం వచ్చిందనుకో- అప్పుడు టై ముందిగదా? నా వ్యతిరేకులందర్నీ కొనటమో, భయపెట్టడమో, ప్రలోభపెట్టటమో చేసి జాప్యానికి విలువ కట్టి నా పదవి దక్కించుకుంటాను.
ఇంకో గమ్మత్తు కూడా జరగవచ్చు. ఈ కొత్త యంత్రమేమిటి మతలబులకు అవకాశం యివ్వటంలేదని ఆ యంత్రాన్ని వుంచాలా లేదా అనే తీర్మానాన్ని సభ్యులంతా కలిసి ప్రవేశపెడితే క్షణాల్లో నీ యంత్రం అక్కడ నుంచి ఎగిరిపోతుంది.
ఒకవేళ నీ యంత్రమే నేను కొన్నాననుకో, నన్ను చూసి రాష్ట్రాలకు చెందిన శాసన సభలు, విధాన సభలు కొన్నాయనుకో నీకు కోట్లలో లాభం. దాంతో నీకు ఉత్సాహం పెరిగిపోయి జనరల్ ఎలక్షన్స్ సందర్భంలో ప్రజలు ఓటువేసే ప్రక్రియను కూడా యంత్రాన్ని కనిపెట్టావనుకో- అది ప్రజలకు నచ్చుతుంది. దాంతో మేము ఆ యంత్రాన్ని కూడా పెద్ద సంఖ్యలో కొనకతప్పదు. అప్పుడేమవుతుంది? ఎలక్షన్స్ లో నిలబడే అభ్యర్ధులకు దొంగ ఓట్లు వేయించుకొనే అవకాశం పోతుంది. ఓటర్స్ ని భయపెట్టే ఛాన్స్ అసలు పోతుంది.
"ఇప్పుడు చెప్పు బాబు ఏ రాజకీయ నాయకుడైనా నీ యంత్రాన్ని, నీ శోధనను అంగీకరిస్తాడా? అఫ్ కోర్స్... నీ అన్వేషణ గొప్పదే. నీ యంత్రమూ గొప్పదే. నా బాధ నీకు అర్ధమయిందా? కాకపోతే నేను ఒకటి చేయగలను. ఇంత చిన్న వయస్సులో ఇంత అమోఘమైన యంత్రాన్ని కనిపెట్టినందుకు నిన్ను మనసారా అభినందిస్తాను. నీవు చెప్పిన ధరకి ఈ యంత్రాన్ని నేనే కొని నా సొంత మ్యూజియమ్ లో షోపీస్ క్రింద పెట్టుకుంటాను- అని ఆ చైర్మన్ అనడంతో ఎడిసన్ షాక్ తిన్నాడు.