"వాళ్ళ అసిస్టెంటు పై నా అభిప్రాయం__"
"అదికాదమ్మా! నువ్వెళ్ళిపోయాక ఓ సంగతి చెప్పాడు.
"ఏమిటదీ?" కలవరపడింది విమల.
"నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా?"
మౌనంగా చూసింది విమల.
"సందేహం ఎందుకూ? చెప్పమ్మా! ఎవరతను?"
"ఫ్లయిట్ లెఫ్ ట్ నెంట్ జాన్సన్."
"జాన్సనా?" ఆయన అదరిపడ్డాడు.
శరీరంలోని రక్తమంతా మెదడులోకి ఎక్కినట్టు అయింది.
"మన కులమేమిటి? మన వంశం ఏమిటి?"
"మన మతంకూడా కాదు. కులం, వంశం అంటారేం డాడీ?"
"అదే నేనూ అనేది. క్రిస్టియన్ ను ప్రేమిస్తున్నావా?"
"అతని మతాన్ని ప్రేమించడంలేదు. అతనిని ప్రేమ్నిస్తున్నాను. అతడి పర్సనాలిటీ ప్రేమిస్తున్నాను."
"వాట్! డామ్ దట్ పర్సనాలిటీ బిజినెస్? ఆ మాట మళ్ళీ మళ్ళీ అనకు. నా మెదడు ఇప్పటికే ఉడికిపోతూ వుంది.
చౌదరికి సుత్తితో ఎవరో నెత్తిమీద బాదుతున్నట్టుగా వుంది.
డాక్టర్ చంద్ర చెప్పింది నిజమే.
ఎలా చెప్పగలిగాడూ?
విమల మనవును విప్పి చదివేశాడు క్షణంలో.
"డాడీ! లేవండి అంకుల్ పిలుస్తున్నారు."
విమల తండ్రికోసం ఆగకుండా బయటికి వెళ్ళిపోయింది.
ఆయన నెమ్మదిగా లేచాడు. మంత్రించిన బొమ్మలా అడుగులో అడుగు వేసుకొంటూ బయటికొచ్చాడు.
వరండాలో నడుస్తున్న చౌదరికి రౌండ్సు పూర్తిచేసుకొని వస్తున్న డాక్టర్ ఎదురుపడ్డాడు.
"చౌదరి సాబ్! రమణమూర్తి గారెక్కడా?"
"ఎవరో వస్తే వెళ్ళాడు. పదమూడో నంబరు గదిలో ఉండి ఉంటాడు."
"వెళ్ళేలోపున ఓసారొచ్చి కలిసి వెళ్ళమనండి. నేను ఆఫీసులో ఉంటాను. అర్జంటుగా మాట్లాడాలి" చెప్పాడాయన.
"చెప్తాను" అంటూ ముందుకు కదిలిన చౌదరి వెనకనుంచి పిలుపు వినిపించి ఆగిపోయాడు.
డాక్టర్ గబగబా అతడి దగ్గిరకొచ్చాడు.
"రమణమూర్తిగారితో మాట్లాడేముందు విషయం మీరుకూడా తెలుసుకొని ఉండటం మంచిదనుకొంటాను."
"ఏమిటది?" అతడు ఆశ్చర్యంగ ప్రశ్నించాడు.
"ఇంతకుముందే పోలీసుకమీషనర్ ఫోన్ చేశాడు."
"ఏమని!" అతడు అయోమయంగా చూస్తూ అన్నాడు.
"మీ ఆసుపత్రిలో ఒక వ్యక్తిని బలవంతంగా నిర్బంధించడం జరిగిందని అతనికి కంప్లయింట్ వచ్చిందట!"
"ఐతే?"
"కృష్ణ గురించేనని నా అనుమానం! అలాటి కేసులేమీలేవు. ఎవరినీ మేము నిర్బంధించలేదు. కావాలంటే వచ్చి ఎన్ క్వయిరీ చేసుకోమన్నాను" అంటూ డాక్టర్ ఆయన ముఖంలోకి చూశాడు.
చౌదరి దిక్కులు చూడసాగాడు.
"మీరతన్ని బలవంతంగ తీసుకొచ్చారా?" సూటిగా ఆయననిచూస్తూ ప్రశ్నించాడు డాక్టర్.
ఆయనకి వెంటనే ఏం చెప్పాలో తోచలేదు.
"బలవంతమంటే బలవంతం కాదుగాని__ఆఁ! ఆఁ! అదే!" ఓ క్షణం తడబడి "రమణమూర్తి పోలీసు సహాయమే తీసుకున్నాడుగా? ఇంకా కంప్లయింట్ ఎందుకూ?" అన్నాడాయన.
ఓ క్షణమాగి మళ్ళీ అందుకొని "అడుగో! మూర్తి ఇటే వస్తున్నాడు అడగండి" గుక్కతిప్పుకున్నాడు చౌదరి.
డాక్టర్ తలతిప్పి చూశాడు.
"మూర్తి ఎ.సి.పి. దాసుతో కలిసివస్తూ కనిపించాడు.
రమణమూర్తి ఎ.సి.పి, ని ఇద్దరికీ పరిచయం చేశాడు.
అందరూ వెళ్ళి ఆఫీసు రూమ్ లో కూర్చున్నారు.
"కమీషనర్ గారు ఇంతకుముందే ఫోన్ చేశారు" రామదాసునుచూస్తూ అన్నాడు డాక్టర్.
"అవును! ఆ పనిమీదే నేనొచ్చాను."
డాక్టర్ రామదాసు ముఖంలోకి చూశాడు.
"అంటే...."
డాక్టర్ మాటలిని మధ్యలోనే అందుకొని అన్నాడు దాసు__రమణ మూర్తి అల్లుడు ఒక ఉత్తరం రాశాడు మా కమీషనర్ కు...."
"ఏమని...?" ఆదుర్దాగ అడిగాడు చౌదరి.
"తనను నిర్భంధించి, బలవంతంగ ఈ ఆసుపత్రిలో చేర్పించి, పిచ్చివాడనే నెపంమీద ట్రీట్ మెంటు ఇస్తున్నారని! దీనికంతకూ కారణం తన మావ రమణమూర్తేనని నేరారోపణ చేశాడు. అది పిచ్చివాడి ఉత్తరంగానే భావించాము. కాని__ఇందులో మా పోలీసాఫీసర్ ఇన్ వాల్వు అయి ఉండడంవల్ల సంగతేమిటో తెలుసుకుందామని వచ్చాము. ఎందుకంటే రేపో మాపో పేపర్లో వస్తుంది."
"పేపర్లో వస్తుందా?" చౌదరి అయోమయంగ అడిగాడు.
"ఆఁ తప్పకొస్తుంది. మీకు తెలుసుగా? ఇవాళ-రేపు పత్రికలవాళ్ళు మాగురించి ఎలా రాసిపారేస్తున్నారో!" అని డాక్టర్ కేసి తిరిగి "ఎందుకైనా మంచిది మీ స్టేటుమెంటు ఒకటి మా దగ్గిర ఉంటేనని వచ్చాను" చెప్పాడు దాసు.
బల్లపై చేతికర్ర వుంచి, జేబులోనుంచి డైరీ తీశాడు దాసు.
"మీ ఎన్ క్వయిరీ పూర్తయిందా? ఫిర్యాదిని ఎగ్జామిన్ చేశారా?"
"ఆఁ! మాట్లాడాను. పిచ్చివాడి స్టేటుమెంటుకు విలువేమిటి డాక్టర్?"
"పిచ్చివాడని మీరే నిర్ణయం చేశారు. ఇంకా సర్టిఫికెటెందుకూ?"
"అమ్మమ్మ! ఎంతమాట! మీరు సర్టిఫయి చెయ్యకపోతే పిచ్చివాడు కూడా మంచివాడికిందే జమ!"
"చేస్తే?"
"మంచివాడుకూడా పిచ్చివాడికిందే లెక్క!"
రామదాసు తన తెలివికి తనే నవ్వాడు. బెల్టుపైన పొట్ట ఎగిరెగిరి పడేలా నవ్వాడు.
"మనస్థిమితం లేనివాడని ఇప్పుడు నేను సర్టిఫికెట్ ఇవ్వకపోతే మీరేం చేస్తారూ?"
"మమ్మలిని చాలా ఇబ్బందిలో పెట్టేస్తున్నారు డాక్టర్. కంప్లయింటు కమీషనర్ దాకా పోయింది. కనక మేమేదో ఒక యాక్షన్ తీసుకోవాలి."
"అంటే రమణమూర్తి గారిపై కేసుపెడ్తారా?"
మాపై మేమే కేసుపెట్టుకోవడమా?" తమాషాగ నవ్వాడు అసిస్టెంటు కమీషనర్ దాసు.
"మరేం చేస్తారూ?"
"మీరే బలవంతంగ రమణమూర్తిగారి అల్లుడిని తీసుకొచ్చి మతిపోయే మందులేవో ఇచ్చి పిచ్చివాడినిచేస్తె. ఆయనకీ విషయం తెలిసి మీపై పోలీసు కంప్లయింటు ఇచ్చినట్టు...."
"కేసుపెడతారు!"
"అవును!"
"వండర్ ఫుల్! మరి మావగారిపై అల్లుడిచ్చిన రిపోర్టును ఏం చేస్తారూ?"
"అతడిని పిచ్చివాడినిచేసి మీరే ఇప్పించారని చెబుతాము. దానికి సాక్ష్యాలుకూడా సేకరిస్తాం. అప్పుడు కేసు బలంగ ఉంటుంది."
వాళ్ళ సంభాషణ వింటున్న చౌదరికి మతిపోతోంది.
"పోలీసు యూనిఫారమ్ లో ఉన్న రామదాసు పిచ్చివాడా లేక ఇన్ని ప్రశ్నలు వేస్తున్న డాక్టర్ పిచ్చివాడా?"
అతడికి అనుమానం కలిగింది.
"ఎ.సి.పి. సాబ్! కేసు మీరే గెలిచారు. కాని ఒక్క పొరపాటు జరిగింది. అక్కడే టేప్ రికార్డర్ ఉంది. మీరు చూసినట్టులేదు."
విజయగర్వంతో రామదాసు ముఖంలోకి చూశాడు డాక్టర్.
"ఓ! ఐసీ!" అంటూ దాసు లేచినిలబడ్డాడు.
ప్యాంటుజేబులోనుంచి ఒక క్యాసెట్ తీసి బల్లపై ఉంచాడు.
"ఇది మీదేననుకొంటాను నోటమాటరాలేదు.
"ఓ ఐసీ! ఆఫీస్ రూమ్ లోకి మందుకొచ్చినప్పుడు క్యాసెటు జేబులో వేసుకొన్నారన్నమాట! ఎస్ పి లెవల్ ఆఫీసర్స్ కూడా ఇలా ప్రవర్తించడం చాలా విడ్డూరంగా ఉంది."
"మీలాంటి ఫేమస్ డాక్టర్లు కూడా మా డిపార్టుమెంటును బ్లాక్ మెయిల్ చెయ్యడానికి సిద్దమైతే మేమేం చెయ్యాలి మీరే చెప్పండి."