"బ్లాక్ మెయిలా? అబ్ సర్డ్ మిస్టర్ రామదాసు! మానసిక డాక్టర్లమే కాని ఇలాంటి నీచమైన పనులు చేయం! ఆ టేప్ రికార్డర్ ఆన్ చేసిలేదు.
మన సంభాషణ టేప్ చెయ్యాలనే ఉద్దేశ్యం నాకు లేనేలేదు. మీరింతకు ముందు మాట్లాడిన ధోరణికి ఆశ్చర్యపోయాను. మీరు మాట్లాడినదంతా రికార్డయిందంటే మీరెలా రియాక్టవుతారో చూడాలనే సర్దాకొద్దీ అలా అన్నాను. అలా అన్నప్పుడు మానసిక స్థితి ఎలా ఉంటుందో చూడాలనిపించింది. అంతేకాని మీ మాటలిని టేప్ చెయ్యాలనే ఉద్దేశ్యంలేదు. కావాలంటే మీరే చూడండి రికార్డర్ స్విచ్ ఆన్ చేసి ఉంది."
డాక్టర్! సరదాగా మీరు నాపై ఓ ప్రయోగం చేశారు బాగానే వుంది. నేనూ సరదాగా మీపై తిరుగు ప్రయోగం చేశానని ఎందుకనుకోరు మీరు? ఇదిగో చూడండి. ఈ టేప్ నాదే. బాలమురళీకృష్ణ అష్టపదులు రికార్డు చేయించుకొని తీసికెళుతున్నాను. మీరు నాపైన ప్రయోగించిన బాణానికి, సరిగ్గా సమయానికి ఇది అడ్డుపడింది. అంతే! కావాలంటే మీ రికార్డర్ ఓపెన్ చేసి మీ కేసెట్ ఉందో లేదో చూసుకోండి" బల్లపైనున్న చేతికర్ర తీసుకొని నిలబడ్డాడు రామదాసు.
డాక్టర్ లేచి పక్క బల్లదగ్గిరకు వెళ్ళాడు.
రికార్డులో ఉన్న కేస్ ట్ చూసి విస్తుబోయాడు.
కేసెట్ ప్లేచేసి చూసుకున్నాడు.
"దెయ్యం పట్టిన మనిషి" మంగమ్మ కేకలు, అరుపులూ, వింత కూతలు! ఓహోం! బీహీం! పల్లకి మోతలు వినిపించాయి.
రికార్డర్ ఆఫ్ చేసి దాసు దగ్గరకొచ్చి కరచాలనంచేశాడు డాక్టర్.
"ఎ గుడ్ రిపార్టి! చాలా పెద్ద టెక్నిక్ డెవలప్ చేశారు కంగ్రాట్సు" అన్నాడు.
దాసు రమణమూర్తికేసి చూశాడు.
రమణమూర్తి గర్వంగా మీసం తిప్పుకొన్నాడు.
"చూశారా మావాళ్ళ సత్తా?" అన్నట్టు డాక్టర్ కేసి చూశాడు.
"మీ పోలీసువాళ్ళ దెబ్బలకు తట్టుకోలేనట్టే. మీ ఎత్తులకుకూడా తట్టుకోలేం! ఒప్పుకున్నాను. పోతే అసలు విషయానికి వద్దాం. ఈ పోలీసు కంప్లయింటుకూడా ఉత్తుత్తిదేనా?"
"నో! నో! డాక్టర్! అది నిజమే. రమణమూర్తి అల్లుడూ, మీ పేషెంటూ అయిన జగన్మోహన్ రావే ఉత్తరం రాశాడు."
"జగన్మోహనరావా?" డాక్టర్ అదిరిపడ్డాడు.
రమణమూర్తీ, చౌదరీ దిమ్మెరపోయారు.
"ఔను! జగన్మోహనరావే?" వాళ్ళందరూ ఎందుకంత ఆశ్చర్యపోతున్నారో అర్ధంకాక వెర్రిచూపులు చూశాడు దాసు.
"డ్యూయల్ పర్సనాలిటీ! రెండు వ్యక్తిత్వాలు. సో కృష్ణ వెనక్కు పోయాడు. జగన్మోహనరావు ముందుకొచ్చాడు" తనకుతనే చెప్పుకుంటున్నట్టు అన్నాడు డాక్టర్.
"ఆయన వెనక్కు పోయి ఈయన ముందుకు రావడమేమిటి?" అయోమయంగా బుర్రగోక్కుంటూ అడిగాడు దాసు.
"అవును డ్యూయల్ పర్సనాలిటీ! మీకు ఉత్తరం రాసింది జగన్మోహన్ పర్సనాలిటీ!"
"ఒక్కనిముషం! ఇప్పుడా పదమూడో నంబరు రూమ్ లో ఉందెవరూ?" దాసుకు నోరెండిపోయినట్టయింది.
"ఇద్దరూ?"
"ఇద్దరా? అక్కడ నేను చూసింది ఒక్కరినే?" అయోమయంగా అన్నాడు దాసు.
"నిజమే శారీరకంగ మీరు చూసింది ఒక్కరినే! కాని మానసికంగా ఇద్దరున్నారు. వాళ్ళ యిష్టా అయిష్టాలనుబట్టి మీకు కన్పిస్తారు."
"నాకేమి అర్ధంకావడంలేదు డాక్టర్! ఇప్పుడా పదమూడవ నంబరు గదిలో ఉంది మా రమణమూర్తిగారి అల్లుడా కాదా?"
"అవును! ఆయన అల్లుడే."
"ఐతే ఆయన జగన్మోహనరావే గదా?"
"ఆ సంగతి మీ యస్.పి. గారినే అడగండి" అంటూ డాక్టర్ రమణమూర్తినే చూశాడు.
"దాసూ! మా అల్లుడిపేరు మురళీకృష్ణ! పదమూడవ నంబరు గదిలో ఉంది మా అల్లుడే" చెప్పాడు రమణమూర్తి.
మరి కమీషనర్ గార్కి రాసిన ఉత్తరంలో, తనపేరు జగన్మోహన్ రావనీ, మీ అల్లుడిననీ, తనను నిర్బంధించి ఈ ఆసుపత్రిలో పదమూడవ నంబరు గదిలో ఉంచారనీ, రాశాడే?" సాలెగూటిలో చిక్కిన ఈగలా ఐపోయాడు దాసు.
"అదేగదా మేము చెపుతోంది? విభిన్న వ్యక్తిత్వం అని! జగన్మోహనూ-మురళీ కృష్ణా-ఇద్దరూ__"
డాక్టర్ మాట పూర్తికాకుండానే దాసు అడ్డుతగిలాడు.
"మురళీకృష్ణా-జగన్ మోహన్ ఒకరేనన్నమాట? ఇన్ఫర్మేషన్!"
"కాదు! వాళ్ళిద్దరూ ఒక్కరుకాదు. ఒకరిలో ఇద్దరున్నారు." డాక్టర్ అన్నాడు.
"ఏమిటో! మీరేమంటున్నారో నాకు బొత్తిగా గొడవగా...."
దాసుకు బుర్రలో పిండి రుబ్బుతున్నట్టుగా వుంది.
"రామదాసుగారు మీకిలా చెప్తే అర్ధంకాదు. ఆమాటకొస్తే మానసిక శాస్త్రం బాగా తెలియని వాళ్ళెవరికీ అర్ధంకాదు. ఈ చౌదరిగారినీ, మీ రమణమూర్తిగారినీ అడిగి చూడండి. వాళ్ళు స్వయముగా ఇద్దరినీచూశారు. మీరు సాయంకాలం ఏడుగంటలకొస్తే ఆ ఇద్దరితో మాట్లాడవచ్చును."
"యింతకుముందు పదమూడవ నెంబరు గదిలో నేను మాట్లాడింది ఎవరితో."
"బహుశా జగన్మోహనరావుతోనే ఐవుండాలి. అతని పర్సనాలిటీయే ఇప్పుడు డామినేట్ చేస్తూంది. మురళీకృష్ణ పర్సనాలిటీ వెనక్కు నెట్టివేయబడింది."
"మీరు హాస్పటల్లో అడ్మిట్ చేసుకొంది ఎవరినీ?"
"మురళీకృష్ణను."
"అంటే మురళీకృష్ణను జగన్మోహన్ గ మార్చివేశారన్నమాట! హిప్నాటిజంలాటిదేదో ప్రయోగించి అతడిని మార్చివేశారు అంతేగదా?"
"నో! నో! మీకర్ధమయేలా ఎలా చెప్పాలో నాకర్ధంకావడంలేదు." నిట్టూర్పు విడిచాడు డాక్టర్.
"నా బుర్ర తిరిగిపోతోంది. ఇప్పుడు నేను వెళ్ళి మా కమీషనర్ గారికి ఏంచెప్పాలో అర్ధంకావడంలేదు. మీరు చెప్పినట్టే అక్కడ నేను చెబితే నన్ను మెంటల్ హాస్పటల్లో చేర్పించినా చేర్పించవచ్చు. ఆశ్చర్యంలేదు. సాయంకాలం మా కమీషనర్గారిని తీసుకొస్తాను. అదేదో ఆయనకే చెప్పండి. మీ ప్రయోగమేదో ఆయనకే చూపించండి."
"ఓకె! అలాగే!"
రామదాసు అందరి దగ్గిరా శెలవుతీసుకొని, తలవేళ్ళాడేసుకొని, కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళిపోయాడు.
26
పోలీస్ కమీషనరూ, రామదాసూ, చౌదరీ, రమణమూర్తి, డాక్టర్ ప్రయోగశాలనుంచి బయటికొచ్చారు.
"డాక్టర్! మా రామదాసు చెప్తే ముందేదో అనుకున్నాం. ఒకే మనిషిలో రెండు విభిన్న వ్యక్తిత్వాలు ఎలా ఇమిడిఉంటాయో కళ్ళారా చూశాను-విన్నాను. సైకియాట్రీ ఇంత గొప్ప శాస్త్రమని నాకిప్పుడే తెలిసింది."
డాక్టర్ కు ఎదురుగా కూర్చుంటూ అన్నాడు పోలీసు కమీషనర్.
బాస్ డాక్టర్ ని పొగడడం విన్నాక రామదాసు రిలీఫ్ గ గాలిపీల్చుకువదిలాడు.
"బతికానురా బాబూ!" అనుకున్నాడు.
బాస్ కన్విస్ కాకపోతే తను యిబ్బందిలో పడాల్సొచ్చేది.
"అసలు వ్యక్తిత్వం ఏది. జగన్మోహనరావా లేక మురళీకృష్ణా?" రమణమూర్తి అడిగాడు.
"అసలనీ, ఫాల్సనీ ఉండదు" డాక్టరన్నాడు.
"పోనీ__ఫ్రైవరీ, సెకండరీ అని వుంటుందా" ప్రశ్నించాడు చౌదరి.
"ఒకరకంగా అలా ఉండవచ్చును. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, ఏది డామినేట్ చేస్తుంది. ఏది అణిగిమణిగి పడివుంటుందని చెప్పడం సశాస్త్రీయం అవుతుంది. మురళీకృష్ణ మొదట చెప్పిన పర్సనాలిటీ. రెండవది జగన్మోహన్. జగన్మోహన్ మధ్య మధ్య వస్తూ పోతూ ఉంటాడు" ఓ క్షణమాగి కమీషనర్ ముఖంలోకి చూస్తూ మళ్ళీ అందుకొన్నాడు డాక్టర్.
"జీవితంలో ఎక్కువ భాగాన్ని మురళీకృష్ణ ఆక్రమించుకొన్నాడు. బయటి ప్రపంచానికీ, బంధుమిత్రులకూ తెలిసినవాడు మురళీకృష్ణే. ఆ యిద్దరిమధ్యా నిరంతరం ఘర్షణ జరుగుతూంటుంది."
"ఐతే ఆజన్మాంతం ఈ రెండు పర్సనాలిటీస్ ఇలాగే వుండిపోతాయా?" దిగులుగా అడిగాడు మూర్తి.
"ఉంటే అతని జీవితమేకాదు-సుధ జీవితంకూడా దుర్భరం అవుతుంది."
"ఇప్పుడు జరిగింది అదేకదా?"
"ఆ స్థితినుంచి తప్పించడానికే నేను చేస్తున్న ప్రయత్నమంటాను."
"సాధ్యమంటారా?"


