అది వింటూనే రమణమూర్తి కుర్చీలో కుప్పగా కూలిపోయాడు. ఒళ్ళంతా చెమటలు కమ్మింది. కొద్ది నిముషాలు మాటరాలేదు. రెండుచేతులతో తలపట్టుకొని పెద్దగ మూలిగాడు.
"రమణా!" గాభరాపడ్డాడు చౌదరి.
లేచి రమణమూర్తిని పట్టుకొన్నాడు.
"నా తల బద్దలైపోతోందిరా చౌదరీ! ఇదంతా ఏమిట్రా? నా బిడ్డ బ్రతుకిలా అయిపోతుందని కలలోకూడా ఊహించలేదు. ఈ స్కాండల్ ఏమిటి? ఈ అపవాదేమిటి? నా బిడ్డ పెళ్ళికాకముందే పిల్లను కందా? అది కప్పిపుచ్చి నేను సుధకు పెళ్ళిచేశానా? మధ్యలో ఈ జగన్మోహన్ ఎవడు? ఓ మైగాడ్! ఈ క్షోభ నేను భరించలేను."
రమణమూర్తి కళ్ళనుంచి బొటబొట కన్నీటిచుక్కలు కారాయి.
"సారీ మిస్టర్ రమణమూర్తి! మీకు బాధ కలిగించేలా మాట్లాడాననుకుంటాను. క్షమించండి. మీరింత సెన్సిటివ్ గా ఉంటారనుకోలేదు. పైకి రాయిలా కన్పించే మీ మనసు వెన్నలా కరిగిపోతుందనుకోలేదు. మీ బాధ ఏమిటో ఇప్పుడు నేను అర్ధం చేసుకొన్నాను. సుధకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. రెండురోజుల్లో మామూలు మనిషి అవుతుంది. మీ అల్లుడి ఆరోగ్యంకూడా త్వరలోనే బాగుపడుతుంది. మళ్ళీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఆనందంగా జీవించడం మీరే చూస్తారు.
"సార్! పిలిచారా?" అంటూ డాక్టర్ దయాసాగర్ ప్రవేశించాడు.
"యస్ డాక్టర్!" అంటూ కుర్చీ చూపించాడు చంద్ర.
"సుధ ఎలా ఉంది?"
"షి ఈజ్ ఫయిన్ సర్! మంచి ప్రోగ్రెస్ కన్పిస్తున్నది" దయాసాగర్ చెప్పాడు.
బెల్ నొక్కి బాయ్ ని పిల్చాడు చంద్ర. బాయ్ రాగానే నాలుగు కూల్ డ్రింక్సు తెమ్మని చెప్పాడు. నాలుగు 'థమ్స్ అప్' పట్టుకొని వచ్చాడు కుర్రాడు. చంద్ర ముందుగా బాటిల్ రమణమూర్తికి అందించాడు.
"ఐయామ్ సారీ డాక్టర్!" కూల్ డ్రింక్స్ అందుకొంటూ చెప్పాడు రమణమూర్తి.
"యు మస్ట్ ఎక్సుక్యూజ్ మి డాక్టర్! మీరు మానసుకశాస్త్రవేత్తలు. నా మానసికస్థితిని తెలుసుకోగలవారు. ఏదేదో మాట్లాడాను, క్షమించాలి" మళ్ళీ అన్నాడు రమణమూర్తి
"దట్సాల్ రైట్ మూర్తిగారూ! డ్రింకు తీసుకోండి. కృష్ణ ఎలా ఉన్నాడో చూసొద్దాం!" అంటూ చౌదరికేసి తిరిగాడు చంద్ర.
"మీ అమ్మాయి విమల చాలా తెలివైంది. మా ప్రొఫెషన్ కు పనికి వచ్చే పిల్ల ఎయిర్ హోస్టెస్ గా వెళ్ళింది. కృష్ణను చక్కగా హాండిల్ చేస్తున్నదని దయాసాగర్ చెప్పాడు. ఏం ఇప్పట్లో వివాహంచేసే ఉద్దేశ్యం లేదా చౌదరిగారూ?"
"మేము ఆ పని చేస్తామనే ఎయిర్ హోస్టెస్ గా చేరింది విమల" నవ్వుతూ చెప్పాడాయన.
"రెచ్చెడ్ జాబ్. వదిలెయ్యమనండి. దయాసాగర్ బ్రిలియంట్ డాక్టర్!" సజెస్టివ్ గా చెప్పాడు చంద్ర ఆయనకేసి చూశాడు.
"అవున్రా చౌదరీ! డాక్టర్ దయాసాగర్ విమలకు తగిలినవాడు. ఉండు విమలతో నేను మాట్లాడతాను" అన్నాడు రమణమూర్తి.
"డాక్టర్ సాగర్ ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోకుండానే మనం ఇంతముందుకు ఆలోచించడంవలన ప్రయోజనం?" సాలోచనగా చెప్పాడాయన.
"సాగర్ మనసు తెలుసుకోకుండానే డాక్టర్ చంద్ర ఈ సజెషన్ ఇచ్చారంటావా?"
"యస్! యూ ఆర్ రైట్ మిస్టర్ మూర్తి!" పెద్దగా నవ్వేశాడు చంద్ర.
"వాట్ డు యుసే మై బాయ్!" అంటూ చంద్ర సాగర్ వీపు చరచాడు.
"అదుగో! విమలకూడా వస్తోంది" హుషారుగా అరిచాడు చంద్ర.
"అంకుల్! డి.సి.పి. రామయ్యగారట మీకోసం వచ్చారు" అంది విమల రమణమూర్తితో.
"ఎక్కడున్నారూ?"
"మన రూంలోనే!"
"కృష్ణ ఎలా ఉన్నాడూ?"
"బాగానే ఉన్నాడు. డి.సి.పి.తో మాట్లాడుతున్నాడు."
రామయ్యకు ఈ విషయం ఎలా తెలిసింది?
తను ఇద్దరు కానిస్టేబుల్స్ పంపమన్నాడు. అంతే! కృష్ణ గురించి చెప్పలేదు. పైగా ఆసుపత్రీ, గదినంబరుతో సహా ఎలా తెలిసిందీ! చాలా రహస్యంగా ఉంచానే?
ఆలోచిస్తూ రమణమూర్తి లేచాడు.
"విమ్మా! ఇలా రా! కూర్చో! డాక్టరు గారు నీతో ఏదో మాట్లాడాలంటున్నారు" వెనక్కుతిరిగిన విమలను పిల్చి కూర్చోబెట్టాడు చౌదరి.
"మీ ఇద్దరినీ పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదనుకుంటాను. ఈపాటికి మీ ఇద్దరూ ఒకరినొకరు తెలుసుకొనే ఉంటారు" విమలకు దయాసాగర్ ను చూపిస్తూ అన్నాడు డాక్టర్.
ఇద్దరూ "తెలుసు" అన్నట్టు తలలు ఊపారు.
"మీ నాన్నగారు మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలనుకొంటున్నారు."
"దేన్నిగురించీ?" విమల గుండ్రంగా కళ్ళు తిప్పింది.
"డాక్టర్ దయాసాగర్ గురించి."
ఆమె చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే లేచి నిలబడింది.
"చెప్పకుండానే వెళ్ళిపోతున్నావ్?" చంద్ర తనను వెంటబడి తరుముతున్నట్టుగానే అన్పించింది.
"మంచి డాక్టరే అనుకుంటాను."
"దట్సాల్!"
"యస్. నోమోర్!"
చౌదరి దీర్ఘంగా నిట్టూర్చాడు.
"చౌదరిగారూ! మీ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తున్నది. మీముందు చెప్పడానికి జంకుతున్నట్టుగా ఉంది" చెప్పాడు చంద్ర.
"విమలకు పూర్తి స్వేచ్చ ఇచ్చాను. నాదగ్గర దాయవలసిన అవసరం లేదే?" అన్నాడాయన.
"లేకపోతే ఆమె అంత అప్ సెట్ అవ్వాల్సిన పనిలేదు. ఇది నా అంచనా. వేచి చూడండి, కొద్దికాలం పోతే మీకే తెలుస్తుంది" అంటూ లేచి నిలబడ్డాడు చంద్ర.
"సాగర్. షిజో ఫ్రేనియాకేస్-వినోద్ కుమార్ ఎలా ఉన్నాడు?"
"ప్రోగ్రెస్ ఏమీ కన్పించడంలేదు సార్!"
"లెట్ అజ్ సీ!" అంటూ కదిలాడు డాక్టర్.
బాస్ వెనకే బయలుదేరాడు దయాసాగర్.
అంతవరకూ ఏవో ఆలోచనల్లో మునిగివుండిన చౌదరి తను ఒంటరిగా ఉండినట్టు తెలుసుకొన్నాడు.
అందరూ వెళ్ళిపోయారు. అయినా తను ఇంకా ఇక్కడే ఎందుకు కూర్చున్నట్టు?
వ్యాధులన్నింటిలోకీ ఈ మానసిక వ్యాధులే ప్రమాదకరమైన అంటువ్యాధుల్లా ఉన్నాయి. ఈ సైకియాట్రిస్టు ఇంకా ప్రమాదకరం అన్పిస్తున్నాడు. లేనివాటినికూడా ఇట్టే సందేహించకుండా చెప్పేస్తున్నాడు.
మనిషికి వచ్చే ఆలోచనలన్నింటినీ బయటపెడితే ఇంకేమైనా ఉందా? ఒకోసారి ఎంతో అసభ్యకరం, ప్రమాదకరమైన ఆలోచనలు వస్తుంటాయి. అవన్నీ బయటపెడితే మనిషి బతకలేడు. ఏ మనిషీ, మరో మనిషిని గౌరవించలేడు.
ఈ ఆసుపత్రిలో కాలుపెట్టి ఇంకా ఇరవైనాలుగ్గంటలు కాలేదు. కాని ఎంతో కాలంగా, అదే జీవితమంతా పిచ్చాసుపత్రిలోనే గడిపినట్టుగా ఉంది. మనసులో తృటిలో కోట్లాది మైళ్ళు ప్రయాణం చేస్తుంది. క్షణంలో వెయ్యోవంతులో అనంతకాలాన్ని దాటిపోతుంది.
ఒకే సమయంలో అటవిక మనుషులనుంచి దిగ్మండంలో దిరుగాదే వాళ్ళను చూడగలుగుతుంది. కాంతికంటే వేగంగా పయనించగల ఈ మనసుకు వచ్చే వ్యాధులను మానవుడు నయం చేయగలుగుతున్నాడు. ఉన్నదయినా కనబడినది. అలాంటి మనసుకు గాయం అయితే మందు లేస్తున్నాడు మానవుడు.
అన్నింటినీ మించింది మానవ మేధస్సు.
దానిని పూర్తిగా ఉపయోగించుకోగలిగినవాడే ధన్యుడు__
"డాడీ!"
ఉలిక్కిపడి వెనక్కు చూశాడు చౌదరి.
విమల వెనక నిలబడి వుంది.
"ఏమ్మా! ఎంతసేపైంది వచ్చి?"
"ఇప్పుడే! ఏమిటి వంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నారు?"
"నీ గురించేనమ్మా!"
"ఏమిటి డాడీ నా గురించి? ఆ పిచ్చి డాక్టరేదో చెప్పాడని నువ్వు కూడానూ__"
"అతనేమన్నాడో తెలుసా?"