Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 37


    "మరి ఆ లాంగ్ కోటు. ఆలివ్ గ్రీన్ సూట్. బ్రౌన్ కలర్ సఫారి డ్రస్. సిల్క్ జుబ్బా. ఇవన్నీ బీదవాళ్ళు వేసుకుంటారా!" అవంతి అడిగింది.

    ఇందర్ ఆ మాట వింటూనే  గతుక్కుమని అవంతివేపు అనుమానంగా చూశాడు.

    తను తొందరపడి నోరు జారినట్లు అవంతి గ్రహించుకుంది. అంతలోనే తెలివి తెచ్చుకుని "బీదట బీద. అంతా అబద్ధాలు. మా నరేంద్ర అన్నీ యిలాంటి రకరకాల సూట్లు వేస్తాడు. అవన్నీ చాలా ఖరీదని చెప్పాడు. నాకా మాత్రం తెలుసు" కళ్ళు చక్రాల్లా తిప్పుతూ గొప్పగా చెప్పింది అవంతి.

    ఇందర్ ఆమె మాట నమ్మాడు.

    "నరేంద్ర ఎవరు?" మామూలుగా అడిగినట్లు అడిగాడు.

    "మా కృష్ణ బాబాయి కొడుకు."

    "రెండు కొత్త పాత్రలు ప్రవేశం అయ్యాయి. పేర్లు గుర్తుపెట్టుకోవాలి" ఇందర్ అనుకున్నాడు. ఎందుకైనా మంచిది అనుకుని "నేను నాటకాల్లో వేషాలు వేస్తుంటాను. అందుకు నాకు రకరకాల డ్రస్ లు వున్నాయి. అంతేగాని నేను లక్షాధికారిని కాను" అన్నాడు.

    "నాటకాల్లో వేషాలే, మరి నాతో చెప్పలేదేం. ఈ తఫా నాకు చేసి చూపించాలి. నాటకాల్లో జుట్టుపోలిగాడి వేషం చాలా బాగుంటుందని మా బుచ్చికక్కి ఎప్పుడూ చెపుతుంటుంది."

    "ఆ వేషం వేసి చూపిస్తానులే" అన్నాడు ఇందర్.

    ఆ తర్వాత ఇందర్ వెళ్ళిపోయాడు. అవంతి రెస్ట్ గా మంచం మీద మేనువాల్చింది.

    సాయంత్రం అయిదు గంటలవేళ ఆదరా బాదరాగా ఇందర్ వచ్చాడు. చేతి సంచీ నిండుగా వస్తువులు వున్నాయి.

    ఇందర్ ముఖంలో ఆందోళన....కంగారు....సీరియస్ నెస్ అన్నీ ఏక కాలంలో చూడగలిగింది అవంతి. అయితే ఆ విషయం తను గమనించనట్లు జాగ్రత్తపడుతూ "అబ్బో చాలా ఆలస్యం అయింది. మూడు గంటలకల్లా వచ్చేస్తానన్నావు కదా! ఇప్పుడు ఐదు దాటింది. అమ్మబాబోయ్ అవన్నీ ఏంటి! బ్రెడ్ ప్యాకెట్స్, బిసికెట్స్, యాపిల్స్, అరటిపళ్ళు, మిఠాయిలు అమ్మో ఇవన్నీ మనకే!" అంటూ ఆనందం ప్రకటించింది.

    "ఆ....అన్నీ నీకే" అని ఇందర్ వాటిని బల్లమీద పెట్టాడు.

    ఇందర్ కేమైంది అనుకున్న అవంతి "అబ్బో అన్నీ నాకిష్టమైనవే" అంది.

    "బ్రెడ్ తినడం అలవాటేనా అపర్ణా!" ఇందర్ అడిగాడు.

    "బ్రెడ్ నాకు చాలా యిష్టం. జామ వేసుకుని తింటే బలే వుంటుంది. భోజనం కూడా అక్కరలేదు." అవంతి చెప్పింది.

    "జామ యింట్లో వుంది. సరేగాని అపర్ణా! నీవు వంటరిగా వుండగలవా"

    విషయం ఏమిటో అవంతికి సూక్ష్మంగా అర్ధమైంది. "ఒంటరిగా వుండటం అంటే నాకు చచ్చే భయం. అయినా యిప్పుడు వుండటం లేదేమిటి?" అంటూ దీర్ఘం తీసింది అవంతి.

    "అది కాదు నేను లేకుండా ఈ ఒక్కరాత్రి...."

    "ఏమోబాబూ నాకేం తెలియదు."

    "అపర్ణా! నేను సీరియస్ గానే చెపుతున్నాను జాగ్రత్తగా విను. నేను నాలుగు రోజులపాటు నా వుద్యోగానికి సెలవు పెడదామని మా కంపెనీకి వెళ్ళాను. ఈ రాత్రి తొమ్మిది నుంచి రేపు రాత్రి పన్నెండు దాకా డ్యూటీ చెయ్యి. సరుకు వచ్చింది. ఇప్పుడే అందరూ శలవు పెట్టారు. మార్కెట్ కి వెంటనే సరుకు చేర్చకపోతే నష్టం వస్తుందని మా కంపెనీ యజమాని అన్నాడు. కాదంటే నా వుద్యోగం కూడా తీసేస్తానన్నాడు."

    "పాడు వెధవ అలా అన్నాడా!"

    "ఆ అలాగే అన్నాడు. ఉత్త పాపిష్టివెధవ." 

    "అయితే మరెలా?"

    "చెపుతాను. అన్నం ఎలా వండాలో ఈ రాత్రికి నేను చూపిస్తాను." ఇందర్ చెపుతుంటే అవంతి మధ్యలో అడ్డుతగిలి "అన్నం నాకొండటం వచ్చుగా. బియ్యంలో నీళ్ళుపోసి ఆ తర్వాత చెయ్యి ముంచి తియ్యటమేగా!" అంది చాలా తేలిగ్గా.

    ప్రపంచంలో అమాయకులుంటారు. కానీ మరీ ఇంత అమాయకతా! లేక చాతగానితనమా! అనుకున్నాడు ఇందర్.

    "నా ముఖంలో ఏముంది? అలా చూస్తావ్!" అవంతి అడిగింది.

    ఇందర్ ఉలిక్కిపడి సర్దుకున్నాడు.

    "కూరలో అంటే మెంతులు వెయ్యక పాడయింది. అన్నం అలా కాదుకదా?" అంది అవంతి.

    "నీవేం మాట్లాడవద్దు. నేను చెప్పినట్లు చెయ్యి" అన్నాడు ఇందర్. బుద్దిమంతురాలిలా తల వూపింది అవంతి.

    ఇందర్ ఆపూట అన్నం ఎలా వండాలో అవంతికి నేర్పాడు. ఏడున్నరకల్లా యిరువురు భోంచేశారు. ఆ తర్వాత ఇందర్ డ్రస్ అవుతూ చెప్పాడు.

    "నేను రేపు రాత్రికి తప్పకుండా వస్తాను. ఒకవేళ పని ఎక్కువగా వుండి రాకపోతే....మరో రెండు రోజులు నేను రావడం ఆలస్యం అయినా భయపడకు. ఈ వీధిలో దొంగల భయం లేదు. వంటరిగా వున్నానని భయపడకు. అన్నం వకటీ వండుకో పచ్చళ్ళు వేసుకుని తినొచ్చు. ఖర్మకాలి ఓ పూట అన్నం సరీగ వుడకలేదనుకో. బ్రెడ్ పళ్ళు స్వీట్స్ తిను. హార్లిక్స్ తాగు. పాలపిండితో కాఫీకి పాలు, పెరుగు తయారు చేసుకో." అంటూ వివరించాడు ఇందర్.

    "రేపు రాత్రికి మీ యజమాని పంపిస్తానన్నాడు కదా!"

    "అలాగే అంటాడు. పని అయిపోతే పంపిస్తాడుకూడా. పని పూర్తిగా కాలేదనుకో పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు! మా కంపెనీ సరుకులు అలాంటివి."

 Previous Page Next Page