Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 37


    "వండర్ ఫుల్! ఎంత ప్రాఫిట్ మనకి? పాతిక లక్షల డెబ్బయ్ ఎనిమిదివేలా? సూపర్బ్! యూ ఆర్ జీనియస్ భవానీశంకర్"
    "ఇదంతా చేసింది ప్రకాష్"
    "వాట్? వీడా? వీడికింత తెలివి వుందా?"
    "వుంది! మీరే అండర్ ఎస్టిమేట్ చేశాడు."
    "అలాగా! అయామ్ సారీ ప్రకాష్!"
    "దట్సాల్ రైట్ అంకుల్! హేపెండ్ ఈజ్ హేపెండ్"
    "నీలో ఇంత స్టఫ్ వుందని నాకు తెలీదు."
    "నేనూ బయటకు చెప్పలేదిన్నాళ్ళు"
    "నువ్వు నా మేనల్లుడివని చెప్పడానికి గర్వపడుతున్నాను."
    "ఎప్పుడో పడాల్సిందసలు."
    "అఫ్ కోర్స్ కొంచెం ఆలస్యమైంది."
    "బాగా ఆలస్యమైంది"
    "స్టిల్ నాట్ టూ లేట్!"
    "బెటర్ లేట్ దెన్ నెవ్వర్ అనేది నా పాలసీ అంకుల్!"
    "అద్భుతమైన పాలసీ! కీపిటప్" అంటూ ప్రకాష్ ని ముద్దు పెట్టుకున్నాడు.
    అందరూ ఇంటికి బయల్దేరారు.
    ఉదయం పదిగంటలకల్లా అగ్రిమెంట్లు సంతకం అయిపోయాయి.


                                            *    *    *    *


    సుధీర్ కుమార్ ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఫోన్ భయంకరంగా మోగుతోంది మంచం పక్కన.
    కళ్ళు నులుముకుని ఫోన్ ని వెతికి పట్టుకుని "హలో" అన్నాడు చిరాగ్గా.
    "సార్! నేను ప్రొడక్షన్ మేనేజర్ రాంగోపాల్ ని సార్"
    "ఏ రాంగోపాల్?"
    "కె.యస్. రాంగోపాల్ సార్"
    "ఏ కె.యస్?"
    "రంభా కాస్మిటిక్స్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ మేనేజర్ రాంగోపాల్ ని సార్!"
    "ఓ! నా ఫ్యాక్టరీ తాలూకు ప్రొడక్షన్ మేనేజర్ వేనా?"
    "అవున్సార్!"
    "మరా సంగతి చెప్పవేం?"
    "చెపుతుంటే మీరు..."
    "ఇంత రాత్రప్పుడు ఎందుకు ఫోన్ చేశావ్?" కోపంగా అడిగాడు సుధీర్ కుమార్.
    "కొంప మునిగిపోయింది సార్!"
    "ఎవరి కొంప? ఏ సంగతి మాట్లాడుతున్నావు నువ్వు?"
    "మనదే సార్. మన ఫ్యాక్టరీ సంగతే మాట్లాడుతున్నాను."
    "అయితే ఫ్యాక్టరీ మునిగిందని చెప్పు! కొంపంటావేం?"
    "సారీ సార్! ఫ్యాక్టరీ మునిగిపోయింది."
    "నిజంగానా?" ఆనందం అణుచుకుంటూ అడిగాడు. "ఆ ఏరియాలో మరీ అంత పెద్ద వర్షం కురుస్తోందా? ఇక్కడ చినుకు కూడా పడటం లేదు."
    "మునిగిపోయిందంటే నిజంగా వర్షంలో మునిగిపోలేదు సార్?"
    "మరి?"
    "మన వర్కర్స్ అందరూ స్ట్రయిక్ చేస్తున్నారు కద్సార్! కానీ వాళ్ళు స్ట్రయిక్ మామూలు స్ట్రయిక్ కాద్సార్! అమెరికాలోలా అదేదో కొత్తరకం స్ట్రయిక్ చేశారంట వర్కర్లు! అదే పద్ధతి ఇక్కడ కూడా ఫాలో అవుతున్నారు సార్."
    "ఏ పద్ధతయినా ఏడవనీ! మనక్కావలసింది నష్టం రావటం అంతే! ఫోన్ పెట్టేసెయ్."
    "అయ్యయ్యో! నా మాట కొంచెం వినండి సార్! ఈ పద్ధతి ప్రకారం మనకి నష్టం రాద్సార్! డబుల్ లాభాలు వస్తాయ్."
    సుధీర్ కుమార్ ఉలిక్కిపడ్డాడు "లాభాలు వస్తాయా?"
    "తెగ లాభాలు సార్?"
    "ఎలా వస్తాయి?"
    "వాళ్ళు ఇరవయ్ నాలుగ్గంటలూ ఫ్యాక్టరీలో పనిచేసి ఉత్పత్తి తెగ పెంచేస్తున్నారండీ! ఆ స్టాకంతా డిస్ట్రిబ్యూటర్స్ కి లారీల్లో పంపించేస్తున్నారు. మామూలుగా రోజుకి రెండు లారీలు స్టాక్ బయటికెళ్ళేది ఇప్పుడు రోజుకి ఆరు లారీలు స్టాక్ వెళుతోంది సార్."
    సుధీర్ కుమార్ కి స్పృహ తప్పినంత పనయింది. ముఖంలో జీవకళ మాయమైపోయింది.
    "ఇడియట్స్! స్ట్రయిక్ చేసుకోండ్రా అంటే వాళ్ళు చేసేది ఇదా? వాళ్ళందర్నీ అరెస్టు చేయిస్తాను."
    "కుదరదు సార్! పోలీసులు వాళ్ళనేమీ చేయలేరు. వాళ్ళు ఎక్కువ పని చేయటం ఇల్లీగల్ కాదని 'లా' చెపుతోంది."
    సుధీర్ కుమార్ కేం మాట్లాడాలో తోచలేదు.
    "వాళ్ళందర్నీ వెంటనే బయటకు గెంటించండి."
    "అది చాలా కష్టం సార్! వాళ్ళసలే మందుకొట్టి పనిచేస్తున్నారు. అలాంటిపని చేస్తే మనల్నందర్నీ వెతికి పట్టుకుని కాళ్ళూ చేతులూ విరిచేస్తారు. మొన్న ఆ నర్సింగరావ్ వర్కర్స్ ని అలా బయటకు గెంటించి లాకౌట్ చేశాడనే కదా అందరూ కలిసి నర్సింగరావ్ ని రెండు భాగాలుగా చేశారు?"
    సుధీర్ కుమార్ నీరుకారిపోయాడు. అతనికి విజయ్ మీదా, ఆ చిరుగుల చొక్కా భవానీశంకర్ మీదా కోపం ముంచుకొచ్చింది. ఆరు నెలల్లో తన ఆస్తిని ఆర్చేస్తానని ప్రగల్భాలు పలికి వాళ్ళు చేసినపని ఇదా? ఫ్యాక్టరీ మూతపడి తెగ నష్టాలు వస్తాయని తనతో చెప్పి ఇప్పుడు తెగ లాభాలు వస్తూంటే అంతులేకుండా పోతారా?

 Previous Page Next Page