Previous Page Next Page 
జయ - విజయ పేజి 37


    "మరి అంతవరకూ ఇంట్లో ఏం వ్యాపకం ఉంటుంది మీకు? మరేదయినా ఉద్యోగం ప్రయత్నించమంటారా?"
    "ఊహు వద్దండీ! మీరు రాసే నవలలు నాకివ్వండి. కాపీ చేసి ఇస్తాను. లేదా మరేవిధంగానయినా సరే మీకు సహాయం చేస్తాను."
    అతను నవ్వాడు. "అంటే నాకు సెక్రటరీగా పనిచేస్తారన్నమాట! ఓకే!"
    మర్నాడు జయ ఆఫీస్ చేరుకునేసరికి అక్కడ కిషోర్ ఆమె కోసం ఎదురుచూస్తూ కనిపించాడు.
    "సారీ జయ! మీ మదర్ పోయారని తెలిసింది" అన్నాడు విచారం వ్యక్తం చేస్తూ.
    జయ ఏమీ మాట్లాడలేదు. కొద్దిక్షణాలు నిశ్శబ్దంగా గడిచినయ్.
    "జయా! కొద్దిసేపు నాకోసం స్పేర్ చేస్తావా?"
    "ఊహు! వీలుకాదు!"
    "ప్లీజ్ జయా! అలా హోటల్లో కూర్చుని మాట్లాడుకుందాం! అయిదు నిమిషాలు! అంతే!"
    "ఇప్పుడు కుదరదు!"
    "సరే! పోనీ సాయంత్రం వస్తాను."
    జయేమీ మాట్లాడలేదు.
    అతను వెళ్ళిపోయాడు. సాయంత్రం ఐదవుతుండగా మళ్ళీ వచ్చాడు.
    "నన్ను చూస్తుంటే నీకు చిరాకు కలుగుతోందనుకుంటాను! కదూ?" చిరునవ్వుతో అడిగాడు.
    అతనితోపాటు బయటకు నడిచింది జయ.
    "ఏమిటో చెప్పు!" అంది రోడ్డుమీద నడుస్తూ.
    "హోటల్లో కూర్చుని మాట్లాడుకుందాం!" అన్నాడతను.
    "అవసరం లేదు! అసలు మా అమ్మ ఇంత త్వరగా ఎందుకు చనిపోయిందో తెలుసా?" కోపంగా అంది జయ.
    "ఎందుకని?"
    "నావల్ల! నేను చేసిన తెలివితక్కువ పని వల్ల!
    కిషోర్ తలవంచుకున్నాడు.
    జయ అక్కడినుంచి వచ్చేయబోయింది.
    "జయా!" ధీనంగా పిలిచాడతను.
    "ఏమిటి?"
    "నేను చెప్పిన విషయేం ఆలోచించావ్?"
    "నేనేమీ ఆలోచించ దల్చుకోలేదు." అనేసి అక్కడి నుంచి వడివడిగా నడిచిందామె.
    అతను ఖిన్నుడయి అక్కడే నిలబడిపోయాడు.
    అప్పుడే తన స్నేహితులతోపాటు అటువేపు వస్తోన్న చంద్రకాంత్ కి ఎవరో ఠక్కున చూపారు.
    "ఏయ్ చంద్రకాంత్! మీ మిసెస్ అదిగో. రోడ్డు అవతలివేపు_"
    అక్కడ నిలబడిపోయిన కిషోర్ నీ, త్వరగా నడిచి వెళ్ళిపోతున్న జయనూ గమనించాడు చంద్రకాంత్.
    కొద్దిక్షణాలు అతని మనసులో ఏవేవో ఆలోచనలు చెలరేగినయ్.
    అంతకు ముందు జరిగిన సంఘటనలు కొన్ని ఛటుక్కున గుర్తుకొచ్చినాయతనికి.
    అవన్నీ అతనిలో లీలామాత్రంగా అనుమానాలు, సందేహాలు కలిగించినయ్.
    "ఓకే! నేను వెళ్తాను!" అని చెప్పి వారినుంచి విడివడి సరాసరి కిషోర్ దగ్గరకు నడిచాడతను.
    నెమ్మదిగా ఏదో ఆలోచిస్తూ నడుస్తోన్న కిషోర్ తన భుజం మీద ఎవరిదో చేయి పడేసరికి ఉలిక్కిపడి పక్కకు చూచాడు. అక్కడ చంద్రకాంత్ ని చూసి మరింత ఖంగారుపడ్డాడు.
    "గుడ్ ఈవినింగ్..." అన్నాడు చంద్రకాంత్ కిషోర్ వంక చూసి చిరునవ్వుతో.
    "గుడ్ ఈవినింగ్..." భయపడుతూ అన్నాడు కిషోర్.
    తనూ జయ అంతకుముందు మాట్లాడుతూ అతనికి కనిపించారేమోనని అనుమానంగా ఉందతనికి.
    "ఇతెక్కడికి వెళ్తున్నారు?"
    "ఇటా?...కొంచెం మా ఫ్రెండ్ తో పనుండీ..."
    అతను చెప్పిన అబద్ధం చంద్రకాంత్ అనుమానం మరింత బలపరచింది.
    "పదండి! కాఫీ తాగుదాం." హోటల్ వేపు దారితీస్తూ అన్నాడు చంద్రకాంత్.
    "ఇప్పుడా..." తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ అన్నాడతను.
    "కాఫీ ఎప్పుడయితేనేం! రండి!" బలవంతం చేశాడు.
    అతనిని అనుసరించక తప్పలేదు కిషోర్ కి.
    ఇద్దరూ హోటల్లో ఓ టేబుల్ ముందు కూర్చున్నారు.
    ఇద్దరికీ కాఫీ ఆర్డర్ చేశాడు చంద్రకాంత్.

 Previous Page Next Page