Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 37


                                                           స్వంతలాభం కొంత మానుకు

    ఉదయం పదిగంటలయింది.
    ఎండలో చెమటలు కక్కుతూ వచ్చిన ప్రభాకరరావుకి ఇంటర్వ్యూ రూముముందు వరండాలో కూర్చున్న, నిల్చున్న మనుష్యులని చూడగానే మరింత చెమటలు పట్టాయి. గుండె ఒక్కక్షణం లయ తప్పింది. ఊపిరి అందనట్లు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. మనసులో ఉజ్జాయింపుగా లెక్క కట్టాడు. అరవైమంది వుండవచ్చు! కనీసం ఏభైకి తక్కువ వుండరు! ఒక్క పోస్టుకి అరవైమంది అంటే తన ఛాన్సు ఎన్నో వంతన్నమాట! ప్రభాకరం మనసులో ఆశ ఎవరో కుదిపినట్లు ధర్మామీటరులో పాదరసంలా అట్టడుగుకి జారింది.
    నీరసంగా వరండా మీదికి వచ్చాడు.... ఎక్కడా ఖాళీలేదు. ఉన్న బెంచీలు కుర్చీలు నిండిపోయాయి. గోడవారగా నిలబడి రుమాలు తీసుకుని మొహం తుడుచుకున్నాడు. గాలి ఆడనట్లనిపించి చేతిలో పేపరుతో విసురుకుంటూ చుట్టూ చూశాడు.
    కొంతమంది భయంభయంగా ప్రాణాలుగ్గ బెట్టుకుని కూర్చున్నారు. 'చూద్దాం, తినబోతూ రుచులెందుకు' అని లేని నిబ్బరం తెచ్చుకున్నట్టు మరికొందరు కనిపిస్తున్నారు. 'నిండా మునిగిన వాడికి చలేమిటి? ఇలాంటివి ఎన్నో అయ్యాయి. అందులో ఇదోటి' అన్న మొండిధైర్యం మరికొందరిలో స్పష్టంగా కనిపిస్తోంది. 'మనకి కాకపోతే మరెవరికొస్తుంది, అన్న ధీమా రికమండేషన్ల మొహాలలో మెదులుతూంది. కొంతమంది గుంపులు గుంపులుగా నిల్చుని మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూలో అడగబోయేవాటిని చర్చిస్తున్నారు మరికొందరు. పాత ఇంటర్వ్యూల ముచ్చట్లు ముచ్చటిస్తున్నారు మరికొందరు. మొత్తానికి అక్కడ అంతా గలభాగా వుంది.
    ప్రభాకరానికి ఇదేం క్రొత్త కాకపోయినా మొదటిసారిలా కాళ్ళు వణుకుతున్నాయి. చెమటలు పడుతున్నాయి, చికాగ్గా వుంది. ఒక్క పోస్టుకి ఇంతమంది వుంటే మనకేం వస్తుంది యీ ఉద్యోగం! ఇందులో ఫస్టు క్లాసుల వాళ్ళెందరో, రేంకులవాళ్ళు, గోల్డ్ మెడల్సులవాళ్ళు ఎందరో! ప్చ్! ఏం ఆశ వుండేట్టులేదు. ఆమాట అనుకోగానే ప్రభాకరానికి గొంతులో ఏదో అడ్డుపడింది. ఇదివరకు పదిసార్లలాగే యీసారీ జరిగితే, మళ్ళీ తన ఉద్యోగనిరీక్షణ పర్వం మొదలవుతుంది! యీసారీ యీ ఉద్యోగం రాకపోతే? తర్వాత సంగతి తల్చుకోడానికే అతనికి భయం వేసింది.   
    అతని ఉద్యోగం మీద ఎంతమంది ఆశలు, కలలు పేర్చుకున్నారో అతనికి తెల్సు! తన ఉద్యోగంతో ఎన్నెన్ని బరువులు, బాధ్యతలు నెరవేర్చాలో కూడా అతనికి తెల్సు! అతనికి తెలియనిదల్లా ఉద్యోగం సంపాయించడం.
    అతను మూడేళ్ళుగా ఎన్ని ఊర్లు, ఎన్ని ఆఫీసులు తిరిగాడో అతని చెప్పుల జత కూడా చెప్తుంది! ఈ ఉద్యోగాలకి, అప్లికేషన్లకి, ఇంటర్వ్యూలకి ఎన్నివందలు తగలెట్టాడో అతనికి గుర్తులేకపోయినా, అతని తండ్రిని నిద్రలో లేపి అడిగినా అణా పైసల్తో సహా చెప్పగలడు!
    అతనికి ఆ ఇంటిగురించి తల్చుకోడానికే భయం! ఆ ఇంట్లో వున్న చిన్నా పెద్దా డజనుమందికి రెండు పూటలా నోట్లోకి వేళ్ళు పోవడానికి ఆ యింట్లో మనుష్యులు పడే తాపత్రయాలు తల్చుకుంటే అతనికి దేన్లోనన్నా పడి చావబుద్ధి వేస్తుంది! ఆ యింట్లో అతను తప్ప ప్రతివాళ్లూ పదో పరకో సంపాయిస్తున్నారని తల్చుకుంటే అతని తల లజ్జతో వంగిపోతుంది! రిటైరై ప్రయివేట్లు చెప్పి ఎలాగో అలాగ బండి యీడ్చడానికి తాపత్రయ పడే తండ్రి, నడుం వంగినా, అప్పడాలు వత్తీ, ఇరుగు పొరుగుకి వడియాలు పెట్టీ ఇన్ని మజ్జిగ నీళ్ళయినా అడిగితెచ్చే మేనత్త, మెట్రిక్ చదువుతో ఎలిమెంటరీ స్కూల్ పంతులమ్మ పనిచేసే చిన్న చెల్లెలు, ఇంట్లో మిషను కుట్టే విధవ చెల్లెలు... ఇంతమంది ఇన్నివిధాల పడే తాపత్రయాలు అన్నీ కలిసినా రెండుపూటలా కడుపునిండా తిండికి కూడా సరిపోవడం లేదంటే రోజుల మహత్యం అని నిట్టూర్పు విడుస్తాడు.
    ఇంటర్వ్యూ ఆరంభమయింది! ప్యూను ఒక్కొక్కరి పేరు పిలుస్తున్నాడు. తడబడే అడుగుల్తో, పాలిపోయిన మొహాలతో ఒక్కొక్కరు లోపలికి వెళ్ళి పదినిమిషాలలో పైకి వస్తున్నారు.... వచ్చిన వాళ్ళని పైనున్న వారు ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు.
    ఇంతలో పోర్టికోలో తళతళలాడుతున్న ఓ ఎంబాసిడర్ కారొచ్చి ఆగింది .... అందులోంచి కళకళలాడుతూ ఓ నవనాగరిక వేషంలో వున్న స్త్రీ దిగి చకచకా మెట్లెక్కి వరండా మీదికి వచ్చింది. గుమ్మం దగ్గర ప్యూను నమస్కారం చేశాడు.
    "ఇంటర్వ్యూ ఆరంభమయిందా! మిసెస్ రామకృష్ణా వచ్చారని చెప్పిరా?" ఆమె అధార్టీగా అంది. బంట్రోతు లోపలికివెళ్ళి మరునిమిషం పైకి వచ్చి ఆవిడని సాదరంగా లోపలికి తీసికెళ్ళాడు.
    మరో పదిహేను నిమిషాలకి ఆమె వచ్చింది. ఆమెతో నవ్వుతూ మాట్లాడుతూ పైకి వచ్చిన ఆయన ఇంటర్వ్యూ మెంబర్లలో ఒకరిని లోపలికి వెళ్ళి వచ్చిన వారికి తెల్సు.
    ఆమెని కారుదాకా సాగనంపి, కారు తలుపు తెరచి పట్టుకున్నారాయన మర్యాదగా. ఆమె కారెక్కి కూర్చున్నాక తలపైన పెట్టి "ఐతే రేపొకసారి రమ్మంటారా నన్నూ" అనడిగింది ఆమె.

 Previous Page Next Page